ఈ ఇద్దరూ... జనాన్ని ఎలా మాయ చేస్తున్నారు?
posted on Oct 29, 2016 @ 2:29PM
నమోన్నమః... ఇంకా భారతదేశం 2014 మూడ్ లోనే వుందంటున్నారు సర్వేకారులు! మోదీకి నమోన్నమః అంటున్నారట జనం! ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ విజయకేతనం రెపరెపలాడుతూనే వుంది! ఇంకా చెప్పుకోవాలంటే కేసీఆర్ క్రేజ్ ఇంకా కొంచెం పెరిగింది కూడా! అసలు మోదీ, కేసీఆర్ ల సక్సెస్ సీక్రెట్ ఏంటి?
కొన్ని సార్లు నాయకులకి పార్టీ ఉపయోగపడుతుంది. మరి కొన్ని సార్లు నాయకులే పార్టీకి ఉపయోగపడతారు! ఈ రెండో కోవకి చెందిన వారే మోదీ, కేసీఆర్. ఇద్దరిదీ వేరు వేరు రాజకీయ నేపథ్యం అయినా ఇద్దరి విజయం మాత్రం ఒకేలా మెస్మరైజ్ చేస్తుంది. అందుకు తాజా ఉదాహరణ వీడీపీ అసోసియేట్స్ చేసిన సర్వే. మొత్తం 420 లోక్ సభ నియోజక వర్గాల్లో ఈ సర్వే నడిచింది. అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానాలు రాబట్టారు. జనం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఢిల్లీకి ఎవర్ని పంపిస్తారు? రాష్ట్రాల్లో ఎవర్ని ఎన్నుకుంటారు? అలాగే ఏ సీఎం ఎంత జనాకర్షణ కలిగి వున్నారు? పీఎం పరిస్థితి ఏంటి? ... ఇలాంటి బోలెడు ప్రశ్నలకి సమాధానాలు సర్వే!
ఢిల్లీలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏకి, తెలంగాణలో టీఆర్ఎస్ కి తిరుగులేదని తేల్చింది సర్వే. కాకపోతే, అన్ని ఫలితాల్లోకి అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే... కేసీఆర్, మోదీల జనాకర్షణ! దేశ ప్రధానిగా 2014లో ఎన్నికైన మోదీ అప్పట్లో ఒక ప్రభంజనం. కాని, గత రెండున్నరేళ్లలో సామాన్య జనానికి ఒదిగిందేం లేదు. ధరల తగ్గుదల, ఉద్యోగాలు వగైరా వగైరా అన్నీ అలానే వున్నాయి. అవినీతి మాత్రం తగ్గింది. కుంభకోణాలు వినిపించటం లేదు. అయినా కూడా మోదీ జాతీయ నాయకుల్లో ఎవరికి అందనంత ఎత్తులో వున్నాడు! 67శాతం మంది ఆయన్నే మళ్లీ ప్రధానిగా కోరుకుంటున్నారు. దీనికంటే ముఖ్యమైంది ఆయన తరువాతి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేసే స్థితిలోనే లేరు. రాహుల్, కేజ్రీవాల్ ఇద్దరూ కలిపి కూడా 8శాతానికి మించి మద్దతు సంపాదించలేకపోయారు. అంత డిఫరెన్స్ వుంది మోదీకి ప్రత్యర్థుల నుంచి. అయితే, దీనికి కారణం ఏంటి?
మోదీ పాప్యులారిటీకి కారణం ఆయన సిన్సియారిటీ అనే అనుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు ఇంకా నెరవేర్చకపోయినా ఆయన మీద జనం నమ్మకంతో వున్నారు. తప్పక అచ్చే దిన్ తెస్తాడని నమ్ముతున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఎక్కడా తన మీద మచ్చ పడేలా ప్రవర్తించలేదు నరేంద్ర మోదీ. అంతే కాదు, పాకిస్తాన్ తో ఆయన డీల్ చేస్తున్న తీరు భారతీయుల్లో ఆత్మవిశ్వాసం నింపింది. ఇదే మోదీ దూకుడుకి కారణం...
మోదీ జనాకర్షణకి పూర్తి భిన్నమైంది కేసీఆర్ ఫాలోయింగ్. ఆయన డైనమిజమే ఆయనకు క్రేజ్ గా మారుతోంది. పది జిల్లాల్ని 31గా చేసిన కేసీఆర్ మొదటి రోజు నుంచీ అన్నీ సెన్సేషనల్ నిర్ణయాలే తీసుకుంటున్నాడు. వాటి వల్ల కలిగే పలితాలు ఎలా వున్నా జనం మాత్రం హిప్పాటైజ్ అవుతున్నారు. దాని ఫలితమే ఏకంగా 87శాతం తెలంగాణ ప్రజలు ఆయనకు జైకొట్టడం! అర్జెంట్ గా ఎన్నికలొస్తే హైద్రాబాద్ లోని ఎంఐఎం ఎంపీ సీటుతో సహా అన్నీ టీఆర్ఎస్ కే దక్కుతాయని సర్వే అంటోంది! అంత భారీగా కేసీఆర్ జనం అభిమానాన్ని పొందాడు. దీనికి కారణం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే. గోల్కొండపై జెండా ఎగరవేయటం మొదలు జిల్లాల విభజన దాకా అన్నీ అనూహ్య విధానాలే వుండటం కేసీఆర్ కు ప్లస్ గా మారుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జనానికి ఎంత వరకూ మేలు జరుగుతుందో కాని ఇప్పటికిప్పుడు మాత్రం టీఆర్ఎస్ హవానే కొనసాగబోతోందని తేలిపోయింది!
మోదీకి, కేసీఆర్ కి కలిసి వస్తోన్న అత్యంత ముఖ్య విషయం మరొకటి వుంది! వీళ్లిద్దరికి పోటీగా బరిలో వున్న వారెవరూ అసలు వీళ్ల స్థాయికి ఏ మాత్రం సరిపోని వారు. దాంతో ఆటోమేటిక్ గా ప్రజలు ఈ ఇద్దరు నాయకుల వైపే మూకుమ్మడిగా వచ్చి చేరిపోతున్నారు!