విరాటే కోహ్లి కాదు కాని, సూపర్ ఛాంపియన్
posted on Mar 6, 2017 @ 3:23PM
విరాట్ అనగానే మనకు విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తాడు! కాని, ఇండియా గర్వంగా ఫీలయ్యేందుకు మరో ఛాంపియన్ విరాట్ వుంది! అదే, ఇండియన్ నేవీ గ్రాండ్ సింబల్ ... ఐఎన్ఎస్ విరాట్! ఈ జల యుద్ధ నౌక ఎట్టకేలకు రిటైర్మెంట్ తీసుకుంది. రెండు దేశాలకి సేవలందించిన ఈ విశిష్ట జల అద్భుతం ఇక ముందు లగ్జరీ హోటల్ గా తన సత్తా చాటే అవకాశాలు కూడా వున్నాయి. అయితే, ఇండియన్ నేవీలోకి విరాట్ స్థానంలో త్వరలో విక్రాంత్ రానుంది. అది ప్రపంచపు నేవీ అద్బుతాల్లో ఒకటిగా వుండనుంది. విరాట్, విక్రాంత్ జల యుద్ధ నౌకల ఘనత ఏంటో చూసేద్దామా...
ఐఎన్ఎస్ విరాట్ మొదట బ్రిటన్ రాయల్ నేవీలో వుండేది. అక్కడ 27 ఏళ్లు సేవలందించిన ఈ గ్రాండ్ ఓల్డ్ లేడీ... 1987లో భారత నేవీలో చేరింది. అప్పట్నుంచీ మూడు దశాబ్దాలుగా భారతీయ సముద్ర జలాలకి అలంకరమైంది. బ్రిటన్లో వుండగా విరాట్ ని హెఎమ్ఎస్ హెర్మెస్ అనేవారు. ఇండియన్స్ కోసం ఐఎన్ఎస్ విరాట్ గా మారిన జల యుద్ధ నౌకని ఇండియన్ నేవీ, అంతర్జాతీయ నేవీ సమాజం... మదర్ అంటుంది గౌరవంగా!
పోయిన సంవత్సరం జూలై 23న ఐఎన్ఎస్ విరాట్ తన ఫైనల్ జర్నీ చేసింది ముంబై నుంచి కొచ్చి వరకూ. తిరిగి దాన్ని ముంబై తీసుకొచ్చిన నేవీ అధికారులు ఫెయిర్ వెల్ పార్టీకి సిద్ధం చేసి అలా వుంచేశారు! పూర్తి స్థాయిలో పని చేసినప్పుడు ఐఎన్ఎస్ విరాట్ ఒకేసాఇర 15వందల మందిని తీసుకు వెళ్లేది!
విరాట్ తన కెరీర్లో మొత్తంలో 2250 రోజులు సముద్రంపై గడిపింది. దాదాపు 11 లక్షల కిలోమీటర్లు చక్కర్లు కొట్టింది. అంటే, 27సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చిందన్నమాట! విరాట్ వీపుపై బయలుదేరిన విమానాలు గాల్లోకి ఎగిరి గంటలు ఆకాశాన్ని చుట్టేశాయో తెలుసా? 22వేల 34గంటలు!
ఇండియన్ నేవీకి మన ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. దేశం కోసం సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ ను స్టార్ హోటల్ గా మార్చే ప్రపోజల్ పెట్టింది. దీనికి ఇంకా నేవీ నుంచి అనుమతి లభించలేదు. అదే జరిగితే విశాఖ తీరంలో విరాట్ హోటల్ అండ్ మ్యూజియంగా వెలిగిపోతుంది! సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతంది!
విరాట్ స్థానంలో ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానున్న విక్రాంత్ కూడా ప్రపంచ రికార్డులతోనే రంగంలోకి దిగబోతోంది. సీ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాక విక్రాంత్ 2018లో భారత నేవీ అమ్ముల పొదిలో చేరుతుంది. 37వేల 500టన్నుల బరువుండే విక్రాంత్ ప్రపపంచంలోనే అరుదైంది. ఇంత భారీ జల యుద్ధ నౌకలు కేవలం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల వద్ద మాత్రమే వున్నాయి. విక్రాంత్ చేరికతో అయిదో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించనుంది!