శశికళ సీఎం అవ్వలేకపోవటానికి ఆ 'ఒక్క రూపాయే' కారణం!

  ఒక్క రూపాయే కదా అని తేలిగ్గా తీసుకోకండి! ఒక్కో  రూపాయే వందలు, వేలు, లక్షలు, కోట్లు అయ్యేది! అసలు రూపాయి పవర్ ఏంటో జయలలిత, శశికళకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. పురుచ్ఛితలైవీ అయితే చచ్చిపోయి బతికిపోయింది కాని.... శశికళకు జైలు తప్పలేదు. అదీ నాలుగేళ్లు! మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీకి దూరం! మొత్తం పదేళ్లు బూడిదలో పోసిన 'పన్నీర్' అయిపోయింది! దీనికంతటికి కారణం ఒక్క రూపాయని మీకు తెలుసా?   1991 నుంచీ 1996 దాకా జయలలిత తొలిసారి సీఎం అయ్యారు. అప్పుడు ఆమెను ఎవరూ అడగకున్నా ఓ పొలిటికల్ స్టంట్ చేశారు! అతి నిజాయితీకి పోయి నెలకు కేవలం రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించారు! ఆ నెలకు ఒక్క రూపాయే తరువాతి కాలంలో కొంపలు ముంచింది. ఇంత దాకా తీసుకొచ్చింది. అనవసర పబ్లిసిటీకి పోయి నెలకు రూపాయి అనటంతో.. 5ఏళ్ల పదవి కాలంలో ఆమె ఆదాయం కేవలం అరవై రూపాయలు అవ్వాలి! కాని, అధికారం పోయేనాటికి... అంటే 1991 నుంచి 1996 తరువాత... జయ ఆస్థులు అమాంతం 66కోట్లు పెరిగాయి! ఇదెలా సాధ్యమైంది?   నెలకు రూపాయి జీతం తీసుకున్న అమ్మ ఆస్థులు అక్రమంగా పెరిగిపోయాయని సుబ్రమణియన్ స్వామి కోర్టులో కేసు వేశారు! ఇప్పటికి ఇరవై సంవత్సరాల కింద మొదలైన ఆ లీగల్ వ్యవహారం మొత్తానికి ఇవాళ్ల అంతిమ తీర్పు రుచి చూపించింది! శశికళ మరొక్క అడుగు దూరంలో వుండగా ... సీఎం పదవికి ఆమడ దూరంలోకి విసిరేసింది! చెన్నై కోర్టులో మొదలైన సుబ్రమణియన్ స్వామి పోరాటం బెంగుళూరు కోర్టుకు, తరువాత బెంగుళూరులోని కర్ణాటక హైకోర్ట్ కు, చివరకు, సుప్రీమ్ కోర్టుకు చేరింది. స్పెషల్ కోర్టు తప్పంటే హైకోర్ట్ ఒప్పని, హైకోర్ట్ ఒప్పంటే సుప్రీమ్ తప్పని తీర్పులు ఇస్తూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా సినిమా నడిపించాయి. కాని, జయ, శశికళ కీలక పాత్రల్లో కొనసాగిన ఈ మల్టీ స్టారర్ లో అంతిమ విజయం సాదాసీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వుంటూ వచ్చిన పన్నీర్ సెల్వమ్ ది అయింది! ఇప్పుడాయన తమిళనాడుని ఏలుకునే స్థితిలో కనిపిస్తున్నారు!   కర్మ సిద్ధాంతం ఇంత వరకైతే సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు కాని... అప్పుడెప్పుడో జయలలిత ఊరికే జనాకర్షణ కోసం ప్రయోగించిన రూపాయి జీతం అస్త్రం తిరిగి తిరిగి ఆమె మీదకే వచ్చింది. ఆమె ఎలాగో గౌరవంగా తప్పించుకుని వెళ్లిపోయినా... చేసిన అవినీతి కర్మంతా శశికళను మాత్రం వీడటం లేదు!  

రానున్న కాలంలో... కార్‌కి ప్రొఫెసర్‌తో పోరు తప్పదా?

  ఆంధ్రాలో చంద్రబాబుకి జగన్ వున్నాడు! కాని, తెలంగాణలో కేసీఆర్ కి ఎవరున్నారు? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కావటంతో కేసీఆర్ కు బలైమన ప్రత్యర్థే కరువయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు కరువు లేకున్నా ఢిల్లీ ఆదేశాల మేరకు నడుచుకునే ఆ పార్టీలో ఫుల్ టైం ప్రతిపక్ష నేతగా సత్తా చాటే ఓపిక, ధైర్యం ఎవ్వరికి లేనట్లు అర్థమైపోతోంది. అయితే, కోదండరామ్ ప్రతిపక్షానికి వున్న లోటు తీర్చే ప్రయత్నంలో వున్నారా? పరిస్థితి చూస్తుంటే రాజకీయ నేతలు చేయని పని, చేయలేని పని ప్రొఫెసర్ గారు చేసేలా కనిపిస్తున్నారు!   కేసీఆర్ ను ఎదుర్కోవటం కష్టం. ఆయనకు సామ, దాన, భేదో, దండోపాయాలు అన్నీ తెలుసు! తన పార్టీలో వచ్చి చేరి జైకొడితే సామంతో సరిపెడతాడు. కాదని మొండికేస్తే, రేవంత్ రెడ్డి విషయంలో చేసినట్టు దండోపాయమూ ప్రయోగిస్తాడు. అందుకే, కాంగ్రెస్ , బీజేపి, ఎంఐఎం, కమ్యూనిస్టులు .... ఎవ్వరూ ఆయన్ని గట్టిగా గద్దించలేకపోతున్నారు. అలాగని కేసీఆర్ పాలన లోపాలే లేకుండా వుందా అంటే,అదీ లేదు! కొన్ని పనులు గొప్పగా జరుగుతోన్నా కొన్ని పనులు, ప్రజల ఆకాంక్షలు అస్పలు నెరవేరటం లేదు! మరీ ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమానికి దశాబ్దాల పాటూ కారణంగా నిలచిన ఉపాధి విషయంలో చాలా అసంతృప్తి వుంది జనంలో!   జేఏపీ చైర్మన్ కోదండరామ్ నిరుద్యోగుల్నే తన కేసీఆర్ వ్యతిరేకు ఉద్యమానికి సైన్యంగా మార్చుకున్నాడు. ఈ నెల ఇరవై రెండున ఉద్యోగాల కోసం ర్యాలీ అంటూ కార్యక్రమం తల పెట్టారు! దీన్ని జరగకుండా చూడాలని ప్రభుత్వం ఎలాగూ చూస్తుంది. ఆ బల ప్రయోగమే ఇప్పుడు కోదండరామ్ కి కావాలి. ప్రభుత్వం అణిచివేతకి దిగితేనే జనంలో దాని పట్ల వ్యతిరేకగా వ్యక్తం అవుతుండటం జరుగుతుంది!   ట్యాంక్ బండ్ మీద విగ్రహాల కూల్చివేత మొదలు రైల్ పట్టాల మీద పడుకోవటం వరకూ తెలంగాణ ఏర్పాటుకి ముందు కేసీఆర్ , కోదండరామ్ లది ఒకే మాట. కాని, ఇప్పుడు అదే కేసీఆర్ కు వ్యతిరేకంగా కోదండరామ్ గళం విప్పుతున్నాడు. దీనికి కారణం ఆయన మనసులో ఏమున్నా... జేఏసీ చైర్మన్ మరోసారి రంగంలోకి దిగి కేసీఆర్ ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే అది ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం వైఫల్యమే! దాన్ని భర్తీ చేసేందుకే ప్రొఫెసర్ రంగంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ స్థాపన కూడా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.   ఒకవేళ కోదండరామ్ పూర్తి స్థాయి రాజకీయ నేత అవతారం ఎత్తితే మాత్రం అది కేసీఆర్ కి, టీఆర్ఎస్ కి డ్యామేజింగ్ వ్యవహారమే. అధికారం కోల్పోవటం గ్యారెంటీ లాంటి అంచనాలు వేయలేం కాని... కార్ కు పంక్చర్ లు అయ్యే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా వుంది! చూడాలి మరి... పాలిటిక్స్ లో పట్ట పొందని ప్రొఫెస్ కేసీఆర్ రాజనీతి శాస్త్రం బోధించే ఈ రియల్ పొలిటికల్ ప్రొఫెసర్ ని ఎలా కట్టడి చేస్తాడో!    

పవన్ కళ్యాణ్ అమెరికా టూర్... మీడియా లైట్ తీసుకుందా?

  పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన... ఈ సంగతి మన మీడియా పెద్దగా పట్టించుకుంటున్నట్టు అనిపించటం లేదు! శశికళ, పన్నీర్ సెల్వం తమిళ డబ్బింగ్ సినిమాకి క్రేజ్ బాగా వుండటంతో పవన్ కళ్యాణ్ స్టారర్ అస్సలు పట్టించుకోలేదనిపిస్తోంది! కాని, ఆయన ఇక్కడ లోకల్ గా అనంతపురం సభ, కాకినాడ సభ అంటే భీభత్సమైన రభస చేసే మన వాళ్లు ఈసారి ఎందుకు లైట్ తీసుకున్నారు? సరైనా సమాధానాలైతే లేవనే చెప్పాలి! అయితే, ప్రధాన కారణం ఎక్కడో అమెరికాలో జరుగుతోన్న మీటింగ్ లు కావటంతో కవరేజ్ బాగా కష్టమయ్యే చాన్సెస్ వున్నాయి. అక్కడ్నుంచీ లైవ్ పెట్టుకోవటం అంత ఈజీ కాదు. పైగా ఎలాగో రికార్డింగ్ చేయించి వీడియో క్లిప్పింగ్ లు తెప్పించుకున్నా... పవర్ స్టార్ కామెంట్స్ లో పెద్దగా మసాలా ఏం వుండటం లేదు. దాంతో పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయటం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా!   ఛానల్స్ లో , పేపర్స్ లో మరీ ఎక్కువ చర్చ జరగకున్నా సోషల్ మీడియాలో పవనిజం ఫాలోవర్స్ తమకు వీలైనంత హడావిడి చేశారు. ఒక తెలుగు వాడు అమెరికా గడ్డపై ప్రసగించబోతున్నాడని ప్రచారాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పవన్ కి సపోర్ట్ చేయాలని కూడా అన్నారు. కాని, తీరా పవన్ వరుసగా సభల్లో ప్రసంగిస్తుంటే వారు కూడా పెద్దగా షేరింగ్ లేం చేయటం లేదు! అమెరికా దాకా వెళ్లినా కూడా పవన్ కళ్యాణ్ తన ఎర్ర కండువా వదలకపోవటం కొంచెం డిస్కషన్ కి దారి తీసింది ఫేస్బుక్, ట్విట్టర్ లలో! రెడ్ కలర్ సామాన్యుడికి ప్రతీక అంటూ పవన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు. కాకపోతే, అమెరికాలో జరిగే మీటింగ్ కి అలా ఎర్ర గుడ్డ కప్పుకుని వెళ్లటం ఏం స్ట్రాటజీనో రాజకీయ పండితులకి కూడా అర్థం కాలేదు!   ఒక మీటింగ్లో ఎర్ర కండువాతో కనిపించిన పవన్ అన్నిట్లో అలా కనిపించలేదు. అంతే కాదు, అమెరికా దాకా వెళ్లి కూడా ఉత్తరాది, దక్షిణాది భేదాల గురించి మాట్లాడాడు. భారతదేశంలో సంస్కృతుల మధ్య తేడాలున్నాయని పవన్ అభిప్రాయపడ్డాడు! అసలు ఇదంతా జరుగుతున్నా ఎవ్వరికీ అర్తం కాని విషయం ఒక్కటే! పవన్ అమెరికా పర్యటనతో ఆశిస్తున్నదేమిటి? ఎన్నారైలలో జనసేన పాప్యులారిటీ పెంచటామా? నిధుల సేకరణా? లేక 2019 ఎన్నికలకి ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయటమా? ఇలా బోలెడు ప్రశ్నలు! కాని, దేనికీ ఇప్పటికిప్పుడు సమాధానాలు లేవు!   రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతానని చెప్పిన పవన్ విదేశాల్లోనూ తన ప్రభావాన్ని పెంచుకోవటం సంతోషించాల్సిన విషయమే. కాని, ఇలా మీటింగ్ లలో పాల్గొనటం ఇంచుమించూ మరే భారీతీయ హీరో చేయలేదు. అలాంటిది తాను చేసినా కూడా మీడియాలో తగినంత పబ్లిసిటీ వచ్చేలా చూసుకోకపోవటం ఎంతో కొంత నష్టమే. ఇంకా పవర్ ఫుల్ ప్లానింగ్ చేయాల్సింది పవర్ స్టార్ అండ్ హిజ్ టీమ్!  

ఆయనకు తిక్కుంది... దాని వెనుక అర్థం కాని లెక్కుంది!

  సుబ్రమణియన్ స్వామి... ఈయన పేరు చెబితే దాదాపు అన్ని పార్టీల వారు భయపడిపోతారు! అలా భయపడే వారి లిస్ట్ లో ఆయన స్వంత పార్టీ బీజేపి నేతలు కూడా వుంటారు! స్వామివారికి ఆగ్రహం వస్తే ఎంతటి వారిపైనైనా స్వారీ చేసేస్తారు! సుబ్బుతో పెట్టుకుంటే సబ్బు పెట్టి కడిగేస్తాడని ప్రతీతి!   తమిళనాడులో జరుగుతోన్న రాజకీయ జల్లికట్టులో బీజేపి పార్టీదీ, కేంద్ర ప్రభుత్వానిది, ఒక విధంగా .. మోదీది మద్దతు ఎవరికో అందరికీ తెలిసిందే! పన్నీర్ కే పట్టం కట్టాలని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, సుబ్రమణియన్ స్వామి మాత్రం రివర్స్ రూటులో వెళుతున్నాడు. ఆయన శశికళ కోసం రంగంలోకి దిగాడు. నేరుగా తనకు అలవాటున్న కోర్టు మెట్లెక్కి పీటీషన్ వేసేశాడు! తమ కేంద్ర ప్రభుత్వమే నియమించిన తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చేత శశికళకు ఆహ్వానం పంపాలని కోర్టును కోరాడు! అసలు సుప్రీమ్ కోర్టులో అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తోన్న శశికళ సీఎంగా ఎలా పనికి వస్తుంది? పోనీ సుబ్రమణియన్ స్వామికి సదరు కేసు గురించి తెలియదా అంటే... ఆ కేసు వేసి జయలలితను, శశికళను జైల్లో పెట్టించిందే ఆయన! కాని, ఇప్పుడు మాత్రం తప్పు చేసిందని ఆయన గతంలో తిట్టిపోసిన మన్నార్ గుడి మాఫియా మహారాణి శశికళే... సీఎం అవ్వాలంటున్నాడు!   సుబ్బు లాజిక్ చాలా సింపుల్ అనే చెప్పాలి శశికళ విషయంలో! ఆమెకు అవసరానికి తగినంత మద్దతు ఎమ్మెల్యేల నుంచి వుంది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఆమె సీఎం అవ్వటం ఖాయం. గవర్నర్ ఎన్ని రోజులు ఆపినా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే. కాబట్టి ఆమెకు మద్దతుగా నిలిచి అందరి ముందు తాను న్యాయం వైపు వుంటానని నిరూపించుకోవటం ఆయన ఉద్దేశం. అలాగే, రేపు శశికళ సీఎంగా పీఠంపై స్థిరంగా కూర్చోగలిగితే ఆమెను కేంద్రానికి, బీజేపికి దగ్గర చేసే ఛాన్స్ కూడా ఆయనకు వుంటుంది. అంటే, తమిళ పాలిటిక్స్ లో ఢిల్లీ నుంచీ చక్రం తిప్పవచ్చన్నమాట!   సుబ్రమణియన్ స్వామి తిక్క, దాని వెనుక వున్న లెక్కా ఎలా వున్నా.... ఇప్పడు మాత్రం బీజేపికి ఆయన కంటిలో నలుసులా మారాడు! తమిళనాడులో బలంగా స్థిరపడాలని చూస్తూ, అందుకోసం పన్నీర్ ను తమ పాస్ పోర్ట్ గా భావిస్తున్న కమలనాథులు తమ స్వంత నేత వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడుతున్నారు! ఒకవైపు వెంకయ్య తమిళనాడులో సీఎం పదవి ఖాళీ లేదంటూ శశికళకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే... సుబ్బూ మాత్రం కొందరు కేంద్ర మంత్రులు చెన్నై రాజకీయాల్లో అతిగా కలగజేసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నాడు! చివరికి స్వామి సహకారం శశికి ఎంత మేర ఉపయోగపడుతుందో... చూడాలి!

శశికళ సహనం నశిస్తోంది... పన్నీర్ వ్యూహం ఫలిస్తోంది!

  తమిళనాడు సీఎం ఎవరు అవుతారు? శశికళనా? పన్నీర్ సెల్వమా? ఈ ప్రశ్నలకి సమాధానాలు అంత తేలిగ్గా దొరికేవి కావు. ప్రస్తుతానికి అందరూ ఒకరిని మించి ఒకరు తెలివిగా పావులు కదుపుతున్నారు. శశికళ ఎమ్మెల్యేల్ని బంధించి పట్టుబిగిస్తే... ఆమె ప్రజా ప్రతినిధుల్ని నిర్బంధించిందనే అంశమే ఆమెకు వ్యతిరేకంగా పన్నీర్ వాడుతున్నాడు. మరో వైపు గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ మాత్రం తొందరపాటు లేకుండా రూల్స్ ప్రకారం అడుగులు వేస్తున్నారు. తనని ఎవ్వరి తప్పుపట్టటానికి లేకుండా చర్యలు తీసుకుంటూనే శశికళకి చెక్ పెడుతున్నారు. మధ్యలో శశి, పన్నీర్ క్యాంపుల్లో వున్న ఎమ్మెల్యేలు కూడా తమ లాభ, నష్టాలు, భవిష్యత్ అంచనా వేసుకుని స్టేట్మెంట్లు ఇస్తున్నారు!   చెన్నై రాజకీయం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతున్నా శశికళ మాత్రమే అందరికంటే ఎక్కువ ప్రభావితం అవుతోన్నట్టు కనిపిస్తోంది. ఆమె ఆశలు అంతకంతకూ అడియాసలు అవుతున్నకొద్దీ సహనం నశించి చిరాకు, కోపం, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది! పన్నీర్ సెల్వం చాలా సౌమ్యుడుగా, విధేయుడుగా కనిపిస్తూనే తన అపార రాజకీయ అనుభవం ఇంతకాలం జయ చాటు నిచ్చెలిగా వున్న శశిపై ప్రయోగిస్తున్నాడు. గడిచే ఒక్కో రోజుకీ పన్నీర్ ప్రజల నాయకుడిగా మారుతున్నాడు. అదే సమయంలో శశికళ సీఎం పదవి కోసం పాకులాడుతున్న కరుడుగట్టిన నాయకురాలిగా మారిపోతోంది! దానికి తోడు తాజాగా చిన్నమ్మ చేసిన హెచ్చరిక జనంలోకి మరింత నెగటివ్ సిగ్నల్స్ పంపినట్టే అనిపిస్తోంది!   శశికళ పొయెస్ గార్డెన్ లో అన్నాడీఎంకే కార్యకర్తలతో మాట్లాడుతూ ఎవరి సహనానికైనా హద్దుంటుందీ అంటూ వారెంట్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా పన్నీర్ సెల్వమ్ కి మాత్రమే కాదు. తమ సహనం నశిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆమె పన్నీర్ కి, ఆయన వెనుక వున్న డీఎంకే, బీజేపి లాంటి పార్టీలకి కూడా హెచ్చరిక పంపారు. ఇదే శశికళ చేసిన తప్పు. ఎందుకంటే, ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మధుసూదనన్ లాంటి సీనియర్ నేతలు ఆమెనే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించే దాకా పరిస్థితి వెళ్లిపోయింది! ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ నాయకుడు శశికళ చేజారిపోతున్నారు! ఇటువంటి సమయంలో ఆమె తగ్గి వుండాలి. కాని, అలా కాకుండా గవర్నర్ తో సహా అందరికీ వర్తించేలా సహనం నశిస్తుంది అంటూ చెప్పటం దురుసుతనమే అవుతుంది! ప్రజల్లో మిగిలిన మద్దతు కూడా ఇంకిపోయే అవకాశం వుంది!   అవినీతి కేసులు, సుప్రీమ్ తీర్పు, జయ మృతిపై చాలా మందికున్న అనుమానాలు, మన్నార్ గుడి మాఫియా అనే ముద్ర ... ఇన్నీ వున్న శశికళ సీఎం అవ్వటం చాలా కష్టం. అలాంటప్పుడు దురుసుగా, దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడితే ముందుకు సాగటం మరింత కష్టమవుతుంది. అసాధ్యం కూడా అవ్వచ్చు. ఎందుకంటే, మొండితనం జయలలిత లాగా జనంలో ఫాలోయింగ్ వున్న వారికి చెల్లుతుంది కాని... అందరికీ కాదు!

