అడ్డే వుండదనుకుంటే... అడ్డంగా బుక్కయ్యారు!
posted on Mar 11, 2017 @ 3:57PM
రాజకీయాలంటే పెద్దగా ఇంట్రస్ట్ లేని వారికి కూడా ఎన్నికలంటే ఆసక్తే! ఎందుకంటే, ఎన్నికల్లో అప్పటికప్పుడు తేలిపోయే గెలుపోటములు వుంటాయి. తమ నేత గెలిచాడా లేదా? లేదంటే తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నెగ్గాడా లేదా? ఇది అందరికీ కావాల్సిన అంశం! ఎలక్షన్స్ రిజల్స్ట్ డే రోజైతే అందరి చర్చా ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్నదాని చుట్టూనే నడుస్తుంటుంది!
2017 సంవత్సరానికే హైలైట్ గా సాగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్న చర్చ ఇప్పుడు విపరీతంగా నడుస్తోంది! ఇన్ ఫ్యాక్ట్ ఈ మొత్తం ఎన్నికల్లో ఎవరైనా తిరుగు లేకుండా గెలిచారంటే అది మోదీనే! కాని, ఆయన అసలు పోటీనే చేయలేదు! మరి ఆయా రాష్ట్ర అసెంబ్లీలకి పోటీ చేసి ఓడిపోయి ఆశ్చర్యపరిచిన ప్రముఖులు ఎవరు?
అందరి దృష్టినీ ఆకర్షించిన అతి పెద్ద రాష్ట్రం యూపీలో ములాయం కోడలు ఓడిపోవటం అందర్నీ ఆశ్చర్యపరిచింది! ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది ఓడిపోయినా స్వయాన పార్టీ మహా నాయకుడు ములాయం చిన్న కోడలు అయ్యి వుండీ అపర్ణా యాదవ్ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత రీటా బహుగుణా జోషీ చేతిలో ఖంగుతిన్నారు! ఇక ఉత్తర్ ప్రదేశ్ పక్కనున్న ఉత్తరాఖండ్ లో ని్న్నటి దాకా సీఎంగా వున్న హరీష్ రావత్ ఓడిపోయారు! అదీ ఒక్క చోట కాదు.. రెండు చోట్ల నుంచీ పోటీ చేసి రెండు స్థానాల్లో తూర్పుకి తిరిగి దండం పెట్టేశారు!
మణిపూర్ కూడా జనాలకి మంచి షాకింగ్ ఓటమిని అందించింది! చాలా ఏళ్లు నిరాహార దీక్ష చేసి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇరోమ్ షర్మిలా ఎన్నికల బరిలో ఏ మాత్రం సత్తా చూపలేదు. 90 ఓట్లు మాత్రమే సాధించి దారుణ ఓటమి పాలైంది. ఆమె ఓడుతుందని మీడియా, మేధావులు ఎంత మాత్రం ఊహించలేదు!
పంజాబ్ లో కాంగ్రెస్ అద్భు విజయం దక్కించుకుంది. సీఎం అవ్వబోయేది కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఈయన ఎమ్మెల్యేగా మాత్రం ఓటమి పాలయ్యారు! అదృష్టవశాత్తూ రెండు స్థానాల్లో పోటీ చేయటంతో ఒక చోట గెలిచి, మరో చోటా బొక్కా బోర్లా పడ్డారు! ఎలాగైతేనేం, కెప్టెన్ గారికి పెద్ద ప్రమాదమైతే తప్పింది!
ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం గోవా కూడా ఓ నాయకుడికి మంచి షాకిచ్చింది. మోదీ ఛరిష్మాతో ఎంతో మంది బీజేపీ నేతలు గట్టేక్కేస్తుంటే గోవా సీఎంగా చేసిన లక్ష్మీకాంత్ పర్సేకర్ మాత్రం ఢమాల్ మనిపించారు బ్యాలెట్ వార్లో! కొంచెం ముందంజలో వున్న కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తోన్న గోవా బీజేపి లక్ష్మీకాంత్ ని మాత్రం కాపాడుకోలేకపోయింది!