ప్రింటింగ్ ప్రెస్ నుండే నేరుగా శేఖర్ రెడ్డి ఇంటికి...

పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరిపి పెద్ద మొత్తంలో నల్లధనం బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లోనే టీడీపీ బోర్డ్ సభ్యుడైన శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.కోట్లలో కొత్త రూ.2000 నోట్లు, కేజీల కొద్ది బంగారం దొరికిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం ఒకపక్క ప్రజలు చిల్లర కష్టాలతో సతమతమవుతుంటే.. వీరికి మాత్రం కొత్త నోట్లు ఎక్కడి నుండి వచ్చాయా అని పోలీసులు విచారిస్తుండగా దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే.. కొత్త 2000 నోట్లు ముద్రణాలయంనుంచే నేరుగా శేఖర్‌రెడ్డి చేతికి అవి చేరుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. సాధారణంగా కొత్తనోట్లు ముద్రణాలయం నుంచి రిజర్వ్‌బ్యాంకుకి, అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్తాయి. కానీ స్టేట్‌ బ్యాంకుకు చెందిన కొన్ని పాలన కార్యాలయాలకు నేరుగానే కొత్త నోట్లు వచ్చాయి.ఇలా వచ్చిన కొత్త రూ.2వేల నోట్లే శేఖర్‌రెడ్డి ఇంటికి వచ్చినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్టేట్‌ బ్యాంకుకు చెందిన పది మంది ఉన్నతాధికారులను విచారిస్తున్న ఐటీ అధికారులు, త్వరలోనే వారినీ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.   కాగా శేఖర్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలతోపాటు ఆయన బంధువుల నివాసాల్లోకూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించి, ఇప్పటివరకు రూ.131కోట్ల నగదు, 170కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.34కోట్ల వరకు కొత్త రూ.2వేల నోట్లే.

పార్లమెంట్ లో సేమ్ సీన్...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా గందరగోళాల మధ్యే ఉభయ సభలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదాలు నెలకొన్నారు. లోక్‌సభలో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్షమైనా, ప్రతిపక్ష సభ్యులైనా ఇలా ప్లకార్డులు ప్రదర్శించడం తగదని, ఏం కావాలో ప్రశాంతంగా చెప్పాలని సూచించారు. అయినా ఎవరూ వినిపించుకోకుండా గట్టిగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించసాగారు. దీంతో సభను వాయిదా వేశారు.   మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు, కరువు పరిస్థితుల వల్ల రైతుల కష్టాలు అనే అంశంపై ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ నోటీసు ఇవ్వడంతో.. దానిపై ఆయనను మాట్లాడాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు. అయితే అదే సమయంలో అధికార పక్ష సభ్యులు అగస్టా వెస్ట్‌లాండ్ స్కాంపై చర్చకు పట్టుబట్టడంతో రెండు వైపుల నుంచి సభ్యులు తీవ్రంగా వాగ్వాదాలకు దిగారు.

లైంగిక దౌర్జన్యం... కర్ణాటక మంత్రి రాజీనామా

  సాయం అడగటానికి వచ్చిన మహిళపై లైంగికంగా దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ఎక్సైజ్‌మంత్రి హెచ్‌వై మేతి తన పదవికి రాజీనామా చేశారు. వివరాల ప్రకారం...మేతి బంధువైన ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి. అయితే ఆమె తనకు అనుకూల ప్రాంతంలో బదిలీ చేయమని అడగటానికి అతని దగ్గరకు వెళ్లగా.. ఆయన లైంగికంగా దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదంతా మంత్రి మేటి భద్రత సిబ్బందిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మేతి బుధవారం రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదించటమేగాక, జరిగిన ఘటనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సందర్భంగా మేతీ మాట్లాడుతూ.. మంత్రి రాజీనామాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించానని, వీలైనంత త్వరగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ సీఐడీని ఆదేశించానని తెలిపారు.

గాలి నల్లధనాన్ని తెల్లగా మార్చింది నేనే..

  గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు వివాహం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో దేశం మొత్తం చిల్లర కష్టాలతో.. నోట్ల మార్పిడితో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే గాలి జనార్ధన్ రెడ్డికి మాత్రం ఈ నోట్ల రద్దు కష్టాలు ఏ మాత్రం లేకుండానే చాలా అంగరంగవైభవంగా పెళ్లి చేశారు. దీంతోనే అందరికి అనుమానాలు వచ్చి పడ్డాయి. ఇంత సడెన్ గా మోడీ నిర్ణయం తీసుకుంటే.. గాలికి మాత్రం అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందబ్బా అని. ఇంకేముంది.. ఈ అనుమానాల నేపథ్యంలోనే గాలి మైనింగ్ కంపెనీలపై ఐటీ దాడులు జరిపాయి. అంతేకాదు ఆ తరువాత భీమా నాయక్ డ్రైవర్ రమేష్ గౌడ రాసిన సూసైడ్ నోట్ లో గాలి పేరు ఉండటంతో వివాదంలో పడ్డారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో పడ్డాడు గాలి జనార్ధన్ రెడ్డి. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహానికి నల్ల ధనాన్ని తెల్లగా మార్చింది తానేనని సీఐడీ అదుపులో ఉన్న బీమానాయక్ అంగీకరించాడు. వివాహానికి అవసరమైన ధనాన్ని తానే సమకూర్చానని.. గాలి జనార్దన్‌రెడ్డితోపాటు బళ్లారి ఎంపీ శ్రీరాములుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపాడు. వారి  సూచన మేరకే తాను నోట్లను మార్చానని అధికారుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

