జనసేనాని సభలకి జనం తగ్గిపోతున్నారా?

  రాజకీయ రంగం అందరికీ ఉద్దేశించింది కాదు. అందరూ మోదీ లాగా టీ అమ్ముకునే స్థాయి నుంచి దేశ క్యాపిటల్ సిటీ దాకా ఎదగలేరు. కొందరికి వారసత్వం కలిసి వస్తుంది. రాహుల్ గాంధీ, అఖిలేష్ లాంటి వారు అలా నెట్టుకొస్తుంటారు. అయితే, స్వయం శక్తితో వచ్చేవారు, వారసత్వంతో నెగ్గుకొచ్చేవారు... ఈ ఇద్దరూ కాకుండా మరో రకం కూడా మన ఇండియన్ పాలిటిక్స్ లో వుంటారు! వారే సినిమా వారు! మామూలు వారికి ఎంతో కష్టపడితే తప్ప దక్కని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ వీరికి అమాంతం దొరికిపోతుంది. మరీ ఫాలోయింగ్ వుంటే స్వంత పార్టీ పెట్టి సీఎంలు కూడా అవుతుంటారు. కాని, సినిమా గ్లామర్ ఐస్ క్రీమ్ లాంటిది! ఎంత తియ్యగా, చల్లగా వుంటుందో... అంతే త్వరగా కరిగిపోతుంది, మురిగిపోతుంది కూడా...   టాలీవుడ్లో పవర్ స్టార్ పవరేంటో మనకు తెలియంది కాదు. అందుకే, ఆయన ప్రజా రాజ్యం కోసం ప్రజల్లోకి వచ్చినా, తరువాత జనసేన అంటూ జనంలోకి వచ్చినా, మోదీ, బాబు జోడీకి ఓట్లు వేయమన్నా అభిమానులు ఎగబడ్డారు. అధికారం కట్టబెట్టారు. ఆంద్రా సీఎం, ఇండియా పీఎం విజయంలో ఖచ్చితంగా పవన్ వాటా కూడా కొంత వుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే, రాను రాను పవన్ పొలిటికల్ పవర్ తగ్గుతోందా? ఇదేం ప్రశ్న అంటారా? అవును, ఇంత వరకూ పవన్ పోటీనే చేయలేదు. ఆయన జనసేన జనంలోకి ఓట్ల కోసం వెళ్లనే లేదు. మరి ఆయన రాజకీయ ఛరిష్మా తగ్గుతోందని ఎలా అనగలం?   పవన్ చేనేత సత్యాగ్రహంలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఆయన స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని చెప్పేశారు కూడా. జనసేన నిర్మాణం కూడా జరుగుతుందని, అందుకోసం గన్నులకి, ట్యాంకర్లకి ఎదురు నిల్చిపోరాడే దమ్మున్న నాయకులు కావాలని అన్నారు. పైగా వాళ్లు జనం నుంచే వస్తారని తన ఉద్దేశం చెప్పకనే చెప్పారు. పవన్ జనసేన నాయకులుగా కొత్తవార్ని రంగంలోకి దించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది చాలా మంచిది కూడా. ఎప్పుడైనా ఒక కొత్త తరం నాయకత్వం జనం ముందుకి వస్తే గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి.   చేనేత సత్యాగ్రహం సందర్భంగా పవన్ వ్యాఖ్యల్ని ఆయన అభిమానులు ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. అయితే, ఆందోళనంతా పవన్ క్రేజ్ ఒకప్పటిలా ఇప్పుడు కూడా వుందా అనే! చేనేత సత్యాగ్రహం సభనే తీసుకుంటే దానికి ఇరవై వేల మంది వస్తారని అంచనా వేశారు. కాని,రెండు నుంచి మూడు వేల మంది కూడా రాలేదని అంటున్నారు. అందులోనూ చాలా మంది నాగార్జున యూనివర్సిటి విద్యార్థులే వున్నారని కూడా చెబుతున్నారు! ఇలా ఒక్కసారి జరిగింది కాబట్టి పవన్ మేనియా తగ్గిపోయిందని మనం చెప్పలేం. కాని, ఒకప్పుడు వున్నంత ఇంట్రస్ట్ ఇప్పుడు పవన్ పొలిటికల్ సభలపై జనానికి వుండటం లేదన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే!   పవన్ ప్రత్యేక హోదా విషయంలో చేస్తున్న పోరాటం, అలాగే, ఆయన కమ్యూనిస్టు పార్టీలకి దగ్గరవుతున్నారనే అనుమానం, మెడలో ఎర్ర కండువా వేసుకుని స్పీచ్ లు ఇస్తుండటం... ఇలాంటివన్నీ ఆయన్ని ఒక వర్గం యూత్ కి దూరం చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. బీజేపికి, మోదీకి అనుకలంగా వుండే నెటిజన్స్ ఇప్పటికే పవన్ వైపు నుంచి తప్పుకున్నారని అంటున్నారు క్రిటిక్స్. సినిమాల పరంగా పవర్ స్టార్ అభిమానులు అయినా రాజకీయాల్లో పవన్ తీసుకుంటున్న లెఫ్టిస్ట్ స్టాండ్ కొందరికి నచ్చటం లేదట. దీన్ని కూడా పవన్ దృష్టిలో పెట్టుకుని రైట్ కో, లెఫ్ట్ కో పరిమితం కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా తన పంథా కొనసాగిస్తే ముందు ముందు ఎన్నికల బరిలో మంచి రిజల్ట్స్ వుంటాయి. లేదంటే, జనానికి కన్ ఫ్యూజింగ్ సిగ్నల్స్ పంపితే చిరుకి ప్రజా రాజ్యంతో ఎదురైన అనుభవమే కళ్యాణ్ బాబుకి కూడా ఎదురవ్వచ్చు!

భావన కిడ్నాప్ కేసులో... ఆ హీరోనే విలనట!

  తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన మలయాళీ హీరోయిన్ భావన చాలా మందికి తెలియకపోవచ్చు. కాని, రీసెంట్ గా జరిగిన కిడ్నాప్ వ్యవహారంతో ఆమె ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అయితే ఆమె మంచి ఫాలోయింగ్ వున్న స్టార్. కాబట్టి అక్కడ భావన గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే, ఆమెను కరుడుగట్టన నేరస్థులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయటం, కార్ లో లైంగిక దాడి చేయటం, ఫోటోలు, వీడియోలు తీసుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య. వారికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని, భావన పై దాడి వెనుక చాలా స్క్రీన్ ప్లే వుంది. మొత్తం కేరళ సినిమా ఇండస్ట్రీ ఎంతగా నేరమయం అయిపోయిందో విప్పి చెప్పే నేపథ్యం వుంది...   మనకు తమిళ ఇండస్ట్రీ గురించి తెలిసినంత కూడా మల్లూవుడ్ గురించి తెలియదు. కాని, మంచి కథాంశాలతో జాతీయ అవార్డులు పొందే చిత్రాలు వాళ్లు చేస్తుంటారు. కాని, పైకి కనిపించే కళాత్మక విలువలు ఇండస్ట్రీ లోపల వుండవని చాలా మంది చెబుతుంటారు. అసలు మలయాళీ సినిమా రంగంలోని ఒక వర్గమే తమ చుట్టూ అల్లుకుపోయిన నేరమయ పరిస్థితుల గురించి ఆందోళనగా, ఆవేదనగా చెబుతుంటుంది. ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ చెప్పే దాని ప్రకారం భావన కిడ్నాప్ ఆమె మాజీ డ్రైవర్ చేసిన ఒక ఆకతాయి పని మాత్రమే కాదు. అందులో ఒక టాప్ హీరో ఇన్వాల్స్ అయి వుండొచ్చని అంటున్నారు! అతనే దిలీప్!   దిలీప్ కేరళ సినిమా రంగంలో మంచి పేరున్న అగ్ర నటుడు. అయితే, ఆయనకు... భావనకు మధ్య గొడవలున్నాయి. అందుక్కారణం భావన అతడి వివాహేతర సంబంధాన్ని భార్య ముందు బట్టబయలు చేయటమేనట! దిలీప్ మాజీ భార్య మలయాళీ హీరోయిన్ మంజు వారియర్. అయితే దిలీప్ మంజుతో విడాకులు తీసుకోక ముందే మరో హీరోయిన్ కావ్య మాధవన్ తో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రహించిన భావన స్నేహితురాలు మంజు వారియర్ కి చెప్పిందట. దాంతో దిలీప్, మంజు విడిపోవాల్సి వచ్చింది. అప్పట్నుంచీ కక్ష పెంచుకున్న దిలీప్ తన పరపతి ఉపయోగించి భావనకు మలయాళ సినిమా ఆఫర్లు రాకుండా చేస్తున్నాడంటారు. ఆమె చేసేది లేక కన్నడ, తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.   దిలీప్ తన శక్తితో భావన మల్లూవుడ్ లో లేకుండా చేసినా కూడా ఈ మధ్యే ఆమె ఓ సినిమా సైన్ చేసింది. దాంతో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో వుంది. ఇది నచ్చకే దిలీప్ తనకు దగ్గరి సంబంధాలు వున్న సునీల్ అనే క్రిమినల్ తో కలిసి భావన పరువు తీసే ప్రయత్నం చేశాడని అంటున్నారు కేరళ సినిమా వాళ్లు. సునీల్ గతంలో భావన వద్ద డ్రైవర్ గా పని చేశాడు. అయితే, అతను పైకి కనిపించినట్టుగా డ్రైవర్ మాత్రమే కాదట. దిలీప్ లాంటి సినిమా రంగపు పెద్ద పెద్ద వారితో దగ్గరి సంబంధాలున్న క్రిమినల్. గతంలో ఎన్నో కేసులు అతడిపై వున్నాయి కూడా. అయిదేళ్ల కింద ఇలాగే ఓ హీరోయిన్ తనని సునీల్ కిడ్నాప్ చేశాడని ఆరోపించింది కూడా. కాని, పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంత పలుకుబడి వున్న నేరగాడు సునీల్.   సునీల్ సంగతి అర్థమైన భావన అతడ్ని తొలగించింది. కాని, పోలీసుల కథనం ప్రకారం ఆమె తాజాగా నియమించుకున్న డ్రైవర్ మార్టిన్ కూడా సునీల్ మనిషేనట! సినిమా స్టైల్లో సాగిన ఈ వ్యవహారం సునీల్ గ్యాంగ్ మొత్తం కలిసి భావనపై దాడికి తెగబడేలా చేసింది. ఆమెను కార్ లో రెండు గంటలు హింసించిన ఉన్మాదులు అదృష్టం కొద్దీ వదిలేసి పారిపోయారు.   నిజంగా దిలీప్ అనే హీరోనే భావన కేసులో విలనా? ఇది ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. భావన కూడా పోలీసుల్ని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని కోరిందట. కాకపోతే, త్వరలో తాను కన్నడ ప్రొడ్యూసర్ ఒకాయన్ని పెళ్లాడబోతున్నాని భావన చెప్పిన వెంటనే ఈ దాడి జరగటం అనే సందేహాలకు తావిస్తోంది. కేవలం ఒక డ్రైవర్ స్థాయి వ్యక్తి ఎంతో పేరున్న టాప్ హీరోయిన్ పై స్వంత ధైర్యంతో దాడి చేస్తాడా? ఖచ్చితంగా వెనుక ఇండస్ట్రీ పెద్దలు వుండే వుంటారు. కాని, అది తేల్చాల్సింది కేరళ పోలీసులు. ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం పాలనలో దాడులు మరీ ఎక్కువైపోయాయని కూడా అంటున్నారు కేరళలో. మహిళల పట్ల అయితే దారుణంగా దాడులు జరుగుతున్నాయట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఓ పెద్ద హీరో విషయంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశించటం... కాస్త విపరీత 'భావనే'!  

