విశాఖలో ప్రేమమ్... ప్రభుత్వానికి ప్రమాదమ్!
posted on Nov 5, 2016 @ 12:35PM
ప్రేమోత్సవం... ఈ సంగతేంటో మీ దాకా వచ్చిందా? మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ అయితే మీకు తెలిసే వుంటుంది! లేకపోతే ప్రేమోత్సవం విషయం పెద్దగా ఐడియా లేకపోవచ్చు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే... ఫిబ్రవరీ 12, 13, 14 తేదీల్లో బీచ్ సిటీ విశాఖలో ఓ ఉత్సవం చేయదలుచుకున్నారు. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమోత్సవం నిర్వహించాలనుకున్నారు. అదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది! అటు పోయి ఇటు పోయి ఏపీ సర్కార్ కు చుట్టుకుంటోంది...
ఫిబ్రవరీ 14వస్తుందంటే ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునేది హిందూ మత సంస్థలు. కాని, ఈసారి వీహెచ్ పీ, బజరంగ్ దళ్ లాంటి వాటికంటే ముందే చంద్రబాబు సర్కార్ గొడవలో పడింది. విశాఖ బీచ్ లో ప్రేమోత్సవం అంటూ కలకలం రేగింది. అసలు విషయం ఏంటంటే... ఒక ప్రైవేట్ సంస్థ ప్రతీ యేడు లాగే ఈ సారి లవ్ ఫెస్ట్ నిర్వహించాలనుకుంది. అందుకోసం నవ్యాంద్రలోని అద్భుత నగరం విశాఖను ఎంచుకుంది. వెంటనే గవర్నమెంట్ ను అప్రోచ్ అయ్యి పర్మిషన్ అడిగింది. కాని, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, లవ్ ఫెస్టివల్ ఆషామాషీగా జరగదట! 9వేల జంటలు ప్రపంచం నలుమూలల నుంచీ తరలి వస్తాయట. వాళ్లకు బీచ్ లోనే టెంట్లు ఏర్పాటు చేస్తారు. బికినీల్లో అమ్మాయిలు భీభత్సమైన గ్లామర్ ఒలకబోస్తారు. ఇదీ... సదరు కంపెనీ వారి ప్రేమ! మనమైతే కామం అంటాం. అదీ వేరే విషయం...
షకీరా లాంటి హాట్ పాప్ సింగర్ కూడా వస్తుండటంతో కొంత మంది ఈ ఈవెంట్ మొత్తాన్ని పెద్ద పాపపు కార్యంగా డిసైడ్ అయిపోయారు. పోయిన సంవత్సరం ఇదే ఉత్సవం గోవాలో జరిగింది. కాని, పెద్దగా వివాదాలేం తలెత్తలేదు. కాని, ఈసారి విశాఖ అనే సరికి అంతా ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే, షకీరా పాటలు, బికినీ వేసుకున్న భామలు, టెంట్లలో టెంపరరీ కాపురాలు... ఇవన్నీ విశాఖ కల్చర్ కావు. గోవాలో పోర్చుగీసు వాళ్లు వదిలి వెళ్లిన సంస్కృతి ఎప్పట్నుంచో వుంది. అక్కడ ఉత్సవం కుదిరింది కాబట్టి ఎక్కడైనా చేస్తామంటే వీలు కాదు. మరీ ముఖ్యంగా, విశాఖ లాంటి ప్రశాంతమైన నగరంలో!
ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వపడేలా స్థాపించిన పార్టీ టీడీపీ. అది అధికారంలో వుండగానే ఈ బీచ్ ఫెస్టివల్స్ , బికినీ సెలబ్రేషన్స్ ఏంటని కొంత మంది మండిపడుతున్నారు. ఇలా అయితే తెలుగు సంస్కృతి మరింత వేగంగా తుడిచి పెట్టుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ , ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పటమే ప్రభుత్వ వ్యూహం!
ప్రేమోత్సవం కాన్సెప్ట్ లేనిపోని గొడవలకు కారణం అవుతుండటంతో ఏపీ సర్కార్ కూల్ గా చేయి వెనక్కు తీసుకునే పనిలో పడింది. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని, అసలు ఆ ఈవెంట్ తో గవర్నమెంట్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తోంది. ఇంకా అనుమతి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారట అధికారులు! అయితే, బికినీ లవ్వుకు నో చెప్పటమే చంద్రబాబు ప్రభుత్వానికి మేలు చేస్తుంది. ఆఫ్ట్రాల్ ఒక ప్రైవేట్ ఈవెంట్ వల్ల విశాఖకొచ్చే విపరీతమైన లాభం, రాబడీ ఏం వుండదు.పై పెచ్చు పంతానికి పోయి పర్మిషన్ ఇస్తే ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రమాదం వుంది. కాబట్టి సీఎం ఈ గాలిన పోతున్న కంపని గాలికే వదిలేస్తే బెటర్...