నిజంగానే పన్నీర్ సెల్వం అలా అవుతాడా..?
posted on Dec 9, 2016 @ 1:51PM
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత అనంతరం ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించినా ఆ తరువాత అతనిపై పలు విమర్సలు వచ్చాయి. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ.. ఆయన జయలలిత నిచ్చెలి అయిన శశికళ చేతిలో కీలు బొమ్మగానే మారతారు అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఈరోజు నుండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే బాధ్యతలు చేపట్టే ముందు పన్నీర్‌సెల్వం మరోసారి శశికళను కలిశారు. నిన్న కొందరు సీనియర్ మంత్రులతో కలిసి పోయెస్‌గార్డెన్ వెళ్లిన ఆయన.. ఇవాళ ఉదయమే మరోసారి అక్కడికి వెళ్లడం గమనార్హం. ఈరోజు కూడా ఆ మంత్రులందరూ పన్నీర్‌సెల్వం వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య తరచూ జరుగుతున్న సమావేశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. జయలలిత తరువాత తదుపరి ప్రధాన కార్యదర్శి శశికళే అన్న వాదనకు వీళ్ల సమావేశాలు బలం చేకూరుస్తున్నాయి. మరి చూద్దాం భవిష్యత్ రాజకీయాలు ఎలా మారుతాయో..