ఆ సీఎం దృష్టిలో మోదీ, అమిత్ షా గాడిదలా?

  ఉత్తర్ ప్రదేశ్ అంటే చిన్న సైజు భారతదేశం! మన దేశ జనాభాలోని ఆరోవంతు జనం అక్కడే వుంటారు! అంటే.. ప్రతీ ఆరుగురు భారతీయుల్లో ఒకరు యూపీ వాసేనన్నమాట! అంత ముఖ్యమైన రాష్ట్రం కాబట్టే అక్కడ ఎన్నికలంటే అన్ని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. వాటిల్లో మాటలతో ప్రత్యర్థిపై దాడి చేయటం ప్రధానమైంది! ఈ సారి యూపీ ఎలక్షన్స్ లో మోదీ అందరి కంటే ముందున్నారు మాటల దాడిలో. అయితే, ఆయన్ని ఎదుర్కొనే ఆవేశంలో సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలు పదే పదే తప్పులు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వంతు వచ్చింది!   మోదీ వాక్ చాతుర్యం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సింది కాదు. అయితే, ఆయన ఈ సారి ఎన్నికల్లో మాటల దాడి కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఇంగ్లీషులో స్కాం అనే పదానికి ఫుల్ ఫామ్ వివరిస్తూ... ఎస్ అంటే సమాజ్ వాది, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేష్, ఎం అంటే మాయావతి అంటూ అందర్నీ ఇరికించారు. దాన్ని ప్రజలు ఎలా తీసుకున్నారో తెలియదు కాని... అదే స్కామ్ పదానికి రాహుల్ మరో వివరణ ఇస్తే పెద్దగా పట్టించుకోలేదు. స్కామ్ అనే నెగటివ్ పదానికి రాహుల్ బాబా పాజిటివ్ అర్థం వచ్చేలా ఫుల్ ఫామ్ చెప్పటంతో ఆశించిన లాభం కలగలేదు.   మోదీ మరో సభలో ఈ మద్యే అఖిలేష్ ను టార్గెట్ చేశారు. ఒక ఊరిలో మైనార్టీలు సమాధులు చేసుకునే చోటు వుంటే.. ఖచ్చితంగా హిందువులకి స్మశానం కూడా వుండాలి అన్నారు. ముస్లిమ్ ల రంజాన్ కి కరెంట్ వుంటే హిందువుల హోళీకి కూడా విద్యుత్ వుండాలి అన్నారు. మొత్తం మీద అఖిలేష్ ప్రభుత్వం ముస్లిమ్ లకు ప్రాధాన్యత ఇచ్చి హిందువుల్ని పట్టించుకోలేదనే భావం కల్పించారు జనంలో! మోదీ చేసిన ఈ దాడికి అఖిలేష్ ఆగ్రహంతో రెచ్చిపోయారు.   ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన అఖిలేష్ గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయవద్దని నేను అమితాబ్ తో చెప్పాను అన్నాడు! అసలు విషయం ఏంటంటే, గుజరాత్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన బిగ్ బి అహ్మదాబాద్ దగ్గరలో వున్న అడవి గాడిదల అభయారణ్యానికి ప్రచారం కల్పించే యాడ్ లో నటించాడు. అందులో గుజరాత్ గాడిదలతో కలిసి బచ్చన్ కనిపిస్తాడు. అలా కనిపించకండని తాను అమితాబ్ కు చెప్పినట్టు అఖిలేష్ అన్నాడు. అయితే, ఇందులో ఆయన ద్వంద్వార్థం వాడాడు. గుజరాత్ గాడిదలు అంటే మోదీ, అమిత్ షా అని మరో అర్థం...   దేశ ప్రధానిని, అధికారంలో వున్న జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని గాడిదలు అనటం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం కాదు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అంటూ ప్రచారం జరుగుతోన్న యూపీ ఎలక్షన్స్ లో అందరూ అన్ని అస్త్రాలు వాడేస్తున్నారు. మోదీ కూడా చాలా సెటైర్లే వేశారు. మాయవతి పార్టీ అయిన బీఎస్పీని ఆయన బెహన్ జీ సంపత్తి పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఇలాంటివే రాను రాను శృతి మించి గాడిదల దాకా వ్యవహారం వెళుతోంది...   రాహుల్ సోదరి ప్రియాంక కూడా మోదీపై విరుచుకుపడింది. ఆయన తనని తాను యూపీకి దత్తపుత్రుడ్ని అంటే... ప్రియాంక గాంధీ మనకు బయటి వారు అక్కర్లేదు అనేసింది. కాని, మోదీ సోషల్ మీడియాలో ఆమె మోదీని బయటి వ్యక్తి అనటం అనేక విమర్శలకు దారి తీసింది. బీజేపి సపోర్టర్స్ యథావిధిగా సోనియా ఇటాలియన్ అంటూ దాడికి దిగారు! మోదీ నుంచి అఖిలేష్ దాకా అందరూ గంభీరమైన విమర్శలు చేస్తే బావుంటుంది. అలా కాక గాడిద సెటైర్లు వేసుకుంటే జనం ముందు అంతా చులకనవుతారు.   మరీ ముఖ్యంగా, మోదీ లాంటి ప్రధాని స్థాయి వ్యక్తిని, వయస్సులో పెద్దవాడ్ని, అనుభవంలోనూ సీనియర్ ని పట్టుకుని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు మంచి కన్నా చెడు చేసే అవకాశాలు ఎక్కువ వున్నాయి! గతంలో సోనియా మృత్యు బేహారీ అంటూ పెద్ద గొడవకు కారణం అయ్యారు. ఇదీ అలాగే అయ్యే అవకాశం లేకపోలేదు. పైగా అఖిలేష్ తన గాడిద హాస్యంలో అమితాబ్ లాంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని చర్చలోకి తేవటం మరింత తప్పుగానే చూస్తారు విజ్ఞత వున్నవారు. అందుకే, నేతలంతా జనం చేతులు జోడించి చప్పట్ల కొట్టేలా కాకుండా చేతులు ఎత్తి దండం పెట్టేలా ప్రసంగాలు చేస్తే బావుంటుంది!

షర్మిల అడిగింది... కేజ్రీవాల్ ఇచ్చాడు... ఆప్ నేతలు నొచ్చుకున్నారు!

  తాను అనుకోని చేసినా, అనుకోకుండా చేసినా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పని వల్ల న్యూస్ లో వుంటాడు. ఆయనకి ఆ మీడియా కవరేజ్ యోగమేదో జాతకంలో వున్నట్టు వుంది! ఆయన పరిపాలించే రాష్ట్రం ఢిల్లీ దేశంలోనే అత్యంత చిన్నది. నిజానికి ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి నగరాల వంటిదే. ఆయన ముఖ్యమంత్రి అయినా ఒక మేయర్ స్థాయి పదవి ఆయన అలంకరించిన సీటు! కాని, పెద్ద పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కనిపించనంత, వినిపించనంత విరివిగా ఏకే హల్ చల్ చేస్తుంటాడు. ఇప్పుడు మరోసారి తనకు తెలియకుండానే వార్తల్లోకి ఎక్కేశాడు ఆప్ అధినేత!   అరవింద్ కేజ్రీవాల్ న్యూస్ అంటే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న గోవా, పంజాబ్ నుంచి అనుకోకండి. అక్కడ ఆప్ గెలిచే అవకాశాలు బాగానే వున్నాయంటున్నారు. అలాంటి సీరియస్ మ్యాటర్ అయితే అంతా బాగానే వుండేది. కాని, మోదీ మీద వ్యతిరేకతతో కేజ్రీ చురుగ్గా పనిచేస్తుంటాడు. అలా ఆయన కలుసుకున్న ఒకానొక నాయకురాలే షర్మిలా. తెలుగు వారికి తెలిసిన షర్మిల కాదులెండీ! ఇరోమ్ షర్మిల అని మణిపూర్ లో ఏళ్లపాటూ నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారిణి!   ఇరోమ్ షర్మిల మణిపూర్ లో సైన్యానికి వుండే ప్రత్యేక అధికారాలు రద్దు చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తోంది. కాని, అక్కడ వుండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఎన్డీఏ, యూపీఏ ... ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇక లాభం లేదనుకుని ఏళ్ల పాటూ సాగిన తన ఉపవాస దీక్ష ముగించి ఈ మధ్యే షర్మిల ఎన్నికల రాజకీయాల్లోకి దిగింది. ఆమెకు బలవంతంగా ఫ్లుయిడ్స్ ఎక్కిస్తూ ప్రాణాలు కాపాడిన ఢిల్లీ ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, ఆమె అనూహ్యంగా తనకు రాజకీయ సలహా, మార్గదర్శనం చేయమంటూ అరవింద్ ను అప్రోచ్ అయింది. అప్పుడే అందరి కళ్లూ షర్మిల, కేజ్రీవాళ్లను అనుమానంగా చూశాయి. ఇదేదో మోదీ వ్యతిరేక కుట్రేమో అన్నట్టు భావించాయి.   అరవింద్ కేజ్రీవాల్ మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలకి ఎలాంటి సూచనలు చేశారో తెలియదుగాని ... ఆమె తన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటానని చెప్పిన పార్టీ ఆఫీస్ కి మాత్రం 50వేలు డోనేట్ చేశాడు. తన అలవాటు ప్రకారం ట్విట్టర్ లో ప్రకటించాడు కూడా. వెంటనే దేశ వ్యాప్త ఆప్ అభిమానులు తమ నాయకుడి గొప్ప మనస్సుకి ఉపొంగి పోయి కామెంట్స్, రీట్వీట్స్ చేశారు. కాని, మణిపూర్ లోని ఆమ్ ఆద్మీ కార్యకర్తలు మాత్రం లోలోపలే తీవ్రంగా మథన పడ్డారు. ఇప్పుడే అదే పెద్ద డిస్కషన్ కి దారి తీసింది!   కేజ్రీవాల్ 2014లో పిలుపునిచ్చినప్పటి నుంచీ మణిపూర్ లో కొందరు అభిమానులు పార్టీ కోసం పని చేస్తూనే వున్నారు. అయితే వారికి ఇప్పటికీ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయలేదు ఢిల్లీలోని ఆప్ హైకమాండ్! తమ  స్వంత ఖర్చులతో ఆప్ పార్టీ నడుపుతున్నారు అక్కడి వారు. కాని, నిన్నగాక మొన్న వచ్చిన ఇరోమ్ షర్మిల అడగటమూ , తమ నాయకుడు ఉదారంగా 50వేలు ఇవ్వటమూ అక్కడి వారికి అస్సలు నచ్చటం లేదట! స్వంత దుకాణానికి దిక్కులేదు... పక్క పార్టీలకి పరోపకారమా అంటూ విసుక్కుంటున్నారట!   అరవింద్ కేజ్రీవాల్ షర్మిలకు విరాళం ఇవ్వటం, మణిపూర్ అప్ శ్రేణులకి అది నచ్చకపోవటం... పెద్ద రాజకీయ దుమారం ఏం కాదు. అసలు మణిపూర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అస్థిత్వమే అంతంత మాత్రం. అరవింద్ పట్టించుకోకపోతే కాంగ్రెస్, బీజేపి, కొత్తగా వస్తోన్న షర్మిల పార్టీ... దేనిలోకో వెళ్లిపోతారు. కాని, అసలు సమస్య ఢిల్లీ ముఖ్యమంత్రిగారి ఆలోచనా విధానం. పబ్లిసిటీ వచ్చే అంశాలకే ప్రాధాన్యతనిస్తూ , విరాళాల రాజకీయం నడుపుతూ, స్వంత పార్టీ విస్తరణని నిర్లక్ష్యం చేస్తే.. చివరకు ఏం మిగులుతుంది? మోదీ మీద విస్త్రృతంగా చేసిన ఆరోపణల పేపర్ కటింగ్స్ మాత్రమే...  

