టాటా పరివార్ లో... ధర్మానికి, ధన లాభానికి మధ్య వార్!
posted on Oct 28, 2016 @ 11:24AM
టాటాల ప్రపంచంలో తుఫాన్ ఇంకా సద్దుమణగటం లేదు. ఒకవైపు అవమానకరంగా తొలగింపబడ్డ సైరస్ మిస్త్రి, మరో వైపు విజయానికి, నైతికతకి ప్రతి రూపంగా ఇంతకాలం చెబుతూ వచ్చిన రతన్ టాటా! వీళ్ల మధ్య టాటా సన్స్ బోర్డు, దాని డైరెక్టర్స్... మొత్తం అంతా గందరగోళంగా వుంది బయట నుంచి చూసేవారికి! మరీ ముఖ్యంగా, టాటాలో షేర్స్ వున్న షేర్ హోల్డర్స్ కి అంతా అయోమయంగా వుంది...
వున్నట్టుండీ తమ చైర్మన్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. అయితే, ఎవ్వరూ ఊహించని ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. కాని, మెల్ల మెల్లగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చైర్మన్ తొలగింపు అనూహ్యంగా జరిగిందేం కాదనిపిస్తోంది. చాలా రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయని అర్థమవుతుంది. వాటి ఫలితమే మిస్త్రీ తొలగింపు అనే తుఫాన్!
సైరస్ మిస్త్రీని చైర్మన్ గా ఎంచుకుంది , ప్రకటించింది రతన్ టాటానే. కాని, తనని కుర్చీలోంచి పక్కకు తప్పించగానే మిస్త్రీ మొదట ఆరోపణలు చేసింది ఆయన మీదే. అసలు తనకి స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశమే ఇవ్వలేదని సైరస్ తన లేఖలో రాశారు. అయితే, టాటా డైరెక్టర్స్ కి పంపిన ఈ కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్ కూడా మీడియాకి లీకైంది. ఈ పని మిస్త్రీనే చేశాడని టాటా డైరెక్టర్స్ అంటున్నారు. ఆయన తన చైర్మన్ గిరి కాలం మొత్తంలో అంతా అనైతికంగా ప్రవర్తించాడని వాళ్లు చెబుతున్నారు. సైరస్ చేసిన ప్రతీ ఆరోపణకి రివర్స్ ఎటాక్ ఇచ్చింది టాటా గ్రూప్!
చాలా కంపెనీలు, ముఖ్యంగా, టాటా నానో సంస్థ లాస్ లో వుందని మిస్త్రీ ఎత్తి చూపాడు. ఆ నష్టాల వల్ల టాటా గ్రూప్ భవిష్యత్ ఆందళనకరంగా మారిందన్నాడు. కేవలం రతన్ టాటా తృప్తి కోసమే నానో ఉత్పత్తి చేస్తున్నారని అన్నాడు. ఇలా రతన్ టాటాని, టాటా సంస్థల్ని మిస్త్రీ నేరుగానే టార్గెట్ చేశాడు. అందుకు తగ్గట్టే టాటా డైరెక్టర్స్ కూడా ఘాటుగా స్సందించారు. మిస్త్రీ తనకిచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయాడని, టాటా కంపెనీల నైతిక పరమైన కీర్తి, ప్రతిష్ఠల్ని ఆయన దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడని అన్నారు. నిజంగా కూడా సైరస్ లాస్ లో వున్న కంపెనీల్ని క్రమంగా వదిలించుకుంటూ వచ్చాడు.
ఖరీదైన కార్లని కొనలేని మధ్యతరగతి ఇండియన్స్ కోసం రతన్ టాటా పట్టుదలతో తీసుకొచ్చిన కలల కారు నానో. అది మార్కెట్లోకి తేవటం గొప్ప విషయమని మారుతి సంస్థ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. కాని, అదే నానోపై రతన్ టాటాకు మిస్త్రీ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీన్నంతట్ని బట్టి చూస్తుంటే... టాటాల సామ్రాజ్యంలో జరిగింది నైతిక విలువలకి, ఫక్తు బిజినెస్ నిర్ణయాలకి మధ్య గొడవగా అర్థం చేసుకోవచ్చు! మరి దీర్ఘ కాలంలో రతన్ టాటా ఎంచుకున్న నైతికత, సామాజిక బాధ్యత వంటి అంశాలు విజయవంతం అవుతాయో... లేక మిస్త్రీ సమర్థించిన కఠిన వ్యాపార నిర్ణయాలు సరైనవని ప్రూవ్ అవుతాయో వేచి చూడాలి...