యూపీ ఎలక్షన్స్... బీజేపి చెలగాటం! ఇతర పార్టీల ప్రాణ సంకటం!
posted on Mar 6, 2017 @ 2:16PM
ఉత్తర్ ప్రదేశ్ ... దేశంలో అతి పెద్ద రాష్ట్రం. అతి పెద్ద ఓటర్ల సముదాయం వున్న రాష్ట్రం. అతి పెద్ద ఎమ్మెల్యేల సంఖ్య వున్న రాష్ట్రం! అందుకే, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు రాజకీయ పరిజ్ఞానం వున్న వారికి అత్యంత ఆసక్తికరం. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపి స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది. అందుక్కారణం... ఏ విధంగా చూసుకున్నా ఉత్తర్ ప్రదేశ్ లో సాధించిన డెబ్బై పైచిలుకు ఎంపీ స్థానాలే! అవ్వే మోదీని మీడియా, మేధావులు ఎంతగా వ్యతిరేకించినా పీఎంని చేశాయి! ఇప్పుడు మరోసారి రేస్ అలాగే నడుస్తోంది. బీజేపికి లక్నో అంసెబ్లీని తన వశం చేసుకోటం ప్రతిష్ఠాత్మకం అయిపోయింది! అదే సమయంలో ఎస్పీకి పరువు నిలుపుకోవాల్సిన గండంలా మారిపోయింది. ఇక బీఎస్పీ, కాంగ్రెస్ ఆటలో అరటిపళ్లు అవ్వకుండా వుండేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి!
యూపీలో మార్చి పదకొండున స్వీట్లు పంచుకునేది ఏ పార్టీ? టపాసులు కాల్చే కార్యకర్తలు ఎవరు? ఈ ప్రశ్నలకి దాదాపుగా ఏ మీడియా సంస్థ వద్ద కూడా సమాధానాలు లేవు! కాని, తమని నడిపించే లెఫ్టు, రైటు సిద్ధాంతాలకు అనుకూలంగా ఫలితాలు చెప్పేస్తున్నాయి! మోదీ వ్యతిరేక బ్యాచి అఖిలేష్ ని మళ్లీ సీఎంని చేసే పనిలో వుంటే నమో బృందం అప్పుడే అయోధ్యలో రామ మందిరం ఖాయం అంటూ ప్రచారం మొదలెట్టేసింది! కాని, మార్చ్ 11లోపు ఎట్టి పరిస్థితుల్లో ఒక క్లియర్ పిక్చర్ వచ్చే ఛాన్స్ లేదు. అంత టైట్ గా సాగింది యూపీ ఎన్నికల బరి! ఒక్క శాతం, రెండు శాతం ఓట్ల తేడా కూడా పార్టీల ఆశల్ని గల్లంతు చేసే ఛాన్స్ వుంది. ఇప్పుడు అందరి టెన్షన్ అదే!
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి గెలుస్తుందని చెప్పేవారిది అనవసర ఉన్మాదం అనటానికి వీల్లేదు. ఎందుకంటే, గత ఎన్నికల్లో తొంభై అయిదు శాతం వరకూ ఎంపీ స్థానాలు కమలం కాజేసింది. రాష్ట్రంలో అధికారంలో వున్న ఎస్పీ మోదీ మాయాజాలాన్ని చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. బీఎస్పీ అయితే ఇంచుమించూ కొట్టుకుపోయింది. కాంగ్రెస్ తనకు వారసత్వంగా వస్తోన్న రెండు, మూడు ఎంపీ సీట్లు తప్ప మరెవీ గెలవలేకపోయింది. ఇదే ఇప్పుడు అసెంబ్లీ పోటీలో కూడా బీజేపిని మెయిన్ టార్గెట్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ దుమ్మెత్తి పోసుకున్నాయి.
కాని, ఈసారి అఖిలేష్ , మాయవతి ఇద్దరూ మోదీ, అమితా షా జపమే చేస్తున్నారు! స్వయంగా వారే ప్రచారంలో తమ ప్రధాన శత్రువు బీజేపి అన్నాక ఉత్తర్ ప్రదేశ్ లోని క్షేత్ర స్థాయి పరిస్థితి అంచన వేయవచ్చు! బీజేపి ఈ సారి సీఎం పదవి చేపట్టినా చేపట్టకపోయినా గొప్ప సక్సెస్ మాత్రం సాధించినట్టే! కాంగ్రెస్ లాంటి పార్టీ వంద సీట్లకు పరిమితమైతే బీజేపి తన పునర్వవైభవం దిశగా ఎస్పీ, బీఎస్పీలకు ప్రధాన పోటీదారు కాగలిగింది. అయితే, బీజేపి అసెంబ్లీని సాధించలేదని కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కొందరైతే మూడు వందల వరకూ ఎమ్మెల్యే సీట్లు సాధించి కమలం అద్బుతంగా వికసిస్తుందని కూడా జోస్యం చెబుతున్నారు!
ప్రస్తుతం ఏడు దశల యూపీ పోరు చివరి దశకు చేరుకుంది. ఇక కొన్ని గంటల్లో అంతిమ ఫలితాలు మాత్రమే మిగిలి వుంటాయి.అవ్వి వస్తే విజేత ఎవరో తేలుతుంది. కాని, అంత వరకూ గెస్సింగ్, బెట్టింగ్ అన్నీ నడుస్తూనే వుంటాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల్నే నమ్ముకున్న ఉత్తర్ ప్రదేశ్ వాసులు ఈసారి తిరిగి జాతీయ పార్టీకి, అభివృద్ధి అంటూ కొత్త ఆశలు రేపుతోన్న బీజేపికి పట్టం కట్టవచ్చు. అందుకే, ఎక్కువ అవకాశాలున్నాయి. కారణం... ఎస్పీకి విపరీతమైన యాంటీ ఇన్ కంబెన్సీ వుంది. అయిదేళ్లుగా అధికారంలో వున్నప్పటి రేపులు, మర్డర్ ల పాపమంతా వెంటాడుతోంది. దానికి తోడైన కాంగ్రెస్ ని ఎవరూ నమ్మే స్థితిలో లేరు.
స్వయంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్సే మూడు వందల సీట్లు వదులుకుని ఎస్పీ పంచన చేరిందంటే... అక్కడ రాహుల్ సేనకి ఎంత బలహీనమైన సంకేతాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అధికారంలో వున్నప్పుడు తన విగ్రహాలు తానే ప్రతిష్ఠించుకుని ప్రజల ఆగ్రహానికి గురైన బెహన్ జీ కూడా అన్ని వర్గాల మద్దతు పొందలేకపోయే అవకాశాలు ఎక్కువ. అగ్రవర్ణాలు ఆమె కంటే ఎక్కువగా మోదీని ఆశ్రయించారని టాక్. పైగా దళితుల్లో కూడా కొన్ని వర్గాల్లో మోదీ అభివృద్ధి నినాదాలకి స్పందించారంటున్నారు. అదే సమయంలో భారీగా ముస్లిమ్ నేతలకు సీట్లిచ్చిన మాయావతి ఎస్పీ ఓట్లకి గండికొట్టారని మరికొందరి వాదన!
బీజేపి అధికారంలోకి రావద్దనే బలమైన కోరికని పక్కన పెట్టి నిష్పాక్షపాతంగా యూపీ ఎన్నికల సరళి చూస్తే... కమల వికాసానికే ఎక్కువ ఆస్కారం వుంది. అయినా సస్పెన్స్ సినిమాలాగా మార్చి పదకొండు దాకా అందరూ ఊపిరి బిగ్గబట్టాల్సిందే. కాని, ఎంతో అవసరమైన ఈ గెలుపు బీజేపికి చెలగాటం! ఇతర పార్టీలకు ప్రాణ సంకటం! ఏం జరుగుతుందో చూద్దాం...