దొంగ నోట్లు ప్రింట్ చేసిన ఇంజనీర్ మోడీకి నచ్చాడు..!
posted on Dec 3, 2016 @ 11:39AM
అభినవ్ వర్మ.. కొత్త 2000 రూపాయల నోట్లకు నకిలీనోట్లను ముద్రించి అరెస్ట్ అయ్యాడు. అలాంటి అభినవ్ వర్మ ప్రధాని నరేంద్ర మోడీకి నచ్చాడు. అదేంటీ అనుకుంటున్నారా..? అయితే అది ఇప్పుడు కాదులెండి గత కొన్ని రోజుల కిందట. అసలు అభినవ్ వర్మ ఎవరు.. మోడీ నచ్చడమేంటీ.. ఒకసారి చూద్దాం.. అభినవ్ వర్మ.. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఓ యువ ఇంజనీరు. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటుచేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అతడు తయారుచేశాడు. వాటి సాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో కూడా తెలుసుకోవచ్చు. గోతులు గానీ, రాళ్లు గానీ ఏవైనా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఇక అతను చూపిన ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఎంతగానో ప్రశంసించారు.
అలాంటి అతను ఇప్పుడు దొంగ నోట్లను ముద్రిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అభినవ్ వర్మ, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్ లు ముగ్గురూ కలిసి ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, తాము ముద్రించిన 2000 రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో ఇస్తున్నారు. అయితే అవి దొంగనోట్లు కావడం విశేషం. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ ఆడి ఎస్‌యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేశామని... అప్పుడే కారులో 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయని మొహాలీ నగర ఎస్పీ పర్మీందర్ సింగ్ చెప్పారు. అంతేకాదు తన కార్యాలయంలో ఇప్పుడు అతడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు చెప్పారు.