కిరణ్ కు పవన్ లాభామా? పవన్ కు కిరణ్ నష్టమా?
posted on Nov 4, 2016 @ 1:45PM
కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో టపాసు లాంటి వాడే! కాని, తారజువ్వ! అమాంతం వెలుగులు చిమ్ముతూ పైకెగుస్తాడు! మళ్లీ అంతలోనే మాయం! కొన్నాళ్ల వరకూ ఇక నో సౌండ్... ఇదీ మన మాజీ సీఎం స్టైల్!
సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. కాని, నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఆయన అసలు సీన్లోనే లేకుండా పోయారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. తరువాత ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలా పూర్తిగా తనని తాను ఎవ్వరికీ కనపించకుండా దాచేసుకున్నారు. అసలు అంతకు ముందు వైఎస్ హయాంలో ఆయన స్పీకర్ గా వున్నప్పుడు ఏ ఒక్కరూ ఈయన సీఎం అవుతాడని భావించను కూడా భావించలేదు. కాని, అనూహ్యంగా రోషయ్య తరువాత ముఖ్యమంత్రిగా వెలుగులు విరజిమ్ముతూ హైలైట్ అయ్యారు. కాని, ఎంత ఫాస్ట్ ఎదిగారో అంతే ఫాస్ట్ గా ఆఫ్ స్క్రీన్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఆకాశంలో తన కిరణాలు ప్రసారించాలనుకుంటారు...
తాజా గుసగుసల్ని బట్టీ చూస్తే కిరణ్ ఇప్పుడు జనసేన వైపు చూపు పెట్టారట. ఆయన బీజేపీలో చేరతారని చాలా రోజులుగా టాక్ నడుస్తున్నా అలాంటి కదలికలు మాత్రం కనిపించలేదు. ఇప్పడు సడన్ గా పవన్ కళ్యాణ్ పార్టీపై మనసు మళ్లిందంటున్నారు. అటు జనసేనకు కూడా ఇప్పటి వరకూ పవన్ తప్ప రెండో నేతే లేకపోవటంతో కిరణ్ కలయిక ఓకేలాగానే వుంది. కాని, అఫీషియల్ గా జనసేన నుంచి మాత్రం ఇంత వరకూ ఎలాంటి ఆహ్వానం రాలేదు కిరణ్ కి. అతి త్వరలో వెల్ కమ్ నోట్ వచ్చేస్తుందంటున్నారు ఇరువర్గాల జనం. కాని, ఇక్కడే బోలెడన్ని ప్రశ్నలున్నాయి విమర్శించే వారికి...
కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినా పెద్దగా లాభం వుండదు.ఆంధ్రప్రదేశ్ లో కమలం ఇప్పుడప్పుడే వికసించే సూచనలు అస్సలు కనిపించటం లేదు. అలాగని బీజేపి జోడీ కట్టిన టీడీపీలోకి కిరణ్ వెళతారా అంటే అదీ సాధ్యం కాదు. చంద్రబాబు కటాక్షం కోసం ఎదురు చూసే నేతల సంఖ్య తెలుగుదేశంలో ఇప్పటికే చాంతాడంత వుంది. వాళ్ల వరుసలో ఒక మాజీ సీఎం అయ్యి వుండి కిరణ్ కుమార్ రెడ్డి కూర్చోలేకపోవచ్చు. పోనీ... మిగిలిన జగన్ పార్టీలోకి వెళదామా అంటే అది కూడా పెద్ద రిస్కే. జగన్ కిరణ్ కంటే జూనియర్. పైగా పార్టీని పూర్తిగా ఏక ఛత్రాధిపత్యంలో నడిపిస్తున్నాడు. వైసీపీ ఫ్యాన్ గాలిలో కూర్చోవటం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏసీ వాతావరణానికి అలవాటు పడ్డ కిరణ్ కి చాలా అసౌకర్యంగా వుండవచ్చు! ఇక మిగిలింది ఇంకా పురివిప్పని జనసేన. అందుకే, కిరణ్ పవర్ స్టారే బెటరని లెక్కలు వేసుకుంటున్నారంటున్నారు. అక్కడైతే పవన్ సినిమా హీరోగా ఫేమస్. అతనితో కలిసి నడిస్తే తనకు ప్లస్ అవుతుంది. మరో వైపు కొత్తగా వస్తోన్న పార్టీ కాబట్టి జనసేన కిరణ్ న్ని సీనియర్ గా బాగానే గౌరవించుకునే ఛాన్స్ వుంది.