టీ కాంగ్ : ఆలూ లేదూ చూలూ లేదు... సామెత నిజం చేస్తోందా?

  దేశంలో ఎన్ని పార్టీలున్నా కాంగ్రెస్ కాంగ్రెస్సే! అత్యంత పురాతన పార్టీ అయిన హస్త దళం క్రమంగా కుంచించుకుపోతోంది. మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మరుక్షణం నుంచీ ఓటములు మరింత ఎక్కువయ్యాయి. త్వరలో గోవా, పంజాబ్, మణిపూర్ లలో అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొంత ఊరట. కాని, దేశంలోని చాలా చోట్ల మాత్రం కాంగ్రెస్ కహానీ ఖతమయ్యే స్థితిలో వుంది. అయినా కూడా కాస్త ఆశలు పెట్టుకోగల రాష్ట్రం మన తెలంగాణ. ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నా రేపో, మాపో అధికారం కాంగ్రెస్ కు చిక్కే ఛాన్స్ ఇక్కడ వుంది! కాని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు యథా ప్రకారం తమ అంతర్గత వర్గ పోరుల్లో హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారు. జనం అధికారం ఇద్దామనుకున్నా వీళ్లే వాళ్లకు వణుకు పుట్టించేలా వున్నారు...   తెలంగాణ ఏర్పాటు తరువాత తామే పవర్ లోకి వచ్చేస్తామని కలలుగన్నారు టీ కాంగ్ నేతలు. జానా రెడ్డి మొదలు గీతా రెడ్డి వరకూ అందరూ ఎవరికి వారు సీఎంలు కూడా అయిపోయారు. ఇలా బోలెడు మంది కాంగీ అగ్ర నేతలు కలల కాన్వాయ్ లో ఊరేగుతుండగానే ఎన్నికలు ముగిశాయి. జనం కేసీఆర్ ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేశారు! ఇందుకు కారణం, ఆయన ఉద్యమ నాయకుడిగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవటం ఒక్కటే కాదు... తెలంగాణ కాంగ్రెస్ నేతల నిర్వాకం కూడా! వాళ్లలో ఏ ఒక్కరూ జనంలో నమ్మకం తీసుకురాలేకపోయారు. ప్రతిపక్ష హోదానిచ్చిన తెలంగాణ ఓటర్లు అధికారం మాత్రం కట్టబెట్టలేదు.   సోనియా తెలంగాణ ఇచ్చినా కూడా రాష్ట్రంలో అధికారానికి దూరం కావటం స్థానిక నేతల అసమర్థతే అనవచ్చు. ఇప్పుడు అదే మరోసారి టీ కాంగ్రెస్ పుట్టి ముంచబోతున్నట్టు కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలకి రెండు సంవత్సరాలు సమయం వున్నా కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ ఉత్తర్ కుమార్ రెడ్డి బ్యాచ్ చేస్తున్నట్టు కనిపించటం లేదు. పైగా ఈ మధ్య కాంగ్రెస్ వారికి సహజమైన అంతర్గత పోరుతో వార్తల్లో నిలిచారు! ఒకవైపు ఉత్తమ్ తన సర్వే తాను చేయించుకుని 55సీట్లు ఖాయమని ప్రచారం చేయించారు. దానిపై మండిపడాల్సిన గులాబీ పార్టీ కంటే ఎక్కువగా చెలరేగిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గొడవ మనకు తెలియంది కాదు. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ అయిన రోజు నుంచీ వెంకట్ రెడ్డి తిరుగుబాటు చేస్తూనే వున్నారు. తాజా సర్వేలో కూడా తన ప్రాంతమైన నకిరేకల్ లో కాంగ్రెస్ ఓడుతుందని ఉత్తమ్ వర్గం అనటం ఆయనకి విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే మీడియా ముందుకొచ్చి గడ్డాలు, మీసాలు పెంచితే కాంగ్రెస్ గెలవదని కుండ బద్ధలు కొట్టాడు!   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... ఉత్తమ్ మీద కోపంతో గడ్డాలు, మీసాలు వేస్ట్ అని వుండవచ్చు కాని... అది నిజం కూడా! కేసీఆర్ లాంటి అపర చాణుక్యుడి ధాటికి తట్టుకుని అధికారంలోకి రావాలంటే చాలా తెలివితేటలు, ఐకమత్యం, పట్టుదల అన్నీ వుండాలి. తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటివేం ఇప్పటికైతే పొడసూపటం లేదు. ఉత్తమ్ , కోమటిరెడ్డి వర్గాలు కొట్టుకుంటుంటే సీనియర్లు దాదాపూ మౌనం వహించేశారు. యథా ప్రకారం ఢిల్లీలో మోదీ దెబ్బకు అల్లాడుతున్న హైకమాండ్ కు విషయమంతా చేరవేశారు. వాళ్లు తెలంగాణ కాంగ్రెస్ రచ్చపై దృష్టి పెట్టేది ఎప్పుడు? పరిష్కారం చూపేది ఎప్పుడు? అంతలోపు ఇక్కడ టీఆర్ఎస్ ను అడ్డుకునేది ఎవరు?   ఒక్కొక్కటిగా చేజారుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణను కూడా కలపొద్దనుకుంటే కాంగ్రెస్ హైకమాండ్ అర్జెంట్ గా తెలంగాణ శాఖని ప్రక్షాళన చేయాలి. అందరికీ అమోదయోగ్యమైన బలమైన నేతని సారథిగా నియమించాలి. లేదా వున్న లీడర్ నే అందరూ ఫాలో అయ్యేలా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప కాలయాపన చేస్తే ఆంధ్రాలో లాగే తెలంగాణలో కూడా ఖాళీ చేయి మిగలటం పెద్ద సుదూర విషయమేం కాదు... హస్తం పార్టీకి!  

ఇక పై కర్ణాటక జైలు నుంచీ తమిళనాడు పాలన!

  తమిళనాడు అసెంబ్లీ గొడ్ల సంతలో పళని స్వామి నెగ్గాడు! కర్ణాటక జైల్లో కూర్చున్న డాన్ శశికళ కూడా నెగ్గింది! చినిగిన చొక్కాతో మీడియాకి దర్శనం ఇచ్చిన స్టాలిన్ కూడా తాను ఆశించిన విధంగా నెగ్గాడనే చెప్పాలి! మధ్యలో పన్నీర్ సెల్వం బృందం కూడా సానుభూతి పొందటంలో బాగానే నెగ్గింది! మరిక ఓడింది ఎవరు? జనం! అవును... వాళ్లు జయలలిత ముఖం చూసి ఓటు వేశారు! అమ్మ కోసం అధికారం అప్పజెబితే ఇవాళ్ల చిన్నమ్మ మనుషులు దౌర్జన్యంగా సీఎం సీటు కబ్జా చేశారు! కాని, విషాదం ఏంటంటే... ప్రజాస్వామ్యం అంటే ఇదే! మరో నాలుగేళ్ల దాకా ఇంకేం లేదు...   పన్నీర్ ముందు ముందు చేయబోయే పోరాటం ఫలించిగాని... స్టాలిన్ వేసే ఎత్తులు వర్కవుట్ అయ్యిగాని... మధ్యంతర ఎన్నికలు వస్తే.. అప్పుడు జనం తమ అభిప్రాయాన్ని ఓట్లు రూపంలో చెప్పవచ్చు. అలా ఏం కాకపోతే మాత్రం తమిళనాడు ప్రజలకి ఇష్టం వున్నా లేకున్నా పళని స్వామిని , ఆయన నెత్తిన కూర్చుని పరిపాలించే జేజేమ్మ శశికళని భరించాల్సిందే! అసెంబ్లీలో బలపరీక్ష తరువాత చెన్నైలో ఇదీ పరిస్థితి!   అసెంబ్లీ మొత్తం స్పీకర్ ఆధీనంలో వుంటుంది. అందుకే, స్పీకర్ నిష్పక్షపాతంగా వుండాలి. కాని, అధికార పక్షానికి చెందే ఏ స్పీకర్ కూడా తన పార్టీకి మంచి చేసుకోకుండా అపోజిషన్ కి మేలు చేస్తాడా?   తమిళనాడు అసెంబ్లీలో కూడా అదే జరిగింది. ఆయన ఆడియో, వీడియో రికార్డింగ్స్ లేకుండా సీక్రెట్ బ్యాలెట్ పెట్టకుండా బల పరీక్ష అన్నాడు. అంటే, బల్లలు చరచటం, చేతులు పైకెత్తటం లాంటి వాటితో ఓటింగ్ జరిపేస్తారన్నమాట! అలా చేస్తే ఇక పళని స్వామి గెలుపు ఎలాగూ అనివార్యమే! అందుకే, పన్నీర్ కి మద్దతుగా నిలిచిన డీఎంకే బ్యాచ్ రెచ్చిపోయింది. ఏకంగా స్పీకర్ ని పక్కకు తోసి ఆ సీట్లో ఓ డీఎంకే ఎమ్మెల్యే కూర్చున్నాడు కూడా! ఇదంతా చూసి మనం షాకవుదామా అంటే... అంత శ్రమ అక్కర్లేదనే చెప్పుకోవాలి! కారణం... రాజకీయాల్లో నేతల రూపంలో చెలామణి అవుతోంది రౌడీలు, గూండాలేనని మనలో ఎవరికి మాత్రం తెలియదు! చిన్న చిన్న మున్సిపల్ సమావేశాల్లో కార్పోరేటర్లు కొట్టుకోవటం మొదలు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేల దాకా ఎక్కడ చూసినా ఇదే వ్యవహారం! తమిళనాడు అసెంబ్లీ దీనికి అతీతం కాదుగా...   డీఎంకే వారు స్పీకర్ ని అవమానించటం, స్టాలిన్ అనుచరుల్ని పళని స్వామి వర్గం గాయపరచటం... ఇదంతా ఒక్క రోజు డ్రామానే! అసలు సినిమా అంతా ఇక ముందు వుంటుంది. మరో రాష్ట్రంలోని జైల్లో కూర్చున్న ఒక అవినీతి ఆరోపణలతో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ... తమిళనాడు ముఖ్యమంత్రిని శాసిస్తుంది. ఆమె తాలూకూ మన్నార్ గుడి మాఫియా రాష్ట్రాన్ని ఏలుతుంది. అయినా జనం చేయగలిగింది ఏమీ లేదు! ఎందుకంటే, మన దేశ ఓటర్లు ఎన్నికలప్పుడు నాయకుడ్ని చూసి కాకుండా వారిచ్చే ఉచిత హామీల్ని విని, వాళ్ల కులం, మతం చూసుకుని ఓటు వేస్తారు! వ్యవస్థలో అక్కడ వున్న లోపమే ఇన్ని అరాచకాలకీ కారణం....

