మోదీ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన బాబు, కేసీఆర్!
posted on Oct 31, 2016 @ 5:28PM
గుజరాత్... ఈ పేరు బిజినెస్ కి మారు పేరు. అంతే కదా? అఫ్ కోర్స్, కొంత మందికి దీనిపై భిన్నాభిప్రాయలు వుండొచ్చు. కాని, గుజరాత్ మాత్రం బిజినెస్ హబ్ గా ప్రచారంలో వుంటూ వస్తోంది. కాని, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు గుజరాత్ ని బీట్ చేశాయి. అదీ బిజినెస్ విషయంలో!
మొత్తం దేశంలో ఎక్కడ వ్యాపారానికి అనువైన వాతావరణం వుంది? ఎక్కడ సంస్కరణలు వేగంగా అమలవుతున్నాయి? ఈ ప్రశ్నలకి సమాధానం, కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు. 2015 జూలై నుంచి 2016 జూన్ వరకూ జరిపిన అధ్యయనంలో ఏపీ, తెలంగాణ టాప్ లో నిలిచాయి. 98.78శాతం మార్కులతో తెలంగాణ, ఆంధ్రా రెండూ సేమ్ ర్యాంక్ కొట్టేశాయి. వీటి తరువాత మూడో స్థానానికి పడిపోయింది వ్యాపారానికి స్వర్గం లాంటి గుజరాత్! 98.21శాతం మార్కులు సంపాదించింది మోదీ స్వరాష్ట్రం. ఇక ఆ తరువాతి స్థానాల్లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హర్యాణా, జార్ఖ్ ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలు నిలిచాయి.
ఈ ర్యాంక్స్ ఆయా రాష్ట్రాల్లో వున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అద్దం పడతాయి. అంటే, వ్యాపారం చేసుకోటానికి సదరు రాష్ట్రాల్లో ఎంత అనుకూల వాతావరణం, ఎంత ప్రొత్సాహకర పరిస్థితులు వున్నాయన్నది తెలుస్తుంది. అంతే కాదు, సంస్కరణల అమలు విషయంలో కూడా ఈ అధ్యయనంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులోనూ మన రెండు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. ఆర్దిక సంస్కరణలు వేగంగా అమలుచేస్తూ సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి.
సమైక్యాంధ్ర ప్రదేశ్ పదేళ్ల పాటూ పాలించి పూర్తిస్థాయి గందరగోళానికి కారణమైంది కాంగ్రెస్. చివరకు, విభజన కూడా చేసి జనాల ఆవేశానికి, ఆగ్రహానికి గురైంది. ఆలస్యంగా ఇచ్చిందన్న చెడ్డ పేరు తెలంగాణలో, విభజించిందన్న కోపం ఆంద్రాలో మూటగట్టుకుంది. అటువంటి పార్టీ హయాంలో పూర్తిగా అభివృద్ధి మందగించింది తెలంగాణ , ఆంద్రాల్లో. ఇప్పుడు మళ్లీ ఈ ర్యాంకింగ్స్ మనం రైట్ ట్రాక్ మీదకు వచ్చామని సూచిస్తున్నాయి. వాల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా అధ్యయనం చేసి ఇచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినస్ ర్యాంకులు మరింత మేలు చేస్తాయి కొత్త రాష్ట్రాలకి. మరీ ముఖ్యంగా, కొత్త రాజధానితో సరికొత్తగా రేసులోకి వచ్చిన నవ్యాంధ్ర ఇంకా ఉధృతంగా వ్యాపారాన్ని వృద్ధి చేయాలి. వ్యాపారానికి అనుకూల వాతావరణం మరింత పెంపొందించాలి! అప్పుడే స్వవర్ణాంద్ర, బంగారు తెలంగాణ నినాదాలు సాకారం అవుతాయి...