దీదీకి అంత భయం ఎందుకో..?
posted on Dec 3, 2016 @ 1:56PM
మొన్నటి వరకూ పెద్ద నోట్ల రద్దుపై నానా హడావుడి చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ఆర్మీ బలగాల మోహరింపుపై రచ్చ మొదలుపెట్టారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కొత్త నోట్ల మార్పిడికి వాహనదారులు ఇబ్బందుల పాలవకుండా కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఔటర్ పరిధిలో ఈ నెల రెండో తేదీ వరకు టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు ముగియడంతో ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు టోల్ ప్లాజాల వద్ద ఆర్మీలను మోహరించారు. కానీ ఇప్పుడు ఈ సైన్యాన్ని మోహరించడం వల్ల మమతా బెనర్జీకి వచ్చిన నష్టం ఏంటో తెలియడం లేదు కానీ ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సైనిక కుట్రనా? అని ఆమె ధ్వజమెత్తారు. అంతేనా..తన కార్యాలయానికి దగ్గరగా ఉన్న టోల్ గేట్ వద్ద ఉన్న సైన్యం వెళితేనే కానీ తాను ఇంటికి వెళ్లనని రాత్రంతా సచివాలయంలోనే ఉన్నారు. ఆ తరువాత సైన్యం వెళ్లిపోయిన తరువాత.. అధికారులు వారు వెళ్లిపోయారని చెప్పినా కూడా.. మిగిలిన 18 జిల్లాల్లో టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు దాదాపు 30 గంటల తరువాత ఆమె తన కార్యాలయం నుండి బయటకు వచ్చారు.
అయితే అసలు డౌట్లు మాత్రం ఇప్పుడే వస్తున్నాయి. ఏదో పెద్ద నోట్లు రద్దు విషయంలో అంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. వారి కష్టాలను చూడలేక ఆమె ఇలా ఆందోళనలు చేస్తున్నారు తప్పులేదు అని అనుకున్నా.. ఇప్పుడు ఆర్మీ సైన్యం మోహరింపుపై ఆమె ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఆర్మీ బలగాలను వ్యతిరేకించడం వల్ల ఆమెకు వచ్చే లాభం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఫేక్ కరెన్సీ నా అన్న కోణంలో కూడా ఆలోచించే వారు ఉన్నారు. ఎందుకంటే పశ్చిమబెంగాల్ మిడ్నార్ జిల్లాల్లో ఆర్బీఐ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అంతేకాదు ఇక్కడ ఎక్కువ ఫేక్ కరెన్సీ కూడా ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ఫేక్ కరెన్సీ విషయంలో గొడవలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఫేక్ కరెన్సీకి.. దీదీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అందుకే ఈ విషయంలో ఆమె అంత రియాక్ట్ అవుతున్నారా...? అని సందేహ పడుతున్నారు.
ఇంకోపక్క మమతా చేస్తున్న దానికి కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దీనిపై స్పందించి... ఆర్మీ మోహరింపును రాజకీయం చేయొద్దని మమతకు హితవు పలికారు. ఇంక కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ కూడా దీదీ చేసిన పనిపై స్పందించి సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆర్మీ బలగాలు మోహరించాయి..గత నెల 28,29,30 వ తేదీలో తనిఖీలు జరగాల్సి ఉంది.. అయితే కొన్ని కారణాల వల్ల తనిఖీలు వాయిదా పడ్డాయి.. సాధారణ తనిఖీలను రాజకీయం చేయవద్దు అని.. బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు. మరి నిజంగానే గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్న సామెత ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్మీ తమ తనిఖీలు తాము చేసుకుంటూ పోతుంటే.. మమతా బెనర్జీ కూడా వారికి సహకరిస్తే ఎలాంటి సందేహాలు రావు. ఇంత చిన్న విషయాన్ని కూడా అంతలా చేస్తుంటేనే లేనిపోని డౌట్లు వస్తున్నాయి అందరికీ.