బంగారు దుకాణాలకి బంగారు బాతు... దంతేరస్!
posted on Oct 28, 2016 @ 5:49PM
ఒక్కసారి పొద్దున్న లేచి పేపర్ చూడండి. లేదంటే టీవీ ఆన్ చేయండి. రేడియో వినండి. కాదంటే ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వండి. అన్ని చోట్లా దర్శనం ఇచ్చేవి ఏంటి? యాడ్స్! అవును... అడ్వర్టైమెంట్లు ఇప్పుడు విశ్వరూపం ఎత్తేశాయి. మీరు సినిమాకి పోతే పెద్ద తెర మీద కనిపించే ప్రకటనలు మొదలు యూ ట్యూబ్ చూసేప్పుడు వచ్చే యాడ్స్ వరకూ అంతటా క్రియేటివ్ మసాలానే! నల్ల చర్మం తెల్లబడటానికి క్రీమ్, తెల్ల జుట్టు నల్లబడటానికి హెయిర్ డై... ఇలా మాయ చేసి అమ్మేస్తున్నారు జనానికి అవసరం వున్నవీ, లేనివి!
రకరకాల ప్రాడక్ట్స్ అమ్మే కార్పోరేట్ కంపెనీలు సహజంగానే పండగల్ని కూడా వదలటం లేదు. మరీ ముఖ్యంగా, బంగారు బాతు లాంటి దంతేరస్ వస్తే బంగారు దుకాణాలకి పండగే! లక్ష్మీ దేవి భక్తుల కంటే ఎక్కువ ఈ షాప్ లు, షోరూంల వాళ్లు హైపర్ అయిపోతున్నారు. అసలు ఒకప్పుడు తెలుగు వారికి దంతేరస్ అంటే ఏంటో కూడా తెలియదు. ధన త్రయోదశి మాత్రం నరకచతుర్ధశికి ముందు రోజుగా చెలామణిలో వుండేది. ఈ రోజున లక్ష్మీ దేవీ , ధన్వంతరి భగవానుడు పాల సముద్రం నుంచి ఉద్భవించారని పురాణం కథనం. కాకపోతే, తెలుగు ప్రాంతాల్లో ధన్వంతరి ఆరాధన కూడా పెద్దగా వుండేది కాదు. కాని, ఇప్పుడు ప్రకటనల ప్రళయం వచ్చేసరికి మొత్తం అంతా మారిపోయింది...
గత కొన్నేళ్లుగా దంతేరస్ అంటూ ఉత్తరాది వారి పండుగని మనకి పరిచయం చేసేశాయి అడ్వర్టైమెంట్లు. వరస పెట్టి వచ్చే ప్రకటనలు, పేపర్స్ లో కనిపించే ఫుల్ పేజ్ యాడ్స్ మాయ చేసేశాయి. దంతేరస్ నాడు, అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు, దీపావళికి ముందు రోజున... బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవీ నడుస్తూ వచ్చి బీరువాలో సెటిలైపోతుందని ప్రచారం చేశారు. అసలు ఒక దశలో ఈ గోల్డ్ రష్ ఎక్కడిదాకా వెళ్లిందంటే ధనత్రయోదశి నాడు బంగారం కొనకపోతే లక్ష్మీదేవీ ఆగ్రహిస్తుందన్నంత విపరీతంగా అయిపోయింది. ఎవరైనా బంగారానికి డబ్బులు లేక కొనలేకపోతే మనస్తాపానికి గురయ్యేలా తయారైంది. ఇక బంగారు దుకాణాల వద్ద అయితే రేషన్ షాపుల వద్ద నిలబడ్డట్టు క్యూలో నిలబడ్డారు జనం! ఇదంతా చూశాక బంగారం తెచ్చి పెట్టుకున్న వాడికంటే ఎక్కువ లక్ష్మీ కటాక్షం అమ్మిన షాపు వాడికొచ్చిందని ఈజీగా అర్థమైపోతుంది!
ఎప్పటిలాగే ఈ యేడు కూడా దంతేరస్ అంటూ యాడ్స్ దంచుకున్నారు గోల్డ్ బిజినస్ మెన్. ఎంత వరకూ జనం షాపుల వైపు పరుగులు తీశారో తెలియదు కాని ముందు కన్నా పిచ్చి తగ్గిందని చెప్పవచ్చు. అయినా కూడా బంగారం కొని తీరాలన్న ఆవేశంతో వున్నా వారు ఇంకా వున్నారు. కాని, మరో వైప పండితులు బంగారం మాత్రమే కొనాలని ఎక్కడా లేదంటున్నారు. అసలు హిందూ మతంలో లక్ష్మీ దేవీ అంటే బంగారమో, డబ్బులు మాత్రమో కాదనీ... ఆమె సకల సందలకూ ప్రతిరూపమని చెబుతున్నారు. అందుకే, దంతేరస్ రోజు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు మట్టి కుండ మొదలు బంగారం, వజ్రాల వరకూ ఏదైనా కొనవచ్చని... అన్నీ లక్ష్మీ రూపాలేనని అంటున్నారు. అంతే కంటే ముఖ్యంగా, మన వద్ద ఏదైతే వుందో దాన్ని దానం చేయాలని చెబుతున్నారు. స్వార్థంతో బంగారం కొని బీరువాలో దాచుకుంటే లాభం లేదంటున్నారు. ఎంతో కొంత దాన , ధర్మాలు చేస్తే అది ఎప్పటికైనా మంచి చేస్తుందంటున్నారు! జనం పండితుల మాట వింటారో లేక యాడ్స్ చెప్పేదే వింటారో ... చూడాలి!