5వందలేళ్ల కింద, మోదీ గురించి చెప్పిన వారెవరో తెలుసా?

  దేశంలో మోదీ పవనం వీస్తోంది! ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాల్ని నమో సునామీ ముంచేస్తోంది! అయితే ఇదంతా మనం పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నాం. కాని, మోదీ అభిమానులు, అంటే... మోదీ భక్తులు మరింత ఆశ్చర్యకర కోణాల్లో చూస్తున్నారు! ఏకంగా అయిదారు వందల ఏళ్లు వెనక్కి వెళ్లిపోయి అక్కడ నరేంద్రుడి గొప్పతనం తాలూకూ సాక్ష్యాలు వెదుకుతున్నారు! పనిలో పనిగా పార్లమెంట్లోనే తమ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు!   కృతి సోమయ్యా అనే ఎంపీ బీజేపి నుంచి గెలిచారు. ఈ విషయం గతంలో మీకు తెలుసో లేదో కాని ఇవాళ్ల ఆయన లోక్ సభలో చేసిన ప్రసంగంతో అందరికీ తెలిసిపోయింది! కమల దళం నాయకుడు తన మోదీ భక్తిని ఏకంగా పదహారవ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ ను చర్చలోకి తెచ్చి మరీ చాటుకున్నాడు. ప్రతిపక్షాల్ని ఉద్దేశించి ఘాటైన ప్రసంగం చేసిన సోమయ్యా మోదీ వస్తాడని పదహారవ శతాబ్దంలోనే నోస్ట్రాడామస్ చెప్పాడని అన్నాడు. అంతే కాదు, ఒక నాయకుడు తూర్పున పుట్టుకొచ్చి ఇండియాని సమున్నత స్థితిలో నిలబెడతాడని ... అతను మోదీనేనని నోస్ట్రాడామస్ ను ఉటంకిస్తూ బీజేపి ఎంపీ చెప్పుకొచ్చాడు!     మోదీ గురించి నోస్ట్రాడామస్ నిజంగా చెప్పాడా? దీనిపై పెద్దగా క్లారిటీ లేదు. 2014లో మోదీ ఘన విజయం సాధించినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఈ ప్రచారం భారీగా జరిగింది. అమెరికా ఆవిర్భావం గురించి, హిట్లర్ గురించి, వాల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవటం గురించి... ఇలా చాలా విషయాలు చెప్పిన నోస్ట్రాడామస్ మోదీ రాక గురించి కూడా చెప్పాడని అప్పట్లో అన్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు కూడా అ మధ్య ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దాంతో పెద్ద కలకలమే రేగింది! మళ్లీ ఇప్పుడు కృతీ సోమయ్యా మరోసారి మోదీ అవతార పురుషుడని ప్రకటించేశాడు! అదీ పార్లమెంట్లో!   మోదీ ఖచ్చితంగా జనాలు ఆదరిస్తున్న నాయకుడే. ఆయన్ని స్వంత పార్టీ నేతలు పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, ఆ పని మరో విధంగా చేస్తే బావుంటుంది. నోస్ట్రాడామస్ ఉవాచల్ని ఆధారం చేసుకోని ప్రధానిని ప్రశంసించటం అనవసరంగా ప్రతిపక్షాలకి ఒక విమర్శ చేసే అంశాన్ని నోటికి అందించినట్టే అవుతుంది!

రెస్ట్‌ తీసుకోవాలంటూ దిగ్విజయ్‌‌పై కాంగ్రెస్‌ నేతల సెటైర్లు

దిగ్విజయ్‌‌సింగ్‌...  కాంగ్రెస్‌ సీనియర్‌ మోస్ట్‌ లీడర్‌... వయసులోనే కాదు పదవిలోనూ పెద్ద పోస్టే... కానీ అసలు మ్యాటర్‌ మాత్రం లోకల్‌ లీడర్‌ కన్నాఘోరం. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఆక్సిజన్‌ అందిస్తాడని ఆశపడ్డ  నేతల్లో గుబులు పెంచుతున్నాడు. సార్‌గారీ  మ్యాజిక్‌తో  కనీసం ఒక్క చోట కాకపోయినా మరో చోట అధికారంలో వస్తామని గంపెడు ఆశలు పెట్టుకున్న పార్టీ ఆశలు నెరవేరే సూచనలు మాత్రం కనిపించడం లేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ పెద్దాయనను ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌ను ముందుకు తీసుకెళ్తారన్న ఆలోచనతో ఇన్‍ఛార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టారు. కానీ దిగ్విజయ్‌ మాత్రం పార్టీని పైకి తీసుకురావడమేమో కానీ... అసలు  పార్టీని కనుమరుగయ్యేలా చేస్తున్నాడనే విమర్శలను మూటకట్టుకున్నాడు.   గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ నిలిచింది. దాంతో మంచి రోజులతోపాటు... అభయం దొరికిందనుకుని ఆశపడ్డ గోవా కాంగ్రెస్‌ నేతలకు నిరాశే ఎదురైంది. ఎక్కువ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచినా... అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో గోవా కాంగ్రెస్‌ నేతలు  దిగ్విజయ్‌‌పై గుర్రుగా ఉన్నారు. పదవి నుంచి తప్పుకోవాలని మాటల యుద్ధం మొదలుపెట్టారు. కొందరైతే దిగ్విజయ్‌ ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు.   సొంత పార్టీ నేతల నుంచి మొదలైన మాటల తూటాలు దిగ్విజయ్‌‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో నెలకొంటున్న  పరిస్థితులతో... డిగ్గీ సాబ్‌కు డెడ్‌లైన్‌ దగ్గరపడినట్లు కనిపిస్తోంది. కంటెంట్‌ ఉన్నోడని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తే... పార్టీనే మడతెట్టేస్తున్నాడని అంటున్నారు.    ఇక తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ఇన్‌‌ఛార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌.... ఇక్కడ కూడా గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీలో చిచ్చు పెడుతున్నారని అంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఎగదోస్తూ, నేతల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని టీ-కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. 

మహబూబ్‌నగర్‌‌ టీఆర్‌ఎస్‌లో రోడ్డుకెక్కిన విభేదాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా గులాబీ దళంలో విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మధ‌్య కొద్దిరోజులుగా జరుగుతోన్న కోల్డ్‌ వార్‌ ఓపెన్‌ అయ్యింది. తనకు మంత్రి పదవి రాకుండా జితేందర్‌రెడ్డి అడ్డుపడ్డాడని రగిలిపోతున్న శ్రీనివాస్‌గౌడ్‌... మనసులో మాటను మీడియా ముందే బయటపెట్టేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి ముందే తన అసంతృప్తిని వెళ్లగగ్గారు శ్రీనివాస్‌గౌడ్‌.   1969 తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి తూటాలకు ఎదురొడ్డి నిలిచారని, తెలంగాణ ఉద్యమం కోసం ముందుండి పోరాడిన తమకి న్యాయం జరగలేదనే భావనను శ్రీనివాస్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బయటపెట్టారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ మనోగతం తెలియడంతో వెంటనే ఎంపీ జితేందర్‌ గౌడ్‌ మీడియా సాక్షిగా స్పందించారు. శ్రీనివాస్‌గౌడ్‌కి మంత్రి పదవి రాకుండా సీఎం కేసీఆర్‌తో ఏ ఒక్క మాటా అనలేదని, అలా అని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎంపీ జితేందర్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.    మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మనస్పర్థలు కాస్త మీడియా సాక్షిగా బయటపడటం సంచలనంగా మారింది. మీడియా ముందే ఎంపీ, ఎమ్మెల్యే  సవాళ్లు విసుకోవడంపై గులాబీ అధినేత ఎలా స్పందిస్తారోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరికి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించినా, భవిష్యత్‌లో మళ్లీ రోడ్డుకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

విజయవాడ నడిబొడ్డున ఆ భూములను లీజుకెందుకిచ్చారు?

