ప్రపంచ మార్కెట్లో... యుద్ధం ఒక వ్యాపారం!
posted on Nov 3, 2016 @ 7:30PM
ఐసిస్... ఇక మీదట ఈ పేరు ఇంతకు ముందు వినిపించినంత వినపడకపోవచ్చు. ఎందుకంటే, ఇరాక్ లో ఆ ఉగ్ర సంస్థ మీద యుద్ధం దాదాపుగా చివరి అంకానికి చేరుకుంది. ఐఎస్ఐఎస్ ఆయువు పట్టులాంటి మోసుల్ నగరం ఇరాకీ సేనల నియంత్రణలోకి వచ్చేస్తోంది. క్రమంగా అమెరికా సాయంతో ముందుకు దూసుకొస్తున్న సాయుధ దళాలు టెర్రరిస్టుల్ని అన్ని దిక్కుల్నుంచీ చుట్టుముట్టేస్తున్నాయి. ఇక రేపో, మాపో ఐసీస్ అధినేత అల్ బగ్ధాదీ నేలకూలటమో, పట్టుబడటమో జరగాల్సి వుంది...
అంత్య కాలం సమీపిస్తున్నా బగ్ధాదీ తనదైన స్టైల్లో ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టే పని చేస్తున్నాడు. ఇంటర్నెట్ లో మనోడి ఆడియో చక్కర్లు కొడుతోంది. దాంట్లో తన ఉన్మాద సైనికుల్ని ఇరాకీ సేనల మీద తిరగబడమని పిలుపునిచ్చాడు. అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందోగాని ప్రస్తుతానికైతే ఐసిస్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది. అసలు ఆ సంస్థ తరుఫున పోరాడాల్సిన జిహాదీలే బురఖాలు వేసుకుని తప్పించుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారంటే యుద్ధం ఎక్కడి దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు!
ఇప్పుడు ఐసిస్ కత ఖతం అనుకంటున్నాం. గతంలో ఇదేలా అల్ ఖైదా కలకలం రేపింది. కాని, లాడెన్ హతంతో అది చల్లబడింది. ఇప్పటికీ అల్ ఖైదా వున్నా ఒకప్పటి జోరు లేదు. దాని ప్లేస్ లోనే ఐసిస్ రాక్షసిలా నోరు తెరిచింది. ఇప్పుడు దాని పని కూడా అయిపోతోంది. కాని, విషాదం ఏంటంటే, ఆయుధాల ఫ్యాక్టరీల ఓనర్లే ప్రభుత్వాలు నడుపుతున్న ప్రస్తుత ప్రపంచంలో మరో ఐసిస్, మరో అల్ ఖైదా పుట్టటానికి పెద్ద టైం పట్టకపోవచ్చు! అందుకు , ఐఎస్ఐఎస్ , అల్ ఖైదాల పుట్టుక, పతనాలే నిదర్శనం...
అల్ ఖైదా, ఐసిస్ లు ఎలా పుట్టాయి ? సూటిగా చెప్పుకుంటే అమెరికా, దాని మిత్ర దేశాల యుద్ధ కాంక్ష వల్ల పుట్టాయి! ఒకప్పుడు రష్యాపై తిరగబడ్డ జనాలకి అమెరికా శిక్షణ, ఆయుధాలు ఇచ్చింది. తరువాత అదే అల్ ఖైదాగా మారి, లాడెన్ రూపంలో అగ్ర రాజ్యాన్ని గడగడలాడించింది. రష్యాతో కోల్డ్ వార్ అయిపోయాక అమెరికా పోషించిన ఉగ్రవాదులు ఖాళీగా కూర్చోలేదు. అమెరికాకే శత్రువులయ్యారు. అదే వాల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడుల దాకా దారి తీసింది. తరువాత ఆఫ్గనిస్తాన్, ఇరాక్ ల పై యద్ధం రూపంలో మరింత సంక్షోభం తలెత్తింది. అదే ఐసిస్ కి కారణమైంది!
ఇరాక్ లో సద్దాంను, అలాగే, లిబియాలో గడాఫీని వరుసగా గద్దె దించుతూ పోయిన అమెరికా అక్కడి స్థానికులకి అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆయుధాలు, శిక్షణ ఇచ్చి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పింది. వాళ్లు సద్దాం, గడాఫీ లాంటి నియంతల పతనం తరువాత అరాచకులైపోయారు. అమెరికా మాట కూడా వినకుండా ఐసిస్ రూపంలో అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నారు. అమెరికా రాజేసిన వదిలిన అల్ బగ్ధాది తన సైన్యంతో ఎంత మంది యాజ్దీల్ని చంపాడో లెక్కేలేదు. ఎందరు ఇరాకీ మైనార్టీ స్త్రీలు రేపులకి, బానిసత్వానికి గురయ్యారో అంచనానే లేదు. 2014 నుంచీ ఇప్పటి వరకూ ఐఎస్ఐఎస్ కిరాతక పర్వం నడుస్తూనే వుంది.
అల్ ఖైదా, ఐసిస్ ల తరువాత నెక్ట్స్ ఏంటి? అమెరికాలో హిల్లరీ గెలిస్తే తక్కువ అవకాశాలు... ట్రంప్ గెలిస్తే ఎక్కువ అవకాశాలు వుంటాయి... మరో అమానుషమైన ఉగ్ర సంస్థ పుట్టడానికి. కాకపోతే, ఇవాళ్ల కాకుంటే రేపు అమెరికా మరో ఉన్మాద ముఠాని ప్రపంచం మీదకి వదులుతుంది. అప్పుడే యుద్ధం చెలరేగి వెచ్చటి నెత్తురు భూమిపై పారుతుంది! ఆ వెచ్చదనమే అమెరికా లాంటి దేశాల్లోని ఆయుధ కర్మాగారాలకి, కార్పొరేట్లకి కావాల్సింది!