మోడీ నోట్ల రద్దుకు ఎంతమంది సపోర్ట్ ఇచ్చారో తెలుసా..?

  నల్లధనాన్ని అరికట్టేందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కొంత మంది  విమర్శించినా.. కొంత మంది మాత్రం మోడీ నిర్ణయాన్ని సమర్థించారు. అంతేకాదు ఈ విషయంపై సర్వే కూడా చేశారు. కేంద్రం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం  ‘నరేంద్ర మోదీ’ యాప్‌ ద్వారా సర్వే నిర్వహించారు. ఈ యాప్ ద్వారా యాప్‌ ద్వారా 10.20 లక్షల మందితో సర్వే నిర్వహించగా.. 93 శాతం మంది మోదీ నిర్ణయం భేష్‌ అని సమర్థించగా..  రెండు శాతం మంది మాత్రం ఈ నిర్ణయానికి ‘వెరీ పూర్‌’ అని రేటింగ్‌ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 684 జిల్లాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

పోరాట కార్యాచరణను ప్రకటించిన ముద్రగడ.. నాలుగుదశల్లో...

  కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని గత కొద్ది నెలలనుండి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈనెల 16 నుంచి 21 వరకు ఆయన పాదయాత్ర చేపడదామని చూసినా దానికి ప్రభుత్వం మాత్రం అనుమతించలేదు. ఇప్పుడు మరో పోరాటానికి సిద్దపడినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు భవిష్యత్‌ పోరాట కార్యాచరణ ప్రకటించారు. నాలుగు దశల్లో తన పోరాటం ఉంటుందని... మొదటిగా.. డిసెంబర్‌ 18న నల్ల రిబ్బన్లు కట్టుకుని.. కంచం, గరిటతో నిరసన తెల్పుతామని చెప్పారు. రెండోదశలో 30న ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామని, మూడో దశలో జనవరి 8న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఆఖరిగా జనవరి 25న కాపు సత్యాగ్రహ యాత్ర చేపడతామని, దీనికి ఎటువంటి అనుమతి తీసుకోబోమని స్పష్టం చేశారు.

కేంద్రపభుత్వానికి సుప్రీం ఆదేశాలు...

  పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్యలపై పిటిషన్లు దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌లు ఆదేశాలు జారీ చేసింది. పెద్దనోట్ల రద్దు నేప‌థ్యంలో తీసుకుంటున్న చర్యలను బహిర్గత పరచాలని కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో స‌హ‌కార బ్యాంకులపై ఆధార‌ప‌డే వారి ప‌రిస్థితి ఏంట‌ని ప్రశ్నించింది. అన్ని అంశాల‌పై స‌మ‌గ్ర వివ‌రాలు అందించాల‌ని చెప్పింది.

రాజ్యసభలో రచ్చ...షటప్ అంటూ తిట్టుకున్నారు..

  పార్లమెంట్ ఉభయసభల్లో పశ్చిమ బెంగాల్ లో సైన్యం మోహరింపుపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనలు కాస్త తీవ్ర పదజాలం ఉపయోగించేవరకు వెళ్లింది. పశ్చిమ బెంగాల్ లో సైన్యం మోహరింపుపై టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతుండగా...అధికార పక్షం నుంచి వ్యాఖ్యలు వినిపించడంతో ఆయన ఆవేశం పట్టలేకపోయారు. ''వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్.. షటప్, షటప్'' అంటూ అధికారపక్షం మీద తీవ్రంగా మండిపడ్డారు. ఇదేమైనా జాతీయ అత్యవసర పరిస్థితా అని ప్రశ్నించిన రాయ్.. మంత్రి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి... సైన్యం ఇలా వెళ్లడం ఇదేమీ మొదటిసారి కాదని, గత సంవత్సరం కూడా ఇదే సమయంలో అదే రాష్ట్రానికి వెళ్లిందని చెప్పారు. దీనిని రాజకీయం చేయోద్దని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో కూడా ఇలాగే జరుగుతోందని అన్నారు.

కోర్టులో జాతీయ గీతం తప్పనిసరి చేయలేం..

  సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం ప్రదర్శంచాలని.. ఆ సమయంలో థియేటర్లలో ఉన్నవారంతా లేచి నిలబడాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే ఈ నేపథ్యంలో  దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేసేలా ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు  పిటిషన్‌ సమగ్రంగా లేనందున దీనిపై ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ.. అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది.

లాలు కొడుకుతో పెళ్లి లేదు... అన్నీ కట్టుకథలే...

  ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు పెద్ద కుమారుడు బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన రాందేవ్ బాబా వాటిని ఖండించారు. ఇవన్నీ కట్టుకథలంటూ కొట్టి పారేశారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఈ కథనాలను ప్రచారం చేసిందని చెప్పారు. లూలూకి అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆయనను పరామర్శించేందుకు వెళ్లానని అంతేకాని నోట్ల రద్దు గురించో, పెళ్లి సంబంధం గురించో, రాజకీయాలను మాట్లాడటానికో వెళ్లలేదని అన్నారు. లాలూ ఈ దేశ సంపద అని... ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కాగా నిన్న రాత్రి బాబా రాందేవ్ లాలూ ప్రసాద్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.

బెంగాల్ ఆర్మీ తనిఖీలపై పార్లమెంట్లో రచ్చ.. రాజకీయం చేయోద్దు..

  పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెద్దనోట్ల రద్దుపై కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగతుండగా.. ఈరోజు ఉభయ సభల్లోనూ బెంగాల్ ఆర్మీ తనిఖీలపై పెద్ద ఎత్తున ఆందోళనలు తలెత్తాయి. దీంతో ఉభయ సభలూ వాయిదా పడ్డాయి   మరోవైపు సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆర్మీ బలగాలు మోహరించాయి..గత నెల 28,29,30 వ తేదీలో తనిఖీలు జరగాల్సి ఉంది.. అయితే కొన్ని కారణాల వల్ల తనిఖీలు వాయిదా పడ్డాయి.. సాధారణ తనిఖీలను రాజకీయం చేయవద్దు అని మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు.