జబర్ధస్త్ 'యాక్షన్ సీన్స్'తో ఆకట్టుకున్న రోజా!

  సాధారణంగా నటన అంటే సినిమా వాళ్లకే చెల్లుతుంది! వారిలా ఇంకెవరూ నటించలేరు. కాని, అప్పుడప్పుడూ రాజకీయ నాయకులు కూడా నిజ జీవితంలో భలే నటిస్తుంటారు! మేకప్ లేకుండానే మీడియా కెమెరాల ముందు అదరగొట్టేస్తుంటారు! తమిళనాడులో శశికళ, ఆమె అనుచరులు, పన్నీర్ , ఆయన వర్గం... ఎలా చూడ చక్కగా యాక్టింగ్ రక్తి కట్టిస్తున్నారో మనం చూస్తూనే వున్నాం! అయితే, ఒక్కోసారి సినిమా వాళ్లే రాజకీయాల్లోకి వచ్చి రచ్చ చేస్తుంటారు. అప్పుడు వారి యాక్టింగ్ అయితే మాటల్లో వర్ణించలేం!   విజయవాడలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతున్న వేళ రోజా నట విశ్వరూపమే చూపించింది. అందులో పాల్గొనాలని బయలుదేరిన ఆమె పోలీసులు అరెస్ట్ చేయటంతో జబర్దస్త్ పర్ఫామెన్స్ కి తెర తీసింది. అసలు ఆమెను మీటింగ్ కి రమ్మంటూ ఆహ్వానం పలికిన ప్రభుత్వం మళ్లీ అరెస్ట్ ఎందుకు చేయించిందో పాలకులకే తెలియాలి. కాదంటే పోలీసులే స్వంత నిర్ణయం తీసుకుంటే వారెందుకు ఒక ప్రజా ప్రతినిధితో అలా ప్రవర్తించారో వివరణ ఇవ్వాలి. కాకపోతే, ఇక్కడ ఎవరెవరి తప్పు వున్నా రోజా హంగామా మాత్రం అందర్నీ ఆకట్టుకుంది!   ఒక ఎమ్మెల్యే అయిన ఆమె పోలీసులు అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద జీపులోంచి దూకేసింది! కాపాడండీ అంటూ పరుగులు తీసింది! అంతే కాక పోలీసుల అదుపులో వుండగానే సెల్ఫీ వీడియో తీసుకుని నానా విమర్శలు చేసింది. పనిలో పనిగా వెంకయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు, కేసీఆర్ కూతుర్ని కూడా విమర్శల్లోకి లాగింది. ఆ వీడియోని మీడియాకి పంపి పర్ఫామెన్స్ అదరగొట్టేసింది! అసలు ఇలాంటి ప్రవర్తన ఒక ఎమ్మెల్యే నుంచి సమర్థించవచ్చా? పోలీసులు అరెస్ట్ చేయటం తప్పైతే కావొచ్చేమోగాని రోజా కూడా హుందాగా ప్రవర్తించాలి కదా? పోలీస్ వాహనం నుంచి తప్పించుకోవటం బాధ్యత అనిపించుకుంటుందా?   రాజకీయ కెరీర్లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన రోజా అసెంబ్లీలో లోపల, బయట, చివరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సుల సందర్భంలో వీలైనంత యాక్టింగ్ తో అలరిస్తున్నారు. ఇలా కాకుండా జనం సమస్యల్ని ప్రస్తావిస్తూ, ఎన్నుకున్న నియోజకవర్గానికి మేలు చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వుంటాయి. విమర్శకులు చెబుతోన్న ఈ మాట రోజమ్మ వింటారో లేదో...

జయ, శశికళకి తప్పని కోర్టు గండం... జగన్ కి తప్పుతుందా?

  ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం వైజాగ్ బీచ్ లో ఉద్యమం అంటే జగన్ రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయారు! కాని, పోలీసులు అడ్డుకోవటంతో ఆగ్రహంతో ఊగిపోయారు! అప్పుడు ఏమన్నారు? నెక్స్ట్ సీఎం నేనే... అందర్నీ గుర్తుపెట్టుకుంటా అని హెచ్చరించారు! కాని, పరిస్థితి చూస్తుంటే జగన్ ఎంత మంది పోలీసు అధికారుల్ని గట్టిగా గుర్తు పెట్టుకున్నా ఆయన సీఎం అవ్వటం అనుమానంగానే కనిపిస్తోంది. అందుకు కారణం... ప్రస్తుతం తమిళనాడు సీఎం అవ్వాలని శాయశక్తులా ప్రయత్నిస్తోన్న శశికళ పరిస్థితే!   జయతో పాటూ ముప్పై ఏళ్ల జీవితం పంచుకున్న శశి ఆమెపై పడ్డ అవినీతి మచ్చని కూడా పంచుకుంది! అక్రమాస్తుల కేసులో ఏ2గా సుప్రీమ్ కోర్టుదాకా వెళ్లింది. ఇప్పుడు ఆ కేసులో తీర్పే కొంప ముంచేలా వుంది. ఎమ్మెల్యేల మద్దతు వున్నా శశికళ సీఎం అవ్వలేకపోవటానికి కారణం అవినీతి ఆరోపణలే! ఇక మన రాష్ట్రంలో ఈడీ దూకుడు చూస్తుంటే కూడా జగన్ పరిస్థితి శశికళ లాగే అనిపిస్తోంది! ఆమెకి, మన యువనేతకి సంబంధం ఏంటి అంటారా? అవినీతి మరకలే!   మొన్నటికి మొన్న 9వందల సరస్వతీ సిమెంట్స్ భూముల్ని ఈడీ అటాచ్ చేసింది. వైసీపీ అధినేత ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైద్రాబాద్ ఆస్తులపై కూడా దృష్టి పెట్టింది. ఏకంగా లోటస్ పాండ్ లోని ఆయన నివాసంపైనే పంజా విసరబోతోంది. అలాగే, జగన్ మీడియాకు కేంద్రమైన సాక్షి టీవీ, పేపర్ల భవనాల్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకోబోతోంది! ఇంకా కొన్ని ఇతర ఆస్తులకి ఈడీ నుంచి మూడినట్టే కనిపిస్తోంది!   జగన్ కు చట్టపరమైన కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. కోర్టులో కేసులు ఒకవైపు సతమతం చేస్తోంటే మరో వైపు నుంచి ఈడీ తరుముకొస్తోంది. జగన్ ఆస్తుల్ని అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఈడీ అటాచ్ చేయటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చేసింది. అయితే, హైకోర్ట్ కు వెళ్లి ఆయన స్టే తెచ్చుకున్నారు. కాని, ఇప్పుడు స్టే ఎత్తివేయటంతో అటాచ్ మెంట్ల భూకంపం కుదిపేస్తోంది. పైకి గంభీరంగానే కనిపిస్తున్నా జగన్ శిబిరంలో టెన్షన్ బాగానే వుంది. కేవలం పది రోజులు టైం ఇచ్చిన ఈడీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం కష్టంగా మార్చేసింది. సాధారణంగా 45 రోజులు గడువు ఇవ్వాలి. కాని, జగన్ పై అభియోగాలు తీవ్రంగా వుండటంతో పది రోజులే అవకాశం ఇచ్చింది ఈడీ. ఇప్పుడు పది రోజుల్లో ప్రతిపక్ష నేత సుప్రీమ్ దాకా వెళ్లైనా ఆస్తుల్ని కాపాడుకోవాలి. లేదంటే తీర్పు వచ్చే వరకూ ఆయన ఆయా ఆస్తుల పై ఆశలు వదులుకుని మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది!   జయ, శశికళ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంది కేవలం అరవై ఆరు కోట్లకు సంబంధించే. అయినా పురుచ్చితలైవీ సీఎం పదవి వదులుకోవాల్సి వచ్చింది. శశికళ సీఎం కుర్చీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతోంది! మరి జగన్ అంతకు పది రెట్లు ఎక్కువ మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారని కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరి ఈ చట్టపరమైన కందకాలు దాటుకుని .... సీఎం అవుతానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్న జగన్ ఎప్పుడు అమరావతి సింహాసనం అధిష్ఠిస్తాడో... చూడాలి మరి!

రేపిస్టుల్ని కుళ్లబొడిపించి... కారం పెట్టించేదట

  రేప్ చేసిన వాళ్లని తలకిందులుగా వేలాడదీయాలి. చితగ్గొట్టాలి. తరువాత ఆ దెబ్బలపై కారం పూయాలి! అప్పుడు తమని ప్రాణాలతో వదిలిపెట్టమని రేపిస్టులు గావుకేకలు పెడుతుంటే.. మహిళలు వార్ని చూడాలి! ఏంటీ ఈ మాటలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తూ కేంద్ర సీనియర్ మంత్రి ఉమాభారతి చేప్పినవి! అంతే కాదు, ఆ టైపులో రేపిస్టులకి తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పోలీసుల చేత ట్రీట్మెంట్ ఇప్పించేదాన్నని ఆమె ప్రకటించారు! అదీ ఒక ఎన్నికల బహిరంగ సభలో!   రేపిస్టులకి కఠినమైన శిక్షలు పడాలని అందరూ కోరుకుంటారు. కాని, స్వయంగా అధికార పక్షంలోని మంత్రి పోలీసుల చేత దౌర్జన్యం చేయించానని చెప్పటం కొంచెం ఆందోనకరమే! అయినా కూడా గతంలో మధ్యప్రదేశ్ కి సీఎంగా పని చేసిన ఉమాభారతి తాను అలా చేశానని చెప్పటంలో కొంత అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం వుంది. ఉత్తరాదిలో మహిళల మీద దాడుల విషయంలో చాలా తేడా వుంటుంది. మన దగ్గరిలా పరిస్థితులు వుండవు. నిర్భయ ఉదంతాలు అక్కడ సర్వ సాధారణం. అదీ ప్రస్తుతం ఎన్నికలు ఎదుర్కొంటోన్న యూపీలో అయితే మరీ దారుణం. ఎస్పీ నేతలు, వారి అనుచరులు చేసే ఆగడాలు భరించనలవి కాకుండా వుంటాయని పబ్లిగ్గానే చెప్పుకుంటారు. అయిదేళ్ల అఖిలేష్ పాలనలో బోలెడు రేప్ కేసులు వెలుగు చూశాయి. ఇక వెలుగు చూడనవి అయితే లెక్కించటానికి కూడా వీలుండదు.   ఉమాభారతి రేపిస్టుల్ని శిక్షించటం గురించి మాట్లాడటానికి కారణం ఈ మధ్య బులంద్ షహర్ అనే ప్రాంతంలో హైవేకు పక్కనే తల్లికూతుళ్లని గ్యాంగ్ రేప్ చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది. అయినా కూడా ఉత్తర్ ప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉమాభారతి ఆవేశంగా తన హయంలో జరిపిన న్యాయం గురించి వివరించారు. పోలీసులు థర్డ్ డిగ్రీ వాడి రేపిస్టుల్ని హింసించటం చట్ట రిత్యా సరైంది కాకపోవచ్చు. కాని, చాలా సందర్భాల్లో రేప్ కేసులు కోర్టుకు వచ్చి నిర్వీర్యం అయిపోతుంటాయి. రేప్ బాధితులకే మరింత నరకం చూపిస్తుంటాయి. నిర్భయ కేసులో కూడా  అసలు నిందితుడు మైనర్ అంటూ మూడేళ్ల జైలుశిక్షతో సరిపెట్టేశారు. ఇవన్నీ కారణాల చేతనే ఉమాభారతి రేపిస్టులకి నరకం చూపించి బాధితుల కాళ్లు పట్టిస్తానని అన్నారు.   ఒకవేళ బీజేపి ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఉమాభారతి చెప్పినట్టు కర్కశమైన శిక్షలు రేపిస్టులకి వేయకున్నా... అక్కడి స్త్రీల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అత్యంత పెద్ద రాష్ట్రంలో రేపిస్టులు స్వేచ్ఛగా అరాచకం చేస్తుండటం మన వ్యవస్థకే అవమానం!

తమిళ చరిత్రలో రాజకీయ తన్నులాటలెన్నో!

  పాలిటిక్స్ అంటే పాలన మాత్రమేనా? అస్సలు కాదు! రాజకీయంలో బోలెడు రచ్చ వుంటుంది. అందుకే, ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో దేశంలో రాజకీయాలు ఒక్కోలా వుంటాయి. దేనికవే ప్రత్యేకం. ఇక తమిళనాడు గురించైతే చెప్పేదే లేదు! అక్కడ ప్రాంతీయ అభిమానం ఎక్కువ. వ్యక్తి పూజ విపరీతం. అందుకే, దేశమంతటిదీ ఓ దారైతే... చెన్నై నేతలది మరో దారి! ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోంది!   ఇప్పుడు శశికళ, పన్నీర్ సెల్వం మధ్య గొడవ చుస్తున్న వారికి భలే టెన్షన్ గా వుండవచ్చు. కాని, తమిళ రాజకీయ చరిత్ర తెలిసిన వారికి ఇదేం పెద్ద విశేషమూ కాదు, విడ్డూరమూ కాదు! అక్కడ ఎవరో ఇద్దరు అగ్ర నేతల మధ్య భీకర పోరు పదే పదే జరుగుతూ వస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా రాజ్యాంగం కూడా రాసుకోక ముందే అక్కడ బడా నేతలు ఇద్దరు కొట్టుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వారే.. పెరియార్, అన్నాదురై!   ద్రవిడ సిద్ధాంతం ప్రచారం చేసి ఉత్తరాది మీద, అసలు భారతదేశం మీదే ద్వేషం నూరిపోశారు పెరియార్. ఆయన 1948లో తొలి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'చీకటి రోజ'ని వ్యాసం రాశారు. కాని, ఆ మొదటి స్వాతంత్ర్య దినం ఆనందదాయకమైందని అన్నాదురై పేర్కొన్నారు. ఇలా వీరిద్దరి మధ్యా భేదాభిప్రాయాలు పొడసూపాయి. మెల్లగా అవ్వి అభిప్రాయ భేదాలుగా మారి పెరియార్ మణియమ్మను పెళ్లాడటంతో అన్నాదురై పార్టీ నుంచి బయటకొచ్చేశారు. అప్పుడు, 1949లో ఏర్పడిందే, డీఎంకే!   పెరియార్ తో గొడవ పడ్డ అన్నాదురై డీఎంకే స్థాపిస్తే ఆయనతో చాలా ఏళ్లు కలిసి నడిచిన ఈవీకే సంపత్ 1961లో కొత్త పార్టీ పెట్టాడు. అందుక్కారణం డీఎంకే ద్రవిడ నాడు అంటూ ప్రత్యేక దేశమే కావాలని డిమాండ్ చేయటం. అది పెరియార్ అన్న కొడుకైన ఈవీకే సంపత్ కు నచ్చలేదు. ఆయన అన్నాదురైతో విడిపోయి హీరో శివాజీ గణేశన్ తో కలిసి తమిళ దేశీయ కట్చి అనే పార్టీ పెట్టాడు. తరువాతి కాలంలో ఇది కాంగ్రెస్ లో విలీనమైపోయింది!   అన్నాదురై స్థాపించిన డీఎంకే చాలా ఏళ్లు కాంగ్రెస్ ను తట్టుకుని బలంగా నిలిచింది, కాని, ఆ పార్టీని స్థాపించిన అన్నా మరణించటంతో కరుణానిధి వేగంగా పావులు కదిపాడు. మొదట తనకు అడ్డువచ్చిన నెడుంజెళియన్ అనే నాయకుడ్ని ఎంజీఆర్ సాయంతో అణగదొక్కాడు. కాని,తరువాత కరుణకు సూపర్ స్టార్ ఎంజీఆర్ తోనూ చెడింది. డీఎంకే కోశాధికారిగా వున్న ఆయన్ని అమాంతం తొలిగించాడు. దాంతో ఎంజీఆర్ ఆగ్రహంతో వేరు కుంపటి పెట్టాడు. అలా పుట్టిందే అన్నాడీఎంకే! ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపనతో కరుణానిధి పన్నెండేళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. తమిళుల సినిమా అభిమానంతో ఎంజీఆర్ చనిపోయే రోజు వరకూ ఏకబిగిన ఏలుకుంటూ పోయాడు!   పెరియార్ తో గొడవ పడ్డ అన్నాదురై ఒక పార్టీ పెడితే, ఆయనతో విభేదించిన సంపత్ మరో పార్టీ పెట్టాడు. తరువాత కరుణతో కయ్యానికి దిగిన ఎంజీఆర్ మూడో పార్టీని జనం ముందుకి తెచ్చాడు. అయితే, ఎంజీఆర్ పెట్టిన అన్నాడీఎంకేలో కూడా అగ్ర నాయకుల ఉగ్ర గొడవలు ఎంత మాత్రం ఆగలేదు. ఎంజీఆర్ మరణంతో ఆయన భార్య జానకీ, జయలలితల మధ్య అధికార పోరు భగ్గుమంది. జయను జానకీ రామచంద్రన్ వర్గం ఎంతగా అవమానించినా మొండిగా ఎదురునిలిచి పార్టీని దక్కించుకుంది. క్రమంగా జయలలిత నుంచి పురుచి తలైవీగా, అమ్మగా ఎదుగుతూ వచ్చి తిరుగులేని నాయకురాలైంది. ఇక వేరు వేరు పార్టీల్లో వున్నా కరుణానిధి, జయలలితల దారుణ శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరికి చిప్ప కూడు తినిపించే సంస్కృతికి తెర తీశారు ఇద్దరూ!   జయలలిత అనూహ్య మృతితో ఇప్పుడు శశికళ, పన్నీర్ మధ్య దశాబ్దాల తమిళ రాజకీయ సంస్కృతికి తగ్గట్టే రాజకీయ జల్లికట్టు సాగుతోందంటున్నారు తలపండిన విమర్శకులు! చూడాలి మరి.. ఈ సారి వున్న పార్టీ ఎవరి వశం అవుతుంది, కొత్త పార్టీ ఏమైనా వస్తుందా, లేక అసలు వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే అనే పేరన్నా వినిపిస్తుందా? లేదా?  

