తాత పాకిస్తానీ గులామ్... మనవడికి కాశ్మీర్ సర్కార్ సలామ్!
posted on Mar 4, 2017 @ 11:28AM
అరాచకానికి పరాకాష్ఠ ఎలా వుంటుందో మీకు తెలియాలంటే కాశ్మీర్ కు వెళ్లాల్సిందే. పోయిన సంవత్సరం దాదాపు అరు నెలలు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! ప్రతీ రోజూ కర్ఫ్యూలే. ప్రతీ రోజు పాకిస్తాన్ అనుకూల అల్లరి మూకల రాళ్ల దాడులే. అందుకు ప్రతిగా భారత సైనికుల కాల్పులు. ఫలితంగా పెల్లెట్స్ తగిలి కొందరు యువకుల మరణం. ఇలా నెలల పాటూ సాగింది. ఎందరో కాశ్మీరీ తల్లులు వేర్పాటువాదుల కుట్రలకు బలైన తమ కొడుకుల్ని చూసి కడుపుకోతకు గురయ్యారు. కాని, అదే సమయంలో కాశ్మీర్ వేర్పాటువాదాన్ని పొడిచి పొడిచి రాజేసే సయ్యద్ అలీ షా గిలానీ ఏం చేస్తున్నాడో తెలుసా?
సయ్యద్ అలీ షా గిలానీ కాశ్మీర్ వేర్పాటువాదుల నేత. పాకిస్తాన్ కోసం పని చేసే నక్క. ఇప్పటి వరకూ ఎందరో కాశ్మీరీ యువతను బంద్ లు, నిరసనలు, ఉద్యమాలు అంటూ పొట్టన పెట్టుకున్నాడు. పత్యేక కాశ్మీర్ అంటూ యువకుల్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ కు సాయపడటమే గిలానీ బిజినెస్. అలా ఆయన కోట్లు సంపాదించాడు. ఇక ఇప్పుడు ఈ వేర్పాటువాద రాక్షసుడి అరాచకం మరింత పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం 2016లో కాశ్మీర్ లోయ అల్లర్లతో అట్టుడుకుతుంటే గిలానీ మనవడు ఏం చేశాడో తెలుసా? చడీ చప్పుడు కాకుండా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టూరిజమ్ శాఖలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు! అసలు తాత కాశ్మీర్ ని భారత్ నుంచి విడదీయాలనుకుంటుంటే... అతనికి వంత పాడే ఈ మనవడు, అప్లై చేయటమే దుర్మార్గం. పైగా ఆ అప్లికేషన్ కి మెహబూబా ముఫ్తీ సర్కార్ రూల్స్ అన్నీ తుంగలో తొక్కి ప్రాధానత్యనిచ్చిందట.
నేరుగా ముఖ్యమంత్రి మెహబూబా పర్యవేక్షణలో వుండే టూరిజమ్ శాఖలో గిలానీ మనవడు అనీస్ కి సంవత్సరానికి 12లక్షలు ఆదాయం వచ్చే ఉద్యోగం ఇచ్చేశారు. ఎలాంటి దర్యాప్తులు, విచారణలు ఏమీ లేకుండానే! అతనికి గతంలోనే యూకే వెళ్లేందుకు అనుమతించవద్దని జమ్మూ, కాశ్మీర్ సీఐడీ నివేదిక ఇచ్చింది. అటువంటి చరిత్ర వున్న అనీస్ కి మెహబూబా ప్రభుత్వం భారీ ఆదాయం వుండే ప్రభుత్వ ఉద్యోగం కట్టబెట్టింది. పైగా అప్పుడు అతగాడి తాత, అరాచకవాది గిలానీ చేస్తోంది ఏంటి? ఇక్కడ మనవడు ఉద్యోగం రూపంలో భారత దేశ వనరులు మెక్కేస్తుంటే... తాత అమాయక, పేద కాశ్మీరీలను రాళ్లు చేతిలో పెట్టి సైన్యం మీదకి ఉసిగొల్పాడు. వందల మంది నిరపరాధుల ప్రాణాలు, చదువులు, జీవితాలతో ఆడుకున్నాడు!
బీజేపి కూడా మద్దతిస్తోన్న మెహబూబా ప్రభుత్వం ఇలా వేర్పాటు వాదులకి భారతదేశ జనాల ట్యాక్స్ లను సమర్పించుకోవటం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం, అందుకోసం రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కటం, నిజమైన అర్హులైన యువకుల బతుకులు నాశనం చేయటం... అంగీకరించరాని దాష్టీకం! ఈ తప్పుని, ఇలాంటి తప్పులు బోలెడన్నిటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరిదిద్దుకోవాలి. లేదంటే కాశ్మీర్ చేజారిపోయినా ఆశ్చర్యం లేదు!