బెజవాడ కనకదుర్గ ఆలయ భూముల వ్యవహారంపై రగడ నడుస్తోంది. నగర నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన స్థలాన్ని సిద్ధార్ధ విద్యాసంస్థలకు కారుచౌకగా ఎలా కట్టబెడతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సుప్రీంలో కేసు నడుస్తుండగా, 33ఏళ్లకు లీజు పొడిగించడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ నిలదీసింది.    సిద్ధార్ధ కాలేజీకి ఇచ్చిన ఆలయ భూముల విలువ ఎకరాకు 70 కోట్లు ఉందని, అందువల్ల ఏటా ఎకరాకు కనీసం కోటి రూపాయలైనా ఆలయానికి ఆదాయంగా రావాలని జగన్ డిమాండ్ చేశారు. 2006లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధార్థ భూముల లీజును రద్దు చేస్తే, ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, ఇలాంటి సమయంలో ఉన్నఫళంగా 33ఏళ్లకు లీజును ఎలా పొడిగిస్తారని జగన్‌ ప్రశ్నించారు. జగన్‌ ప్రశ్నలకు సమాధానమిచ్చిన దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు.... అమ్మవారి ఆలయ భూముల్ని అప్పనంగా ఇవ్వలేదనీ, ఎకరా లీజును లక్షన్నరకు పెంచినట్లు తెలిపారు.   అయితే దేవాదాయశాఖ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే, అప్పనంగా తమకు నచ్చినవారికి ఇష్టారాజ్యంగా కట్టబెట్టడాన్ని కాంగ్రెస్‌‌, వామపక్ష నేతలు తప్పుబడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ భూములపై అసెంబ్లీ సాక్షిగా మరోసారి చర్చ జరగడంతో.... సిద్ధార్థ భూముల లీజు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వందల కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెడుతున్నారని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, తెలుగు తమ్ముళ్లు మాత్రం లైట్‌ తీస్కుంటున్నారు.

అవనిగడ్డ వైపు చూస్తోన్న వంగవీటి రాధా

వంగవీటి రాధా... మాజీ ఎమ్మెల్యేగా కంటే వంగవీటి రంగా కుమారుడిగానే ఫేమస్‌. మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాధా... రెండుసార్లు ఓటమి పాలయ్యాడు. మూడుసార్లూ కూడా మూడు పార్టీల నుంచి పోటీ చేశాడు. అయితే ఏ పార్టీలోనూ ఇమడలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా, ఓ స్థలం విషయంలో అప్పటి సీఎం వైఎస్‌కు చికాకు తెప్పించారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి, ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే విజయవాడ సెంట్రల్‌ నుంచి పీఆర్పీ తరపున పోటీకి దిగిన రాధా ఓటమి పాలయ్యారు. ఇక 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగినా మరోసారి పరాజయం తప్పలేదు.    వైసీపీలో కీలక నేతగా ఎదుగుతారని భావించినా, వంగవీటి రాధా ప్రస్తుతం స్తబ్ధుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం బెజవాడలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదని భావించిన వైసీపీ అధినాయకత్వం.... రాధా ప్రాధాన్యతను తగ్గించిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం, విజయవాడ నగర అధ్యక్ష పదవులతో రాధాను జగన్‌ ప్రోత్సహించినా, పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో ఆశించినమేర రాణించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే వెల్లంపల్లికి నగర అధ్యక్ష పదవి ఇచ్చి, రాధాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారని అంటున్నారు. రాధా వల్ల పార్టీకి, పార్టీ వల్ల రాధాకి ఉపయోగం జరిగేలా అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నా, రాధా మాత్రం స్తబ్ధుగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల పార్టీలో చేరిన వెల్లంపల్లికి విజయవాడ నగర వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాధా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది, అదే సమయంలో తనతో విభేదాలున్న మల్లాది విష్ణు కూడా త్వరలో వైసీపీలో చేరతాడన్న ప్రచారం జరుగుతుండటంతో రాధా తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం రాధా రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు వరుసగా ఓటమి పాలైన రాధా ...ఈసారి గెలవాల్సిన పరిస్థితి. అయితే తన కంచుకోట విజయవాడ ఈస్ట్‌ను వదులుకుని రాధా పెద్ద తప్పు చేశారని, గత ఎన్నికల్లో తప్పు తెలుసుకుని ఇక్కడ్నుంచి పోటీ చేసినా ఓటమి పాలవడం మరింత కుంగదీసిందంటారు. కానీ ఈసారి తప్పకుండా గెలివాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అవనిగడ్డ నుంచి పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది.   మరోవైపు వంగవీటి రాధా జనసేన పార్టీలోకి వెళ్తారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే రాధా వర్గం నుంచి దీనిపై ఎలాంటి సమాధానం రావడం లేదు. పీఆర్పీలో చేరి గతంలో ఇబ్బందిపడ్డ రాధా, జనసేన వైపు అడుగులేస్తారో లేదో చెప్పలేమంటున్నారు అనుచరులు. అదే సమయంలో వైసీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో.... రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.

కర్మభూమి ఉత్తరప్రదేశ్ తరువాత జన్మభూమి గుజరాతా?

నీళ్లలో మొసలిని, భూమిపై సింహాన్ని, ఆకాశంలో గ్రద్ధని... ఎవ్వరూ ఓడించలేరు! మరి గుజరాత్ లో బీజేపిని? ఇంచుమించూ అంతే! అసలు గెలవదనుకున్న యూపీలో క్రమంగా పరిస్థితి మెరుగుపరుచుకుంటూ వచ్చిన కమలం అద్బుతం సృష్టించింది! ఏకంగా 300కంటే ఎక్కువ సీట్లు సాధించింది ప్రతిపక్షాలకు షాకిచ్చింది! మరి ఇంత జోష్ లో వున్న కాషాయనాథులకు తమ స్వంత గుజరాత్ లో గెలుపు సమస్యగా మారుతుందంటారా? అస్సలు కాదు! అయినా కూడా గుజరాత్ లో ముందస్తు ఎన్నికలకు వెళదామని ఆలోచిస్తున్నారట మోదీ అండ్ షా!   ఇవాళ్ల మోదీ నమోగా ఎదిగి నమస్కారాలు అందుకుంటున్నాడంటే దానికి కారణం గుజరాత్! ఆయన రాజకీయ రథయాత్ర అక్కడే మొదలైంది! ద్వారక నుంచి ఉప్పొంగి వచ్చిన అరేబియా సముద్రంలా ఢిల్లీ దాకా, ఇప్పుడు లక్నో దాకా ఆయన దేశం మొత్తాన్నీ ముంచెత్తాడు! కాని, తాజా పరిస్థితులు గుజరాత్ బీజేపిని ఆందోళనలో నెడుతున్నాయి. అందుకే, దేశమంతా నమో నమో అంటూ స్మరిస్తున్న శుభ తరుణంలోనే గాంధీనగర్ పరీక్షని ఎదుర్కొవాలని అనుకుంటున్నారట!   గుజరాత్ లో గత రెండు దశాబ్దాలుగా కమలానికి ఎదురు లేదు. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తానన్న ఆశే వదిలేసింది! కేశుభాయ్ పటేల్, తరువాత నరేంద్ర మోది, ఆ తరువాత ఆనందీ బేన్, ఇక ఇప్పుడు విజయ్ రూపానీ... ఇలా వరుసగా కమలనాథులే సీఎం కూర్చీని అలంకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా, మోదీ వరుస విజయాలతో గుజరాత్ కాంగ్రెస్ ను ఆటలో అరటి పండు చేసేశాడు. ప్రతీ ఎన్నికలప్పుడు సోనియాతో సహా ఎందరు మోహరించి గొంతులు చించుకున్నా మోదీ ముందు మోకరిల్లకుండా తప్పటం లేదు! అయితే, 2014లో నరేంద్రుడు ఢిల్లీ బాట పట్టడంతో గుజరాత్ ఒక్కసారిగా కుదుపుకి గురైంది. అదే ఇప్పుడు అమిత్ షాని అమితంగా ఆందోళన పరుస్తోన్న విషయం!   మోదీ ఒడిసి పట్టి పరిపాలించిన కాలంలో ఎక్కడా ఏ సమస్య లేని గుజరాత్ తరువాతి కాలంలో పటేళ్ల చిటపటలకి కేంద్రమైంది. హార్దిక్ పటేల్ ప్రమాదం కాకపోయినా చికాకుగా మారాడు. అలాగే, గుజరాతీ రైతులు కూడా ఇబ్బందుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరో వైపు ఆ రాష్ట్ర దళితులు గో రక్షకుల కారణంగా కొంత భయాందోళనలకు గురవుతున్నారని కూడా అంటున్నారు! ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలే! అదే ఇప్పుడు కమలానికి కంగారుగా వుండటానికి కారణం!   యూపీ, ఉత్తరాఖండ్ లలో గెలుపు, గోవా, మణిపూర్లలో అధికారం... అంతా ఉత్సాహంగానే వున్నా... మోదీ లేని లోటుతో బీజేపీ గుండెలో గుబులు రేపుతోంది గుజరాత్. అది మరీ ముదరక ముందే ముందస్తు ఎన్నికలకి వెళదామనే ఆలోచనలో వుందట అక్కడి రాష్ట్ర శాఖ! అప్పుడే అమిత్ షా, మోదీ ఫోటోలతో కరపత్రాలు ప్రత్యక్షమయ్యాట వివిధ ప్రాంతాల్లో. ఎలాగూ ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలకు వెళ్లాల్సి వుంది. కాబట్టి మరో అయిదారు నెలల ముందే బ్యాలెట్ వార్ కి సిద్ధపడితే... యూపీ మేనియా గుజరాత్ లోనూ కలిసి వస్తుందని ఆశిస్తున్నారట!   గుజరాత్ లో కాంగ్రెస్ కి తోడుగా ఆప్ కూడా రంగంలోకి దిగి హడావిడి చేస్తుండటంతో బీజేపీకి అక్కడ ఈ సారి ఇద్దర్నీ ఎదుర్కోక తప్పని పరిస్థితి వుంది. అందుకే, ముందస్తు ఎత్తుతో కాంగ్రెస్ , ఆప్ లకు యుద్ధానికి సిద్ధమయయ్యే సమయం లేకుండా చేయాలని కూడా ఒక ఆలోచన! మరి అంతా అనుకున్నట్టే జరిగి గుజరాత్ ముందస్తు నగారా మోగితే.... మరో భీభత్సమైన బ్యాలెట్ యుద్ధానికి రంగం సిద్ధమైనట్టే!