మోదీ సర్కార్... దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు కొత్త పేర్లు పెట్టబోతోందా?

  హైద్రాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కదా.. కాకపోతే, అప్పుడప్పుడూ ఈ విమానాశ్రయం పేరుపై వివాదం చెలరేగుతూనే వుంటుంది! కొందరు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే , మరి కొందరు కనీసం డొమెస్టిక్ టెర్మినల్ కన్నా ఎన్టీఆర్ పేరు పెట్టాలని అంటూ వుంటారు! ఇలాంటి గొడవలు మన దేశంలో మామూలే. అయితే, కేంద్రం త్వరలో ఇలాంటి ఎయిర్ పోర్ట్ గొడవలకి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే ఆలోచనలో వున్నట్టు కనిపిస్తోంది! అసలు విమానాశ్రయాలకు ప్రత్యేక పేర్లే లేకుండా చేస్తే ఎలా వుంటుందీ అని ఆలోచిస్తోందట!   హైద్రాబాద్ లో వున్న ఎయిర్ పోర్ట్ రాజీవ్ గాంధీ పేరున వుంటే, ఢిల్లీ విమానాశ్రయం ఇందిర పేరుతో వుంది. ముంబైలోది ఛత్రపతి శివాజీ పేరుతో పిలవబడుతోంది. ఇలా ఒక్కో నగరంలోని ఒక్కో ఎయిర్ పోర్ట్ ఎవరో ఒక గొప్ప నాయకుల పేరుతో వ్యవహరింపబడుతోంది. అంతే కాదు, ఈ నాయకుల పేర్లతో వున్న విమానాశ్రయాలపై అనేక వివాదాలు , అసంతృప్తులు కూడా వున్నాయి. ఒక పేరు తీసి మరో పేరు పెట్టాలని డిమాండ్లు చేస్తుంటారు కొందరు. అంతే కాదు, దాని కంటే ముఖ్యంగా, విదేశాల నుంచీ వచ్చే ప్రయాణికులు మన దేశ , రాష్ట్ర నాయకుల పేర్లతో వుండే విమానాశ్రయాల్ని పలకలేక ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకి బెంగుళూరులోని అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయం 'కెంపే గౌడా ఎయిర్ పోర్ట్' అంటున్నారు! కెంపే గౌడా బెంగుళూరు నగర స్థాపకులు! ఆయన కన్నడ వాళ్లకు అభిమాన పురుషుడు. కాని, మన దేశంలోనే చాలా మందికి తెలియదు. ఇక ఫారినర్స్ సరిగ్గా పలకటం ఎలా సాధ్యమవుతుంది?   ఇండియాలోని ఎయిర్ పోర్ట్స్ పేర్లపై పుడుతోన్న వివాదాలు, వస్తోన్న డిమాండ్స్, విదేశీయులకు కలుగుతోన్న అసౌకర్యం.. అన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర విమానాయాన శాఖ ఓ కీలక నీర్ణయం తీసుకునే యోచనలో వుంది. అసలు వ్యక్తుల పేర్లతో కాకుండా విమానాశ్రయం ఎక్కడ వుందో... ఆ నగరం పేరే దానికి వుండేలా చూడాలని భావిస్తోంది. ఇంకా దీని పై తుది నిర్ణయం ఏం తీసుకోలేదుగాని.. అదే జరిగితే ఇప్పుడున్న పేర్లన్నీ మాయం అయిపోతాయి! ఓన్లీ హైద్రాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు... ఇలా సిటీల పేర్లతో ఎయిర్ పోర్ట్స్ పిలవబడతాయి! జనం నుంచీ, పార్టీల నుంచీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ.... ఇలా అనేక దిక్కుల నుంచీ నిరసనలు వచ్చే అవకాశం వున్న ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంటుందా? లేదా? కొన్నాళ్లు అగితే గాని తెలియదు..

వాళ్ల జీవితాల్ని పట్టించుకోకపోతే.. వీళ్ల జీతాలు కట్!

  తల్లిదండ్రులకి పిల్లలే జీవితం! అందుకే, నెల నెలా జీతాలు సంపాదించి జీవితాంతం వారి కోసం ఖర్చు చేస్తుంటారు. కాని, తీరా ఆ తల్లిదండ్రులు ముసలి వారై, పిల్లలు సంపాదన మొదలు పెడితే? ఇప్పటికీ మన దేశంలో చాలా మంది సంతానం తమ తల్లిందండ్రుల్ని చక్కగానే చూసుకుంటున్నారు. కాని, రోజు రోజుకు పేరెంట్స్ ని పట్టించుకోని పిల్లలు ఎక్కువైపోతున్నారు. తాము వారి మీద ఆధారపడ్డప్పుడు ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని కొందరు పిల్లలు పెద్దవ్వగానే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. తమ కోసం ఏమీ తీసి పెట్టుకోకుండా అంతా పిల్లలకే ధారపోసిన ఆ ముసలి వారు నానా కష్టాలు, అవమానాలు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక నరకం అనుభవిస్తున్నారు!   పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకి కొంత ఆసరా అయ్యేలా అసోంలోని బీజేపి ప్రభుత్వం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. త్వరలో అక్కడ ఒక రూల్ రానుంది. దాని ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగం వుండీ... తమ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తోన్న కొడుకుల జీతాల్లో కోత విధించనున్నారు! ఆ మొత్తాన్ని అమ్మా, నాన్నలకు ఇచ్చి వారి జీవితం దుర్భరం కాకుండా చూస్తుంది ప్రభుత్వం. ఇది ప్రాక్టికల్ గా ఎలా వర్కవుట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. తల్లిదండ్రుల్ని కొడుకు సరిగ్గా చూసుకోవటం లేదని గవర్నమెంట్ కి ఎలా తెలుస్తుంది? పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తేనే కట్ జీతం కట్ చేస్తారా? ఒకవేళ చేసినా ఎంత? ఎలాగా? లాంటి బోలెడు ప్రశ్నలు వున్నాయి. అన్నీ త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు పాసైతే మనకు తెలిసిపోతాయి!   అసోమ్ ప్రభుత్వం తెస్తోన్న కొత్త రూల్ వల్ల ఎంత మంది తల్లిదండ్రులకి ఎంత మేర ఉపయోగం వుంటుంది? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. పైగా ప్రభుత్వ ఉద్యోగులు కాని కొడుకులు తమ అమ్మా, నాన్నల్ని గాలికి వదిలేస్తే? అప్పుడు గవర్నమెంట్ కూడా చేయగలిగింది ఏం లేదు! అయినా కూడా గవర్నెమెంట్ ఉద్యోగుల్లో అయితే తమని కన్నవారిపై భయ, భక్తుల్ని కల్పించటం .. మెచ్చుకోదగ్గ పరిణామమే!

ఎమ్మెల్యేలు క్యాంపుల్లో... శశి, పన్నీర్ టెన్షన్లో... జనం అయోమయంలో!

