గోవాకి మరో పారికర్, గుజరాత్ కి మరో మోదీ అవసరమా?
posted on Mar 11, 2017 @ 3:44PM
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం మీద పై చేయి బీజేపీదే అయింది! ఎందుకని? సూటిగా మాట్లాడుకుంటే , బీజేపీకి మోదీ వున్నాడు. మిగతా పార్టీలకు అలాంటి నాయకుడు లేడు! అక్కడే వచ్చింది వున్న తంటా అంతా! పంజాబ్ లో గెలిచిన కాంగ్రెస్ కి కారణం రాహుల్ గాంధీ నేతృత్వం అనలేం. అలాగే, ఎస్పీకి, బీఎస్పీకి కూడా అఖిలేష్, మాయావతి మోదీని ఢీకొట్టే స్థాయిలో నాయకత్వం అందించలేకపోయారు! అందుకే, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో స్పష్టమైన విజయం, గోవా, మణిపూర్ లలో గట్టి పోరాటం మోదీ నేతృత్వంలోని బీజేపి సుసాధ్యం చేయగలిగింది. అకాళీ దళ్ వల్ల పంజాబ్ లో మాత్రం ఓటమి అంగీకరించింది.
మిగతా పార్టీలతో పోల్చితే బీజేపికి మోదీ రూపంలో బలమైన నాయకత్వం, అమిత్ షా రూపంలో తెలివైన వ్యూహం వున్నప్పటికీ... కమలనాథులు కూడా గుర్తించాల్సిన ఒక సత్యం ఈ ఎన్నికల్లో బయటపడింది. అది వారు గోవా నుంచి గ్రహించాలి. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ బీజేపి గోవాలో పాగా వేయటం కీలకమైన పరిణామం. అక్కడ క్యాథలిక్స్ ఓటర్లని కూడా మెప్పించి, విశ్వసింపజేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు మనోహర్ పారికర్. ఆయన్ని ఒక్కసారిగా ఢిల్లీకి పిలిపించటంతో గోవాలో నాయకత్వం లోపం బయలుదేరింది. అదే గోవాలో బీజేపి ఇబ్బందులన్నిటికి మూలమైంది. పారికర్ తరువాత సీఎం గా వున్న లక్ష్మీకాంత్ పర్సేకర్ ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారంటే ఎంత బలహీనమైన నాయకత్వం గోవాలో పార్టీని నడుపుతోంది అర్థమవుతుంది! పారికర్ లాంటి మరి కొంత మంది నేతల్ని గోవా బీజేపి రెడీ చేసుకోవాల్సింది. లేదంటే బీజేపి హైకమాండ్, ఆరెస్సెస్ లు ఆ దిశగా ఆలోచించాల్సింది. ఇకనైనా ఆ పని చేయకపోతే గోవాలో వెంట వెంటనే కోలుకోవటం కష్టమైపోతుంది!
గోవాలో మాదిరిగానే బలమైన నాయకత్వ లేమీ అనే లోపంతో బాధపడుతోన్న మరో కాషాయ రాష్ట్రం గుజరాత్. మోదీ, అమిత్ షాల స్వంత రాష్ట్రమైన గుజరాత్ బీజేపి కంచుకోటగా మారిపోయింది. వరుసగా అక్కడ కమలం వికసిస్తూనే వుంది. కాని, వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రంలో నమో పీఎం అయ్యేందుకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే గందరగోళం నెలకొంది. ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు తెర మీదకి. అయినా కూడా పటేళ్ల ఉద్యమం లాంటివి సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. ముందు ముందు ఇది కూడా గుజరాత్ బీజేపికి కష్ట కాలం తెచ్చి పెట్టే అవకాశం వుంది.
గుజరాత్, గోవా లాంటి రాష్ట్రాల్లో స్థానిక నేతల్లోంచి బలమైన నాయకుల్ని బీజేపి హైకమాండ్ తయారు చేసుకోవాలి. లేదంటే రాష్ట్ర స్థాయిలో గుమాస్తాల మాదిరి నేతల్ని సీఎంలను చేస్తూ కాంగ్రెస్ వ్యూహం పాటిస్తే కొన్నాళ్లకి పతనం తప్పదు!