మన స్మార్ట్ ఫోన్స్ , టీవీల్లోకి అమెరికన్ దెయ్యం దూరిందా?
సీఐఏ ఏజెంట్... ఈ పేరు చెప్పగానే ప్రపంచ నేరస్థుల వెన్నులో వణుకు పుడుతుంది. అలాగే, బ్రిటీష్ నిఘా సంస్థ స్పెషల్ ఏజెంట్ జేమ్స్ బాండ్ గురించైతే చెప్పేదే లేదు! నిజంగా జేమ్స్ బాండ్ అంటూ ఒక గూఢచారి లేనేలేకున్నా జనం మాత్రం బాండ్ నిజమేనని నమ్మే స్థితికి తీసుకొచ్చింది హాలీవుడ్. అయితే, అమెరికా, బ్రిటన్ ల నిఘా సత్తా కూడా అంతటిదే! మరీ ముఖ్యంగా, అమెరికన్ సీఐఏ మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుందని పేరు. ఇప్పుడు విక్ లీక్స్ అదే విషయాన్ని మరో సారి స్పష్టం చేసింది...
ప్రపంచాన్ని భయపెట్టే అమెరికాని... అదే రేంజ్లో భయపెట్టే అసలు సిసలు సంస్థ వికీలీక్స్! మొట్ట మొదటి లీక్ నుంచీ యూఎస్ నే టార్గెట్ చేసిన ఆ సంస్థ తాజాగా మరో సారి వాల్ట్ సెవన్ అంటూ జనం ముందుకొచ్చింది. ఈ వాల్ట్ సెవన్ కోడ్ నేమ్ తో వికీలీక్స్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. అయితే, ఈసారి సీఐఏను టార్గెట్ చేసి అది ఎలా సామాన్య జనం లివింగ్ రూముల్లోకి, జేబుల్లోకి, కార్లలోకి జొరబడుతుందో నిరూపించింది. వికీలీక్స్ లెటెస్ట్ డాక్యుమెంట్స్ ప్రకారం అమెరికన్ నిఘా సంస్థ కొన్ని వేల హ్యాకింగ్ టూల్స్ ను తయారు చేసిందట! వాటిని ప్రపంచ వ్యాప్తంగా వున్న స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ కార్లలో ప్రవేశపెట్టి తనకు కావాల్సిన సమాచారం రాబట్టుకునే కుట్ర చేసిందట. ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఐప్యాడ్ లు, కార్లలోకి సీఐఏ తాను తయారు చేసిన టూల్స్ పంపించి తరువాత తనకు కావాల్సిన విధంగా ఆయా యంత్రాల్ని వాడుకుందట. అంటే... హ్యాకైన టీవీలు, ఫోన్లు, కార్లు, ఐప్యాడ్ ల వంటి ఆఫ్ చేసినా కూడా సీఐఏ ఎక్కడో కూర్చుని వాట్ని వాడుకుంటుందన్నమాట. మీరు ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా అంతా అమెరికాలో తెలిసిపోతుంది!
సామాన్య జనం గురించి అమెరికన్ సీఐఏకు తెలిస్తే పెద్ద సమస్య లేదు. కాని, ఆల్రెడీ జనాల ప్రైవెసీకి భంగం కలిగించిన అమెరికా తాను తయారు చేసిన టూల్స్ పై పట్టు కోల్పోయిందట! అంటే, అవ్వి కరుడుగట్టిన సైబర్ నేరగాళ్ల వద్దకి వచ్చేశాట! ఒకవేళ వాళ్లు తమకు లభించిన వేలాది టూల్స్ ఆధారంగా కొత్త హ్యాకింగ్ టూల్స్ తయారు చేసి పంజా విసిరితే జనం నానా తంటాలు పడాల్సిందే! ఫోన్ లలోంచి అత్యంత సున్నితమైన సమాచారం, పాస్ వర్డ్ లు అన్నీ క్షణాల్లో మాయం అయిపోతాయి. టీవీల ద్వారా ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నదీ ఉగ్రవాదులు కూడా వినేస్తారు. ఇలా ఏదైనా జరగొచ్చు!
హ్యాకింగ్ టూల్స్ కారణంగా మొత్తం ప్రపంచమంతా సైబర్ నేరగాళ్ల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతుంది అనేది పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఇప్పుడు ప్రచారం జరుగుతోన్నంత స్మార్ట్ ప్రళయం రాకపోవచ్చు. కాని, అసలు అనైతికంగా హ్యాకింగ్ టూల్స్ తయారు చేసిన సీఐఏ కనీసం వాటి భద్రత విషయంలో కూడా జాగ్రత్తగా వుండకపోవటం, నిర్లక్ష్యంగా ప్రవర్తించటం... దుర్మార్గం. ఇలాంటి దుష్ట పన్నాగాలు అగ్రరాజ్యం మానుకోకపోతే.. అందరికంటే ఎక్కువ నష్టం దానికే కలిగే అవకాశం లేకపోలేదు...