లష్కరే తాయిబా టాప్ కమాండర్ అబూబకర్ హతం..?

  జమ్ము కాశ్మీర్లో ని  అనంత్‌నాగ్, బారాముల్లా జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా.. అందులో ఒకరు విదేశీ మిలిటెంట్ లష్కరే తాయిబా టాప్ కమాండర్ అబుబాకర్ అని పోలీసులు వర్గాలు తెలుపుతున్నాయి. నిన్న ఉదయం అనంతనాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతం బీవ్రా వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై మిలిటెంట్లు కాల్పులు జరిపగా.. ఆర్మీ జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు... మృతి చెందిన మిలిటెంట్‌ను బాసిత్ అహ్మద్‌దర్‌గా గుర్తించామన్నారు. మరోవైపు బారాముల్లా జిల్లా సొపోర్ ప్రాంతం బొమాయి ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా అతను లష్కరే తాయిబా టాప్ కమాండర్ అబూబకర్ అయి ఉంటాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

రాందేవ్ బాబా కు 11 లక్షల జరిమానా..

  ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి కంపెనీకి జరిమానా పడింది. నాణ్యతలేని ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 2012లో హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన  తేనే, ఉప్పు, జామ్, మస్టర్డ్ ఆయిల్ ఉత్పత్తుల శాంపిల్స్ ను అప్పట్లోనే పరీక్షించారు. ఆ పరీక్షల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని అప్పుడే నిరూపితమైంది. అయితే గత నాలుగేళ్లుగా ఈ కేసు విచారణలోనే ఉండగా ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు కంపెనీకి రూ.11 లక్షల జరిమానా విధించింది.   అంతేకాదు ఇతర కంపెనీలలో తయారుచేసిన ఉత్పత్తులను పతంజలి బ్రాండ్ ఇమేజ్ తో మార్కెట్లో విక్రయిస్తున్నారని, ప్రస్తుతం రూ.5వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 వే కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తుందని కోర్టు గుర్తించింది.

మణిపూర్ లో హైఅలర్ట్.... ఉగ్రదాడిలో జవాన్లు మృతి..

  మణిపూర్ రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈరోజు ఉదయం రాష్ట్రంలోని ఉగ్రవాదులు దాడులు జరపడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మణిపూర్, లోక్ చావోలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మణిపూర్‌ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబి సింగ్‌ కార్యక్రమానికి భద్రత నిమిత్తం సిబ్బంది మోరహ్‌ నుంచి తెంగనౌపల్‌ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు సమాచారం. పేలుడు పదార్థాలు, తుపాకీలతో ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట...

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్ జవాంగ్ కు మధ్య వివాదాలు ఎప్పటినుండో ఉన్న సంగతి తెలిసిందే. నజీబ్‌ ద్వారా రాష్ట్రాన్ని పాలించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ కేజ్రీవాల్‌ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బే తగిలింది.  దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయని.. కావాలంటే దిల్లీ ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈ రోజు విచారణ సందర్భంగా వెల్లడించిన అభిప్రాయం కేజ్రీవాల్‌కు వూరట కలిగించేలా ఉంది. ‘ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి కొన్ని అధికారాలుండాలి. లేకపోతే ప్రభుత్వం పనిచేయజాలదు’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.

జగన్ కు లోకేశ్ సవాల్...టైమ్, ప్లేస్ డిసైడ్ చేసుకో..

  టీడీపీ జాతీయ కార్యదర్శి  నారా లోకేశ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురంలో పర్యటించిన లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని... టైమ్, ప్లేస్ డిసైడ్ చేసుకోవాలని జగన్ పై ఛాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి జగన్ కు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. సాక్షి పత్రికకు, జగన్ కు అభివృద్ధి ఎంతమాత్రం కనపడదని.. తెలంగాణలో ఉంటూ విమర్శలు చేయడం మానుకోవాలని... ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి, అభివృద్ధిని చూడాలని చెప్పారు. ఏపీకి సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నారని... సమర్థుడైన ప్రతిపక్షనేత మాత్రం లేడని ఎద్దేవా చేశారు. మరి లోకేశ్ సవాల్ ను జగన్ స్వీకరిస్తారో లేదో చూడాలి.