యోగి ఆదిత్యనాథ్ వెనుక వున్న 15వందలేళ్ల కథ తెలుసా?

యోగి యోగి యోగి... ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది ఈ పేరే! భారతదేశానికి యోగులు కొత్తేం కాదు. కాని, ఆధునిక భారతదేశంలో ఒక యోగి పేరు ఇంతగా వినిపించటానికి కారణం... యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అవ్వటమే! దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఆయన చేతుల్లోకి రావటంతో అందరి దృష్టి ఒక సన్యాసిపై పడింది! ఇంతకీ యోగిగారి గొప్పేంటి?    యోగి ఆదిత్యనాథ్ గురించి పొలిటికల్ గా మాట్లాడుకుంటే బోలెడంత వుంటుంది. ఆయన కరుడుగట్టిన హిందూత్వం నుంచీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దాకా చాలా చెప్పుకోవచ్చు. అంతే కాదు, ముందు ముందు యోగి సారథ్యంలో యూపీ ఎటు వెళుతుంది అనేది కూడా ఎవరికి తోచినట్టు వారు విళ్లేషించవచ్చు! కాని, అసలు ఆసక్తికర అంశం ఆదిత్యనాథ్ వెనుక వున్న 15వందలేళ్ల సంప్రదాయం! దాని గురించి తెలుసుకుంటే మనకు బోలెడంతా ఇంట్రస్టింగ్ గా వుంటుంది! యోగి ఆదిత్యనాథ్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువగా అతి ప్రాచీనమైన నాథ సంప్రదాయంలోని ఒక కర్మ యోగి!   మన దేశంలో పురాణ కాలం నుంచీ కూడా వున్న ఒకానొక సంప్రదాయం సిద్ధ సంప్రదాయం. అదే తరువాత కాలంలో నాథ సంప్రదాయం అయింది. నాథ సంప్రదాయం ప్రకారం ఆదినాథుడు శివుడు. ఆయన తరువాత తమ గురువులుగా మత్స్యేంద్రనాథుడు మొదలు మొత్తం తొమ్మిది మందిని భావిస్తారు నాథ సంప్రదాయం పాటించే వారు. నాథ సంప్రదాయం అంటే కూడా ఒక విధమైన శైవ సంప్రదాయమే. కాకపోతే, వీరు తొమ్మది నాథ మునులు నవ నాథులుగా పేర్కొంటారు. వారి ఉపదేశాల ప్రకారం నాథ సంప్రదాయంలోని సంసారులు, సన్యాస భక్తులు ఇద్దరూ నడుచుకుంటారు.    నాథ సంప్రదాయంలో అందరు గురువుల కంటే అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారు గోరక్షానాథ్. ఆయననే ఉత్తరాది వారు గోరఖ్ నాథ్ అంటుంటారు. ఆయన ప్రబావం ఉత్తర్ ప్రదేశ్, నేపాల్, ఉత్తరాఖండ్ లలో చాలా ఎక్కువగా వుంటుంది. అయితే, యావత్ ఉత్తరాదిలో కూడా ఆయన భక్తులు మనకు కనిపిస్తూనే వుంటారు. ఇక గోరక్షానాధ్ ప్రధాన మఠం, ఆలయం వున్న ప్రాంతమే గోరఖ్ పూర్. అక్కడ్నుంచే యోగి ఆదిత్యనాథ్ వరుసగా అయిదుసార్లు ఎంపీగా గెలిచారు. అంతే కాదు, గోరఖ్ పూర్లోని గోరక్షానాథ్ పీఠానికి అధిపతి కూడా ఆయనే! యోగి ఆదిత్యనాథ్ కి సన్యాసం ఇచ్చి... అంత వరకూ తాను పోటి చేసిన ఎంపీ స్థానాన్ని కూడా ఇచ్చిన వారు యోగి అవైద్యనాథ్! ఆయన ఆశీస్సులతోనే అతి పురాతనమైన నాథ సంప్రదాయంలో అడుపెట్టారు యోగిజీ!   నాథ్ సంప్రదాయం మరో విశేషం కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి. మన దేశంలోకి ముస్లిమ్ లు దండయాత్రలు చేయక ముందే ప్రారంభమైన నాథ పరంపర అవసరమైతే ధర్మ రక్షణ కోసం ఆయుధాలు పట్టిన సందర్భాలు కూడా వున్నాయి. మధ్య యుగాల్లో ఇటు బౌద్ధాన్ని, అటు ఇస్లామ్ ని సమర్థంగా ఎదుర్కొన్నారు నాథ యోగులు , సన్యాసులు! ఆ పోరాట పాటవాన్నే వారసత్వంగా, ఆశీర్వాదంగా అందుకున్నారు యోగి ఆదిత్యనాథ్. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు యూపీ సీఎం అయ్యారు!   నేపాల్ లోని గూర్ఖాలకు, మన దేశ సైన్యంలోని గూర్ఖా రెజింమెంట్ కు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? గోరక్షానాథ్ నుంచే! ఆయన పేరునే తాము స్వీకరించామని నేపాల్ గూర్ఖాలు, ఇండియన్ గూర్ఖా రెజిమెంట్ వారు చెబుతారు! సో.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వందల సంవత్సరాల ఆధ్యాత్మిక జ్ఞానం, పోరాట పటిమలకి వారసులన్నమాట!

బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక కేసీఆర్‌ కీలక నిర్ణయాలు

బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తుండటంతో ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక మార్పులు జరగొచ్చని అంటున్నారు. 2019లో వందకి పైగా సీట్లు టీఆర్‌ఎస్‌వేనంటూ ధీమాగా ఉన్న కేసీఆర్‌.... త్వరలో కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణ చేపట్టవచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుంటూ, తన పాలనపై, ప్రజల నాడిపై ఓ అంచనాకి వచ్చిన కేసీఆర్‌.... పనిచేయని నేతలను పక్కనబెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్‌, పార్టీ పదవులు పూర్తిస్థాయిలో భర్తీ చేసి.... కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు   ఇక డబుల్ బెడ్రూమ్‌ స్కీమ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో కేసీఆర్‌ సీరియస్‌ తీసుకున్నారు. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ నెలాఖరు నాటికి రెండున్నర లక్షలకి పైగా డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే కనీసం వందల సంఖ్యలో కూడా ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్‌.... ఈ ఏడాది చివరి నాటికి రెండు లక్షల ఇళ్లు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.   అదే సమయంలో రెండున్నరేళ్ల పాలనపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటోన్న గులాబీ బాస్‌... జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నేతలు, కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే టూర్‌ సూపర్‌ సక్సెస్‌ అవుతుందని భావిస్తున్న సీఎం... నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులు పూర్తిస్థాయిలో భర్తీ చేశాకే.... బస్సు యాత్ర చేపట్టాలని డిసైడైనట్లు చెబుతున్నారు.

మనోజ్ సిన్హా.... లేదంటే రాజ్‌నాథ్‌... ఈరోజు తేలిపోవాల్సిందే

  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. 18న ప్రభుత్వ ఏర్పాటుకి ముహూర్తం పెట్టుకున్నప్పటికీ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో తేలడం లేదు. యూపీ ఫలితాలొచ్చి ఏడు రోజులవుతున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. మిగతా నాలుగు రాష్ట్రాల కంటే యూపీకి కమలనాథులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలంటే 2019లో యూపీ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులేస్తోంది.   యూపీ విషయంలో ఏ చిన్న పొరపాటు చేయకూడదని ఆ పార్టీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని కుల సమీకరణలపై, ఎన్నికల హామీలను నెరవేర్చడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆయన బృందం దృష్టి సారిస్తోంది. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంతోపాటు పార్టీలో అన్ని వర్గాలను కలుపుకువెళ్లే నేత కోసం అన్వేషిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయాలా లేక యాదవేతర బీసీలకు అవకాశం ఇవ్వాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు. సీఎం పగ్గాలు ఓ వర్గానికిస్తే .....డిప్యూటీ సీఎంను మరో వర్గం నుంచి ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఏ ఎమ్మెల్యేకీ సీఎం సీటు ఎక్కే అవకాశం రాకపోవచ్చని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి. కేంద్రం నుంచే బలమైన నేతను పంపుతారని భావిస్తున్నారు.   అయితే యూపీ సీఎం రేసులో కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాను ముఖ్యమంత్రి కేసులో లేనని ఆయనే స్వయంగా ప్రకటించినప్పటికీ, మనోజ్‌ సిన్హానే అందరికీ ఆమోదయోగ్యమైన, సమర్ధుడైన నాయకుడిగా ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మనోజ్‌ సిన్హా ముందంజలో ఉన్నా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత యూపీ బీజేపీ చీఫ్‌ కేశవ్ ప్రసాద్‌ మౌర్య రేసులో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురిలో ఒక్కరు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే  మనోజ్‌ సిన్హానే ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నారు.

భారతంపై భారతీయుడి కామెంట్స్ తప్పా... ఒప్పా!

భారత దేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వుండేవారికి భావప్రకటనా స్వాతంత్ర్యం వుంటుంది. దీనిపై ఎవరికీ సందేహం లేదు. కాని, మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ని ఎలా వాడుకోవాలి? దీనిపైనే అసలు సమస్యంతా ఆధారపడి వుంది! మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు తమ భావప్రకటన ఎలా చేయాలి? ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే, రంగులు మార్చే రాజకీయ నేతలు మొదలు రంగులు వేసుకునే సినిమా వాళ్ల వరకూ అందరూ రోజుకో వివాదాస్పద వ్యాఖ్య చేస్తుంటారు. జనం గగ్గోలు పెడుతుంటారు. కొన్నాళ్లకి అంత కూల్ అయిపోతుంది. మళ్లీ మరో గొడవ మొదలవుతుంది!   కమల్ హసన్ మన దేశానికి ఖచ్చితంగా గర్వకారణమే.కాని ఆయన పుట్టక ముందు నుంచే గర్వకారణం మహాభారతం! గత 5వేల సంవత్సరాలుగా మహాభారతం భారతీయ జీవన విధానంలోఅంతర్భాగం. అటువంటి ప్రపంచపు అతి పెద్ద ఇతిహాసాన్ని అపహాస్యం చేశాడు కమల్! ధర్మరాజు ద్రౌపతి పావులా పెట్టి జూదం ఆడి తప్పు చేశాడనీ... అలాంటి గ్రంథాన్ని భారత ప్రభుత్వం గౌరవిస్తోందని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడట. ఇంకేముంది తమిళ హిందూ సంస్థలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి! భగ్గున మండాయి!    అసలు మహాభారతాన్ని విమర్శించి కమల్ సాధించదలుచుకున్నది ఏమిటి? అందులో జూదం వున్నందు వల్ల ఇప్పుడు సమాజం ఏమైనా ప్రభావితం అవుతోందా? ఆయన చెప్పినట్టే ఒక స్త్రీని జూదంలో పెట్టి ఆడటం తప్పు అనుకుందాం! అయినా కూడా లక్ష శ్లోకాల మహాభారతంలో ఇంకేం మంచే లేదా? ఎక్కడో ఒకటి అరా తప్పుల్ని పట్టుకుని వారసత్వ సంపద లాంటి మహాభారతాన్ని వదిలేద్దామా? ఎవరో అతివాద వామపక్ష భావజాలం వున్న వాళ్లు నోరు పారేసుకుంటే ఫర్వాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల టికెట్ల డబ్బులతో సెలబ్రిటీ అయిన కమల్ ఈ విధంగా మాట్లాడటం సబబేనా? ఇంతా చేసి ఆయన చేసిన విమర్శ ఏమైనా సమాజాన్ని ఉద్ధరిస్తుందా? మహాభారతం సమస్యలకి కారణమైతే బైబిల్ , ఖురాన్ ల సంగతేంటి? వాట్ని కమల్ తన భావ ప్రకటనలో భాగంగా ఇలాగే విమర్శిస్తాడా? విమర్శిస్తే కూడా మళ్లీ ఆయనకు రక్షణనిచ్చి కాపాడాల్సింది .. మహాభారతాన్ని గౌరవిస్తోందని ఆయన విమర్శించిన సో కాల్డ్ భారత ప్రభుత్వమే!   హిందూ సమాజం ఐక్యంగా వుండదు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోయి, విభజింపబడి వుంటుంది. దాని వల్ల హిందూత్వంపై , హిందూ వారసత్వంపై , హిందూ సమాజంపై ఏ ఆరోపణలు, ఏ విమర్శలు  చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఏవో కొన్ని ప్రతి విమర్శలు తప్ప దాడులు జరిగేటంత భయం లేదు. బెంగా లేదు. అందుకే, కమల్ మహాభారతాన్ని టార్గెట్ చేస్తాడు. వర్మ గణఫతిని, శివుడ్ని టార్గెట్ చేస్తాడు. ఎంఎఫ్ హుస్సేన్ అయితే ఏకంగా దేవీదేవతల బొమ్మలు నగ్నంగా గీస్తాడు. అలాంటి వాళ్లని అందర్నీ స్వేచ్ఛావాదులు, అభ్యుదయవాదులు వెనకేసుకొస్తుంటారు. కాని, పురాణాలు, ఇతిహాసాలు, మనుస్మృతులు దాటుకుని చాలా దూరం వచ్చిన హిందూ సమాజంపై అనవసరంగా ఇలా విషం గక్కటం ఎంత వరకూ సమంజసమో కమల్ లాంటి వారే ఆలోచించాలి! మహాభారతం పై చేసినట్టే ఆయన అంబేద్కర్ మీదో, జీసస్ మీదో, మదర్ థెరిసా మీదో కామెంట్స్ చేస్తే రియాక్షన్ ఎలా వుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుని కమల్ ఇక మీదట వ్యాఖ్యానాలు చేస్తే బావుంటుంది. కాలుష్యం గురించో, అవినీతి గురించో, ఉగ్రవాదం గురించో నాలుగు మంచి మాటలు చెబితే ఆయన స్థాయికి తగ్గట్టుగా వుంటుంది! 

