నోట్ల రద్దు.. కేంద్రంపై సుప్రీం ప్రశ్నల వర్షం..
posted on Dec 10, 2016 @ 9:37AM
నోట్ల రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారించిన సుప్రీం కోర్టు కాస్త గట్టిగానే కేంద్రాన్ని మందలిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. నోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనే దీనిపై స్పందించిన సుప్రీం.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించింది. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టగా..నోట్ల రద్దు తీసుకునే ముందు అసలు కేంద్రం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? లేక ఆషామాషీగా నోట్ల రద్దును ప్రకటించారా? అని ప్రశ్నించింది. "రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన వేళ, మీరనుకున్నంత మేరకు కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టారా? అసలెంత కొత్త కరెన్సీ కావాలని అంచనా వేశారు? మీ వద్ద ఏదైనా ప్లాన్ వుందా? రూ. 10 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వస్తాయని భావిస్తే, అంత మొత్తం కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మరి సుప్రీం ప్రశ్నలకు కేంద్రం ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూద్దాం.