మమత మార్క్ సెక్యులరిజమ్... 60 వేల విద్యార్థులు అతలాకుతలం!
posted on Mar 10, 2017 @ 4:23PM
దేశ రాజకీయాలు ఇప్పుడు నిలువునా చీలిపోయాయి. మొత్తం అంతా మెల్ల మెల్లగా మోదీ, మోదీ వ్యతిరేక బ్యాచ్ అన్నట్టు తయారవుతోంది పరిస్థితి! కాంగ్రెస్ లాంటి బీజేపి వ్యతిరేక పార్టీ మొదలు కాషాయదళానికి ఎన్నేళ్లుగానో మిత్ర పక్షం అయిన శివసేన వరకూ అన్ని పార్టీలు మోదీ హీట్ తో సతమతం అవుతున్నాయి. ఈ సీన్ మరింత క్లియర్ గా కనిపించాలంటే మనం బెంగాల్ వెళ్లాలి! అక్కడ విచిత్రంగా అధికార పక్షం తృణమూల్, ప్రతిపక్షం సీపీఎం... రెండూ బీజేపిని టార్గెట్ చేస్తున్నాయి. మోదీనే తిట్టిపోస్తున్నాయి! అసలు కోల్ కతాలో పరిస్థితి ఏంటంటే... పాలక పక్షం, ప్రతి పక్షం మోదీ, బీజేపి భయంతో గజగజ వణుకుతూ ఏకమైపోయాయి!
మమతా బెనర్జీ సీపీఎం మీద ఉధృతంగా దాడి చేసి అధికారంలోకి వచ్చింది. అందుకే, ఆమె అంటే కమ్యూనిస్టులకి కోపం. కాని, దేశ వ్యాప్తంగా సాగుతోన్న మోదీ వేవ్ బెంగాల్ ని కూడా టచ్ చేసింది. దాంతో ఉప్పు, నిప్ప లాంటి మమత, కమ్యూనిస్టులు కలిసి వ్యూహాలు పన్నే స్థితికి వచ్చేశారు. ఆ మధ్య నోట్ల రద్దు సమయంలో కలిసి ఉద్యమం కూడా చేద్దామనుకున్నారు! అయితే, తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీపీఎం, టీఎంసీ చేసిన పని చూస్తే బెంగాల్ లో బీజేపి బెంగా ఎంతగా పెరిగిపోయిందో తెలుస్తుంది!
సీపీఎం ఎమ్మెల్యే ఒకరు సభలో లేచి రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విద్యాబోధన జరుగుతోందని ఆరోపించారు! మామూలుగా అయితే దీన్ని పాలక పక్షం ఖండించాలి. కాని, అమాంతం లేచి నిలబడ్డ మమత బెనర్జీగారి మంత్రిగారు తన వద్ద 125 స్కూళ్ల లిస్ట్ వుందనీ, వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సిలబస్ కు వ్యతిరేకంగా విద్యా బోధన జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చాడు. పైగా ఆ లిస్ట్ ఇచ్చింది హోం మంత్రి కూడా అయిన గౌరవ ముఖ్యమంత్రిగారేనట! మమత ఇచ్చిన ఆ 125 స్కూల్స్ ఏవంటే... ఆరెస్సెస్ కు దగ్గరగా వుండే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు. మొత్తం 60వేల మంది వరకూ పిల్లలు చదువుకుంటోన్న ఈ సేవా దృక్పథంతో నడిచే స్కూల్స్ అన్నీ లక్నోలో వున్న విద్యా భారతీ అఖిల్ భారతీయ శిక్ష సంస్థాన్ కు అనుబంధంగా నడుస్తుంటాయి!
బెంగాల్ దేశంలోని అత్యధిక ముస్లిమ్ జనాభా వున్న రాష్ట్రాల్లో ఒకటి. అంతే కాదు, బంగ్లాదేశ్ నుంచి అడ్డూ అదుపు లేకుండా అక్రమ చొరబాట్లు జరుగుతుంటాయి. ఈ కారణంగా బెంగాల్ లోని చాలా జిల్లాల్లో ముస్లిమ్ ల సంఖ్య పెరిగిపోతోంది. దాని వల్ల గవర్నమెంట్ మైనార్టీల్ని సంతుష్టీకరించి ఓట్లు దండుకునే పనిలో వుంది. దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు సహజంగానే బీజేపి వైపు చూస్తున్నారు. ఫలితంగా ఆక్రోశం తట్టుకోలేకపోతున్న మమత ఆ మధ్య మోదీ కెరీర్ ని నాశనం చేస్తానని శపథం చేశారు. అంత ఫ్రస్ట్రేషన్లో వుండబట్టే.. నేరుగా ప్రతిపక్ష సీపీఎంతో కలిసి బీజేపికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేయస్తోంది!
బీజేపికి వ్యతిరేకంగా మమత పావులు కదపటం ఎవ్వరూ తప్పు పట్టరు కాని... మరీ దుర్మార్గంగా 60వేల మంది పిల్లల భవిష్యత్ తో ఆటలు ఆడటం అరాచకం అనిపించుకుంటుంది. అందుకు సీపీఎం మద్దతు కూడా తీసుకోవటం మరో విషాదం. అసలు నిజంగా హిందూ ట్రస్టుల ఆధ్వరంలో విద్యా బోధన జరుగుతోన్న స్కూల్స్ లో మత ఛాందసవాదం నేర్పుతున్నట్టయితే... దేశ వ్యాప్తంగా వున్న అనేక మదర్సాల్లో చేస్తున్నదేమిటి? మరీ ముఖ్యంగా ఉగ్రవాదానికి, ఫేక్ కరెన్సీలకి, అక్రమ చొరబాట్లకి, బాంబుల తయారికీ అడ్డగా మారిన బెంగాల్లో మదర్సాల్లో ఏమవుతోంది? మదర్సాలపై కూడా మమత నిఘా పెట్టగలదా? స్కూళ్ల లిస్టు తయారు చేసి నోటీసులు ఇచ్చి గుర్తింపు రద్దు చేస్తామని చెప్పగలదా? ముందు ముందు ఈ హిందూ సంస్థల స్కూళ్లకు నోటీసుల వ్యవహారం పెద్ద గాలివానగా మారే సూచనలే కనిపిస్తున్నాయి!