కాంగ్రేస్ వాళ్ల కొత్త మ్యాచ్ లో సిద్ధూ బై రన్నర్ మాత్రమేనా?

  నవజ్యోత్ సింగ్ సిద్దూ... ఈ పేరు ఎప్పుడూ సంచలనమే! వివాదాస్పదమే! క్రికెట్లో వున్నా, ఇప్పుడు రాజకీయాల్లో వున్నా సిద్దూ డేరింగ్ అండ్ డాషింగే! కాని, ఆయన తెగింపు, సాహసం ఎప్పుడూ పెద్దగా లాభం చేకూర్చినట్టు కనిపించదు పాపం! క్రికెట్లో కూడా అద్బుతమైన టాలెంట్ వున్న సిద్దూ ఎలాంటి అద్బుతాలు చేయకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 1996 ప్రపంచ కప్ సిరీస్ కి ఆయన ఎంపికయ్యాడు. కాని, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకల్లో జరిగిన ఆ సీరిస్ లో ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు! మ్యానేజ్ మెంట్ ఆడనివ్వలేదు! దాంతో విసిగిపోయిన ఆయన తరువాత కొన్నాళ్లకే రిటైర్ మెంట్ తీసుకున్నాడు! ఇక ఆ తరువాత మొదలైన పొలిటికల్ జర్నీలో కూడా క్రికెట్ లో జరిగిందే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది!   సిక్సర్ల సిద్దూగా పేరు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ నిజానికి టీమిండియా క్యాప్టెన్ అవ్వగలిగిన వాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలిగే వాడు. కాని, ఆయన నిజాయితీ వల్లో, ముక్కు సూటితనం వల్లో, లేక నిలకడలేనితనం వల్లో కొన్ని సెంచరీలు, కొన్ని రికార్డ్ లు తప్ప ఏమీ సాధించలేకపోయాడు! రాజకీయాల్లోకి వచ్చి 15ఏళ్లు బీజేపీలో వున్నా ఇక్కడా ఆయన పరిస్థితి అదే! సిద్దూను కమల దళం అవమానించిందని చెప్పలేం. కాని, ఆయన మాత్రం ఆ పార్టీలో ఎంత మాత్రం సంతృప్తిగా వుండలేదు. చివరకు, పంజాబ్ లో ఓడిపోయే ప్రమాదం వుందని గ్రహించిన బీజేపి నాయకత్వం ఆయన్ని పిలిచి ఆ మధ్య రాజ్యసభ సీటిచ్చింది. ఆ చర్యతో ఆయన కాంగ్రెస్ , ఆప్ ల వైపు వెళ్లడని భావించింది. కాని, సిద్దూ తన ఇమ్మెచ్యురిటీతో ఎన్నికల ముందు అనేక నాటకీయ పరిణామాలకి ఆస్కారం ఇచ్చాడు! ఒక సారి కాంగ్రెస్ వైపు, ఒకసారి ఆప్ వైపు మొగ్గు చూపుతూ పొలిటికల్ గా చులకన అయ్యడు. ఎట్టకేలకు బీజేపి ఇచ్చిన రాజ్యసభ పదవిని మూడు నెలలకే వదులుకుని మరీ కాంగ్రెస్ లో చేరాడు. సిద్దూ లాంటి వ్యక్తిత్వం వున్న వారికి కాంగ్రెస్ లాంటి మహాలంకలో ఏం జరుగుతుందో ప్రమాణ స్వీకారం అయ్యేటప్పటికే తెలిసిపోయింది!   దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవుతున్నా పంజాబ్ లో అదృష్టం బాగుండీ ఘన విజయమే సాధించింది. అందుకు ప్రధాన కారణం కెప్టెన్ అమ్రీందర్ సింగ్. ఆయన నేతృత్వంలో మంచి మెజార్టీ సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల ముందు తమ పార్టీలోకి వచ్చిన సిద్దూను నమ్మీ నమ్మనట్టు వ్యవహరిస్తోంది. ప్రమాణస్వీకారోత్సవం ముందు వరకూ సిద్దూ ఉప ముఖ్యమంత్రి అని ప్రచారం జరిగింది. కాని, ప్రతీ నేతా సీఎమ్మే అయిన కాంగ్రెస్ లో మన కొత్త పక్షికి అంత ఇంపార్టెన్స్ దక్కనిస్తారా? చాలా మంది సీనియర్లు అడ్డుపడటంతో ఉప ముఖ్యమంత్రిని కాస్త మంత్రికే పరిమితం చేశారు. అదీ సాంస్కృతిక, పర్యాటక, స్థానిక సంస్థల మంత్రిగా ప్రకటించారు! ఇవేవీ క్యాబినేట్లో ప్రధానమైవి కావు. సిద్దూ భార్య గత ప్రభుత్వంలో వైద్యశాఖను నిర్వహించారు. ఆ దృష్టితోనైనా కనీసం సిద్దూకి వైద్య ఆరో్గ్య శాఖ ఇవ్వలేదు. ఎలాంటి ప్రాధాన్యం లేని జూనియర్ శాఖలే అంటగట్టారు!   ఇప్పటి వరకూ జరిగిన వ్యవహారం చూస్తుంటే సిద్దూ ఆశలు కాంగ్రెస్ లో చేరాక కూడా సిద్ధించేటట్టు కనిపించటం లేదు. పైగా ఇప్పుడు బీజేపితో కూడా చెడింది కాబట్టి కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతూ జాగ్రత్తగా బండి నడపాలి. దేశంలోని అతి పాత పార్టీలో కొత్తగా చేరిన ఆయన ఇష్టం వున్నా లేకున్నా టైంపాస్ చేయక తప్పదు. అయితే, ముక్కుసూటి మనిషని పేరు పడ్డ సిద్దూ కాంగ్రెస్ మార్కు ట్రీట్మెంట్ తో ఎన్నేళ్లు వేగుతాడు! అదే పెద్ద సస్పెన్స్!

కాపు కాసేందుకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్‌ నేతలు

ఆంధ్రప్రదేశ్‌‌లో కాపు ఫోబియా పట్టుకుంది. అన్ని పార్టీలూ కాపుల వైపే చూస్తున్నాయి. గత ఎన్నికల్లో కాపుల ఓట్లతోనే తెలుగుదేశం అధికారంలోకి రాగలిగిందని అంటారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... చంద్రబాబుకి మద్దతు ఇవ్వడంతో కాపులు ఏకపక్షంగా టీడీపీకి ఓట్లేశారనేది ఒక అంచనా. అందుకే సంక్షేమ పథకాలు, కార్పొరేషన్‌ ఏర్పాటుతో కాపులను అధికార టీడీపీ మరింత మచ్చిక చేసుకుంటుంటే... ప్రతిపక్ష వైసీపీ మాత్రం కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి అండగా ఉంటూ బీసీల్లో చేర్చేవరకూ అండగా ఉంటామంటోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఏపీలో ఉనికి కోల్పోతున్న పార్టీని కాపాడుకునేందుకు కాపుల వైపు చూస్తోంది. వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌‌కు కాపు కాసిన కాపులను మళ్లీ తమవైపు తిప్పుకుంటేనే పార్టీ ఏపీలో బతికి బట్టకడుతుందని భావిస్తోన్న పెద్దలు..... కాపులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.   నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా కాపుల ఓట్లే కీలకంగా మారడంతో ఆ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాపులకు చేరువయ్యే మార్గాలను అన్వేషించిన ఏపీ కాంగ్రెస్‌.... కాపు రిజర్వేషన్ల అంశంపైనే దృష్టిపెట్టింది. కాపుల సమస్యలను అందిపుచ్చుకుని పోరాటం చేయడం ద్వారా వాళ్లకు దగ్గర కావాలని భావిస్తోంది.   టీడీపీ, వైసీపీలో కాపు లీడర్లకు పెద్దపీట వేస్తుండటంతో... కాంగ్రెస్‌ కూడా ఆ దిశగా ఆలోచిస్తోంది. కాపులను ఆకట్టుకునే క్రమంలో కాపులకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. చిరంజీవి లేదా పల్లంరాజుకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లే కీలకం కావడంతో ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇప్పట్నుంచే కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మరి కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో లేదో చూడాలి.