కొన్ని ప్రోగ్రామ్స్... 'ఇడియట్' బాక్స్ పేరు నిలబెడుతున్నాయా?

  సినిమా అయితే వారానికో, నెలకో ఒకసారి చూస్తాం. అదీ మనకు ఇష్టం వుంటే టికెట్ కొనుక్కుని మన విచక్షణతో, విజ్ఞతతో తిలకిస్తాం. కాని, టీవీ అలా కాదు. ఒక్కసారి రిమోట్ తీసుకుని బటన్ నొక్కామంటే న్యూస్ నుంచి న్యూసెన్స్ వరకూ అన్నీ వచ్చి మీద పడిపోతాయి. ఇష్టం వున్నా లేకున్నా అలా చూసేస్తూ వుండాల్సి వస్తుంది. పైగా సకుటుంబ సపరివారంగా...   టీవీ ప్రభావం సినిమా, పేపర్లు, ఇంటర్నెట్ అన్నిటికంటే ఎక్కువ. అయినా కూడా ఛానల్స్ లో వచ్చే కంటెంట్ పై ఎలాంటి నియంత్రణ, సెన్సార్ ఫిప్ వుండదు. అదే రాను రాను పెద్ద సమస్యగా మారుతోందా? అవుననే కోర్టు కూడా అభిప్రాయపడింది! జబర్దస్త్ కామెడీ షో విషయంలో ఒక కేసు నమోదు కావటంతో ఆ కార్యక్రమ జడ్జ్ లు నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రేష్మి వంటి వారంతా నోటీసులు అందుకున్నారు. వాటిపై వాళ్లు హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది!   జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చదవుకున్న వారు, చదువుకోని వారు అందరూ చూస్తారనీ... వాటి వల్ల అందులో చూపేది అంతా నిజమేనని భ్రమపడే అవకాశం వుందని కోర్టు అభిప్రాయపడింది. ఒక స్కిట్ లో న్యాయ వ్యవస్థను అవమానించారని పిటీషనర్ కేసు వేయగా దాన్ని సవాలు చేస్తూ నాగబాబు తదితరలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారు కోరినట్టు కేసునైతే కొట్టి వేసిందిగాని టెలివిజన్ కార్యక్రమాలకు కూడా నియంత్రణా మార్గదర్శకాలు వుండాలని పేర్కొంది.   కామెడీ కోసం రూపొందించే కార్యక్రమాలు ఈ మధ్య చాలా సార్లు వివాదాస్పదం అవుతన్నాయి. కొన్ని సార్లు కుల సంఘాలు ఆగ్రహానికి గురైతే చాలా సార్లు మహిళల పట్ల ఈ వినోద కార్యక్రమాల తీరు దారుణంగా వుంటోందని అంటున్న వారు చాలా మంది వుంటున్నారు. గతంలో ఒకసారి ఒక కమెడియన్ మీద భౌతిక దాడి జరిగిన సంఘటన కూడా తెలిసిందే!   టీవీకి ఇప్పుడైతే ఎలాంటి నియంత్రణా లేనప్పటికీ ముందు ముందు తగిన మార్గదర్శకాలు జారి చేస్తే బావుంటుంది. ఎందుకంటే, చిన్న పిల్లల నుంచీ ముసలి వారి దాకా అందరూ కలిసి చూసే టీవీ సినిమాల వంటి వాటికన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానిపై మేధావులు, ప్రభుత్వం, ఇతర సంస్థలు దృష్టి పెట్టాలి...  

అప్పుడే తలైవాని ముఖ్యమంత్రిని చేసేస్తోన్న తమిళ జనం!

  జయలలితని తమిళనాడు జనం గర్వంగా ఏమని పిలిచే వారో తెలుసుగా... పురుచ్చి తలైవీ! తలైవీ అంటే నాయకురాలు అని అర్థం! మరి జయ తలైవీ అయితే ... తలైవా ఎవరో తెలుసుగా... రజినీకాంత్! ఆయనని ఇంత కాలం కోలీవుడ్ తలైవాగా భావించే వారు ఫ్యాన్స్! అంటే , తమిళ సినిమా ప్రపంచానికి మకుటం లేని మహారాజు అని వాళ్ల ఫీలింగ్! కాని, తాజాగా తలైవీ జయలలిత నిష్క్రమణతో తమిళనాడు అల్లకల్లోలం అయిపోయింది. పన్నీర్, శశికళ, పళని అంటూ రోజుకో పేరు హల్ చల్ చేస్తోంది చెన్నై రాజకీయాల్లో. మరి ఈ అనిశ్చితికి పరిష్కారం ఏంటి?   ఒకవైపు అసెంబ్లీలో పళని స్వామి మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెంట వున్నారని చెబుతున్నాడు. మరో వైపు పన్నీర్ తనకూ మద్దతుందని గొంతు చించుకుంటున్నాడు. డీఎంకే సారథి స్టాలిన్ అయితే మధ్యంతరం వచ్చేస్తే బావుండునని కాచుకుని కూర్చున్నాడు. ఇన్నిటి మధ్యా తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది తలైవా పైనేనట! కేవలం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకోవటమే కాదు పోస్టర్లు ప్రింట్ చేసి గోడల మీదకి ఎక్కించేస్తున్నారు. తళతళ మెరిసే ఖద్దరు పంచె, షర్టుతో తలైవా ముఖ్యమంత్రిగా నడుస్తోంటే ఆయన వెనుక జెడ్ ప్లస్ సెక్యురిటీ ఫాలో అవుతున్నట్టు పోస్టర్లు వేశారు! నెక్ట్స్ సీఎం రజినీకాంతేనని కూడా వాటిపై రాశారు!   అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో పళని స్వామి గెలవటం పెద్ద కష్టమేం కాదు. కాని, కర్ణాటక జైలు నుంచి తమిళనాడును ఏలటం చాలా మంది తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి శశిలాగే జయ జైలుకి వెళ్లి వుంటే ప్రజాగ్రహం తీవ్రంగా వుండేది. ఎన్ని బస్సుల అద్దాలు పగిలేవో ఎవరమైనా ఊహించవచ్చు. కాని, చిన్నమ్మ జైలుకి వెళితే జనం ఏ మాత్రం ఆగ్రహానికి లోను కాలేదు. అంటే, ఒక విధంగా ఆమెను జయలలిత అభిమానులు కూడా ఇష్టపడుతున్నట్టు కనిపించటం లేదు. కాబట్టి శశికళ ఆశీర్వాదంతో పరిపాలించనున్న పళని స్వామిది మూణ్ణాళ్ల ముచ్చటే అంటున్నారు కొందరు విశ్లేషకులు. అదే జరిగి మధ్యంతరం అనివార్యం అయితే బీజేపి బలంతో తలైవా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే అవినీతి మరకలు పడ్డ డీఎంకే పైన కూడా తమిళులకి పూర్తి నమ్మకం లేదు కాబట్టి!   ఇంతకీ జనం కోరుకుంటున్న విధంగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా? ఒక సారి జయ తాలూకూ రోబోగా పన్నీర్, మరోసారి శశికళ తాలూకూ రోబోగా పళని... ఈ రోబోల పాలనకి వెండి తెర రోబో ముగింపు పలుకుతాడా? ఇవీ కాలమే సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు! కాని, నిజంగా సీఎం అవ్వదలుచుకుంటే.. అంతటి సత్తా వున్న గ్లామర్ గాడ్ మాత్రం రజినీయే! ఇక ముందు ముందు ఇండియాలో సినిమా స్టార్స్ కు సీఎంలు అయ్యే ఛాన్స్ లు కష్టమే! అలాంటి ఫాలోయింగ్ వున్న సూపర్ స్టార్స్ ఈ తరంలో ఏ సినిమా రంగంలోనూ వచ్చిన దాఖలాలు లేవు...

7ఏళ్ల పాప గూగుల్లో జాబ్ కావాలంది! మరి సుందర్ పిచై ఏమన్నాడు?

  గూగుల్ కంపెనీలో జాబ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు చెప్పండి? ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు! కాని, ఆ అమ్మాయి తనకి గూగుల్ లో పని చేయాలని వుందంటూ ఉత్తరం రాసింది. దానికి ఏకంగా గూగుల్ సీఈవో, మన సుందర్ పిచై స్పందించాడు! ఆయన జాబ్ కావాలన్న ఆ అమ్మాయితో ఏమన్నాడో తరువాత తెలుసుకందాం కాని... అసలు ఉద్యోగం అడిగిన ఆ గడుసరి ఎవరో తెలుసా? క్లోయ్ బ్రిడ్జ్ వాటర్ అనే ఏడేళ్ల బ్రిటీష్ గడుగ్గాయ్! ఆ వయస్సులోనే తనకు గూగుల్ లో ఎంప్లాయిగా చేరాలని వుందంటూ కోరిక బయటపెట్టింది. అందుకు, తన స్వహస్తాలతో లేఖ రాసిన గూగుల్ సీఈవో సుందర్ ఎంతో సుందరంగా స్పందించాడు!       క్లోయ్ బ్రిడ్జ్ స్టోన్ ఏడేళ్ల పాప. బ్రిటన్ లోని హెర్ ఫోర్ట్ నగరంలో వుంటోంది. అయితే, తనకు తండ్రి కొనిచ్చిన ట్యాబ్లెట్ చూసి తెగ మురిసిపోయింది. దాంట్లో కనిపించిన స్లైడ్స్ క్లోయ్ కి భలే నచ్చేశాయి. వాటన్నిటికీ మూలం గూగుల్ అని తెలుసుకున్న క్లోయ్ తన స్వదస్తూరీతో ఒక లెటర్ రాసింది. డియర్ గూగుల్ బాస్... అంటూ సుందర్ పిచైను సంబోధించిన ఆ పాప తరువాత తన ఇష్టాలు, కోరికలు అన్నీ చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడూ స్విమ్మింగ్ చేసే తాను భవిష్యత్ లో ఒలంపిక్స్ కి వెళ్లి సత్తా చాటుతానని చెప్పింది. అలాగే, గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేయటం తన లక్ష్యమని క్లోయ్ ప్రకటించింది.   ఏడేళ్ల పాపకి గూగుల్ గురించి ఎలా తెలిసింది అనే డౌట్ రావటం సహజమే. గూగుల్ కార్పోరేట్ ఆఫీస్ ఇమేజెస్ చూసి ముచ్చటపడిన ఆ అమ్మాయికి తండ్రి ఓ సారి గూగుల్ లో పని చేయటం బావుంటుందని చెప్పాడట. అప్పట్నుంచీ అక్కడ ఉద్యోగం చేయాలని కలలు కంటోంది. ఆ చిన్నారిని ఎంకరేజ్ చేయటానికి తండ్రి యాండీ బ్రిడ్జ్ స్టోన్ ఓ గూగుల్ సీఈవోకి ఓ లెటర్ రాయమన్నాడు. వెంటనే తనకు వచ్చిన భాషలో, భావంతో లెటర్ రాసేసింది క్లోయ్ బ్రిడ్జ్ స్టోన్. దాన్ని అందుకున్న సుందర్ పిచై లైట్ గా తీసుకోక తన బిజీ షెడ్యూల్ లో కాస్త సమయం వెచ్చింది రిప్లై రాశాడు. స్వయంగా ఆయన సైన్ చేసిన లేఖలో బాగా చదువుకుని గూగుల్ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేస్తే తప్పక జాబ్ ఇస్తామని చెప్పాడు! అంతే కాదు, క్లోయ్ కోరుకున్నట్టు ఒలంపిక్స్ కి వెళ్లాలని ఆకాంక్షించాడు!     సుందర్ పిచై సైన్ చేసిన లెటర్ రావటంతో అటు కూతురు, ఇటు తండ్రి ఇద్దరూ ఉబ్బితబ్బిబైపోయారు! నెట్లో కూడా ఆ చిన్నారి రాసిన లేఖ, సుందర్ పిచై రాసిన లెటర్ రెండూ వైరల్ అయ్యాయి!  