ఏటీఎం క్యూ లైన్.. వరుసలో పీఎం, మాజీ పీఎం, అద్వానీ

  నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అన్నది అందరికి తెలిసిన సత్యమే. కానీ ఇలా లైన్లో నిల్చున్న వారిని ఎవరూ ఫొటోలు తీయరు. వారి గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోరు. అదే ఎవరైనా ప్రముఖులు క్యూలో నిల్చుంటే మాత్రం ఫొటోలు తీసేసి సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తారు. అలాంటి ఒక ఫొటోనే ఇప్పుడు వైరల్ మారింది. అదేంటంటే ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎల్‌కే అద్వానీ ఒకరి వెంట ఒకరు వరుసగా నిలబడిన ఫొటో. ఈ ఫొటో ఎక్కడ అనుకుంటున్నారా..? పార్లమెంట్ ఏటీఎం వద్ద మోడీ, మన్మోహన్‌సింగ్‌, ఎల్‌కే అద్వానీ, అరుణ్‌ జైట్లీ నిల్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక నెటిజన్లు పెట్టిన కామెంట్లపై ఓ లుక్కేద్దాం..   మీరు ఏటీఎం క్యూలో నిలబడ్డప్పుడు.. మీ కన్నా ముందున్న వ్యక్తి మెషిన్‌ దగ్గరకెళ్లి రెండో కార్డు తీస్తే.. మీరు ఇలాగే చూస్తారు అంటూ ఓ నెటిజన్‌ చమత్కరించగా.. మోదీ కొత్త రెండువేల నోటు, మన్మోహన్ పాత వెయ్యినోటు, అద్వానీ పాత 100 నోటు అంటూ మరొకరు పేర్కొన్నారు. ప్రధాని, మాజీ ప్రధాని, ఎప్పటికీ ప్రధాని ఆశావహ అభ్యర్థి అంటూ ఇంకొకరు క్యాప్షన్‌ ఇచ్చారు. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌, కోచ్‌ అంటూ మరొకరు చమత్కరించారు.

రేపు రాత్రి వరకే 500 నోటు చెలామ‌ణి..

  పెద్ద నోట్ల రద్దు అనంతరం పాత 500 నోట్లను బ్యాంకులతో పాటు కొన్ని చోట్ల మార్చుకునే వెసలుబాటు కల్పించారు. అయితే ఇప్పుడు ఆ గడువు కూడా ముగియనున్నట్టు ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని అంశాల్లో 500 నోటు వినియోగాన్ని ఎత్తివేసిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు ఉన్న వెసలుబాటును కూడా ఎత్తివేసింది. బిల్లులు క‌ట్టేందుకు, మందులు కొనేందుకు, ప్రిపేయిడ్ రిచార్జ్‌ల‌కు డిసెంబ‌ర్ 15వ తేదీ అర్థ‌రాత్రి వ‌ర‌కు పాత 500 నోటును చెలామ‌ణి చేయ‌వ‌చ్చు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి 12 గంట‌ల వ‌ర‌కే పాత రూ.500 నోటు చెల్లుబాటు కానుందని..శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచి పాత 500 నోటును కేవ‌లం బ్యాంకుల్లో మాత్ర‌మే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని.. 500 నోటుకు క‌ల్పించిన వెస‌లుబాటు రేపు అర్థ‌రాత్రితో ముగుస్తుంద‌ని ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

ట్రంప్ తీరుపై మరోసారి ఒబామా ఫైర్...

  అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ పై ఒబామా విమర్సలు గుప్పించడం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు ట్రంప్ వైఖరిపై విమర్శలు చేసిన ఆయన మరోసారి ఆయనపై విమర్శలు చేశారు. అమెరికా నిఘా సంస‍్థ (సీఐఏ)తో పాటు ప‌లు ఏజెన్సీల విషయంలో ట్రంప్‌ అనుసరిస్తున్న తీరుని ఆయ‌న ఖండించారు. ట్రంప్ క‌న‌బ‌రుస్తోన్న ధోర‌ణి ప్రమాదకరమైనద‌ని.. ట్రంప్‌ 'ఫ్లయింగ్‌ బ్లైండ్‌' విధానం అనుస‌రిస్తున్నార‌ని, అది ప్రమాదకరమైనదని ఒబామా అన్నారు. ట్రంప్‌ ఎంత స్మార్ట్‌ అనేది ప్ర‌ధాన‌మైన అంశం కాద‌ని, ఒక మంచి నిర‍్ణయం తీసుకోవడానికి బెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని ఒబామా సూచించారు. అమెరికా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల సీఐఏ ఓ రిపోర్టునిస్తూ అమెరికాలోని డెమోక్రటిక్‌ పార్టీతో పాటు హిల్లరీ క్లింట‌న్‌ని లక్ష్యంగా చేసుకొని జరిగిన సైబర్‌ దాడులలో రష్యా పాత్ర ఉందని పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రిపోర్ట్‌ను డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు.