పిల్ల కాంగ్రెస్‌, తల్లి కాంగ్రెస్‌ ఒక్కటవుతాయా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం... అప్పటివరకూ ఎవరూ ఊహించని పరిణామాలు ఈజీగా జరిగిపోతుంటాయి. అప్పటికప్పుడే శత్రువులు మిత్రులుగా.... మిత్రులు శత్రువులుగా మారిపోతారు. అధికారమే లక్ష్యంగా సాగే ఈ ఆటలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగబోతోంది.   పిల్ల కాంగ్రెస్‌, తల్లి కాంగ్రెస్‌ ఒక్కటవుతాయన్న టీడీపీ ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీకి పూర్వవైభవం తేలేకపోయినా, కనీసం తామున్నామని అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ నేతలు... జగన్‌తో కలిసి నడిచేందుకు అడుగులేస్తున్నారు.   కారణాలేవైనా జగన్‌ విషయంలో అనుసరించిన విధానం, తీసుకున్న నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కోలుకోలేని దెబ్బతింది. రాష్ట్ర విభజనతో ఏపీలో నష్టపోయినా... కనీసం తెలంగాణలోనైనా అధికారంలోకి వస్తామన్న అంచనాలు తల్లకిందులవడంతో ఢిల్లీ పెద్దలు కంగుతిన్నారు. మరోవైపు ఏపీలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో అధిష్టానం నివ్వెరపోయింది. ఇటు తెలంగాణలో కేసీఆర్‌ దెబ్బకు పార్టీ విలవిల్లాడుతుంటే.... ఇక ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని తిరిగి నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం మళ్లీ జగన్‌ వైపు చూస్తోంది. ఆ మేరకు మూడ్నెళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఏఐసీసీ.... ముందుగా కేవీపీ ద్వారా ప్రాథమిక చర్చలు పూర్తిచేసి...ఆ తర్వాత దిగ్విజయ్‌ను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు.   ఆ మధ్య జగన్మోహన్‌రెడ్డితో రహస్యంగా సమావేశమై చర్చలు జరిపిన దిగ్విజయ్‌... తనకున్న చనువుతో మరోసారి జగన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ, కాంగ్రెస్‌ను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఏఐసీసీ ప్రయత్నిస్తున్నా.... జగన్‌ మాత్రం వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తే.... ఆస్తుల కేసుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చిక్కులు తప్పవని భయపడుతున్నట్లు చెబుతున్నారు.

ఇద్దరు భారతీయ మత గురువుల్ని మాయం చేసిన పాక్!

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశం ఏది? మీకు ఇంకే పేరు గుర్తుకొచ్చినా తప్పులో కాలేసినట్టే! ఖచ్చితంగా మన పక్క దేశం పాకిస్తాన్ మాత్రమే అత్యంత ప్రమాదకర దేశం! ఇది ఆ దేశం పై వున్న కోపంతోనో, పగతోనో చెబుతున్నది కాదు. నిజంగా పాక్ లో ఎవ్వరికీ భద్రత లేదు. ఉగ్రవాదులు దేశ ప్రధాని కన్నా శక్తివంతులు అయినప్పుడు ఇక చెప్పేదేముంది? తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే పాక్ లోని దారుణమైన ప్రమాదకర పరిస్థితులు మరికాస్త అర్థమవుతాయి భారతీయులకి!   ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ అనే దర్గా వుంది. చాలా ప్రఖ్యాతి గాంచిన చోటది. అందుకే, అక్కడి రై్ల్వే స్టేషన్ పేరు హజ్రత్ నిజాముద్దీన్ అనే అంటారు! అటువంటి దర్గాకి మౌల్వీ సయద్ అసీఫ్ అలీ నిజామీ. ఆయన తన బంధువు నజీమ్ అలీ నిజామీతో కలిసి మార్చ్ ఎనిమిదిన పాకిస్తాన్ వెళ్లాడు. కరాచీలో దిగిన వారిద్దరూ లాహోర్లో వున్న దాతా దర్భార్ అనే దర్గాను సందర్శించటానికి వెళ్లారు. అయితే, అక్కడ పని పూర్తయ్యాక లాహోర్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి కరాచీ ఎయిర్ పోర్ట్ కి రావాల్సి వుంది. కాని, అదే సమయంలో సయద్ అసీఫ్ అలీతో పాటూ ప్రయాణిస్తున్న నజీమ్ అలీని పాక్ అధికారులు ఆపేశారట! కారణం ఆయన వద్ద సంతృప్తికరమైన ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ లేకపోవటమే.    లాహోర్లో సయద్ తో పాటూ వున్న నజీమ్ ను ఆపేసిన తరువాత ఆ ఇద్దరి ఫోన్లు స్విచ్చాప్ అయిపోయాయని చెబుతున్నారు వారి బంధువులు. ఇక అప్పట్నుంచీ , అంటే మార్చ్ పద్నాలుగు నుంచీ వారి ఆచూకీ తెలియటం లేదట! ఇదంతా వింటుంటే షాకింగ్ వుంది కదా? అసలు పాక్ కు వెళ్లిన ఎవరో సామాన్యులు కాదు... ఏకంగా భారత్ లోని ఒక ప్రముఖ దర్గా నిర్వహించే మత గురువుకే భద్రత లేకుండాపోయింది! ఇప్పుడు 80ఏళ్ల ఆయన ఎక్కడున్నారో తెలియదు! ఆయనతో పాటూ వున్న 60ఏళ్ల ఆయన బంధువు సంగతి కూడా తెలియదు! విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పటికే పాక్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆచూకీ కనుక్కోమని అడిగారట. కాకపోతే, అసలు జరిగిన ఈ ఉదంతం చూస్తే పాక్ ఎంతటి ప్రమాదకర గమ్యం ఈజీగా చెప్పేయవచ్చు!    ఇండియా నుంచి వెళ్లిన ఒక ప్రముఖ ఇస్లామ్ మత గురువునే అక్కడి ప్రభుత్వ అధికారులు మాయం చేశారంటే హిందువులో, మన బాలీవుడ్ ప్రముఖులో వెళితే పరిస్థితి ఎలా వుంటుంది? క్రికెట్ ఆడటం మానేసి చాలా రోజులైంది కాని... ఇండియన్ క్రికెటర్స్ కి అయినా ఏం భద్రత వుంటుంది? అసలు ఇండియన్స్ పాకిస్తాన్ వెళ్లే ఆలోచనలు వుంటే అవన్నీ అమాంతం పక్కకు పెట్టటం మంచిది! ఎందుకంటే, ఇప్పుడప్పడే కుక్క తోకలు చక్కగా మారే అవకాశం అస్సలు లేదు!