కిరణ్ కుమార్ కోణం నుంచి చూసినప్పుడు జనసేన ఆలోచన బాగానే వున్నా పవన్ వైపు నుంచి చూసినప్పుడే అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అసలు పవన్ అన్న చిరు పెట్టిన ప్రజా రాజ్యం ఎందుకు ఢమాల్ అయిపోయింది? ఇలా ఏ పార్టీ నుంచి ఎవరు వస్తే వాళ్లను వెల్ కమ్ చేసేయటంతోనే జనంలో క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు కిరణ్ లాంటి ఒక మాజీ కాంగ్రెస్ సీఎంని తీసుకుని జనసేన కూడా అదే తప్పు చేయవద్దంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే, ఓటర్లు ఒక కొత్త పార్టీ వస్తే కొత్త నాయకత్వాన్ని కూడా ఆశిస్తారని వారంటున్నారు. అలా కాకుండా కొత్త సీసాలో పాత మందు ఫార్ములా వాడితే బెడిసికొట్టొచ్చంటున్నారు!
జనసేనలోకి కేవలం కిరణ్ రాకతో వ్యవహారం ఆగిపోకపోవచ్చు. ఆయన బాటలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల్లోని అసంతృప్తి బ్యాచ్ మొత్తం జై పవనిజం అనవచ్చు. అలా అంటే ఎన్నికల ముందు హడావిడి బాగానే వుంటుంది కాని ఎన్నికల తరువాత ఓట్లే నిరాశపరుస్తాయి. ఇది ఆల్రెడీ పీఆర్పీ నిరూపించిన బ్యాలెట్ సత్యం! అంతే కాదు, కిరణ్ కుమార్ చేరిక జనసేనకు ప్రాక్టికల్ గా కూడా అనేక నష్టాలు తెచ్చే ఛాన్స్ వుందంటున్నారు. ముఖ్యంగా, ఆయన సీఎంగా వుంటూనే రాష్ట్ర విభజన జరగనిచ్చారు. ఢిల్లీ పరిణామాలు అన్నీ తెలిసినా హైద్రాబాద్ లేకుండా ఆంధ్రాను విడదీస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. లాస్ట్ లో రాజీనామా, ప్రెస్ మీట్లు ఎన్ని చేసినా అసలు ఆయన విభజనని మొదట్లోనే అడ్డుకోలేకపోయారని జనంలో అసంతృప్తి వుంది. కనీసం యూపీఏ ఆలోచన ఏంటో కూడా కిరణ్ సామాన్య ఆంధ్ర ప్రజలకి చెప్పలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ జనసేనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరో వైపు తెలంగాణలో ఇప్పటికే జనసేనకి పెద్దగా అవకాశాలు కనిపించటం లేదు. కిరణ్ లాంటి కరుడుగట్టిన సమైక్యవాది కూడా చేరితే పవన్ పార్టీ కేసీఆర్ సంస్థానం పై ఆశలు వదులుకోవాల్సిందే!
తెలంగాణలో జనసేన ఆశలు, ఆశయాలు పక్కన పెడితే ఆంధ్రాలో మాత్రం చక్కటి స్కోప్ వుంది. అధికార పక్షం మ్యానిఫెస్టోలో చెప్పిన దాంట్లో సగం కూడా డెలివర్ చేయలేకపోయింది. 2019 కల్లా జనంలో అసంతృప్తి పెరిగే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరో వైపు, ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ ఎంత మాత్రం వాడుకోలేకపోతున్నారని అంటున్నారు మేధావులు. ప్రతిపక్షంగా వైసీపీ ప్రజలకు దగ్గరవ్వలేకపోతోందని వారి ఆరోపణ. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన సంచలనాలు సృష్టిస్తూ దూసుకొచ్చే చక్కటి సమయం ఇప్పుడు వుంది. కాని, పవన్ కళ్యాణ్ చేయాల్సిందల్లా పీఆర్పీ ఎందుకు ఫ్లాపైందో గుర్తు పెట్టుకోవటమే! అన్ని పార్టీల్లో ఆరితేరిన ఓల్డ్ మాంక్స్ అందర్నీ తన టేబుల్ మీదకి తెచ్చుకుంటే ... ఎన్నికల సమయంలో తూళి పడాల్సి వస్తుంది. అలా కాకుండా కొత్త నాయకత్వం, కొత్త భరోసా ప్రజలకి చూపిస్తే ఒకప్పటి ఎన్టీఆర్ ప్రభంజనం లాంటిది జనసేన నుంచి కూడా ఆశించవచ్చు!