మమతా బెనర్జీ ఆలోచనను అందుకే తిరస్కరించా..
పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ పై ధ్వజమెత్తారు. అంతేకాదు పలు దీక్షలు, నిరసనలు కూడా ఆమె చేపట్టారు. అయితే మమతాకు కొంతమంది నుండి మద్దతు లభించినా.. కొన్ని పార్టీల నుండి మాత్రం మద్దతు లభించడంలేదు. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒకరు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దుపై స్పందించిన నితీశ్ ఆయనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే తాను మమతా బెనర్జీ ఆలోచనను తిరస్కరించిన కారణాన్ని గురించి చెప్పారు. నితీశ్ కుమార్ కు స్వయంగా ఫోన్ చేసిన మమతా బెనర్జీ నోట్ల రద్దుపై తాను చేపట్టిన దీక్ష, నిరసనలకు మద్దతిచ్చి కలసి రావాలని కోరిందట. అందుకు నితీశ్ నిరాకరించారట. ఎందుకంటే... ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి, ముందడుగు వేసేందుకు ఓకే చెప్పిన తరువాత, ఎన్ని నిరసనలు తెలిపినా ప్రయోజనం ఉండదని తాను స్పష్టంగా చెప్పినట్టు చెప్పారు.