నోట్ల రద్దు వెనుక ఉన్నది వారే...
posted on Dec 9, 2016 @ 3:23PM
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా పగడ్బందీగా, ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా.. ముఖ్యంగా నల్ల కుబేరులకు ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా నిర్ణయం తీసుకొని వారికి ముచ్చెమటలు పట్టించారు. అయితే మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నా.. నల్లధనం దాచుకున్న వారికి మాత్రం ఏం చేయాలో తెలియట్లేదు. అయితే మోడీ నవంబర్ 8న రాత్రి నిర్ణయం తీసుకున్నా.. ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని మోడీనే స్వయంగా చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు.. దాని వెనుక పది నెలల కసరత్తు దాగి ఉందని ఆయన అన్నారు. కనీసం కేబినెట్‌లోని మంత్రులకు కూడా తెలియకుండా అంత పకడ్బందీగా, రహస్యంగా ఈ ఆపరేషన్ ఎలా జరిగిందన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. చివరి నిమిషం వరకు అంతా రహస్యమే. అయితే ఇంత రహస్యంగా చేసిన ఆపరేషన్ వెనుక ముఖ్యంగా ఆరుగురు వ్యక్తులు ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. ఇంకా అశ్యర్యపడే విషయం ఏంటంటే.. అదీ కూడా ప్రధాని మోదీ ఇంటి నుంచే కావడం. ఇందులో ప్రధానమైన వ్యక్తి హష్ముఖ్ అధియా. ఈయన మోడీకి నమ్మినబంటు. అందుకే ఇంత పెద్ద బాధ్యతని ఆయన తన భుజ స్కంధాలపై మోసుకున్నారు. ఇంకా ఈయనతోపాటు మరో ఐదుగురు అధికారులతో కలిసి మోడీ ఇంట్లోనే పది నెలలపాటు అత్యంత రహస్యంగా కసరత్తు చేసి ఇంతటి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.