పన్నీర్ రనౌటేనా... థర్డ్ అంపైర్ మోదీ, రక్షిస్తాడా?

  పన్నీర్ సెల్వం కథ కంచికేనా? జయమ్మ ముఖ్యమంత్రి అవ్వమనగానే మూడు సార్లు సీఎం అయ్యాడు. చిన్నమ్మ దిగిపోగానే బుద్ధిగా రాజీనామా చేశాడు. కాని, అంతలోనే ఎదురు తిరిగాడు. అమ్మ ఆత్మ సందేశం ఇచ్చిందంటూ శశికళ ముఖంలో కళ లేకుండా చేశాడు. ఆమె సీఎం ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ చేశాడు! కాని, ఇప్పుడు జైల్లో సాధారణ ఖైదీలా కఠిక నేల మీద కాలం గడుపుతోన్న చిన్నమ్మకి పెద్ద సినిమానే చూపిన పన్నీర్ తాను మాత్రం సాధించుకున్నది ఏం లేదు! పళని స్వామి క్యాబినేట్ లో బెర్త్ కాదు కదా... అసలు పార్టీలోనే చోటు లేకుండా పోయింది! ఇదంతా పన్నీర్ అమాయకత్వమా? లేక అత్యాశా? లేక ఇంకేదైనా దూర దృష్టా? పైపైన చూస్తే పన్నీర్ సెల్వం ప్రస్తుతానికి ఓడిపోయినట్టే. తనంత తానుగా రాజీనామా చేసి, శశికళను అడ్డుకుని, చివరకు పళని స్వామి ముందు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాని, 1969లో 18ఏళ్ల వయస్సు నుంచీ పన్నీర్ రాజకీయం చేస్తూనే వున్నాడు. పెరియార్ నుంచి జయ దాకా ఎంతో మంది తమిళ మహా మహా నేతల్ని చూశాడు. కరుణానిధి పార్టీలో పని చేసి ఎంజీఆర్ వెంట నడిచి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాడు. అదృష్టం కొద్దో, అర్హత వుండటం వల్లో మూడు సార్లు సీఎం అనిపించుకున్నాడు. ఇంత అనుభవం వున్న వాడు ఈసారి శశికళకి తెలిసి తెలిసి ఎందుకు ఎదురు తిరిగాడు? పన్నీర్ కి తన వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు రారు అని తెలియదా? తెలిసే వుండాలి. ఆయన పార్టీలో ఆయనకి ఎంత మద్దతు లభిస్తుందో ఆయనకి తెలియకుండా వుంటుందా? ఖచ్చితంగా ఒక అంచనా వుంటుంది. కాబట్టి తాను సీఎంగా కొనసాగుతానని ఆయన భ్రమపడి వుండకపోవచ్చు. మూడు సార్లు సీఎం పదవి ఏ గొడవా చేయకుండా వదిలేసిన ఆయన దాని కోసం మరీ కక్కుర్తిపడతాడని కూడా అనలేం!   పన్నీర్ సెల్వం వెనుక కేంద్రం, బీజేపి వున్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే, ఆయన చిన్నమ్మకి దారిచ్చి తప్పుకున్నవాడు అమాంతం అడ్డుపడ్డాడు. అయితే, ఎంతో రిస్క్ చేసి మన్నార్ గుడి మాఫియాకి శత్రువుగా మారిన పన్నీర్ మోదీ నుంచి పొందిన అభయం ఏమై వుంటుంది? ఢిల్లీ ప్రభుత్వం ఎవరి చేతిలో వుంటుందో వారి చేతిలో పవర్ కి కొదవ వుండదు. కాబట్టి పన్నీర్ భద్రత మోదీ సర్కార్ తీసుకుంటుంది. అలాగే, ఆయనతో వెంట వచ్చిన వారితో కలిసి కొత్త పార్టీ పెట్టవచ్చు. ఆ పార్టీ సాయంతో తమిళనాడులో కమలం వికసించాలని ప్రయత్నించవచ్చు. ఇది ఎవ్వరైనా అంగీకరించేదే. అలాగే, పన్నీర్ సెల్వమ్ కూడా తమిళనాడులో బీజేపికి చేసిన పాయానికి ప్రతిఫలంగా కేంద్రంలో ఏదైనా మేలు పొందవచ్చు!   పన్నీర్, బీజేపి కాంబినేషన్ లో ఇప్పటికైతే ఎక్కడా రజినీకాంత్ కనిపించటం లేదు కాని... ఆయన ఏ క్షణంలో అయినా తమిళనాడు పొలిటికల్ సీన్లో ఎంటర్ అవ్వచ్చు! పురుచ్చి తలైవీ నిష్క్రమణం తరువాత భారీ శూన్యం ఏరపడింది తమిళనాట. కలైంగర్ కూడా మంచం పట్టి మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాడు రజినీకాంత్ కి. ఆయన ఒకవేళ రాజకీయాల్లోకి రాదలుచుకుంటే ఇంతకంటే గొప్ప అవకాశం వుండదు. పై నుంచి మోదీ రక్షణలో , శశికళ జైల్లో వున్న వేళ, కరుణానిధి హాస్పిటల్ కే పరిమితమైనప్పుడు, జయ మరణంతో జనం అయోమయంలో వున్నప్పుడు ... సూపర్ స్టార్ కి సూపర్ ఛాన్సే! అది ఆయన వాడుకుంటాడా అన్నదే పెద్ద ప్రశ్న!   రజినీకాంత్ ని బీజేపి ఒకవేళ రాజకీయాల్లోకి తీసుకు రాగలిగితే పన్నీరుకి, ఆయన వర్గానికి అంతకంటే కావాల్సింది ఇంకేం వుండదు! రజినీకాంత్ కు దగ్గరైపోయి పన్నీర్ అత్యంత కీలకంగా మారవచ్చు! చక్రం తిప్పవచ్చు! అయితే, ఇదంతా ఇప్పటికైతే అద్భుతమైన ఊహే! నిజమయ్యే అవకాశాలు ఎంతగా వున్నాయో.. అంతకంటే ఎక్కువగా లేవు కూడా!   పన్నీర్ సెల్వం మూర్ఖంగా శశికళని ఢీకొట్టి రాజకీయ జీవితం పాడు చేసుకున్నాడని వాదించే వారు మాత్రం ఇంకా కొన్నాళ్లు ఆగి మాట్లాడితేనే బెటర్! ఎందుకంటే, పన్నీర్, పళని చెన్నైలో ఏం చేస్తారనే దాని కన్నా ... రాబోయే కాలంలో మోదీ, శశికళ ఢిల్లీ, బెంగుళూరుల్లోంచి ఏం చేస్తారనేదే కీలకం!

పళనిస్వామి వస్తే ఏం లాభం?

  ఎట్టకేళకు తమిళనాడు రాజకీయాలకు కాస్త కొలిక్కి వచ్చాయి. శశికళ వీరవిధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ గవర్నరు ఆహ్వానించడంతో ఆ కుర్చీకి కొత్త కళ వచ్చింది. సచివాలయానికి చేరుకుందామనుకున్న శశికళ సెంట్రల్‌ జైలుకి చేరుకోవడంతో.. ముఖ్యమంత్రి పీఠం మీద ఆసక్తి నెలకొంది. ఈ వివాదం మీద ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరిస్తున్నా గవర్నరు న్యాయనిపుణుల సలహాతో ఇప్పుడు ఇహ పళనిగారిని ఆహ్వానించక తప్పలేదు.   తమిళ రాజకీయాలలో పళనిస్వామిది ఓ ప్రముఖ పాత్ర. ఎంజీఆర్‌ చనిపోయిన తరువాత జయకి అండగా నిలిచిన అతికొద్దిమంది నేతలలో పళని ఒకరు. అలా అన్నాడీఎంకేలో ఆయనది దాదాపు 30 ఏళ్ల ప్రస్థానం. రైతు కుటుంబంలో జన్మించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వంలోనే ఎన్నదగిన నేతలలో ఒకరుగా నిలిచేవారు. ప్రస్తుతానికి రహదారులు, నౌకాయానాల శాఖ మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. ఇంత అనుభవం ఉంది కాబట్టి తమిళమార్కు రాజకీయాలలో పళని పండిపోయారని ఒప్పుకోక తప్పదు.   నిజానికి జయలలిత చనిపోయిన వెంటనే ఆ స్థానంలో పళనిస్వామిని కూర్చోపెట్టాలని శశికళ భావించారు. అయితే అత్యధిక శాసనసభ్యులు దీనికి నిరాకరించడంతో పన్నీర్‌ను నిలబెట్టక తప్పింది కాదు. తనకి దక్కని ముఖ్యమంత్రి పదవి శశికళకైనా దక్కాలని పళని చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి పదవి అంటే ఏమాత్రం ఆశ లేదని చెప్పిన శశికళను అదే పదవి కోసం వెంపర్లాడేలా ఎగదోశారు. ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా గోల్డెన్‌ బే రిసార్టులకు తరలించడంలోనూ ఆయనది ముఖ్యపాత్రని చెబుతారు. ఊహించని రీతిలో ఇప్పుడు శశికళ చిప్పకూడు తినక తప్పకపోవడంతో, ఆమెకు తోడుగా నిలిచిన పళని తెర మీదకు వచ్చాడు. తన బదులు పళనిని ముఖ్యమంత్రి పీఠం మీద నిలపడంలో అటు శశికళ పంతమూ నెగ్గినట్లయ్యింది.   నిజానికి తమిళనాట రాజకీయాలు ఎప్పుడోనే బ్రష్టుపట్టిపోయాయి. ద్రవిడ ఉద్యమంతో తమిళజాతిని తలెత్తుకునేలా చేసిన నాయకుల వారసులు ఇప్పుడు వ్యక్తిగత పూజలందుకునేందుకు తొందరపడుతున్నారు. అవినీతి, కుటుంబ పాలన, ఆడంబరం, కుతంత్రాలు, హత్యారాజకీయాలతో అక్కడి నేతలు ఎప్పుడోనే నీతులు తప్పారు. మరి ఆ తరహా రాజకీయాలకు పళనిస్వామి ఏ రంగు పులుముతారో చూడాలి. జైల్లో ఉన్న శశికళ మనసుని ఎరిగి ఆమె కనుసన్నలలోనే నడుచుకుంటారా? తనదైన శైలిలో విచక్షణాయుతంగా పాలన సాగిస్తారా? మిగిలిన పాలనాకాలాన్ని తూతూమంత్రంగా లాగించేస్తారా? అన్న ప్రశ్నలకు త్వరలోనే ఓ జవాబు రానుంది.   ఒకటి మాత్రం నిజం! మురికిపట్టిన తమిళరాజకీయాలు మళ్లీ కోలుకోవాలంటే చాలాకాలమే పడుతుంది. అది తమిళుర చేతుల్లోనే ఉంది. సాధారణంగా తమిళురకు స్వాభిమానం ఎక్కువ. తమ భాషని కాపాడుకునేందుకు వారు ఉద్యమిస్తారు, జల్లికట్టు వంటి ఆచారాన్ని కాపాడుకునేందుకూ వారు ఉద్యమిస్తారు. మరి తమ నేతల విషయంలో ఎందుకని వారు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నట్లు? స్వాభిమానం ఉన్నచోట శృతిమించిన వ్యక్తిపూజలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్నలు కనుక వారిలో మెదిలితే తమిళనాట మార్పు రాక మానదు!!!

నిస్సిగ్గుగా అవినీతి..

  ఒకప్పుడు జైలుకి వెళ్లినవారిని సమాజం వింతగా చూసేది. జైలు నుంచి తిరిగివచ్చినా కూడా వారిని జనజీవనంలో చేర్చుకునేవారు కాదు. మరీ ఇంతటి పక్షపాతం కాస్త బాధాకరమే అయినా... తప్పు చేసిన మనిషిలో ఎలాగైనా పశ్చాత్తాపాన్ని రగిలించాలన్నదే కారాగారాల ఉద్దేశం. కానీ ఇప్పుడో! పరిస్థితులు మారిపోయాయి. జైలుకి వెళ్లినవాడు అదేదో ఉత్సవానికి బయల్దేరినట్లుగా కోలాహలంగా బయల్దేరుతున్నాడు. అక్కడి నుంచే తనకు కాగల కార్యాలన్నింటినీ చక్కబెట్టుకుంటున్నాడు. ఇక తిరిగి వచ్చిన తరువాత ఏదో రాచకార్యం మీదనో, స్వాతంత్ర్య ఉద్యమంలోనో పాల్గొని వచ్చినవాడిలా రొమ్ము విరుచుకుని తిరుగుతున్నాడు. తాజాగా తమిళుర చిన్నమ్మ శశికళ ప్రవర్తనే ఇందుకు ఓ ఉదాహరణ.   బెంగళూరు సెంట్రల్ జైలులో గడపవలసిన శశికళ ఓ నాలుగేళ్లకు సరిపడా డ్రామాను రంగరించి బయల్దేరారు. వేదనిలయాన్ని జాగ్రత్తగా చూసుకోమంటూ అప్పగింతలను అందించి, జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ టీవీ ఛానళ్లకు కనువిందు చేసేలా వీరశపథాలు చేసి, సమాధిలోని జయలలితను ఓ మూడుసార్లు తట్టారు. ఈ వీధిభాగోతాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు రోడ్డు మార్గం గుండా బెంగళూరుకి పయనమయ్యారు. అలాగని పోనీ శశికళమ్మ, జయలలిత ఆశయాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారా అంటే అదీ లేదయ్యే! వెళ్తూ వెళ్తూ జయ ఈసడించి పార్టీ నుంచి వెళ్లగొట్టిన తన బంధువు దినకరన్‌కు పార్టీ బాధ్యతలను అప్పగించారు.   అక్రమ ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం మొట్టికాయలు వేసి మరీ జైలులోకి నెట్టిన విషయం ప్రపంచమంతా గ్రహించింది. కానీ ఇదేదో వీరపోరాటంలా శశికళ బిల్డప్‌ ఇవ్వడం ఏమిటి? దానికి జనం హోరుమంటూ ఆమెకు మద్దతుగా నిలవడం ఏమిటి? ఆఖరికి శశికళ జైలుకి వెళ్లినా కూడా ఆమె మాటే చెల్లుబాటయ్యేలా, ఆమె విధేయుడైన పళిని ముఖ్యమంత్రి కావడం ఏమిటి? ఇదంతా చూస్తుంటే లోపం ఎవరిలో ఉందో అన్న మీమాంస మొదలవ్వక తప్పదు.   రాజకీయాలు మనకెందుకని మనం ఎప్పుడైతే వాటికి దూరంగా ఉన్నామో, ఎందుకూ పనికిరానివారంతా అందులోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. సహజంగానే ఇలాంటివారిలో నైతిక విలువలు ఉంటాయని ఆశించడం కష్టం. కాబట్టి జనం కూడా రాజకీయాలలో అవినీతి సహజమే అన్న దృక్పథంతో నిండిపోయారు. ఫలితంగానే మనం చూస్తున్న భాగోతాలు! పనికిమాలిన నాయకులు ప్రజల కోసం కాకుండా కేవలం అధికారంలోకి రావడం కోసమే ప్రయత్నించడం. అలా అడ్డదారినా, దొడ్డిదారినా, డబ్బుదారినా అధికారంలోకి వచ్చిన తరువాత అందినంత మేరా దోచుకోవడం ఓ క్రతువులా మారిపోయింది. ఒకవేళ తాము చేసిన అవినీతి బయటపడి, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చినా... పెద్దగా సిగ్గుపడాల్సిన పనిలేకుండా పోయింది. ఏదో ఒకసారి అవినీతి చేస్తే బాధపడాలి కానీ, అసలు అవినీతే జీవిత విధానం అయితే అందులో మనస్సాక్షికి చోటేముంటుంది. దాంతో అలాంటి నాయకులని చూసీ చూసీ అలవాటైపోయిన జనం కూడా వారికి జేజేలు పలకడం మొదలుపెట్టారు.   తమిళనాట జయమ్మ అయినా, తెలుగునాట జగన్‌ అయినా ఇదే కథ! కాకపోతే ఈసారి న్యాయస్థానాలు కాస్త ఘాటుగా ప్రవర్తించడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. మరి ఆ న్యాయస్థానాలు కడదాకా తమ మాట మీద నిలబడి అవినీతిపరుల తాట ఒలుస్తాయా లేదా అన్నదే వేచిచూడాల్సిన విషయం. అదే కనుక సాధ్యమైతే మన ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చినట్లే!

దత్తత...ఇన్సూరెన్స్.. ఓ మర్డర్

ఇంట్లో అన్ని ఉన్నా చిన్నారుల బోసినవ్వులు, బుడిబుడి నడకలు లేకుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పిల్లలు పుట్టే అవకాశం లేని పక్షంలో దత్తత ద్వారానైనా ఆ ప్రేమను సొంతం చేసుకుంటారు కొంతమంది దంపతులు. మానవ సంబంధాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో డబ్బు కోసం తల్లిదండ్రుల ప్రాణాలని తీసే పిల్లలను చూస్తున్నాం..అయితే ఈ ఘటనలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గుజరాత్ నుంచి లండన్ వెళ్లిన ఆర్తి, కన్వల్‌జిత్ సింగ్ దంపతులు గోపాల్ అనే పిల్లవాడిని నితీష్ అనే మిత్రుడి ద్వారా దత్తత తీసుకున్నారు. అతని పేరిట 1.2 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు. దత్తతకు సహకరించిన నితీష్ కూడా లండన్‌లోనే ఉండి వీసా గడువు ముగియడంతో 2015లోనే గోపాల్‌తో సహా గుజరాత్ తిరిగివచ్చాడు.     ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8న గోపాల్‌ను వెంటబెట్టుకుని సొంత ఊరికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటర్‌ సైకిల్‌పై వచ్చి పిల్లవాడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి నిన్న తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు నితీష్‌ను తమదైన స్టైల్లో విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి.       అసలు ఆ ఎన్నారై దంపతులు గోపాల్‌ను దత్తత తీసుకున్నదే ఇన్సూరెన్స్ సొమ్ము కోసమని చెప్పాడు నితీష్..ఆ బాలుడిని కడతేర్చడానికి 2015 నుంచి ప్రయత్నించినట్లు..చివరికి 5 లక్షల రూపాయలకు కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకున్నామని వెల్లడించాడు..ప్లాన్‌లో భాగంగానే గోపాల్‌ను తీసుకుని రాజ్‌కోట్ బయలుదేరినట్లు తెలిపాడు.  తనపై అనుమానం రాకుండా ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లానని అసలు నిజాన్ని బయటపెట్టాడు . నితీష్‌ వాంగ్మూలంతో ఆ ఎన్నారై దంపతుల కిరాతకం వెలుగులోకి వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఎన్నారై దంపతులను ఇండి‌యా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

శశికళలో ఇంత కోపాగ్నియా..!

  నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు అన్న డైలాగ్ శశికళకు బాగా సూట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే నాకు సీఎం పీఠం దక్కకపోయినా పర్లేదు కానీ... పన్నీర్ సెల్వానికి మాత్రం సీఎం పదవి దక్కకుండా చేస్తానని చెప్పిన శశికళ ఇప్పుడు ఆ మాట నిజం చేసేందుకు ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. తనను దోషిగా తేల్చుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖిన్నురాలైన శశికళ.. ఆ తరువాత మాత్రం తనకు సీఎం పదవి దక్కకపోయినా పర్లేదు.. కానీ పన్నీర్ సెల్వంకు మాత్రం సీఎం పదవి దక్కనివ్వనని తన వర్గం ఎమ్మెల్యేల దగ్గర అన్నట్టు సమాచారం. ఇప్పుడు శశికళను చూస్తుంటే మాత్రం అది నిజం చేయకుండా ఉండేలా లేరు. ఇందుకు ఆమె మెరీనా బీచ్ వద్ద అమ్మ సమాధివద్ద శపథం చేయడం చూస్తుంటేనే అర్ధమవుతోంది.   సుప్రీంకోర్టు శశికళను వెంటనే లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో బెంగుళూరు సెషన్స్ కోర్టు ఎదుట లొంగిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోయెస్ గార్డెన్ నుండి బెంగుళూరు బయలుదేరారు. లొంగిపోయేముందు మెరీనా బీచ్ వద్ద అమ్మ సమాధి దగ్గర నివాళులు అర్పించడానికి వెళ్లిన శశికళ అక్కడ ఆవేశంతో శపథం చేశారు. ఇప్పుడు ఆమె శపథం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఎంతో నెమ్మదిగా.. ఎంతో సౌమ్యంగా కనిపించే శశికళలో ఇంత కోపం ఉందా.. ఇంత ఆగ్రహమా అని ఆశ్చర్యపోతున్నారు. నివాళులు అర్పించేప్పుడు రౌద్రంగా కనిపించిన శశికళ.. పెదవులు బిగబట్టి, ఆమె సమాధిపై బలంగా కొడుతూ, శపధాలు చేసిన తీరు అక్కడున్న అన్నాడీఎంకే నేతలను ఆశ్చర్య పరిచింది. ఆమె ఏమేమి శపథాలు చేశారన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ఒకటేనని, పన్నీర్ సెల్వంకు అధికారం దక్కకుండా ఉండటం, పార్టీ విడిపోకుండా తాను సూచించిన వారికి సీఎం పదవి దక్కడమేనని అర్థమవుతోంది. మరి జైలు నుండి శశికళ ఎన్ని ఎత్తులు వేస్తారో చూద్దాం..

జయహో ఇస్రో

పేదరికం, అవినీతి, కుటుంబపరిపాలన, కులం పిచ్చి, నిస్తేజమైన ప్రభుత్వ యంత్రాంగాలు, నిర్వేదాన్ని కలిగించే న్యాయవ్యవస్థ... భారతదేశం అన్న పేరు వినగానే చాలామందికి గుర్తుకువచ్చేవి ఇవే! ప్రత్యేకించి ఏమన్నా గొప్పగా చెప్పుకోవాలన్నా వేల సంవత్సరాల క్రితపు చరిత్రను భుజానికి ఎత్తుకోవాల్సిందే. కానీ మన దేశం గురించి చెప్పుకొనేందుకు ఏముంది అన్న బాధ కలిగిన ప్రతిసారీ... భారతీయులు తల ఎత్తుకునేలా చేసిన సంస్థ ఇస్రో.     ఇస్రో ఏర్పడి ఇప్పటికి దాదాపు 50 ఏళ్లు పూర్తికావస్తోంది. ఏదో మిగతా దేశాల్లాగా ఇండియా కూడా తూతూమంత్రంగా ఓ అంతరిక్ష సంస్థని ఏర్పాటు చేసిందిలే అని ప్రపంచమంతా భావించింది. కానీ 1975లోనే ఆర్యభట్ట పేరుతో తొలి భారతీయ ఉపగ్రహాన్ని నిర్మించింది ఇస్రో. వేల ఏళ్లనాటి మన విజ్ఞాన స్ఫూర్తి ఇంకా చెక్కుచెదరలేదని నిరూపించింది. అది మొదలు ప్రపంచాన్ని ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది.     దక్షిణాసియాలో సమాచార వ్యవస్థకు కొత్త అర్థాన్ని ఇచ్చిన INSAT ఉపగ్రహాలు (1983), ఉపగ్రహాలను సమర్థవంతంగా ప్రయోగించగల PSLV వ్యవస్థ, మన దేశానికి తనదైన నావిగేషన్‌ వ్యవస్థను అందించగల NAVIC ఉపగ్రహాలు... ఇలా ఏటికేడు ఇస్రో అందిస్తూ వచ్చిన అద్భుతాల జాబితా చాలా పెద్దదే. అరకొర సదుపాయాలతో, చాలీచాలని నిధులతోనే మంగళయాన్‌, చంద్రయాన్‌ వంటి భారీ ప్రణాళికలను సైతం సాకారం చేయగలిగారు.     ఇస్రో ఏదన్నా ప్రయోగాన్ని చేసిన ప్రతిసారీ... ప్రపంచంలో ఇది రెండోసారి, నాలుగోసారి అంటూ లెక్కలు వేసేవారు. కానీ ఈసారి ఇస్రో అంతకుమించిన అద్భుతాన్ని ఆవిష్కరించే సాహసం చేయనుంది. ఇప్పటివరకూ ఎవరూ సాధించని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వీటిలో మూడు ఉపగ్రహాలు మాత్రమే మనవి కావడం విశేషం. మిగతా ఉపగ్రహాలన్నీ ఇజ్రాయేల్‌, నెదర్లాండ్స్, స్విట్జర్‌లాండ్‌ వంటి దేశాలవి. ఇక ఏకంగా 96 ఉపగ్రహాలు అమెరికానుంచే వచ్చాయంటే మన ఇస్రో ప్రతిష్ట ఎంత ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేర్చడం ద్వారా ఇస్రో కావల్సినన్ని నిధులను కూడా సేకరించగలుగుతోంది.     ఒకవైపు విదేశీ ఉపగ్రహాలను చేరవేస్తూనే మరోవైపు మన దేశ అవసరాల కోసమూ మూడు ఉపగ్రహాలను పంపుతోంది ఇస్రో. వీటిలో Cartosat-2 అనే ఉపగ్రహం మన శత్రువుల కదలికలను గమనించగల అద్భుతమైన సాధనం. మరో రెండు ఉపగ్రహాలేమో క్లిష్టమైన నానో టెక్నాలజీ సాయంతో రూపొందించినవి. ఇలా ప్రయోగించే సంఖ్యలోనే కాదు, అందులో ఉన్న ఉపగ్రహాల విషయంలో కూడా ఈ ప్రయోగం కీలకమైనదే! ఇన్ని ఉపగ్రహాలనూ ఒక్కసారిగా మోసుకువెళ్లడం, వాటిని వేర్వేరు కక్ష్యలలో ప్రవేశపెట్టడం అంటే మామూలు విషయం కాదు. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రవేశపెట్టగానే ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. ఆ సంఖ్యని మించి ఉపగ్రహాలను పంపడం మరోసారి సాధ్యం కాదనుకుంది. కానీ భారత్‌ ఇప్పుడు అంతకు మూడురెట్ల అద్భుతాన్ని సాధించబోతోంది. ఇండియాలో మేధావులకు చోటు లేదనీ... కాస్తో కూస్తో బుర్ర ఉన్నవారంతా విదేశాలకు తరలిపోవాల్సిందే అని భ్రమించేవారి దిమ్మతిరిగేలా నిప్పులు చిమ్ముకుంటూ ఇస్రో అంతరిక్షంలో సరికొత్త అధ్యాయం సృష్టించబోతోంది.

ఇండియన్ సైంటిస్టులు... తెలుగు తీరంలో... 'సెంచరీ' కొడతారా?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ... ఈ పేరు మన దేశంలోని ఒక సంస్థది మాత్రమే కాదు! నూరు కోట్ల భారతీయుల గర్వకారణం! స్థాపించినప్పటి నుంచీ ఇస్రో సంధించిన రాకెట్ ఏదీ గగనంలోకి విజయవంతంగా దూసుకుపోకుండా వున్నది లేదు. ఒకటి రెండు వైఫల్యాలే తప్ప ప్రపంచంలో ఇంత అద్బుత విజయ పరంపర మరే పరిశోధనా సంస్థ ఇప్పటి వరకూ సాధించలేదు. ఇక ఇప్పుడైతే అమెరికా, రష్యాల అంతరి పరిశోధనా శాస్త్రవేత్తలకి కూడా విస్మయం కలిగించే సైంటిఫిక్ ఫీట్ చేయబోతున్నారు ఇండియన్ జీనియస్ లు!   ఒకటి రెండు కాదు.. ఏకంగా వందకు మించి ఉపగ్రహాల్ని ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో వారు! అంటే ఇండియన్ సైంటిస్టులు సాటిలైట్స్ సెంచరీ కొట్టనున్నారన్నమాట! ఇస్రో ఫిబ్రవరీ 15, 2017న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ తో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని భూమికి 500కిలో మీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టనుంది! 104 సాటిలైట్స్ లో కేవలం 3 మాత్రమే మన దేశానివి! 88 అమెరికాకు చెందినవి! మిగతావి ఇజ్రాయిల్, ఖజక్ స్తాన్, నెదర్లాండ్స్, యూఏఈ లాంటి దేశాలవి!   ఒకప్పుడు టెక్నాలజీ కోసం మనమెంతో ఆధారపడ్డ రష్యా, అమెరికాలకే ఈ రోజు మనం ఉపగ్రహాల్ని ఆకాశా వీధిలో అలంకరించి పెడుతుండటం చాలా పెద్ద విజయం. ఇంత గొప్పగా అంతరిక్ష విజయాలు మరే దేశం సాధించలేదు గత యాభై ఏళ్లలో. ఇజ్రాయిల్, చైనా లాంటి దేశాలు రేసులో వున్నా మన ఇస్రో అంత చౌకగా, ప్రతిభవంతంగా ప్రయగాలు చేయటం, అవ్వి విజయవంతం కావటం మరెక్కడా లేదు!   ఇస్రో చేస్తోన్న 104 ఉపగ్రహాల సాహసం విజయవంతం అయితే ప్రపంచంలోనే ఇన్ని సాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేసిన దేశం మనదే అవుతుంది! అమెరికా 29, రష్యా 37 సాటిలైట్స్ లాంచ్ చేయగలిగాయి. గత సంవత్సరం ఇస్రోనే 20 ఉప గ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టి సత్తా చాటింది! ఇప్పటి వరకూ ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ల సాయంతో 39సార్లు ప్రయోగాలు చేసింది. అందులో 37సార్లు మనం విజయవంతం అయ్యాం. ఒకసారి పూర్తిగా విఫలం కాగా మరొకసారి పాక్షిక విజయం మాత్రమే దక్కింది. అంటే, ఇస్రో చేసిన పీఎస్ఎల్వీ లాంచింగ్స్ 97శాతం సక్సెస్ అయ్యాయన్నమాట!    పీఎస్ఎల్వీ సాయంతోనే మన శాస్త్రవేత్తలు చంద్రయాన్, మంగళ్ యాన్ ప్రయోగాలు కూడా చారిత్రకంగా విజయవంతం చేశారు! బుధవారం మన శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న వంద ఉపగ్రహాలు కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోవాలని కోరుకుందాం!    ఈ 104 ఉపగ్రహాల ప్రయోగం ఘన విజయం సాధిస్తే భారత్ అంతరిక్ష రంగంలో సరికొత్త బిజినెస్ మ్యాన్ అవుతుంది! ఆవును, ఇంతకాలం మనం మన కోసం పూర్తిగా ఖర్చు భరించుకుని ప్రయోగాలు చేశాం. ఇక మీద దేశదేశాల ఉపగ్రహాలు లాంచ్ చేస్తూ వాటి నుంచి విదేవీ మారక ద్రవ్యాన్ని, ద్వైపాక్షిక బంధాల్ని సంపాదించుకుంటూ ముందుకు పోవచ్చు! అంటే, మన ఉపగ్రహాలు ఇంచుమించూ ఫ్రీగా లాంచ్ చేసుకోవచ్చన్నమాట! ఇప్పుడు ప్రయోగిస్తున్న 104 సాటిలైట్స్ లో మనవి 3. వాటి లాంచ్ కి అయ్యే ఖర్చు అమెరికా, రష్యా, ఇతర దేశాలు పే చేస్తున్న బిల్ లోంచే సరిపోతోంది! ఇలా ఎన్నో విధాలుగా తాజా ప్రయోగం ఇస్రో చరిత్రలో, ఇండియా చరిత్రలో సరికొత్త ఆధ్యాయమే! 