  మీకు కబాలీ ట్రైలర్ లో చూపించిన రజినీకాంత్ డైలాగ్ గుర్తుండే వుంటుంది! గళ్ల లుంగీ కట్టుకుని, వంగి వంగి సలామ్ చేసే వాడ్ని కాదు... కబాలీని అంటూ ... రజినీ చెలరేగిపోతాడు ఆ డైలాగ్ లో! ఇప్పుడు సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వం పై అదే డైలాగ్ ని ఉపయోగిస్తున్నారు నెటిజన్స్! నిన్న మొన్నటి వరకూ అమ్మ, చిన్నమ్మ ఎవరు పిలిచినా ఎంతో వినయంగా నమస్కారం చేసేవాడు పన్నీర్. కాని, గత కొన్ని రోజుల్లో సీన్ మారిపోయింది. పన్నీర్ శశికళ చేత కన్నీర్ పెట్టిస్తున్నాడు. తన అసలు సత్తా చాటుతున్నాడు. ఇంకా ఆటాలో గెలుపు ఆయనదని తేలిపోలేదు కాని గడుస్తున్న ఒక్కో గంటా శశికళ ముఖంలో కళ తగ్గిపోయేలా చేస్తోంది...   ఒకవైపు కోర్టు తీర్పు అతి త్వరలో వెలువడనున్నా దూకుడుగా సీఎం పదవి కోసం రంగంలోకి దిగిన శశి అదే కంటిన్యూ చేస్తోంది ఇంకా. ఆమె తనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి భద్రంగా దాచేశారు. వాళ్ల సంఖ్య నూటా ముప్పై ఒకటి అంటూ గవర్నర్ కి లిస్ట్ కూడా ఇచ్చారు. రిసార్ట్స్ లో కనీసం సెల్ ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా గోడౌన్ లో దాచిన బ్లాక్ సరుకులా మార్చేసింది ఎమ్మెల్యేల్ని. ఇదంతా ఆమెకు జనంలో చెడ్డ పేరు తెస్తోంటే పన్నీర్ మాత్రం తెలివైన ఆట ఆడుతున్నాడు. తనకు ఎమ్మెల్యేల బలం లేకున్నా గవర్నర్ ని కలిసి వచ్చిన ఆయన ధర్మం గెలుస్తుందని ప్రకటించాడు! అమ్మ అభిమతం కూడా తాను సీఎంగా వుండాలనే అంటూ జనానికి చెప్పకనే చెప్పాడు.   గవర్నర్ ని కలిసిన పన్నీర్ సెల్వం ఆత్మ విశ్వాసంతో మీడియా ముందుకు వస్తే శశికళ మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీనిబట్టి ఆమెకు విద్యాసాగర్ రావు నుంచి పాజిటివ్ సంకేతాలు రాలేదనే చెప్పుకోవాలి. బలపరీక్ష అంతకంతకూ లేట్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇక ఇంతలో సుప్రీమ్ తీర్పు వచ్చేస్తే... సీన్ మొత్తం మారిపోవటం ఖాయం! శశికళ దోషిగా జైలుకి వెళ్లాల్సి వస్తే సీఎం పీఠంపై ఆమె పెట్టుకున్న ఆశలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి! సెల్వంకు సీఎంగా కొనసాగేందుకు దాదాపు ఎలాంటి అడ్డూ వుండదు!   శశికళ ఒకవేళ దోషిగా కాక నిర్దోషిగా బయటపడినా ఆమెకు పరీక్ష కాలం కొనసాగే అవకాశాలే వున్నాయి. సోమవారం తీర్పు వచ్చే అవకాశం వున్నందున గవర్నర్ మంగళవారం నుంచి ఎప్పుడైనా బల పరీక్షకు ఛాన్స్ ఇవ్వవచ్చు. ఇంతలోపు పన్నీర్ డీఎంకే, కాంగ్రెస్ పార్టీల లోపాయికారి మద్దతు కూడగడితే శశికళకు చుక్కలు కనిపించడం గ్యారెంటీ. ఆఫ్ట్రాల్ ఆమె ముఖ్యమంత్రి కావటం డీఎంకే నాయకుడు స్టాలిన్ కూడా ఇష్టం లేదు. కేంద్రంలోని బీజేపి పెద్దలకు సైతం శశికళపైన సద్భావం లేదు. వీటన్నిటి దృష్ట్యా పన్నీర్ తాను గెలవాలని ప్రయత్నించకున్నా ... శశికళ వ్యతిరేక శక్తులే ఆయన్ని గెలిపించే బాధ్యత భుజాన వేసుకునే అవకాశం వుంది!   గవర్నర్ చెన్నైలో దిగి నేరుగా పరిస్థితి సమీక్షించారు కాబట్టి మరో రెండు మూడు రోజులు ఉత్కంఠ కొనసాగించి సోమవారం సుప్రీమ్ తీర్పు తరువాత క్లైమాక్స్ కి ప్లాన్ చేయవచ్చు. అప్పటి దాకా శశికళ, పన్నీర్ సెల్వంతో పాటూ అందరికీ సస్పెన్స్ తప్పక పోవచ్చు!  

జగన్ జిల్లాలో... క్యాంపు రాజకీయాల జాతర!

  క్యాంపు రాజకీయాలు ... ఈ మాట వినగానే ఇప్పుడు అందరి ఆలోచనలు తమిళనాడు మీదకి మళ్లుతున్నాయి. అక్కడ పన్నీర్ సెల్వం, శశికళ శిబిరాల మధ్య భీభత్సమైన వార్ నడుస్తోంది. అందులో ఎమ్మెల్యేలే ఆయుధాలు. అందుకే, వారిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు శశికళ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. క్యాంపు ఏర్పాటు చేసి ప్రజా ప్రతినిధుల్ని జాగ్రత్తగా దాచేసింది. అయితే, ఈ క్యాంపు రాజకీయాలు ముఖ్యమంత్రి సీటు కోసం జరిగే బలపరీక్షల్లోనే అనుకుంటే పొరపాటే! అన్ని స్థాయుల్లోనూ మన నేతలు క్యాంపులకి తెర తీస్తున్నారు. పరోక్ష ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా ప్రజా ప్రతినిధుల్ని గుట్టుగా దాచేయటం మామూలైపోయింది!   మరి కొన్ని రోజుల్లో ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, కడపలో మాత్రం ఎమ్మెల్సీ ఫైట్ తీవ్రంగా వుంది. అది జగన్ జిల్లా కావటంతో వైసీపీ గెలుపు కోసం మంచి ఊపు మీద వుంది. ఎలాగైనా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంఖ్యా బలం కూడా జగన్ వద్ద వుంది. కాని, టీడీపీ కూడా ప్రతిపక్ష నేత స్వంత జిల్లాలో పాగా వేసేందుకు పట్టుదలతో వుండటంతోనే ఆట రక్తి కడుతోంది. రెండు పార్టీలు ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటుని కూడా అమూల్యంగా భావిస్తున్నాయి!   ఇప్పటికే చంద్రబాబు తమ నేతలకి చెప్పి కడప జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో చర్చలు జరిపించారు. త్వరలో వారితో రాజధానిలో సమావేశం కూడా అవ్వనున్నారు. అటు జగన్ అయితే తన జిల్లాకు వచ్చి వైసీపీ మద్దతుదారులతో ఆల్రెడీ సమావేశం అయిపోయారు. ఆయన తానే భవిష్యత్ సీఎం అని వారికి భరోసా ఇచ్చి ఓటు వైసీపీకే వేయాలని చెప్పాడు. అయితే, ఇంత చేస్తున్నా తమ మద్దతుదారులు ఎక్కడ చేజారిపోతారోనని టీడీపీ, వైసీపీలు రెండిటికీ భయంగానే వుంది. అందుకే, క్యాంపులకి సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది!   టీడీపీ నేతలు కడపలోని తమ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రాజధానికి తరలిస్తే.. వైసీపీ జిల్లాలోనే వుంచుతూ నేతలు ఎటూ పోకుండా జాగ్రత్తపడుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరో సారి ప్రజా ప్రతినిధులు సంతలో సరుకుల్లా మారిపోయారు. అయినా కూడా డబ్బుల సంచుల చుట్టూ తిరుగుతోన్న ప్రస్తుత రాజకీయంలో ఏ పార్టీ మడి కట్టుకుని కూ్ర్చునే అవకాశం లేకుండా పోతోంది! అదీ అసలు సమస్య...  

టీడీపీ గడపలోకి... మరో కడప నేత?

  అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అంతకంతకూ బలపడుతోంది. అయితే, తాజాగా టీడీపీ కండువా కప్పుకుంటారని వినిపిస్తోన్న పేరు వైసీపీ నేతది కాదు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు అధికార పక్షం వైపు కదులుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటి వరకూ కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజక వర్గాలకే పరిమితం అవుతూ వచ్చారు. కాని, ఆయన సేవల్ని మున్ముందు రాష్ట్ర స్థాయిలో తాము వినియోగించుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బత్యాల చెంగల్ రాయుడు ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు!   బత్యాల చెంగల్ రాయుడుకు మద్దతు తెలుపుతోన్న రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకులు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడిన గంటా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. బత్యాల టీడీపీలో చేరటం ఇక లాంఛనమే అంటున్నారు జిల్లా నేతలు. ఆయన చేరిక వల్ల టీడీపీకి కడప జిల్లాలో రాజకీయంగా మంచి లాభమే చేకూరనుంది. అలాగే, నీటి పారుదల అంశంలో బత్యాల చెంగల్ రాయలుకు వున్న అనుభవం, పరిజ్ఞానం కూడా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మంత్రి గంటా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని పాంతాలకు నీరెలా అందించాలన్న విషయంపై గతంలో బత్యాల రూపొందించిన నివేదికలు చంద్రబాబును కూడా మెప్పించగలిగాయి. కాబట్టి ఆయన చేరిక పార్టీకి, ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుందని భావిస్తన్నారు.   తాను టీడీపీలో చేరుతున్నట్టు బత్యాల చెంగల్ రాయుడు ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు కాని ఆయన చేరిక త్వరలోనే జరుగుతుందని భావించవచ్చు. తనకు మద్దతునిస్తున్న 35మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఎవరికి మద్దతు పలకాలో తేల్చుకుంటానని ఆయన అన్నారు. అయితే, మంత్రి స్వయంగా వెళ్లి ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనటంతో బత్యాల టీడీపీ ఆగమనం లాంఛనమే అనిపిస్తోంది.

చంద్రబాబు ... లోకేష్ శకానికి నాంది పలకనున్నారా?