సుష్మకు అరుదైన గౌరవం..

  కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్ ద్వారా తనకు వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తారన్న సంగతి తెలిసిందే. సమస్యలను తన దృష్టికి తెచ్చిన వారికి సాయం చేయడంలో సుష్మా స్వరాజ్‌ ఎప్పుడూ ముందుంటారు. ఇందుకు గాను సుష్మస్వరాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. ‘ట్విట్టర్‌ దౌత్యం’తో నవీన పంథా అనుసరించిన సుష్మకు ఫారిన్‌ అఫైర్స్‌ మ్యాగజైన్‌ తన ‘గ్లోబల్‌ థింకర్స్‌’ జాబితాలో చోటిచ్చింది. 2016కు గాను 15మందితో కూడిన ఈ జాబితాలో హిల్లరీ క్లింటన్‌, ఏంజెలా మెర్కెల్‌ తదితరుల సరసన సుష్మకు చోటు లభించింది. ఇక సుష్మకు దక్కిన ఈ గౌరవంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తంచేశారు. ఆమెను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

మోడీ అందుకే నన్ను మాట్లాడనివ్వడంలేదు..

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్సలు గుప్పించారు. పార్లమెంట్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మోడీ కోట్లాది మంది జీవితాలను నాశనం చేశారని.. ప్రధాని వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారు అన్నారు. నేను మాట్లాడితే ప్రధాని ఇబ్బందిపడతారు.. మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.. ఆధారాలు సభలో ప్రవేశపెడతామన్న భయపడుతున్నారు.. అందుకే సభలో నన్ను మాట్లాడనివ్వడంలేదు అని మండిపడ్డారు. అంతేకాదు బహిరంగ సభలో మోడీ బాగానే మాట్లాడతారు కానీ సభలో సమాధానం చెప్పడంలేదు.. అధికార పక్షమే సభను అడ్డుకుంటుందని అన్నారు.

మోడీ వచ్చినా ఉపయోగం లేదు...

  పార్లమెంట్ లోక్ సభలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సంగతి తెలిసిందే. అయితే మోడీ సభకు హాజరైనా ఎలాంటి ప్రయోజనం మాత్రం లేదు. మోడీ వచ్చినందుకైనా ఈరోజు పెద్ద నోట్లపై చర్చ జరుగుతుందని అందరూ భావించినా.. అది మాత్రం జరగలేదు. అయితే ఈరోజు పెద్ద నోట్ల రద్దుపై కాకుండా అగస్టా కుంభకోణంపై కేంద్ర మంత్రి రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధికార, విపక్ష నేతల మధ్యం మాటల యుద్దం జరిగింది. అగస్టా కుంభకోణంలో త్యాగి అరెస్టు అంశంపై భాజపా సభ్యుడు మాట్లాడటంతో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే అరుణాచల్‌ప్రదేశ్‌లో విద్యుత్‌ ప్రాజెక్టు కుంభకోణం, పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జునఖర్గే డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ప్రాజెక్టు కుంభకోణంలో రిజిజు ప్రమేయం ఉందని, ప్రాజెక్టు బిల్లు చెల్లింపుల్లో కిరణ్‌రిజిజు ఒత్తిడి చేశారని విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర సహాయ మంత్రి కిరణ్‌ రిజుజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్‌ స్పందిస్తూ.. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉండగా .. విపక్షాలు అడ్డుకోవడం సబబు కాదన్నారు. ఎంతకీ విపక్షాలు ఆందోళనలు ఆపకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

విమానం నుండి మహిళను ఈడ్చుకెళ్లిన అధికారులు...

  ఎయిర్ పోర్డ్ వద్ద బోర్డింగ్ నియమాలను సరిగా పాటించలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా విమానంలోకి బయటకు లాగి దించేశారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అమెరికా, మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టులో బ్యాగేజ్ చెకింగ్‌, బోర్డింగ్ ప్రక్రియ‌ల‌ను స‌రిగా పూర్తి చేయ‌కుండానే మహిళ విమానం ఎక్కింది. దీంతో అధికారులు ఆమెను విమానం దిగాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె నిరాకరించడంతో సదరు అధికారులు ఆమెను విమానం నుండి బయటకు లాక్కెళ్లారు. అయితే ఆమె పేరును వెల్లడించడానికి ఒప్పుకోని అధికారులు.. ఆమెపై కేసు బుక్ చేసిన‌ట్లు చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకున్న విమానాశ్ర‌య అధికారులు ప్ర‌స్తుతం విచారణ జరుపుతున్నట్లు స‌మాచారం. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారిపోయింది.