లక్నో ఎన్ కౌంటర్ వెనుక హైద్రాబాద్ లింక్!
posted on Mar 9, 2017 @ 11:30AM
లక్నో ఎన్ కౌంటర్... ఉగ్రవాది సైఫుల్లా... ఒక దేశ ద్రోహి శవాన్నీ తాను స్వీకరించనని అతడి తండ్రి స్టేట్మెంట్... అయినా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోన్న పార్టీలు... ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలని చూస్తోన్న బీజేపి... ఆ క్రెడిట్ దక్కకుండా అడ్డుపడదామనుకుంటున్న కాంగ్రెస్ , ఇతర సెక్యులర్ పార్టీలు.... ఇదీ కొన్ని గంటలుగా నడుస్తోన్న హై ఓల్టేజ్ డ్రామా! కాని, పైకి జరుగుతోన్న పొలిటికల్ సర్కస్ వెనుక టెర్రరిజానికి చెక్ పెట్టే కట్టుదిట్టమైన వ్యవస్థ ఒకటి వుందని మీకు తెలుసా? అదీ ఎక్కడో లక్నోలో నక్కిన ఒక ఐసిస్ ఉన్మాది బండారం ఇక్కడ మన హైద్రాబాద్ లోని కొందరు యాంటీ టెర్రర్ ఎక్స్ పర్ట్స్ బయటపెట్టారని మీకు తెలుసా? లక్నో ఎన్ కౌంటర్ వెనుక వున్న హైద్రాబాద్ లింక్ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది...
సాధారణంగా దేశంలో ఎక్కడ బాంబులు పేలినా, ఆ ఉగ్రవాది మూలలు హైద్రాబాద్ నుంచే వుంటాయి. మన పాతబస్తీ అంతలా లోకల్ , బంగ్లాదేశీ ఉగ్రవాదుల అడ్డగా మారిపోయింది. కాని, ఈసారి జరిగిన లక్నోలోని సైఫుల్లా ఎన్ కౌంటర్ కి మరో రకంగా హైద్రాబాద్ కనెక్ట్ అయింది. ఇక్కడ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ పై పని చేస్తోన్న స్పెషల్ ఇంటలిజెన్స్ గ్రూప్ ఒకటి మధ్యప్రదేశ్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు బోలెడంత సహకారం అందించింది. దాని వల్లే కరుడుగట్టిన ఐసిస్ సానుభూతిపరుడు సైఫుల్లా హతమయ్యాడు.
సైఫుల్లా ఐసిస్ మతోన్మాద సిద్ధాంతాలకి ఆకర్షితుడై భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే హింసకు వ్యూహం పన్నాడు. ఉజ్జయినీ ట్రైన్ బ్లాస్ట్ తో తాను అనుకున్నది అమలు చేశాడు. ఇలా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో రైళ్లలో బాంబులు పెట్టాలని కొంత కాలంగా ఐసిస్ ఉగ్రవాదులు ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. కాని, వారికి తెలియని విషయం ఏంటంటే, మన హైద్రాబాద్ లో వార్ని అనుక్షణం డేగ కళ్లతో వెంటాడుతోన్న ఒక ఇంటలిజెన్స్ బృందం వుందని!
హైద్రాబాద్ లో సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోయే ఒక ఇంటలిజెన్స్ అధికారుల బృందం కొందరు ఇస్లామిక్ యువకులు ఐసిస్ పట్ల ఆకర్షితులవుతున్నారని ఎప్పుడో గుర్తించింది. అయితే, వారి మాటల్ని, కదలికల్ని గమనిస్తూనే వున్నా వారు ఫలాన ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తారని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయింది. అంతలోనే సైఫుల్లా లాంటి వారు దారుణానికి పాల్పడ్డారు. కాని, ఆ వెంటనే సైఫుల్లాను నీడలా వెంటాడుతోన్న హైద్రాబాద్ ఇంటలిజెన్స్ మధ్యప్రదేశ్, ఢిల్లీ నిఘా విభాగాలకు సమాచారం చేరవేసింది. లక్నోలో ఉన్మాది నక్కాడని తెలిసిన ఎంపీ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ దాడి చేసి మట్టు పెట్టాయి! ఇలాంటి ఐసిస్, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల్ని, ఆన్ లైన్లో మతోన్మాదానికి లోనై ఉగ్రవాదులుగా మారుతున్న వార్ని కనిపెడుతూ వుండడానికి ప్రత్యేక బృందం మన నగరం నుంచీ సంవత్సరం పొడవునా పని చేస్తోంది. ఇది నిజంగా మెచ్చుకోవల్సిన కృషి...