  ఏ రాష్ట్రంలో అయినా, లేదా ఢిల్లీలో అయినా ... ఎప్పుడూ లేని రాజకీయ హడావిడి కనిపించేది ఒక్క మంత్రి వర్గ మార్పులు, విస్తరణ టైంలోనే! పదవి ఊడుతుందనే వారిలో ఆందోళన, వస్తుందని ఆశించే వారిలో ఉత్సుకత మాటల్లో చెప్పలేకుండా వుంటాయి. ఇప్పుడు అమరావతి కూడా అలాంటి పొలిటికల్ హీట్ తోనే వుంది! మీడియా, జనం దృష్టి మొత్తం పన్నీర్, శశికళ మధ్య సాగుతోన్న ఫైటింగ్ మీదే వున్నా... ఆంధ్రా పాలిటిక్స్ లో మాత్రం సైలెంట్ గా భారీ మార్పులకి రంగం సిద్ధమవుతోంది!   నవ్యాంధ్ర ఏర్పడి మూడో సంవత్సరం కూడా పూర్తి కావస్తున్నా చంద్రబాబు క్యాబినేట్ లో పెద్ద పెద్ద మార్పులు ఇప్పటి వరకూ జరగలేదు. అయితే, ఈ నెల పదహారో తేదీలోపు ఏ క్షణాన్నైనా క్యాబినేట్ రూపు, రేఖలు మారిపోవచ్చంటున్నారు. అయితే, ఈసారి అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ చినబాబు గురించే వుంటుందంటున్నారు. ఆల్రెడీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన వంతు కృషి చేస్తోన్న లోకేష్ ఇక మరి కొద్ది రోజుల్లోనే బుగ్గ కారు ఎక్కేయటం గ్యారెంటీ అంటున్నారు. టీడీపీ నేతల అభిమతం ప్రకారం భవిష్యత్ ముఖ్యమంత్రి అయినా ఆయన తండ్రి క్యాబినేట్లో కీలక శాఖనే దక్కించుకుంటారని గట్టి టాక్. అసలు ఇప్పుడు జరగనున్న మంత్రి వర్గ మార్పు, చేర్పులన్నీ లోకేష్ ను పాలనలో ప్రవేశపెట్టేందుకే అంటున్నారు.   ఏపీ క్యాబినేట్ రీషఫల్ లో లోకేష్ ప్రధాన హైలైట్ గా నిలవనుండగా మిగతా వారు కూడా చాలా మంది కుదుపుకు గురయ్యే ఛాన్స్ వుందంటున్నారు. సీఎం ఇంకా అధికారిక నిర్ణయం ఏం తీసుకోకున్నా రకరకాల ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి దాకా కొందరు మంత్రులు చూపించిన పర్ఫామెన్స్, అలాగే మరికొందరి విషయంలో సామాజిక వర్గాల కూడికలు, తీసివేతలు... ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రధానంగా పరికిస్తున్నారట!   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడుగా వున్నకళావెంకట్రావు క్యాబినేట్లోకి వస్తారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆయన బంధువైన ప్రస్తుత మంత్రి మృణాళిని ఔట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే, ఇప్పుడు మంత్రి వర్గంలో చిన రాజప్పను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని చేసే ఛాన్స్ కూడా వుందంటున్నారు. మరోవైపు రాజప్ప ఉద్వాసన కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రుకు వరంగా మారవచ్చు. ఆయన క్యాబినేట్లో చేరవచ్చు. ఇక నెల్లూరు సీనియర్ నేత, రెడ్డి సామాజిక వర్గం నుంచీ టీడీపీలో నిరంతరంగా వుంటోన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.   ఈ సారి మంత్రి వర్గ కూర్పులో మరో పెద్ద మార్పుగా చెప్పుకోవాల్సింది నారాయణ తొలగింపు. ప్రస్తుతం ఆయన కీలకమైన మంత్రుల్లో ఒకరు. ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా వాటిల్లో ఆయన పాత్ర వుంటోంది. కాని, బాబు ఆయన్ని తాను చైర్మన్ గా వున్న సీఆర్ డీఏకు సారథిగా నియమిస్తారని అంటున్నారు.   ఆ మధ్య జరిగిన వైసీపీ వలసల్లో చాలా మంది చంద్రబాబుకు జైకొట్టారు. వీరి గురించి కూడా సీఎం సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. వాళ్లు పార్టీలో చేరేప్పుడు పదవుల విషయంలో కొంత భరోసా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒకట్రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారట! అదే జరిగితే వైసీపీ వలసల కోటాలో భూమా అఖిలప్రియను అమాత్య పదవి వరించవచ్చు. అలాగే, మరో నేత అమర్ నాథ్ రెడ్డి కూడా అమాత్యులు కావచ్చు. రెడ్డి వర్గం నుంచి సెక్రటేరియట్ వదిలి పెట్టాల్సి రావాల్సిన వాళ్లలో ప్రముఖంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , పల్లె రఘునాథరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు మైనార్టీ వర్గం నుంచి చాంద్ పాషా, ఎంఏ షరీఫ్ పేర్లు కాబోయే మంత్రుల లిస్ట్ లో వున్నాయంటున్నారు. కాని, ఈ ఇద్దరికీగాని, ఒక్కరికిగాని ఎవ్వరికీ ఇంకా బెర్త్ కన్ ఫర్మ్ అయినట్టు మాత్రం అనిపించటం లేదు.   ఇక చంద్రబాబు ఖచ్చితంగా పక్కన పెట్టాలని భావిస్తున్న పేర్లుగా వినిపిస్తున్న రెండు .... రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు. వీళ్లిద్దరి వల్లా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలుగుతోందని సీఎం భావిస్తున్నారట. రావెల చర్యలు, మాటలు ఇప్పటికే నష్టం కలిగించాయి. కాబట్టి ఆయన స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్య మంత్రి అవుతారని అంటున్నారు. పత్తిపాటిని కూడా తొలిగిస్తే ఆయన స్థానంలో స్పీకర్ కోడెల మంత్రి అవుతారని అంటున్నారు. కాని, ఇది కొంత మేర డౌటే అని కూడా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.   ఉత్తరాంధ్ర లెక్కలు చూస్తే అక్కడ్నుంచీ మంత్రి వర్గంలో వున్న పీతల సుజాత, గంటా శ్రీనివాస రావులకి శాఖలు మారతాయని వినిపిస్తోంది. ప్రాధాన్యం కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనాభలో అత్యధిక శాతంగా వున్న బీసీల విషయంలో కూడా బాబు పక్కాగా లెక్కలు వేసుకుని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. పితాని సత్యనారాయణ, కొండబాబు, బీదా రవిచంద్ర లాంటి వారు మంత్రులయ్యే ఛాన్స్ వున్నాయి. వీళ్లెవరూ కాపులు కాదు. కాపులకే ఎక్కవ ప్రాధాన్యత దక్కుతోందని ఇతర బీసీ వర్గాలు అసంతృప్తిగా వున్నట్టు చంద్రబాబు గమనించటమే ఇందుకు కారణం అంటున్నారు. కాకపోతే, ఇంకా ఫైనల్ లిస్ట్ లో వుండే పేర్లు ఎవరివో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.   మంత్రి వర్గ రూపు, రేఖలు ఎప్పుడు మారతాయో ఖచ్చితంగా తెలియదుగాని.. అతి త్వరలోనే లోకేష్ మొదలు స్పీకర్ కోడెల వరకూ టీడీపీలో చాలా మంది డెయిలీ రొటీన్ త్వరలోనే మారనుందనేది మాత్రం గ్యారెంటీ!

కాలుష్యంలో...నిమజ్జనం అవుతోన్న హుస్సేన్ సాగర్!

హుస్సేన్ సాగర్ కలుషితం అవుతోంది. ఇది ఎంత మాత్రం సహించరాని విషయం.... ఈ మాటలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? కరెక్టే, మనం ప్రతీ యేటా వినాయక నిమజ్జనం అప్పుడు ఒక్కసారి ఆచారం కోసం హుస్సేన్ సాగర్ కాలుష్యం గురించి మాట్లాడుకుంటాం. కొందరైతే ఉత్సాహంగా కోర్టుకు వెళతారు. వినాయక విగ్రహాలు నీళ్లలో నిమజ్జనం చేయోద్దని కోర్టు చేత చెప్పించాలని చూస్తారు. కాని, యధావిధిగా విగ్రహాల నిమజ్జనం జరిగిపోతూనే వుంటుంది. కాని, అసలు హుస్సేన్ సాగర్ మామూలు సమయాల్లో ఎలా వుంటోంది? ఏడాకి ఒకసారి జరిగే నిమజ్జన కాలుష్యం సరే... ఏడాదంతా జరిగే ఇతర కాలుష్యాల మాటేంటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటే యదార్థ పరిస్థితి దారుణంగా ఎదురవుతుంది కళ్ల ముందు!   తాజాగా చేసిన అధ్యయనాల ప్రకారం హుస్సేన్ సాగర్ మృత చెరువు అని తేలిపోయింది! అంటే, చెరువులో నీళ్లు లేక ఎండిపోయిందని కాదు! అందులో వున్నవి నీళ్లలా కనిపంచే విషమని! హైద్రాబాద్ నడిబొడ్డున వున్న మన చారిత్రక చెరువు సాధారణంగా ఎండాకాలం వచ్చిన కొద్దీ దుర్వాసనతో స్వాగతం పలుకుతుంది. దీనికి కారణం, సంవత్సరానికి ఒకసారి పర్యావరణ ప్రేమికులు హడావిడి చేసే వినాయక నిమజ్జనం కాదు! ప్రతీ రోజు, ప్రతీ గంట, ప్రతీ నిమషం హుస్సేన్ సాగర్ లోకి వచ్చి చేరే కలుషిత నీరు. బంజారా హిల్స్ నుంచి సికింద్రాబాద్ దాకా, కూకట్ పల్లి నుంచీ బాలాపూర్ దాకా ఎక్కడెక్కడి నీరో ఇందులో వచ్చి కలుస్తుంటుంది. దీని వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా తయారైందంటే... నిపుణులు చెబుతోన్న దాని ప్రకారం... హుస్సేన్ సాగర్ తాను సహజంగా శుద్ది చేసుకునే శక్తిని కోల్పోయిందట. చెరువు కింద భూమిలో మీటర్ల కొద్దీ వ్యర్థాలు, ఖనిజాలు ఇంకిపోయాయట! ఫలితంగా ఎండాకాలం రాక ముందే హుస్సేన్ సాగర్ లోంచి కంపు వ్యాపిస్తోంది. రాజధాని మధ్యలో అంద విహీనంగా కొట్టుమిట్టాడుతోంది!   తెలంగాణ ఏర్పాటుకి ముందు, తరువాత కూడా బోలెడు సార్లు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అన్నారు. కాని, ఇంత వరకూ ఒక్క చుక్క నీరు స్వచ్ఛంగా మారింది లేదు. మరోసారి వినాయక నిమజ్జనం సమయంలో వివాదం రాజుకోవటం తప్ప సంవత్సరం పొడవునా జరుగుతోన్న కాలుష్యం పట్టించుకుంటున్న వారు ఎవరూ లేరు! ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు... 365 రోజులూ హుస్సేన్ సాగర్ ని రక్షించుకునే పనిలో వుంటే తప్ప మన పురాతన సరోవరాన్ని కాపాడుకోలేం! 

