ట్రంప్ కు పాక్ ప్రధాని ఫోన్... ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్...
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి డొనాల్డ్ తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. హిల్లరీ, ఒబామా విషయంలోనే ఇది అర్ధమైంది. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా ట్రంప్ తన వైఖరికి మార్చుకున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నప్పుడు పాకిస్థాన్ పై ట్రంప్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్ మాత్రమేనని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశ ప్రధానిపై.. దేశంపై ప్రశంసలు కురిపించారు. అసలుసంగతేంటంటే..ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు నిన్న నవాజ్ షరీఫ్ ఫోన్ చేసినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. షరీఫ్, ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వివరాలను పాకిస్థాన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. నవాజ్ ను పోరాటయోధుడిగా ట్రంప్ అభివర్ణించారని, అన్ని విధాలుగా ఆయన సంతృప్తికరంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారని.. తాను ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టు లేదని, చాలా కాలంగా స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్టు ఉందని ఆయన అన్నట్టు పీపీఐబీ వెల్లడించింది. అంతేకాదు ఏకంగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ సరికొత్త ట్విస్టు ఇచ్చారు. దీర్ఘకాలంగా పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైతే తాను సహకరిస్తానని ట్రంప్ చెప్పినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పాక్ ను సందర్శించాలని షరీఫ్ ఆహ్వానించారని, అందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించారని వెల్లడించింది.