తెలుగుదేశం కంచుకోటలపై పవన్ కల్యాణ్‌ ఫోకస్‌

2019 ఎన్నికల కోసం పవన్ కల్యాణ్‌ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాడు. లేటైనా లేటెస్ట్‌గా వస్తానంటూ... తాను వేసే ఒక్కో అడుగుతో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. సైలెంట్‌గానే సంచలనాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాజకీయంగా వేస్తోన్న ఒక్కో అడుగు.... అధికార పార్టీ తెలుగుదేశంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్‌ దృష్టి పెట్టడం, అదీ కూడా టీడీపీకి బాగా పట్టున్న జిల్లాలపై పవన్‌ ఫోకస్‌ పెట్టడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది.    2014లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్‌ దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని పదహారు స్థానాలను ఏకపక్షంగా టీడీపీకే కట్టబెట్టారు. పశ్చిమగోదావరి తర్వాత ఆ స్థాయిలో అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ విజయం దక్కింది. జిల్లాలోని 14 స్థానాల్లో ఏకంగా 12 చోట్ల గెలిచి ప్రభంజనం సృష్టించింది.   అయితే ఇఫ్పుడు ఈ రెండు జిల్లాలపై పవన్‌ కన్ను పడింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచే పోటీ చేయడమే కాకుండా, అనంతపురం జిల్లాలో కరవు, రైతు ఆత్మహత్యలు, సాగు, తాగు నీరు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్ని సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమని ప్రకటించడం హాట్‌ టాపిక్‌‌గా మారింది. అనంతలో పోటీ చేస్తానని ప్రకటించడం, జిల్లా సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తానని చెప్పడంతో... వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా జనసేన పోటీచేస్తే.... తమ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.   ఇక తన ఓటు హక్కును హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు మార్చుకున్న జనసేనాధిపతి... పశ్చిమగోదావరిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. మెగా కుటుంబానికి పశ్చిమగోదావరి సొంత జిల్లా కావడం, ఏపీ రాజధానికి సమీపంగా ఉండటంతో....రాష్ట్రంలో జనసేన పాలిటిక్స్‌కు ఏలూరే సెంటర్‌ పాయింట్‌ అవుతుందంటున్నారు. ఆ లెక్కన పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందంటున్నారు.   అంతేకాదు 2009లో చిరంజీవి పోటీ చేసినట్లుగా... ఇటు రాయలసీమ నుంచి... అటు కోస్తాంధ్ర నుంచీ కూడా పవన్‌ బరిలోకి దిగితే... ఏలూరు లేదా నర్సాపురాన్ని ఎంచుకుంటారనే టాక్ వినిపిస్తోంది.  అయితే గత ఎన్నికల్లో పవన్ అండతో పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీకి ఇది మింగుడుపడటం లేదు. ఒకవేళ పవన్‌ ...గోదావరి జిల్లాలతోపాటు కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్‌ పెడితే.... తెలుగుదేశం కంచుకోటలకు బీటలు ఖాయమంటున్నారు.  అయితే కాపులు అధికంగా ఉండే పాలుకొల్లులో చిరంజీవి ఓటమి చవిచూసిన నేపథ్యంలో పవన్‌ పొలిటిల్‌ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

కాగితాలకే పరిమితమవుతోన్న పేదోడి డబుల్‌ బెడ్రూమ్‌ కల

తెలంగాణలో పేదోడి డబుల్‌ బెడ్రూమ్‌ ఇంటి కల కలగానే మిగిలిపోతోంది. ప్రతీ పేదవాడికీ రెండు విశాలమైన గదులతోపాటు హాలు, కిచెన్‌తో కలిపి డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న టీఆర్ఎస్‌ ప్రభుత్వ హామీ కాగితాలకే పరిమితమవుతోంది. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటూ కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నా... డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం మాత్రం కాగితాలను దాటడం లేదు. డబుల్‌ బెడ్రూమ్‌ నిర్మాణాల కోసం వేల కోట్ల రుణాలను సమకూర్చుకుంటున్న ప్రభుత్వం... పనుల్లో మాత్రం వేగం చూపించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఇప్పటివరకు అంటే 2017 మార్చి 31వరకు 2లక్షల 60వేల డబుల్‌ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా, కేవలం 1426 గృహాలు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కూడా ఇప్పటివరకు 964 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా, మరో 462 చివరి దశలో ఉన్నాయి. మిగిలినవి ఇంకా టెండర్ల ప్రక్రియలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.    2017 మార్చి 31వరకు 2లక్షల 60వేల డబుల్‌ ఇళ్లను నిర్మించాల్సి ఉండగా, అందులో 78వేల 996 ఇళ్లను జిల్లాలకు కేటాయించారు, ఇలా జిల్లాలకు అలాట్‌ చేసిన వాటిలో 71వేల 893 ఇళ్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అయితే వీటిలో 1426 ఇళ్ల నిర్మాణం మాత్రమే హౌసింగ్‌ శాఖ చేపట్టింది. మిగిలిన ఇళ్లన్నీ కాగితాల మీదే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా సిద్దిపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లాలో 16వేల 69 డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేపడతామని చెప్పినా... 7212 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే అధికారులు  చర్యలు చేపట్టినా,  అవి కూడా పట్టాలెక్కడం లేదు. ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ఉంది.    ఇక డబుల్‌ బెడ్రూమ్‌ హామీతోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌... ఆ తర్వాత సమీక్షల పేరుతోనే కాలం సరిపెడుతోంది. గ్రేటర్లో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం కావాల్సి ఉండగా... ప్రభుత్వం ప్రతిపాదించిన రేటు 7లక్షల 75వేలకు కట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఇక్కడ పనులు ఒక్క ఇంచు ముందుకు సాగటం లేదు. ఎన్నో సార్లు టెండర్లు పిలిచినా నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు. దాంతో  గ్రేటర్‌లో పేదోడి డబుల్ బెడ్రూమ్‌ కల... కలగానే మిగిలిపోతోంది.    మొత్తానికి ఈ రెండున్నరేళ్లలో కేవలం 964 కుటుంబాలకు మాత్రమే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ఇవ్వగలిగింది ప్రభుత్వం. అయితే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను  కోట్ల రూపాయల ఖర్చుతో జెట్‌ స్పీడ్‌తో నిర్మిస్తోన్న ప్రభుత్వం.... పేదోడి సొంతింటి కలను సాకారం చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్షల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.... కనీసం వందల్లో కూడా కట్టలేకపోతోందని అంటున్నారు.

మోదీ చేసిన నోట్ల రద్దు... 'బంగారం' లాంటి నిర్ణయమా?

నవంబర్ లో మోదీ చేసిన నోట్ల రద్దు తీవ్రమైన కలకలం రేపింది! దేశ ఆర్దిక వ్యవస్థ కుప్పకూలిపోతోందంటూ చాలా మంది గుండెలు బాదుకునే దాకా వెళ్లింది. కాని, సీన్ కట్ చేస్తే... ఇప్పుడు నాలుగు నెలల తరువాత... మార్చ్ లో అంతా మారిపోయింది! నోట్లు రద్దు చేసిన మోదీకే అయిదు రాష్ట్రాల్లో దేశం నలుమూలలా జనం బ్రహ్మాండంగా మద్దతు పలికారు! భారీ మెజార్టీ ఇచ్చి సత్కరించారు!    నోట్ల రద్దు వల్ల అప్పటికప్పుడు చాలా ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే! కాని, అత్యధిక భారతీయులు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు క్యూలు కట్టినప్పుడు తాము దేశం కోసం కష్టపడుతున్నామని గర్వపడ్డారు! అందుకు తగ్గ ప్రతిఫలాలు ఇంతదాకా రాలేదు. ధరలేం భారీగా తగ్గిపోలేదు. పేద వాళ్లు ప్రశాంత్ గా ఏం జీవించటం లేదు. కాని, మోదీ పెద్ద నోట్ల రద్దు పైకి కనిపించని కోణాల్లో ఆర్దిక వ్యవస్థని బలిష్ఠం చేస్తూ వస్తోంది తనదైన రీతిలో! బంగారు భారతాన్ని ఆవిష్కరించేందుకు డీమానిటైజేషన్ తనవంతు సహకారం అందిస్తోంది!   నోట్ల రద్దుకు , బంగారానికి పైకి పెద్దగా సంబంధం వున్నట్టు కనిపించదు. కాని, గత నాలుగు నెలల్లో జరిగింది ఏంటంటే... మోదీ జనం చేతుల్లో డబ్బు లేకుండా చేశారు. వున్నదంతా బ్యాంకుల్లోకి పోయింది. బ్యాంకుల్లోంచి తిరిగి బయటకు రావటం చాలా కష్టమైపోయింది. అందుకే, చాలా మంది ఆన్ లైన్ లావాదేవీల మీద దృష్టిపెట్టారు. ఈ మొత్తం నోట్ల కటకటలో ఒక శుభపరిణామం ఏం జరిగిందంటే...   భారతీయులు బంగారం కొనటం తగ్గించేశారు. ఏకంగా 39శాతం బంగారు దిగుమతులు తగ్గిపోయాయి గత సంవత్సరం! 550 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం బయట నుంచి తెచ్చుకున్నాం. 2009 తరువాత ఈ స్థాయిలో బంగారు కొనుగోలు తగ్గటం ఇదే మొదటిసారి! ఇక బంగారం కొనుగోళ్లు, విదేశాల నుంచి దాని దిగుమతులు తగ్గటం అంటే ఆర్దిక వ్యవస్థకి బలం చేకూరటం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా? బంగారం ఎంత తక్కువగా దిగుమతి అయితే అంత ఎక్కువగా రూపాయి మారకం విలువ పెరుగుతుంది. మోదీ డీమానిటైజేషన్ తో ఆ దిశగా తొలి అడుగులు పడ్డాయి. అయితే, ఇప్పటికీ 24వేల టన్నుల బంగారం మన ఇళ్లలో, గుళ్లలో వుందని ఒక అంచన! అందులో అత్యధిక శాతం బ్యాంకుల్లోకి చేరి ఆర్దిక వ్యవస్థకి అండగా వుంటేనే భారతదేశం నిజమైన బంగారు భారతంగా ఆవిర్భవించేది! దేశ భవిష్యత్ కోసం భారతీయులంతా బంగారంపై వ్యామోహం తగ్గించుకోవటం ఎంతైనా అవసరం! 

