కూల్ డ్రింక్స్ బ్యాన్ చేయటం కూల్ ఐడియా కాదు...
ఈ మధ్య తమిళనాడు చిత్ర, విచిత్ర, విషాద కారణాలతో వార్తల్లో వుంటోంది. జయలలిత ఆరోగ్యం నుంచీ జల్లికట్టు ఆరాటం వరకూ రకరకాల అంశాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇక మొన్నటికి మొన్న పన్నీర్, శశికళ రాజకీయ యుద్ధమైతే మరీ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది! ఇప్పుడిప్పుడే చల్లబడుతోందని భావించిన తమిళనాడు కూల్ డ్రింక్స్ నిషేధంతో మరోసారి టాకింగ్ టాపిక్ అయిపోయింది..
తమిళనాడులో పెప్సీ, కోక్ లను నిషేధించారు. ఇది చాలా మంచి విషయమని జనం కూడా మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమిళుల సత్తా గురించి పొగడ్తలు కురుస్తున్నాయి. కొందరైతే పెప్సీ, కోక్ లను దేశమంతా నిషేధించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెప్సీ, కోక్ లు ఆరోగ్యానికి చేసే చేటు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ కూల్ డ్రింక్స్ బ్యాన్ చేయటమంత గొప్ప పని మరొకటి వుండదు. కాని, తమిళనాడులో జరిగింది వేరు!
తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా పెప్సీ, కోక్ లను నిషేధించలేదు. అక్కడి ఒక వాణిజ్య సంఘం ఈ చర్యకు పూనుకుంది. పెప్సీ, కోక్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల శీతల పానీయాలు తమ లోకల్ బ్రాండ్ కూల్ డ్రింక్స్ కొంప ముంచుతున్నాయని వారి ఆందోళన. అందుకు బ్యాన్ చేసేశారు. అయితే, ఇక్కడ మనం గుర్తించాల్సిన పెద్ద కిటుకు ఒకటి వుంది. కూల్ డ్రింక్స్ మొత్తానికి మొత్తంగా బ్యాన్ చేస్తే జనం కొబ్బరి బోండాలు తాగి ఆరోగ్యం కాపాడుకుంటారు. కేవలం పెప్సీ, కోక్ లను లేకుండా చేస్తే లాభం ఏంటి? లోకల్ కూల్ డ్రింక్స్ అమ్మకాలు పెరుగుతాయి. వాట్ని తయారు చేస్తూ బతుకుతోన్న వ్యాపారులు, ఉద్యోగులు వగైరా వగైరా బాగుపడతారు. ఇది మంచిదే. కాని, జనానికి వచ్చిన లాభం ఏం లేదనేది స్పష్టం. పెప్సీ, కోక్ కాకుండా లోకల్ బ్రాండ్ పానీయాలు తాగి హెల్త్ పాడుచేసుకోవటమే!
జనం, వారి ఆరోగ్యం సంగతి సరే... మనం ఇప్పుడు గ్లోబలైజేషన్ శకంలో వున్నాం. ఈ మధ్యే మన ఇండియన్ ఉద్యోగులకు అమెరికాలో భద్రత కరువైందని గగ్గోలు పెడుతున్నాం. మా దేశంలోని ఉద్యోగాలు మాకే ముందు కావాలి అంటోన్న ట్రంప్ ను తిట్టిపోస్తున్నాం. టాలెంట్ వున్న ఇండియన్స్ ని అమెరికాలో ఎలా జాబ్ చేసుకోనీయరని ప్రశ్నిస్తున్నాం! మరి అమెరికన్ కంపెనీలైన పెప్సీ, కోక్ లు మన దగ్గర బిజినెస్ చేసుకుంటే తప్పేంటి? మనం అమెరికాలో డాలర్లు సంపాదించుకోవచ్చు కాని.. ఆమెరికన్ కంపెనీలు ఇక్కడ తమ ప్రాడక్ట్స్ అమ్మకూడదా? పైగా పెప్సీ, కోక్ లు విదేశీ బ్రాండ్సే కావొచ్చు. కాని, వాటి తయారీ యూనిట్లు ఇక్కడే వుంటాయి. వాటిల్లో లోకల్ తమిళులే ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడు పెప్సీ, కోక్ ల పై బ్యాన్ విధించటం ద్వారా వారి ఉద్యోగాలకు ప్రమాదం తీసుకొచ్చారు వ్యాపారుల సంఘం వారు! లోకల్ బ్రాండ్ కూల్ డ్రింక్స్ వారి కోసం లోకల్ పెప్సీ, కోక్ ఉద్యోగుల్ని రోడ్డున పడేశారు!
తమిళనాడులో పెప్సీ, కోక్ బ్యాన్ నేపథ్యంలో మనం గ్రహించాల్సిన సత్యం ఒక్కటి వుంది. ప్రపంచీకరణ కాలంలో మనం విదేశాల్లో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అదే మాదిరిగా విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ తమ వస్తువులు అమ్ముకుంటాయి. మన వారికి కొంత వరకూ ఉపాధి కూడా కల్పిస్తాయి. కాబట్టి లోకల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు వాటికి ప్రత్యేక రాయితీలు, ప్రొత్సాహకాలు ఇవ్వాలి. అంతేగాని, పెప్సీ, కోక్ లను నిషేదించినట్టు ఒక్కోటి హిట్ లిస్ట్ లో చేరుస్తూ పోతే దీర్ఘకాలంలో మనకే నష్టం ఎక్కువ...