శశికళ జైలుకి... మరి ఆ రిసార్ట్ బిల్లు ఎవరికి?

మనకు తమిళ సినిమాలు కొత్త కాదు. బోలెడు డబ్బింగ్ అయ్యి ఇటు వస్తుంటాయి. ఏ మాత్రం బాగున్నామనం ఆదరిస్తూనే వుంటాం. శశికళ, పన్నీర్ ల మల్టీ స్టారర్ కూడా అలాంటి సక్సెస్ ఫుల్ తమిళ డబ్బింగ్ సినిమానే! కాకపోతే, ఈ సినిమాకి సుప్రీమ్ తీర్పు క్లైమాక్స్ అనుకున్నారు అంతా. కాని, శశి ఇంకా స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా నడిపిస్తోంది. తాను జైలుకి వెళ్లినా పళని స్వామీ రూపంలో తన మనిషినే పీఠం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఎంత వరకూ సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. అలాగే పన్నీర్ కూడా ఊరికే ఏం వుండటం లేదు. తన లెక్కల్లో తాను మునిగిపోయాడు!   ఒకవైపు శశి, పన్నీర్ లు సీరియస్ గా పొలిటికల్ బ్యాటిల్లో తలపడుతుంటే సోషల్ మీడియాలో మాత్రం తెగ జోకులు షికారు చేస్తున్నాయి. అందులో, శశికళ శిక్ష ఖరారయ్యాక మొదలైన సెటైర్ '' ఇంతకీ ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారు? ''' అని!    గోల్డెన్ బే అనే ఒక రిసార్ట్ వుందనే నిన్న మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. మహాబలిపురం వెళ్లే దారిలో అది వుందన్న సంగతి చిన్నమ్మ పుణ్యమా అని ప్రపంచం మొత్తానికి ఫ్రీగా తెలిసిపోయింది! ఆ రిసార్ట్ ఓనర్ ఎవరోగాని లక్కీ ఫెలో అనే అనాలి! ఇంత పబ్లిసిటీ కావాలంటే కోట్లు ఖర్చు చేయాలి యాడ్ప్ కోసం. కాని, చిన్నమ్మ తన ఎమ్మెల్యేల్ని తీసుకుపోయి గోల్డెన్ బేలో బంధించటంతో మీడియా మొత్తం గోల్డెన్ బే అంటూ గోల గోల చేసేసింది! సోషల్ మీడియాలో కూడా తమిళ ఎమ్మెల్యేల కొట్టంలా మారిన ఈ గోల్డెన్ బే ఫుల్ హాట్ టాపిక్ అయిపోయింది!    ఫేస్బుక్, ట్విట్టర్లలో కొందరు నిన్న మొన్నటి దాకా ఓ జోక్ చేస్తూ వచ్చారు. తన వద్ద '' 130మంది ఎమ్మెల్యేలు వున్నారని... సీఎం అయ్యేందుకు గవర్నర్ తనని ఆహ్వానించాలనీ'' గోల్డెన్ బే ఓనర్ డిమాండ్ చేశాడంటూ వాళ్లు సెటైర్ వేశారు!  ఇక సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాత శశికళ జైలుకి వెళ్లనుండటంతో ... ఇప్పుడు... ''గోల్డెన్ బే రిసార్ట్ ఓనర్ కి బిల్లు ఎవరు కడతారంటూ'' కామెంట్ చేస్తున్నారు! ఇన్ ఫ్యాక్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారో మనకు తెలియదు కాని... రిసార్ట్ లో చిన్నమ్మ తన ఎమ్మెల్యేలకు సకల సౌకర్యాలు కల్పించారు! బీరు, బిర్యానీతో పాటూ చిందులేసేందుకు మ్యూజిక్ కూడా పెట్టించారు! సో... బాగానే చమురు వదిలి వుంటుంది!   కొసమెరుపు ఏంటంటే... సోషల్ మీడియాలో... చాలా మంది మరో బాంబు పేల్చుతున్నారు! అసలు గోల్డెన్ బే రిసార్ట్ ఎవరిది? చిన్నమ్మ శశికళదే అంటున్నారు! అదే నిజమైతే బిల్లు బాధ లేదు... 

మళ్లీ మొదలైన శశికళ పొలిటికల్ గేమ్

గత వారం రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం తమిళనాట జరుగుతున్న గేమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఎత్తులు..పై ఎత్తులు, కౌంటర్లు..రీకౌంటర్లు ఇలా ఒక సినిమాకు కావాల్సినన్ని కోణాలు ఈ వ్యవహారంలో ఉన్నాయి. ఏ రోజుకారోజు తమకు గవర్నర్ నుంచి పిలుపు వస్తుందని ఇటు శశికళ..అటు పన్నీర్ సెల్వం ఎదురుచూపులు చూశారు.  నిన్న మొన్నటి వరకు ఇద్దరి బలబలాలు సమంగానే ఉన్నాయి..కానీ ఇవాళ్టీ సుప్రీం తీర్పుతో అంతా పన్నీర్ చేతుల్లోకి వచ్చేసింది. అక్రమాస్తుల కేసులో ఆమెను అత్యున్నత న్యాయస్థానం దోషిగా తేల్చడంతో..ఇక చిన్నమ్మ సీఎం అయ్యే అవకాశం లేదు.     అంతేకాదు మరో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు పడింది. సీన్ కట్ చేస్తే మరికాసేపట్లో చిన్నమ్మ అరెస్ట్..సరే ఇదంతా పక్కనబెడితే ఇంత జరిగినా..చివరికి తాను అరెస్ట్ కాబోతున్నా కూడా శశికళ తన ఓటమిని అంగీకరించడం లేదు. కింద పడ్డా తనదే పై చేయి అన్నట్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంది. తన స్థానంలో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని తెరమీదకు తీసుకువచ్చి గవర్నర్‌‌తో భేటీ అయ్యేలా ప్లాన్ గీశారు.     ఇప్పుడు స్వామి అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత...129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉంది..అప్పుడంటే చిన్నమ్మకు "కోర్టు తీర్పు" పెండింగ్‌లో ఉంది కాబట్టి గవర్నర్ విద్యాసాగర్‌ రావు వేచి చూశారు..కానీ పళనిస్వామి విషయంలో మాత్రం ఆ అవకాశం లేదు. అసెంబ్లీలో బలనిరూపణ కోసం స్వామిని తప్పక పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పన్నీర్ సెల్వం పరిస్థితి క్లిష్టమవుతుంది..ఏది ఏమైనప్పటికి పన్నీర్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదన్నది చిన్నమ్మ టార్గెట్.

శశి ఫ్యూచర్ మసి బారినట్టేనా? పిక్చర్ అభీ బాకీ హై!]

  శశికళ.... శశి... చిన్నమ్మ... ఈ పేర్లు గత కొన్ని రోజులుగా మీడియాలో మార్మోగిపోయాయి. తమిళ మీడియా సంగతి తెలియదు కాని... తెలుగు మీడియా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ, రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టు ఉధృతంగా కవరేజ్ ఇచ్చాయి. కాని, ఇవాళ్ల సుప్రీమ్ తీర్పుతో శశికళ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? ఇక పన్నీర్ సెల్వమ్ దే హవానా? అఫ్ కోర్స్ , కాదంటున్నారు రాజకీయ అనుభవం వున్న వారు! శశికి తీర్పు వల్ల గ్రహణం పట్టిందే తప్ప అమావాస్య ఏం వచ్చేయలేదంటున్నారు! కొద్ది రోజులు మసకబారి శశి మళ్లీ తన వెన్నల చెన్నై రాజకీయాల మీద ప్రసరిస్తుందంటున్నారు... శశికళ జైలుకి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చు.   కాని, ఈ నాలుగేళ్లలో ఆమె వర్గం అన్నాడీఎంకేలో లేకుండా పోతుందా? నో ఛాన్స్. శశికళ వీర విధేయులు పార్టీలోనే వుంటారు. పన్నీర్ సెల్వానికో, మరో ముఖ్యమంత్రికో... ఎవరికైనా సరే పంటి కింద రాళ్లలానే కొనసాగుతారు. చిన్నమ్మ జైలు నుంచి ఇచ్చే ఆర్డర్స్ వీలైనంత పాటించే ప్రయత్నం చేస్తారు! ఇక పన్నీర్ సెల్వం జయకు విశ్వాసపాత్రుడైన బంటే గాని... వారసుడు కాదు. ఆమెకున్న పార్టీపై వున్న పట్టుగాని, ప్రజల్లో వున్న ఫాలోయింగ్ కాని... రెండూ ఈ సాధు జీవికి లేవు! కాబట్టి పదే పదే ఏఐఏడీఎంకే రెబెల్స్ రెచ్చిపోవచ్చు. అప్పుడు వారికి శశికళే అండగా కనిపిస్తుంది. జయ తరువాత అంతో ఇంతో గట్టి పట్టున్న వ్యక్తి ఆమె కాబట్టి!   మొత్తం పదేళ్లు ఆమెకు సీఎం అయ్యే ఛాన్స్ లేకున్నా... నాలుగేళ్లు మాత్రమే లోపలుంటారు. అంటే పన్నీర్ సెల్వం నెక్స్ట్ ఎలక్షన్స్ ఎదుర్కొనెందుకు రెడీ అవుతుంటే చిన్నమ్మ జైలు గేట్లు తీసుకుని బయటకు వస్తారు. వచ్చీరాగానే పార్టీని చీల్చి తన వర్గంతో ఎన్నికలకు వెళితే ఆమెను ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యురాలిగా చూడరు. ప్రభుత్వ వ్యతిరేకత అంతా పన్నీర్ పైనే వుంటుంది. శశి ఫ్రెష్ గా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టుకోవచ్చు!   జైలుకి వెళ్లొచ్చిన శశిని జనం అదరిస్తారా? జైలు నుంచి చిన్నమ్మ చక్రం తిప్పగలదా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు ఇంకా మిగిలే వున్నాయి. అలాగే, పన్నీర్ జయ మృతిపై దర్యాప్తు చేయించి శశికళని కొత్త కేసుల్లో, ఆరోపణల్లో ఇరికించ వచ్చు కూడా! కాబట్టి ముందు ముందు శశికళకి రాజ మార్గం ఏం లేదు. అలాగని ఆమెకు ది ఎండ్ ఎదురైపోయినట్టు కూడా భావించరాదు! ది యాక్సువల్ గేమ్ హాజ్ జస్ట్ బిగాన్!