5 రాష్ట్రాల ఎన్నికలు... మోదీ నేర్పిన 5 గుణపాఠాలు!

2017 సంవత్సరం మొత్తానికి సరిపోయేంత షాకిచ్చిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అపోజిషన్ కి నేర్పే అయిదు గుణపాఠాలు ఏంటి? ఓ సారి చూద్దాం...  1. మన దేశంలో బీజేపిని ఎదుర్కొనే బాధ్యత ప్రధానంగా కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలది. అయితే, ఎర్ర పార్టీలతో సహా కాంగ్రెస్ , రీజినల్ పార్టీలు అన్నీ వెర్రిగా వామపక్ష అతివాదుల వెంటపడుతున్నాయి. కన్నయ్యా, ఉమర్ ఖిలీద్ లాంటి వారికి సపోర్ట్ చేస్తూ... ఆ అఫ్జల్ గురుని సమర్థించే అతి లెఫ్ట్ ఉద్యమకారులతో... ఓటర్ల నుంచి లాభం పొందటం మాట అటుంచి భారీ నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుంది! అదే జరిగింది...  2. మోదీ భారతీయ యువత ఆశలకి, ఆశయాలకి అనుగుణంగా డిజిటలైజేషన్ అంటుంటే... అఖిలేష్ యాదవ్ స్మార్ట్ ఫోన్లు పాటలు వినటానికి, గేమ్స్ ఆడుకోటానికి అంటాడు!  ఫోన్ లో బ్యాంకింగ్ ఏంటంటూ వెటకారం చేస్తాడు! రాహుల్ బాబా చిరిగిన కుర్తా వేసుకుని వచ్చి డ్రామా చేస్తాడు! ఆ కుర్తా చిరిగింది కాదనీ, చింపుకుని వచ్చిందనీ యువతకి తెలియదా? 3. మైనార్టీలు, దళితుల విషయంలో బీజేపిని విలన్ని చేసి చూపించవచ్చు అనే భ్రమకి మన ప్రతిపక్షాలు దూరం కావాలి! మోదీ నేతృత్వంలో అంబేద్కర్ ని ఆరాధ్య దైవంగా స్వీకరించేసింది కమలం పార్టీ! యూపీలో ముస్లిమ్ మెజార్టీ స్థానాల్లో కాషాయ ధ్వజం ఎగరటం కూడా ముస్లిమ్ లలో మారుతున్న అభిప్రాయానికి సంకేతం!  4. బీహార్లో మహాఘట్ బంధన్ అంటూ ఒక ముఠాను తయారు చేసి బీజేపిని అబిమన్యుడిలా చుట్టాముట్టాయి అన్ని పార్టీలు. కాని, మతతత్వ శక్తుల్ని అడ్డుకోటానికి మేమంతా కలుస్తున్నామంటే ఇక మీదట జనం నమ్మకపోవచ్చు. మరింత నమ్మదగ్గ కారణం ఏదైనా చూపిస్తేనే ఎస్పీ, కాంగ్రెస్ లాంటి పొత్తుల్ని ఓటర్లు ఓకే చేస్తారు! 5. ప్రతిపక్షాలు మీడియాని నమ్ముకోవటం తగ్గించాలి. నోట్లు రద్దైన మరుసటి రోజు నుంచీ డీమానిటైజేషన్ వల్ల జనం నరకం చూస్తున్నారని హడావిడి చేసింది మీడియా. అది నమ్మిన కేజ్రీవాల్ మొదలు రాహుల్ బాబా వరకూ అందరూ అడ్డంగా బుక్కయ్యారు! ఆ ఫలితం గోవా నుంచి యూపీ దాకా జనం ఓట్లతో చూపించారు!

ఆయన వల్ల కాంగ్రెస్ గెలవలేదు! కాంగ్రెస్ వల్లే ఆయన ఓడిపోయాడు!

మిడాస్ టచ్ అంటే మీకు తెలుసా? పూర్వ కాలంలో ఒక రాజు వుండేవాడట. ఆయనకు ఒక వరం వల్ల ఏది ముట్టుకున్నా బంగారమయ్యేదట. దాంతో ఆయన ఫుల్ హ్యాపీ! అయితే, తరువాత అదే వరం కొంపముంచింది! అన్నం, నీళ్లు ముట్టుకున్నా బంగారమైపోయి జీవితం దుర్భరమైంది! ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పకున్నాం అంటే...    ప్రశాంత్ కిషోర్ ... ఈయన ఒక స్ట్రాటజిస్ట్. అంటే వ్యూహకర్త! మనోడి పేరు బాగా జనంలోకి రావటానికి కారణం 2014 పార్లమెంట్ ఎన్నికలు. వాటిల్లో ప్రశాంత్ బీజేపీ కోసం పని చేశాడు. మోదీని ప్రధానిగా గెలిపించటంలో కీలక పాత్ర వుంది. ఆయన పన్నిన వ్యూహాలు నమోకి బాగా ఉపయోగపడ్డాయి. అందుకే, రిజల్ట్స్ తరువాత పీకే సారుకి ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. వెంటనే బీహార్ ఎన్నికల్లో ఆయన్ని నితీష్, లాలూ టీమ్ బుక్ చేసుకుంది. మహాఘట్బంధన్ పేరుతో వారు బీజేపిని మట్టికరిపించటంలో సక్సెస్ అయ్యారు. ఇందులోనూ ప్రశాంత్ కిషోర్ హస్తం వుందని ప్రచారం జరిగింది. ఆయన ముట్టుకుంటే ఏ ఎన్నికలైనా బంగారమే అంటూ పేరొచ్చేసింది!    వరుస విజయాలతో మిడాస్ టచ్ వుందనిపించుకున్న ప్రశాంత్ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పని చేశాడు. మోదీతో కలిస్తే మోదీ రేంజ్లోనే సక్సెస్ వచ్చినట్టు... రాహుల్ తో కలిస్తే రాగా రేంజ్లోనే పీకేకి కూడా ఓటమి ఎదురైంది! ఇప్పుడు యూపీ ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ ను పట్టించుకునే వారే లేరనే స్థితి దాపురించింది! అందుకు కారణం, యూపీలో ఓటమి మాత్రమే కాదు... చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ లో కూడా ఆయన మ్యాజిక్ పని చేయకపోవటమే!   ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు యూపీ, ఉత్తరాఖండ్ లలో కాంగ్రెస్ కు పని చేయకపోవటానికి కారణం ... అసలు ఆయన మాటని కాంగ్రెస్ నేతలు విననే వికనపోవటం! పక్కా కాంగ్రెస్ మార్కు కల్చర్ తో ప్రశాంత్ చెప్పేదేదీ కాంగ్రెస్ హైకమాండ్ వినలేదు, నేతలు పట్టించుకోలేదు, కార్యకర్తలు అమలు చేయలేదు. దాంతో పీకే ఖాతాలో చేదు ఓటమి జమకాక తప్పలేదు! అయినా... ఛరిష్మా వున్న నేతల్ని, అంకితభావంతో పని చేసే కార్యకర్తల్ని, పటిష్టమైన సంస్థాగత వ్యవస్థని సృష్టించుకోకుండా... ప్రశాంత్ కిషోర్లని అద్దెకు తెచ్చుకుంటే జనం ఓటు వేసేస్తారా? యూపీలో జరిగింది అదే! కాంగ్రెస్ మునిగింది. ఆ కాంగ్రెస్ ని నడుముకి కట్టుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా మునిగాడు!