మీరు ప్రౌడ్ ఇండియనైతే... మీకు ఇస్రో ఏం చేయబోతోందో తెలియాల్సిందే!

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్... షార్ట్ గా చెప్పుకుంటే... ఇస్రో! ఈ పేరు మనందరికీ తెలిసిందే. కాని, త్వరలో ఇస్రో శాస్త్రవేత్తలు తలపెట్టిన చారిత్రక ప్రయోగం గురించి మీకు తెలుసా? ఒకటి రెండు కాదు.. ఏకంగా వందకు మించి ఉపగ్రహాల్ని ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు! అంటే ఇండియన్ సైంటిస్టులు సాటిలైట్స్ సెంచరీ కొట్టనున్నారన్నమాట!   ఇస్రో ఫిబ్రవరీ 15, 2017న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ తో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని భూమికి 500కిలో మీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టనుంది!  104 సాటిలైట్స్ లో కేవలం 3 మాత్రమే మన దేశానివి! 88 అమెరికాకు చెందినవి! మిగతావి ఇజ్రాయిల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, యూఏఈ లాంటి దేశాలవి!. ఇస్రో చేస్తోన్న సాహసం విజయవంతం అయితే ప్రపంచంలోనే ఇన్ని ఉపగ్రహాలు ఒకేసారి లాంచ్ చేసిన దేశం మనదే అవుతుంది! అమెరికా 29, రష్యా 37 సాటిలైట్స్ లాంచ్ చేయగలిగాయి. గత సంవత్సరం ఇస్రోనే 20 ఉప గ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టి సత్తా చాటింది!   ఇప్పటి వరకూ ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ల సాయంతో 39సార్లు ప్రయోగాలు చేసింది. అందులో 37సార్లు మనం విజయవంతం అయ్యాం. ఒకసారి పూర్తిగా విఫలం కాగా మరొకసారి పాక్షిక విజయం మాత్రమే దక్కింది. అంటే, ఇస్రో చేసిన పీఎస్ఎల్వీ లాంచింగ్స్ 97శాతం సక్సెస్ అయ్యాయన్నమాట! పీఎస్ఎల్వీ సాయంతోనే మన శాస్త్రవేత్తలు చంద్రయాన్, మంగళ్ యాన్ ప్రయోగాలు కూడా చారిత్రకంగా విజయవంతం చేశారు! త్వరలో మన శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న వంద ఉపగ్రహాలు కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోవాలని కోరుకుందాం! 

ఎఫ్బీ సీఈవో జూకర్ బెర్గ్ పదవి... ఊడిపోనుందా?

  జనాలు చేతిలో బుక్ పట్టుకోవటం మానేశారు! కనీసం ఫేస్ అద్దంలో చూసుకుందాం అన్నా టైం వుండటం లేదు! అంత బిజీ అయిపోయారు అందరూ! అయినా కూడా కోట్లాది మంది ఫేస్బుక్ లో కాలక్షేపం చేస్తున్నారు! అంతలా వ్యసనంగా మారిపోయింది ఎఫ్బీ! ఆ ఎఫ్బీ సృష్టి కర్తే మార్క్ జూకర్ బెర్గ్! ఆయన తన సోషల్ మీడియా వెబ్ సైట్  కంపెనీకి కేవలం ఓనర్ మాత్రమే కాదు సీఈవో కూడా. కాని, ఇప్పుడు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికే ఎసరు వచ్చినట్టు కనిపిస్తోంది!   సమ్ ఆఫ్ అస్ అనే ఒక వినియోగదారుల హక్కుల కోసం పోరాడే సంస్థ వుంది. దాని వెబ్ సైట్లో కొందరు ఒక అన్ లైన్ ఉద్యమం మొదలుపెట్టారు. వాళ్ల డిమాండ్ ఏంటంటే, ఎఫ్బీ కి వన్నాఫ్ ది డైరెక్టర్స్ గా, సీఈవోగా జూకర్ బెర్గ్ వుండకూడదని! అందుక్కారణం లేకపోలేదు. జూకర్ బెర్గ్ అటు యజమానిగా, ఇటు సీఈవోగా రెండు పదవుల్లో వుండటం వల్ల ఆయనకు తిరుగులేకుండా పోతోంది. ఆయన నిర్ణయాలు ఎదిరించే అవకాశమే లేదిప్పుడు. షేర్ హోల్డర్స్ కి నచ్చినా, నచ్చకపోయినా అన్నీ భరించాల్సిందే. అందుకే, జూకర్ బెర్గ్ గుత్తాధిపత్యం నచ్చని కొందరు షేర్ హోల్డర్స్ ఆన్ లైన్ ఉద్యమం చేపట్టారు.   జూకర్ బెర్గ్ సీఈవోగా తప్పుకోవాలని జరిగిన ప్రచారానికి మద్దతుగా మొత్తం 3లక్షల మందికి పైగా సంతకాలు చేయగా... అందులో లక్షా 5వేల మంది ఎఫ్బీ షేర్ హోల్డర్స్ వున్నారట! ఇంత మంది మార్క్ జూకర్ బెర్గ్ ను సీఈవోగా వద్దని చెబుతున్నా ఇప్పటికిప్పుడు ఆయన పదవికి పెద్దగా గండమేం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇప్పటికీ అత్యధిక శాతం వాటా జూకర్ బెర్గ్ దే. ఆయన చేతిలో మెజార్టీ షేర్స్ వున్నంత కాలం ఎవ్వరూ ఏం చేయలేరంటున్నారు. అందుకే, జూకర్ కూడా దీన్ని లైట్ తీసుకుంటున్నాడట!  

చిన్నమ్మ ఓడింది... సెల్వం గెలిచాడు!

నిన్నటి దాకా అందరి నోటా శశికళ పేరే వినిపించింది! కాని, రాత్రికి రాత్రి పన్నీర్ సెల్వం పెద్ద కలకలమే రేపాడు. నిజంగా ఆయన సీఎంగా కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. ఏడీఎంకే ఎమ్మెల్యేలంతా చిన్నమ్మ చేతి గోరు ముద్దలు తినటానికే ఇష్టపడుతున్నారు. కాని, పన్నీర్ సెల్వం లెక్కలు కూడా వేరే వున్నాయంటున్నారు. ఆయన వెనుక బీజేపి, మోదీ వున్నా లేకున్నా ఇప్పుడు చేసిన తిరుగుబాటు వల్ల పోయేదేం లేదు. ఎలాగూ సీఎం పదవి శశికళ లాగేసుకుంటుంది. కాబట్టి ఆమెకి ఎదురుతిరిగి జనం ముందు వీరుడిగా గుర్తింపు పొందే అవకాశం వుంది. అలాగే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపి, డీఎంకే లాంటి పార్టీల లోపాయికారి మద్దతు కూడా ఆయనకు వుంటుంది. కాబట్టి పదే పదే సీఎం పదవి వదులుకుంటూ వచ్చిన పన్నీర్ క్యాలికులెటెడ్ గానే ఇదంతా చేశాడని వాదించే వారూ వున్నారు!   శశికళకి ఎదురు తిరిగి నిలవటం అంటే ఎంతైనా రిస్కే. కాని, దానికి తగ్గ ప్రతిఫలం ముందు ముందు పన్నీర్ సెల్వం పొందుతాడా? ఈ అనుమానానికి ఒక హోప్ ఫుల్ యాన్సర్ సోషల్ మీడియాలో వచ్చింది. ఈ మధ్య సామాన్య జనం మూడ్ ఫేస్బుక్ , ట్విట్టర్ లలో రిఫ్లెక్ట్ అయినంతగా మరెక్కడా కావటం లేదు. మొన్నటికి మొన్న జల్లికట్టు విషయంలో కూడా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది. అది వేదికగానే తమిళులు మెరీనా బీచ్ కి లక్షల్లో కదిలారు! అంటే అభివృద్ధిలో, విద్యలో ఎంతో ముందున్న తమిళనాడులో సోషల్ మీడియా ప్రభావానికి బాగానే లోనైందని అర్థం! మరి సోషల్ మీడియా శశికళ, పన్నీర్ సెల్వమ్ ల రాజకీయ పోరు గురించి ఏమనుకుంటోంది?   సోషల్ మీడియా అంటేనే జనాభిప్రాయం. అందుకే, కొందరు శశికళ సీఎం పదవి చేపట్టడం పై నెట్టిజన్ల ఒపీనియన్ కనుక్కునే ప్రయత్నం చేశారు. శశికళ సీఎం పదవి చేపట్టాలా? పన్నీర్ సెల్వమే కొనసాగాలా? అన్న రెండు ప్రశ్నలు జనానికి వేస్తే... అత్యధిక శాతం మంది సెల్వానికే సెల్యూట్ కొట్టారట! శశికళ వద్దే వద్దన్నవారు బోలెడు మంది వున్నారట! అంతే కాదు, అవసరమైతే గవర్నర్ పాలన విధించమని కూడా అభిప్రాయపడ్డారట! దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఈ ఫలితాల్ని తమ అకౌంట్లలో షేర్ చేశారు! దీనిబట్టి చిన్నమ్మ పెద్ద పోస్ట్ చేపట్టడంపై తమిళులు ఎంత గుర్రుగా వున్నారో అర్థం చేసుకోవచ్చు! సుప్రీమ్ కోర్టులో శశికళ దోషిగా తేలితే ప్రజల్లో విముఖత మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ భరోసాతోనే పన్నీర్ తిరుగుబాటు చేసినట్టు కనిపిస్తోంది పరిస్థితి చూస్తోంటే!