టీడీపీ-బీజేపీకి దూరంగా పవన్ కళ్యాణ్.. సీపీఐకు దగ్గరగా..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు పలికి ఎన్నికల్లో వారు విజయం సాధించడానికి కారణమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీ పార్టీలకు దూరంగా ఉంటున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీలపైనా విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడ్డారు ఆయన. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని.. కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడిది ఇంకా పార్టీ నేతలదే అని చెప్పారు కూడా. అంతేకాదు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది అని కూడా హెచ్చరించారు. ఇక ఎట్లాగూ 2019 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలో దిగుదామని చూస్తున్నారు. కానీ నిన్న పవన్‌ కల్యాణ్‌ సీపీఐ నేతలతో భేటీ అయిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పెద్దనోట్ల రద్దు సహా ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రావు తదితరులు పవన్‌తో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఇక సీపీఐ నేతలతో భేటీ అనంతరం పవన్ బీజేపీ-టీడీపీ పార్టీలకు దూరంగా ఉంటున్నారు అన్న వార్తలకు ఆజ్యం పోసినట్టైంది. పవన్ సీపీఐతో జతకడతారు అన్న వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం.. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతారో.. లేక వేరే పార్టీలతో పొత్తుతో బరిలోకి దిగుతారో..?

వాళ్లు వెళ్లే వరకూ ఇంటికి వెళ్లను... రాత్రంతా సచివాలయంలోనే

  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుపై రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కుదిరినప్పుడల్లా పెద్ద నోట్ల రద్దుపై, ప్రధాని నరేంద్ర మోడీపై ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో విషయంపై ఆమె కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్ ల వద్ద సైన్యాన్ని మోహరించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేనా.. సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని సచివాలయంలోని తన కార్యాలయం నుండి కదల్లేదు. అసలు సంగతేంటంటే.. నేటి నుంచి టోల్ బూత్ ల వద్ద డబ్బులు చెల్లించక తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో, ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకే సైన్యాన్ని మోహరించారు. దీనిలో భాగంగానే దీదీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే హుగ్లీ బ్రిడ్జ్ టోల్ బూత్ ఉంది. అక్కడా సైన్యం కాపలాకు దిగింది. దీనిపై స్పందించిన ఆమె "ఇది సైనిక తిరుగుబాటా?" అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టోల్ గేట్ ల వద్ద సైన్యాన్ని ఎలా నియమిస్తారని...సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని రాత్రంతా తాను ఆఫీసులోనే ఉండి పరిస్థితిని చూస్తానని చెప్పారు. అయితే ఆ తరువాత హుగ్లీ బ్రిడ్జ్ నుంచి సైన్యం వెళ్లిపోయినా మమత కదల్లేదు. ఇంకా 18జిల్లాల్లోని టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 8.45 గంటల సమయానికి కూడా ఆమె సచివాలయంలోనే ఉన్నారు. అక్కడి నుంచి కదల్లేదు.

ఏపీకి 2500 కోట్లు.. తెలంగాణకు 1600 కోట్లు..

  పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరటనిచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఏపీకి రూ. 2500 కోట్లు, తెలంగాణకు రూ. 1600 కోట్ల కరెన్సీ రానుంది. ప్రత్యేక విమానాల్లో ఈ డబ్బు రెండు రాష్ట్రాలకు తెప్పించనున్నారు. ఏపీకి రూ. 2500 కోట్లు వస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. మరోవైపు, తెలంగాణకు రూ. 1600 కోట్లలో రూ. 600 కోట్లను హైదరాబాద్ లోని బ్యాంకులకు పంపిణీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాల బ్యాంకులకు పంపుతారు.

వారసత్వ బంగారంపై జైట్లీ స్పష్టత..

వారసత్వంగా వచ్చిన బంగారంపై పన్ను లేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టత ఇచ్చారు. ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన ఆయన  చట్ట సవరణ బిల్లులో నగల జప్తుపై ఎలాంటి కొత్త నిబంధనలు లేవని తెలిపారు. అయితే ఐటీ తనిఖీల్లో నగల పరిమితిపై నిబంధనలు ఉన్నాయని..పరిమితికి మించి ఉన్న ఆభరణాలపైనే ఐటీ అధికారులు వివరణ అడుగుతారని వెల్లడించారు. వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. పురుషులు 100 గ్రాములు బంగారం కలిగి ఉండొచ్చని స్పష్టం చేశారు. లెక్కచూపిన ఆదాయం, వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్ను లేదని పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దుకు అమెరికా మద్దతు...

  దేశంలో ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు గాను పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన అగ్రదేశమైన అమెరికా.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికింది. అవినీతిని రూపుమాప‌డానికి ఈ నిర్ణ‌యం ఎంతో ముఖ్యమైన, అవసరమైనదని ..చట్ట వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్యకలాపాలన్నింటికీ చ‌ర‌మ‌గీతం పాడ‌డానికి ఈ నిర్ణ‌యం ఎంతో తోడ్ప‌డుతుంద‌ని స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ పేర్కొన్నారు. ఇండియాలో నివసిస్తోన్న‌, పనిచేస్తోన్న త‌మ దేశ సిటిజన్లకు ఈ అంశంపై సరైన సమాచారం అందే ఉంటుందని తాను అనుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు. అమెరికా సిటిజ‌న్లు త‌మ వ‌ద్ద ఉన్న ర‌ద్దైన‌ నోట్లను మార్చుకునే ఉంటార‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు.