పాక్ ఉన్మాదం పెరిగిపోతోంది! ప్రపంచ అనుమానం ముదిరిపోతోంది!

ఉగ్రవాదం అనగానే మనకు పాకిస్తాన్ గుర్తుకు వస్తుంది. మన దేశంలో జరిగే ప్రతీ దాడికి కారణం పాకిస్తానే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకూ పాకిస్తాన్ ఎలాగోలా తన ప్రభావం చూపుతూనే వుంటుంది. కాంగ్రెస్ వున్నా, బీజేపి వచ్చినా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ వుండటం లేదు. పాకిస్తాన్ మన సైనికుల తలలు నరకటం యథేచ్ఛగా జరుగుతూనే వుంది. అయితే, రాను రాను పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా అనే విషయం ఇండియానే కాదు ప్రపంచం మొత్తం నమ్మటంతో మొదలుపెడుతోంది. ఇది కొంతలో కొంత శుభ సూచకం!   అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు చాలా రోజుల వరకూ పాకిస్తాన్ పాడు పనులు పట్టించుకోనే లేదు. వెస్టన్ కంట్రీస్ దృష్టిలో టెర్రరిజమ్ అంతా ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, పాలస్తీనాల్లోనే పుడుతూ వుంటుంది. కాని, ఈ అభిప్రాయం ఎంత తప్పో అమెరికా స్వయంగా నిరూపించుకుంది. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే అగ్రరాజ్యానికి దొరికాడు.అక్కడే మట్టుబెట్టారు. కేవలం ఆల్ ఖైదా కాదు తాలిబన్, లష్కరే తోయిబా నుంచి ఐసిస్ దాకా అన్ని ఉగ్రవాద సంస్థల లింకులు పాకిస్తాన్ లో దొరుకుతాయి. అసలు ప్రపంచంలోని అతి పెద్ద ఉగ్రవాద నెట్ వర్క్ పాకిస్తాన్ వారి ఐఎస్ఐ మాత్రమే!   పాకిస్తాన్ దశాబ్దాల తరబడి తన భూభాగంపై ఉగ్రవాదుల ఫ్యాక్టరీలు నడుపుతోందని భారత్ చెబుతూనే వుంది. ఇప్పుడు కూడా కుల్భూషణ్ జాదవ్ అనే భారతీయుడ్ని గూఢచారి అంటూ పాకిస్తాన్ ఉరితీసే ప్రయత్నం చేస్తోంది. ఆ కుట్రను అంతర్జాతీయ న్యాయస్థానంలో ఛేదించే గట్టి ప్రయత్నం చేస్తోంది భారత్. అయినా కూడా జాదవ్ ను ప్రాణలతో పాక్ వదిలిపెడుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే, అలాంటి ఒక ఉన్మాద దేశంగా మారిపోయింది టెర్రరిస్ట్ పాకిస్తాన్. మరి అలాంటి దేశం నుంచి విదేశాలకు వెళ్లిన పాకిస్తానీల్ని ఎవరైనా ఎలా చూస్తారు? అనుమానంగానే! ఇప్పుడే అదే జరుగుతోంది!   తాజాగా ఇస్లామాబాద్ నుంచీ లండన్ వెళ్లిన ఒక పాకిస్తానీ ఫ్లైట్ ను రెండు గంటలు ఆపేశారట బ్రిటన్ అధికారులు. అంతే కాదు, అనుమానం కొద్దీ ఆ విమానంలో వున్న 14మంది పాకిస్తానీ క్రూ మెంబర్స్ ని కంప్లీట్ గా చెక్ చేశారట. వాళ్ల దగ్గరా, విమానంలోనూ ఏమీ దొరకలేదట. కానీ ఈ విషయం మీద సీరియస్ అయిన పాకిస్తానీ గవర్నమెంట్ బ్రిటన్ విమానాయాన అధికారులతో మాట్లాడతామని అంటోంది. ఏమి మాట్లాడినా ఎంత నిరసన తెలిపినా పాకిస్తాన్ చేతులారా చేసుకున్న పాపమే ఇవాళ్టి ఈ చెడ్డ పేరు. ప్రపంచ టెర్రరిజనానికి అసలు మూలంగా మారిపోయాక ప్రపంచం అనుమానంగా చూడక మరేం చేస్తుంది? ముందు ముందు పాకిస్తాన్ కి, పాకిస్తానీలకి అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు, అవమానాలు మరిన్ని తప్పకపోవచ్చు! అయినా కూడా పాక్ తన తోక వంకర సరి చేసుకుంటుందని కూడా మనం ఆశించలేం…

ప్రధానిగా మోదీకి మూడేళ్లు! అపోజిషన్ కి మాత్రం మూడాఫ్!

2014 మే 16… ఆధునిక భారత చరిత్రలో పెద్ద మలుపు! కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రస్థానంలో పెద్ద కుదుపు! ఎవ్వరూ ఎప్పుడూ ఊహించనిది జరగనే జరిగింది. చాలా మంది దశాబ్దాల పాటూ ఆశపడుతూ వచ్చింది… ఎట్టకేలకు సాకారమైంది! అదే మోదీ ప్రధాని కావటం! కాంగ్రెస్ తప్ప భారతదేశ చరిత్రలో మరే పార్టీ స్వంత మెజార్జీ సాధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ రికార్డ్ బద్ధలైంది మూడేళ్ల కింద… ఇదే రోజు! అప్పట్నుంచీ చాలా మంది చాలా మార్పులు, విప్లవాలు, అభివృద్ధులు ఆశించారు. అవేమీ మోదీ శకంలో అనుభవంలోకి రాలేదు. అయినా, మూడేళ్ల అనంతరం నమోకి నమోన్నమః అంటూనే వున్నారట దేశంలోని అత్యధిక జనం…   దాదాపు 60శాతానికి పైగా ప్రజలు ఇంకా మోదీ మీద నమ్మకంతోనే వున్నారని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగలేదు. నిత్యావసరాల ధరలు తగ్గిందీ లేదు. అలాగే, పాకిస్తాన్ సమస్య, ఉగ్రవాదం ఎటూ పోయింది లేదు. మరింత ముదిరాయి కూడా. కాశ్మీర్ కల్లోలంగా మారింది. అయినా, 2014 పార్లమెంట్ మొదలు 2017 యూపీ అసెంబ్లీ వరకూ మోదీ దండయాత్రని ఎందుకు ఎవ్వరూ అడ్డుకోలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం… బీజేపి బలం కాదు… విపక్షాల బలహీనత అంటున్నారు క్రిటిక్స్. మోదీని ఢీకొట్టాలంటే మోదీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన రాజకీయవేత్త, నిజాయితీపరుడు కావాలి! అలాంటి నాయకుడు దేశంలోని బీజేపియేతర పార్టీలన్నిట్లో భూతద్దం వేసి వెదికినా దొరకటం లేదు. మాస్ అప్పీల్ వుంటే మంచి పేరు వుండదు. మంచి పేరుంటే జాతీయ స్థాయిలో సత్తా వుండదు. ఇదీ మోదీకి వ్యతిరేకంగా పోరాడుతోన్న నేతలందరి పరిస్థితి!   ఉన్నట్టుండీ పెద్ద నోట్లు రద్దు చేసిన మోదీ కోట్లాది మంది జనాన్ని ఏటీఎంల ముందు నిలబెట్టారు. అయినా, జనం ఆగ్రహంతో ఊగిపోతారనకుంటే సీన్ రివర్స్ అయింది. డీమానిటైజేషన్ మోదీ చేసిన విఫల యత్నంగా భావించే తప్ప… అందులో ఆయనకు దురుద్దేశాలున్నాయని జనం భావించలేదు. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ దాడి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రజల్ని కన్విన్స్  చేయలేకపోయారు. ఇంచుమించూ ఇదే గడ్డు పరిస్థితి మిగతా అంశాల విషయంలోనూ మోదీ వ్యతిరేకులకి ఎదురవుతోంది. మూడేళ్ల ప్రధాని మోదీని ముప్పై ఏళ్ల జాతీయ అనుభవం వున్న నాయకులు కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకు కారణం మోదీ విజయాల శాతం తక్కువగా వున్నా దేశం ఆయన నిజాయితీని నమ్ముతుండటమే.   నరేంద్ర మోదీని నిలువరించలేకపోయిన నాయకుల్లో స్వంత పార్టీలోని అద్వానీ మొదలు ప్రతిపక్ష పార్టీల్లోని రాహుల్, నితీష్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ములాయం, మాయావతి… ఇలా అందరూ వున్నారు. విచిత్రంగా శివసేన లాంటి పార్టీలు , వాటి నాయకులు కూడా మోదీ మీద మింగలేక కక్కలేకా అన్నట్లు కోపాన్ని పంటికింద అనుచుకుని భాగస్వాములుగా వుంటున్నారు.   మరో రెండేళ్లలో మళ్లీ దేశం ఎన్నికల పోరుతో రణరంగం అవ్వనుంది. అప్పుడు కూడా పెద్దగా అనూహ్య మార్పులేం వుండబోవని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇందుకు వారు చూపుతున్న కారణం మోదీ విజయాలు కావు. ప్రతిపక్షాలకు కరువైన నాయకత్వం. రాహుల్, కేజ్రీవాల్, నితీష్…. ఇలా ఎవ్వరూ జనం సమక్షంలో మోదీకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. అసలు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అయితే… 2019 పక్కన పెట్టి 2024 కన్నా సమర్థ నాయకత్వాన్ని ముందు పెట్టుకుని బరిలోకి దిగాలని సూచిస్తున్నారు! మొత్తం మీద మూఢేళ్ల ప్రధాని మోదీ … జనంలో ప్రేమని ఎంతగా తట్టిలేపారో తెలియదుగాని… ప్రతిపక్షాల్లో నిస్పృహని మాత్రం పూర్తిగా గుమ్మరించారు! 

రాజకీయ సినిమా కోసం… రజినీ మేకప్ వేసుకోటం మొదలెట్టేశాడా?

  మన దేశంలో ఎన్నికలపై అత్యంత ప్రభావం చూపే అంశాలు ఏంటి? డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతం వగైరా వగైరా! ఇవి కాక మరేదైనా ఎలక్షన్స్ ను తారుమారు చేసే ఛాన్స్ వుందా? ఖచ్చితంగా వుంది! సౌత్ ఇండియాలో అయితే సినిమా గ్లామర్ పాలిటిక్స్ ను బాగానే ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ టైంలో వున్నంత సీన్ ఇప్పుడు లేకపోయినా హీరోలు ప్రతీ ఎన్నికల ముందు కలకలం రేపటం మనం చూస్తూనే వున్నాం. కేవలం ప్రచారం చేసి ఊరుకునే వారు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవారు, సీఎంలు అవ్వాలని ప్రయత్నించే వారు ప్రతీ రాష్ట్రంలోనూ వున్నారు. దివంగత జయలలిత తరువాత మళ్లీ ఇప్పుడప్పుడే సినిమా వాళ్లెవరూ ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలైతే కనిపించటం లేదు! కాని, ఇంకా ఎటూ తేల్చని తలైవా పైన మాత్రం ఆయన అభిమానులు గట్టి నమ్మకం పెట్టుకున్నారు!   ఒక పార్టీ పెట్టడం, అన్ని వర్గాల ఓట్లు సంపాదించటం, సీఎం అవ్వటం అంత ఆషామాషీ కాదు. అందుకే, తమిళనాడులో విజయ్ కాంత్ మొదలు మన దగ్గర చిరు వరకూ చాలా మంది అసెంబ్లీకి వెళ్లారుగాని… సెక్రటేరియట్లు కైవసం చేసుకోలేకపోయారు. ఇక ఇప్పుడు ఆ సత్తా వుందని ప్రచారం జరుగుతోన్న ఒకడే ఒక్కడు మొనగాడు… మన ముత్తు, రజినీకాంత్! ఆయన వస్తారనీ, చెన్నై చేజిక్కించుకుంటారని కోట్లాది మంది ఫ్యాన్స్  ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. కాని, అత్యంత తాజాగా కూడా రోబో ఎలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. ఎప్పటిలాగే దేవుడిపైన భారం వేశాడు అరుణాచలం!   గతంలో చాలా సార్లు రాజకీయాల్లోకి రమ్మని రజినీకాంత్ పై ఒత్తిడి వచ్చినా ఆయన రాలేదు. అందుకు కారణాలు బోలెడు. అన్నిటికంటే ముఖ్యంగా బంగారం లాంటి కెరీర్ ఆయన ముందు వుండింది. అలాగే, ఒకవైపు జయ, మరోవైపు కరుణా నిర్ధాక్షిణ్యంగా దాడి చేయటానికి సిద్ధంగా వుండేవారు. ఇప్పుడు అలాంటి సమస్యలు అన్నీ పోయాయి. ఇంకా సినిమాలు చేస్తున్నప్పటికీ సుదీర్ఘ కెరీర్ మాత్రం లేదని చెప్పక తప్పదు. వయసు పెరిగిపోతోంది. అలాగే, జయ, కరుణా లేని లోటు తమిళనాడు ప్రతీ రోజు చవిచూస్తోంది. కాబట్టి ఈ సంధి కాలం పడయప్ప బాగా వాడుకోవచ్చు. కాని, ఏనాడూ తెగించి రణ రంగంలోకి దూకని మన హీరో మరోసారి తనదైన స్టైల్లో సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. రాజకీయాల్లోని రానని గతంలో లాగా తెగిసి చెప్పకపోయినప్పటికీ దేవుడు శాసిస్తే వస్తానంటూ పాత పాటే పాడాడు. మరి దేవుడు తమిళ వెండితెర వేల్పుకి ఏం చెబుతాడు? రాజకీయాల్లోకి వెళ్లమనా? వద్దనా? ఆ విషయం పార్లమెంట్ ఎన్నికలో, అసెంబ్లీ ఎన్నికలో వస్తే తప్ప తేలేది కాదు! కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం నిజం… రజినీకాంత్ చెప్పిన దేవుడు త్వరలోనే ఏదో ఒక ఆర్డర్ మాత్రం వేయవచ్చు! ఆర్డర్ మోదీ, అమిత్ షాలు సూపర్ స్టార్ వద్దకి మోసుకు రావచ్చు!   తమిళ రాజకీయాల్లో కీలకంగా ఎదగాలనుకుంటున్న బీజేపి రజినీ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వటం దాదాపు పక్కానే. కాని ఎప్పుడు ఎలా అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్!

ధర్నా చౌక్ కోసం ధర్నా… ప్రభుత్వానికి కావాల్సిందే ప్రతిపక్షాలు చేశాయా?

  హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్… ఆ పార్క్ పక్కనే ధర్నా చౌక్… రెండు దశాబ్దాలుగా ఆ ధర్నా చౌక్ ఎన్నో ధర్నాల్ని చూసింది! కాని, సోమవారం నాడు జరిగిన ధర్నా … చౌక్ చరిత్రలోనే విచిత్రం! విపరీతం కూడా! ఎందుకంటే, ధర్నా చౌక్ లో తాజాగా జరిగింది దాదాపుగా చివరి ధర్నా! ఎలాగైనా అక్కడ్నుంచీ చౌక్ ను ఎత్తేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే అది జరిపోవచ్చు కూడా. ఆపే అవకాశం ఇంచుమించూ ప్రతిపక్షాలకు , ప్రజా సంఘాలకు, జేఏసీకి లేదనే చెప్పాలి. ధర్నా చౌక్ ఎక్కడ వుండాలని నిర్ణయించే హక్కు ఏ విధంగా చూసినా అధికారంలోని ప్రభుత్వానిదే!   ధర్నా చౌక్ మార్పు నిజానికి పెద్ద సమస్యేం కాదు. తెలంగాణలో మిర్చీ రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అలాగే, రైతుల్ని క్రిమినల్స్ లాగా బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లటం చాలా మందికి సహించలేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో ధర్నా చౌక్ ధర్నాలు కేసీఆర్ సర్కార్ కు అందివచ్చిన అవకాశంగా ఉపయోగపడ్డాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టిన ప్రతిపక్షాలు ఇందిరా పార్కు వద్ద బలప్రదర్శనకు దిగాయి. అందుకు తగ్గట్టే ఓ వర్గం మీడియా చెబుతోన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ధీటుగా సమాధానమిచ్చే వ్యూహం పన్నింది. లేడీ పోలీసుల్ని కూడా స్థానికులు, వాకర్స్ అంటూ ధర్నాలో కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించుకునే క్రమంలో అసలు తీవ్రమైన సమస్యలు పక్క దారి పట్టాయి.   దిల్లీలో పార్లమెంట్ కు దగ్గర్లోనే జంతర్ మంతర్ వుంటుంది. అక్కడ ధర్నాలు చేస్తుంటారు. అదే రీతిలో హైద్రాబాద్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్లకు దగ్గరగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వుండేది ఇన్నాళ్లు. దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అక్కడ్నుంచి తొలగించటం టీసర్కార్ పొరపాటే అనవచ్చు. కాని, అది మరీ అంత పెద్ద సమస్య కూడా కాదు. మరీ ముఖ్యంగా జేఏసీ, కమ్యూనిస్టులు, జనసేన కార్యకర్తలు పట్టుదలకి పోయి ధర్నా చౌక్ కోసం ధర్నాలు చేయటంతో అనవసర ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల మీద నుంచీ మీడియా, జనం దృష్టి మళ్లింది. కాబట్టి బీజేపి, టీటీడీపి, జేఏసీ…. అన్నీ ఒక నిర్ణయానికి వచ్చి ధర్నా చౌక్ గొడవ పెద్దగా చేయకపోవటమే మేలు. అంతకంటే తీవ్రమైన ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తే గవర్నమెంట్ కార్నర్ అయ్యే ఛాన్స్ వుంటుంది.   ధర్నా చౌక్ ఎక్కడ వున్నా అసెంబ్లీ, సెక్రటేరియట్ దాకా పోలీసులు ఉద్యమకారుల్ని,నిరసనకారుల్ని అస్సలు వెళ్లనీయరు. అరెస్టులతో కథ కంచికి చేరాల్సిందే. కాబట్టి ధర్నా చౌక్ కేసీఆర్ కాస్త దూరంగా ఏర్పాటు చేసినా ప్రతిపక్షాలు ఉరుకోవటమే మేలు. అలాంటి నిర్ణయం ఒకవేళ నిజంగా అప్రజాస్వామికమే అయినా… సామాన్య జనంపై అది చూపే ప్రభావం చాలా స్వల్పం. అటువంటి దానిపై అహానికిపోయి పోరాటం చేస్తే అసలు సమస్యలు చర్చకు నోచుకోవు. అది ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రతిపక్షాలకే నష్టం…

తెలంగాణలో బీజేపీ మిషన్‌ ప్రారంభం... 60+10పైనే గురి

  2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలనైతే అనుసరించారో... అలాంటి స్ట్రాటజీనే తెలంగాణలోనూ ఇంప్లిమెంట్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఒక టార్గెట్‌ను విధించుకుని... పక్కా ప్లాన్‌తో సీరియస్‌గా సీన్‌లోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పదికిపైగా ఎంపీ సీట్లు, అరవైకి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా మిషన్‌-2019ని సిద్ధంచేసింది. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలకు అధినాయకత్వం ఆదేశించింది. ముఖ్యంగా బూత్‌ కమిటీల స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేసింది.   రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలున్న నేపథ్యంలో జూన్‌ తర్వాత తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన ఫార్ములాను అమలు చేయనుంది. ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకోవాలని భావిస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకొని ఆ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటోంది.   అధికార టీఆర్‌ఎస్‌కు కింది స్థాయి వరకు కేడర్‌ లేకపోవడం, పూర్తిగా జిల్లా కమిటీలు కూడా ఏర్పడకపోవడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రియా శీలకంగా వ్యవహరించకపోవడం, టీడీపీ పూర్తిగా బలహీన పడటం, వామపక్షాలు సత్తాచాటలేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం  అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై ఉద్యమిస్తూనే పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.

టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ కన్ను... తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌

  తెలంగాణలో అప్పుడే కూడికలు తీసివేతలు మొదలైయ్యాయి. పార్టీలన్నీ పక్కా స్కెచ్‌తో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణపై కన్నేసిన బీజేపీ అధిష్టానం యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్‌ సెవెన్‌ స్టేట్స్‌లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరదీసిన కమలం పార్టీ... టీడీపీ, కాంగ్రెస్‌లో ముఖ్యనేతలపై కన్నేసింది. ఇప్పుడున్న నేతలతోనే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని అంచనాకి వచ్చిన బీజేపీ హైకమాండ్‌... టీడీపీ, కాంగ్రెస్‌లో ప్రజాబలం, పేరున్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.   కమలం యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా... ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల్లో ఫైర్‌ బ్రాండ్‌లుగా పేరున్న పలువురు నేతలు... బీజేపీలో చేరేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారన్నది లేటెస్ట్‌ న్యూస్‌. అయితే టీడీపీ, కాంగ్రెస్‌లో బలమైన నేతలు బీజేపీలోకి వస్తే.... తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని పాత కాపులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దాంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఇతర పార్టీల నేతల ప్రయత్నాలకు మోకాలడ్డుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే దీన్ని గమనించిన ఆయా లీడర్లు... నేరుగా ఢిల్లీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.   తెలంగాణ పర్యటనలో అమిత్‌షా‌ను కలిసేందుకు ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమిత్‌షా మీదే ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరినా.... ఇప్పుడున్న నేతలు... కలుపుకొని పోతారో లేదోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నా... రాష్ట్ర నేతలు మాత్రం మోకాలడ్డే ప్రయత్నాలు చేయడంపై కలవరపడుతున్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే.... కనీసం ప్రస్తుతమున్న పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత అయినా దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

టీకాంగ్రెస్‌కు డేంజర్‌ బెల్స్‌... భయపెడుతోన్న వలసల సునామీ

  తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌ను... ఆ తర్వాత వ‌రుస ఓట‌ములు మ‌రింత కుదిపేశాయి. ఆ నిరాశతోనే పలువురు నేత‌లు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌‌లోకి క్యూ క‌ట్టారు. ఆ వలసల భయం నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న కాంగ్రెస్‌ను మ‌రోసారి వ‌ల‌స‌ల భయం వెంటాడుతోంది. తాజాగా పార్టీ నుంచి భారీ వ‌స‌ల‌స‌లు ఉంటాయ‌నే చ‌ర్చ బ‌లంగా వినిపిస్తోంది. పార్టీలో ఏ ఇద్దరు నేత‌లు క‌లిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. వ‌ల‌సల జాబితాలో ప‌లువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తుండ‌టంతో ఆ పార్టీకి మింగుడు ప‌డ‌టం లేదు.   అయితే ఈసారి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోకి కాకుండా... జాతీయ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హస్తం పార్టీ నుంచి  దాదాపుగా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌‌లో ఉన్నారనే వాదన బ‌లంగా వినిపిస్తోంది. వీరితోపాటు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తం 30మంది నేతలు కమలం పార్టీలోకి జంప్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నార‌నే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌... హైదరాబాద్‌ బ్రదర్స్‌గా పేరొందిన మాజీ మంత్రులిద్దరు... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఈ నేతలు... త్వరలోనే కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు.   అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం త‌మ పార్టీ నుంచి వ‌ల‌స‌లు ఉండవంటున్నారు. పైగా  ఇత‌ర పార్టీల‌కు చెందిన చాలా మంది నేత‌లు తమకు ట‌చ్ లో ఉన్నార‌ని చెబుతున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వారంతా కాంగ్రెస్‌లోకి వస్తారంటున్నారు. తమతో టచ్‌లో ఉన్న నేతల్లో అధికార టీఆర్‌ఎస్‌ నేత‌లు కూడా ఉన్నార‌ని ఉత్తమ్ చెబుతున్నారు. అయితే ఉత్తమ్‌ కామెంట్స్‌ను లైట్‌ తీస్కుంటున్న టీకాంగ్రెస్‌ సీనియర్లు.... నేతలు చేజార‌కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేదంటే వలసల సునామీ కాంగ్రెస్ ను ముంచేయ‌డం ఖాయ‌మ‌ంటున్నారు.

పవన్ కౌంటర్.. ఆరునూరైన పోటీ ఖాయం..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ఇప్పటికీ చాలామంది బహిరంగంగానే కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్లపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఘాటుగానే సమాధానమిచ్చారు. అనంతపురం జిల్లా నూతన నాయకులతో సమావేశమైన ఆయన ఆ ప్రాంతంలోని పలు సమస్యలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని చెప్పారు. అంతేకాదు నేను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడునికి కాదు అని కొందరు అంటున్నారు... అసలు అలాంటి రాజకీయ నాయడుకు రాజకీయాల్లో ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాలు చేస్తూ కోట్లు గణిస్తున్నారు..ఇంట్లో కూర్చొనే కోట్లు సంపాదించుకుంటున్నారు.. అని మండిపడ్డారు. ఇంకా సినిమాల గురించి కూడా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుదిశ్వాస విడిచేవరకు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా... ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని.. సినిమా అన్నా, సినీ పరిశ్రమ అన్నా అపార గౌరవం ఉంది..  నా కుటుంబం, సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నా అని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అనంతపురం పోటీ చేయడం ఖాయమని... సామాన్యులు రాజకీయాలు ఎలాచేయగలరో చెప్పాలనుకుంటున్నా, వేలకోట్లు అవసరం లేదని నిరూపిద్దామని చాలా భావోద్వేగంతో చెప్పారు.

నన్ను బ్రతికించు నాన్నా..కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో..

  "నాన్నా నన్ను బ్రతికించు నాన్నా.. నాకు బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి..  నా స్నేహితులతో ఆడుకోవాలని, స్కూలుకు వెళ్లాలని ఉంది".. ఓ చిన్నారి తన తండ్రిని ప్రాధేయపడుతూ మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు వింటే ఎవరికైనా హృదయం చలించక మానదు. కానీ ఆ తండ్రి హృదయం మాత్రం కరగలేదు. ఫలితం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకరమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అయితే ప్రాణం పోవడానికి ముందు ఆ పాప మాట్లాడుతూ విడుదల చేసిన వీడియో మాత్రం అందరిని కంటతడిపెట్టిస్తోంది.   విజయవాడలోని దుర్గాపురంలో మాధవ శెట్టి శివకుమార్, సుమశ్రీ దంపతులు. వీరికి సాయిశ్రీ అనే చిన్నారి ఉంది. అయితే తల్లిదండ్రులు వీడిపోవడంతో సాయిశ్రీ తన తల్లితోనే ఉంటోంది. అయితే ఈ చిన్నారి గత కొంతకాలంగా క్యాన్సర్ బారిన పడటంతో చికిత్స చేయించుకుంటుంది. ఇక భర్త నుండి విడిపోయిన సుమశ్రీ పాప చికిత్స కోసం ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టింది.  మెరుగైన వైద్యం అందకపోతే పాప బ్రతకదని వైద్యులు చెప్పడంతో బెంగుళూరు తీసుకెళ్లాలనుకున్నారు. అందుకు సాయిశ్రీ పేరున తండ్రి రాసిన ఫ్లాట్‌ అయినా అమ్మి వైద్యం చేయిద్దామనుకుంది సుమశ్రీ. కానీ అది వీలుకాని పరిస్థితి. ఫ్లాట్‌ బాలిక పేరున ఉన్నా.. మైనర్‌ కావడంతో సంరక్షకుడిగా తండ్రి పేరున ఉంది. ఇక కూతురు మైనర్ కావడం...తండ్రి రౌడీ షీటర్ కావడంతో కొంత మంది ఎమ్మెల్యేల అండదండలతో ఫ్లాట్ ను కబ్జా చేయించారు. ఈ క్రమంలోనే సాయిశ్రీ తన తల్లి సుమశ్రీ దాదాపు పదిరోజులు శివకుమార్ ఇంటి చుట్టూ తిరిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ శివకుమార్ మనసు మాత్రం కరగలేదు. అదిపోగ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అరకొర వైద్యం అందడంతో సాయిశ్రీ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆ పాప వీడియో మాత్రం వైరల్ అయింది. వీడియో విన్న ప్రతి ఒక్కరూ పాప బాధ విని చలించిపోతున్నారు.   ఇదిలా ఉండగా.. తన కూతురు మరణంపై తల్లి సుమశ్రీ మాట్లాడుతూ... తన భర్త నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్న కుమార్తెకు సరైన వైద్యం చేయించకుండా అడ్డుపడిన భర్త శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

పెగ్గేసిన పెళ్లికొడుకుల మత్తు వదిలిస్తోన్న పెళ్లి కూతుళ్లు!

  బీహార్… ఈ పేరు చెప్పగానే మనకు వెనుకబాటుతనం, రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యం, లాలూ అవినీతి పాలన … ఇవే గుర్తుకు వస్తాయి. కాని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీహార్ నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒక విచిత్రమైన కారణం చేత వార్తల్లో నిలిచింది! అదేంటంటే… రెండు మూడు వారాల వ్యవధిలో ముగ్గురు బీహారీ వధువులు పెళ్లికొడుకుల్ని వద్దు పొమ్మని వెళ్లగొట్టేశారు. పీటల మీది దాకా వచ్చిన పెళ్లిల్లు ఎందుకు ఆగిపోతున్నాయి? రీజన్ వింటే ఆశ్చర్యం, ఆనందం కలగక మానవు!   బీహార్ వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనుకబడేసిన ప్రాంతం! రాజకీయ నేతలు తమ స్వార్థం కొద్దీ జనంతో ఆటలాడుకున్నారు. అందుకే, ఒకప్పుడు నలంద లాంటి విశ్వవిద్యాలయం వున్న ఆ రాష్ట్రం ఇప్పుడు విద్యలో, ఉద్యోగాల్లో, అభివృద్దిలో అన్నిట్లో వెనుకబడింది. అందుకు అనేక కారణాలు. వాటిల్లో ముఖ్యమైంది… మద్యపానం! తాగి తాగి అక్కడి మగవాళ్లు తాము చచ్చి , కుటుంబాల్ని కూడా చంపుకుతిన్నారు. పేదరికంలో కూరుకుపోయేలా చేశారు. అయితే, నితీష్ కుమార్ గత ఏప్రెల్ లో మొండి పట్టుదలతో ముందుకు పోయి చెప్పిన మాట ప్రకారం మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. దాని సత్ఫలితాలు మెల్ల మెల్లగా తొంగి చూస్తున్నాయి ఇప్పుడిప్పుడే!   బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం వున్నా మందు దొరుకుతోంది అన్నది బహిరంగ రహస్యం. సీఎం నితీష్ లిక్కర్ బ్యాన్ మెచ్చుకోదగ్గదే అయినా… బ్లాక్ మార్కెట్లో మందు లేకుండా చేయటంలో ఆయన విఫలమయ్యాడు. దాని ఫలితమే అక్కడక్కడా ఇంకా బీహారీ మందు బాబులు చిందులేస్తూనే వున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. ఒకే నెలలో మూడు పెళ్లిల్లు ఆగిపోయి… నోట్లోంచి వచ్చిన మద్యం కంపుతో!   తాజాగా జరిగిన సంఘటనలో పాట్నాకి 75కిలో మీటర్ల దూరంలోని ఓ ఊళ్లో వరుడు పెళ్లికి వచ్చేప్పుడు మందు కొట్టి వచ్చాడట. దండలు మార్చుకునేందుకు వధూ, వరులు దగ్గరికి రావటంతో మనోడి సంగతి అమ్మాయికి తెలిసిపోయింది. అంతే కాదు, అబ్బాయి తరుఫున వచ్చిన మగ పెళ్లి వారు చాలా మంది తాగి వచ్చి రచ్చ చేయటంతో అమ్మాయి మూడు ముళ్లు వేయించుకోటానికి ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి వారు అబ్బాయి బృందం మొత్తాన్ని ఊళ్లోనే బంధించారు. గ్రామ పెద్దలు వచ్చి కట్నం డబ్బులు, కానుకలు అన్నీ తిరిగి ఇచ్చేస్తామని పెళ్లి కొడుకు వారి చేత ఒప్పించాక వదిలేశారు! అయితే, ఇలాంటి దిమ్మ తిరిగే సంఘటన బీహార్లో మొదటిది కాదు. రెండు, మూడు వారాల వ్యవధిలో మూడోది! కొన్నాళ్ల కిందట కూడా ఇలాగే మరో రెండు పల్లెటూళ్లలో కూడా మద్యం తాగొచ్చిన వరుళ్లకి మత్తు దిగే షాకిచ్చారు అమ్మాయిలు!   బీహార్ సీఎం నితీష్ మద్యపాన నిషేధం అనగానే మొదట అందరూ విమర్శించారు. ఆయనతో పొత్తు పెట్టుకున్న లాలూ కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికల హామీగా మాత్రమే చూశాడు. కాని, గెలిచిన తరువాత నితీష్ అన్నంత పనీ చేశాడు. ఆయనెందుకు చేశాడో… ఇప్పుడు ఇలా అమ్మాయిలు పెళ్లిల్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటుంటే అర్థం అవుతోంది. బీహార్ మహిళలు మద్యంతో దశాబ్దాలుగా విసిగి, వేసారి వున్నారు. అందుకే, మద్యం అంటేనే చిర్రెత్తిపోతున్నారు!

యుమున తీరంలో యముడ్ని శాంతింపజేసే యజ్ఞం! మూడో ప్రపంచ రణమే కారణం!

  మూడో ప్రపంచ యుద్ధం… ఈ మాట ఇప్పటికి చాలా సార్లు వినిపించింది. ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కొంత కాలం అందరూ మౌనంగా వున్నారనుకుంటా! ఆ తరువాత నుంచీ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మూడో ప్రపంచ యుద్దం అంటూ కామెంట్లు చేస్తూనే వున్నారు. కాని, 1945 తరవాత గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ థర్డ్ వాల్డ్ వార్ రాలేదు. కాని, ఇక ఆగేది కాదంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు!   అమెరికా, ఉత్తర కొరియా మధ్య టెన్షన్ గురించి మీకు కొంచెమైనా తెలిసి వుంటే మూడో ప్రపంచ యుద్ధం డిస్కషన్ ఇప్పుడెందుకు వచ్చిందో అర్థమైపోతుంది. అమెరికా ఈ మధ్య కాలంలో అఫ్గనిస్తాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాలపై దాడులు చేసింది. కాని, అవేవీ న్యూక్లియర్ కంట్రీస్ కావు. ఇప్పుడు నార్ కొరియా కొట్లాటకు సర్వం  సిద్ధం చేసుకుంది. ఆ దేశ నియంత అణు క్షిపణులు చూసుకుని ఎగిరెగిరిపడుతున్నాడు. ఇక ట్రంప్ కూడా రోజు రోజుకు యుద్ధం తప్ప వేరే మార్గం లేదన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికా, ఉత్తర కొరియాలు అణు దాడులకు దిగితే మాత్రం … అది మూడో ప్రపంచ యుద్ధమే అవ్వబోతోంది!   అమెరికా, కొరియాల మధ్య యుద్ధ వాతావరణం పసిగట్టి థర్డ్ వాల్డ్ వార్ రాబోతోందని చెప్పటం విశ్లేషణ మాత్రమే. కాని, జ్యోతిష్యులు ఆకాశంలోని గ్రహాలు ఆగ్రహంగా వున్నాయంటున్నారు. అనుగ్రహం కోసం యజ్ఞాలు కూడా చేస్తున్నారు. అంతే కాదు, థర్డ్ వాల్డ్ వార్ అనివార్యమని చెబుతోంది మన భారతీయ జ్యోతిష్యులు మాత్రమే కాదు… అమెరికన్ అస్ట్రాలజర్ ఒకరు ఈ బాంబు తొలిసారి పేల్చారు! జూన్ 14న మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అంటూ డేట్ కూడా చెప్పేశాడు! ఆ ప్రముఖ అమెరికన్ అస్ట్రాలజరే గతంలో ట్రంప్ ఖచ్చితంగా యూఎస్ ప్రెసిడెంట్ అవుతాడని కూడా చప్పాడట!   అమెరికన్ అస్ట్రాలజర్ అమెరికా,కొరియా దేశాల మధ్య యుద్ధం గురించి మాట్లాడితే మన దేశ జ్యోతిష్య పండితులు ఇండియా, పాకిస్తాన్ గొడవల గురించి చెప్పుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాక్ అన్ని విధాల వినాశనానికి సంసిద్ధంగా వుంది. ఏ క్షణమైనా భారత్ పూర్తి స్థాయి సర్జికల్ స్ట్రైక్స్ మొదలు పెట్టవచ్చు అంటున్నారు అస్ట్రాలజర్స్! ఇండియా, పాక్ సంబంధాల సంగతి కాస్తో కూస్తో తెలిసిన విశ్లేషకులు కూడా ఈ వాదనని కొట్టిపారేయటం లేదు. భారత ఆర్మీ పగతో రగిలిపోతోంది. కాబట్టి పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావటం సమీప భవిష్యత్ లో దాదాపుగా జరిగే పనే! కాకపోతే, పాక్ వద్ద కూడా ఉత్తర కొరియాలాగే న్యూక్స్ వుండటం అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం!   అమెరికా, ఉత్తర కొరియా, ఇండియా, పాక్ దేశాల మధ్య యుద్ధాలు మూడో ప్రపంచ సంగ్రామానికి నాంది పలుకుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం . కాని, అనలిస్టులు,అస్ట్రాలజర్లు ఇద్దరూ వార్ ని కొట్టిపారేయటం లేదు! అందుకే, మన వాళ్లు కొంత మంది యముడి సోదరి అని భావించే యమున నది తీరంలో విశ్వ శాంతి యజ్ఞం చేస్తున్నారు. యుద్ధం తప్పాలని దైవాన్ని ప్రార్థిస్తున్నారు! మరి హింస తప్పుతుందా? రణమూ, మరణమూ శాంతిస్తాయా? కాలమే తేల్చాలి…

టీచర్ ని లవ్వాడాడు! పెళ్లాడాడు! ఇప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయ్యాడు!

  యూరప్ ఖండంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య తీవ్రమైన పోటీ వుండేది. కేవలం ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకల విషయంలో మాత్రమే కాదు… కవిత్వం, కళలు వంటి వాటి గురించి కూడా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు తెగ పోటీ పడేవి. ఆ పోటీలో భాగంగానే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి యూరోపియన్ దేశాలు ప్రపంచంలోని అనేక దేశాల్ని కాలనీలుగా మార్చుకుని పంచుకున్నాయి! అయితే, ఇంగ్లీషు వాళ్లు ఎప్పుడూ రాజకీయంగా డామినేట్ చేసేవారు! కాని, ఫ్రెంచ్ వారు మాత్రం రొమాన్స్ విషయంలో ముందుండే వారు!   ఎప్పుడో వాల్డ్ వార్ టూకి ముందు విషయాలు ఇప్పుడెందుకు అంటారా? ఒక పెద్ద లింక్ వుంది. అందుకే, ఈ ఉపోద్ఘాతం! ఫ్రాన్స్ ఇప్పుడే కాదు ఎప్పుడూ రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్! వందల సంవత్సరాలుగా మత్తు కలిగించే మద్యాలు, గమ్మత్తు కలిగించే రొమాంటిక్ పద్యాలు అక్కడ సర్వ సాధారణం! ఈ కళల విషయంలో బ్రిటన్ ఎన్నో శతాబ్దాలు ట్రై చేసి కూడా ఫ్రెంచ్ వార్ని ఓడించలేకపోయింది. అయితే, ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ ఫ్రాన్స్ జనాల రొమాంటిక్ ప్యాషన్ ఏ మాత్రం తగ్గినట్టు లేదు! అందుకు తాజా సంచలన ఉదాహరణ… న్యూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యువల్ మాక్రోన్!   తనకంటూ ఓ పార్టీ కూడా లేకుండా ఇండిపెండెంట్ గా బరిలో దిగాడు 39ఏళ్ల ఎమ్మాన్యువల్! ఆయన ప్రత్యర్థిది జాతీయ వాదం అయితే ఈయనది ఆదర్శవాదం. లిబరల్ థింకింగ్ వున్న లెఫ్టిస్ట్ అయిన ఎమ్మాన్యువల్ ని ఆయన ఇచ్చిన వాగ్ధానాలు నమ్మే ఫ్రెంచ్ ఓటర్లు అధికారంలోకి తెచ్చారు. కాకపోతే, క్యాంపైన్ టైంలో ఎమ్మాన్యువల్ కి బాగా కలిసొచ్చిన మరో అంశం… ఆయన భార్య బ్రిజ్జెట్టి! ఇప్పుడు 39ఏళ్లున్న కొత్త అధ్యక్షుడి 64ఏళ్ల భార్య ఆమె!   ఇంకా నలభై నిండని వాడికి అరవై దాటిన బామ్మ భార్య అనటంతోనే అవాక్కయ్యారా? ఇంకా వుంది బోలెడంత ఫ్రెంచ్ రొమాన్స్! ఎమ్మాన్యువల్ 15ఏళ్లున్నప్పుడు బ్రిజెట్టి మనోడి టీచర్! ఆమె ప్రేమలో మునిగిపోయిన టీనేజ్ కుర్రాడు మెల్లగా లైన్లో పెట్టాడు. కాని, అందరు టీనేజర్లలా కొన్నాళ్లకు మర్చిపోకుండా టీచర్ నే కళ్లల్లో, కలల్లో పెట్టుకుని చూసుకుంటూ వచ్చాడు. చేసేది లేక ఈ ఫ్యూచర్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి టీచరమ్మ కూడా పడిపోయింది. అలా 15ఏళ్లప్పుడు స్టార్టైన ఎమ్మాన్యువల్ ప్రేమ కథ ఆయన పీజీ కూడా పూర్తయ్యాక పెళ్లితో కొత్త పుంతలు తొక్కింది. కాని, బ్రిజ్జెట్టికి అప్పటికే పెళ్లైంది. విడాకులు కూడా ఇచ్చేసింది. కాని, ముగ్గురు పిల్లలున్నారు మొదటి భర్త కారణంగా! ఇంకా విడ్డూరం ఏంటంటే.. మన ఎమ్మాన్యువల్ కంటే ఆయన భార్యగారి మొదటి భర్త తాలూకూ మొదటి సంతానం రెండేళ్లు పెద్ద! బ్రిజ్జెట్టి రెండో సంతానమైన కూతురు ఎమ్మాన్యువల్ కి క్లాస్ మేట్!   టీచర్ ని లవ్ చేయటం, పెళ్లి చేసుకోవటం, ఆమె పాతికేళ్లు పెద్దది కావటం, అంతకు ముందే ఆమెకి ముగ్గురు పిల్లలుండటం, వారిలో ఒకరు రెండో భర్తకంటే పెద్ద వారు కావటం… ఇవన్నీ వింటుంటే.. మైండ్ బ్లాంక్ అవుతోంది కదా? ఇలాంటి పెళ్లి, కుటుంబం, నేపథ్యం వుంటే మన దేశంలో ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడేవాడే! కాని, రొమాన్స్ అంటే పడి చచ్చిపోయే ఫ్రెంచ్ జనాలు ఆరితేరిన ఈ స్టూడెంట్ లవ్వర్ నే ఏరికోరి ఎంచుకున్నారు! ఎమ్మాన్యువల్ సక్సెస్ లో ఎంతో కొంత ఈ టీచర్,స్టూడెంట్ రొమాన్స్ పాత్ర కూడా వుందనేది కాదనలేని సత్యం!

కొందరు నేతలు నోరు తెరిస్తే… రాజకీయ దుర్వాసనే!

  భారత్ క్రికెట్ టీమ్ ఏ దేశ జట్టుతో ఓడిపోతే మీరు ఎక్కువ బాధపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా పాకిస్తానే! పాక్ పై ఇండియా గెలిస్తే సంతోషం, ఓడితే దుఃఖం… ఇదీ సామాన్యుల పరిస్థితి. కాని, మన దేశ రాజకీయ నేతలు కొందరికి అలాంటి భావోద్వేగాలు ఏమీ వున్నట్టు లేదు. ఎంత సేపూ తమ రాజకీయ వ్యాఖ్యలు, లాభాలే తప్ప వారికి కొంచెమైనా జాతీయ భావం వుందా అనిపిస్తుంటుంది! క్రికెట్లో ఓడటం కాదు…. ఏకంగా పాకిస్తాన్ మన సైనికుల్నే చంపేస్తుంటే కూడా కొందరి బుద్ధి మారటం లేదు. తాజాగా అఖిలేష్ తన కామెంట్స్ తో  జవాన్ల త్యాగలని వెక్కింరిచారు…   ఆ మధ్య యూపీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ఖూన్ కీ దలాల్ అంటూ మోదీని విమర్శించాడు. ఆయన ఉద్దేశ్యం సైనికుల రక్తాన్ని ప్రధాని తన స్వార్థానికి వాడుకుంటున్నారని! అలా కామెంట్ చేసి రాహుల్ ఆశించింది ఏంటి? యూపీలో రాజకీయ విజయం! ఇప్పుడు అలాంటి మాటలే మాట్లాడాడు అఖిలేష్! ఉత్తర్ ప్రదేశ్ సీఎం నుంచి మాజీ సీఎం అయిన యువనేతకి ఫ్రస్ట్రేషన్ ఇంకా తగ్గినట్టు లేదు. అసలు గుజరాత్ నుంచి ఎవరన్నా సైనికులు దేశం కోసం అమరులయ్యారా… అంటూ ప్రశ్నించాడు! దీన్ని మనం ఏమనాలి?   మోదీ, అమిత్ షా గుజరాతీలు. వారంటే అఖిలేష్ కి పడదు. అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో అయితే మోదీ, షా ఇద్దర్నీ గుజరాత్ గాడిదలన్నాడు అఖిలేష్! అయినా, దాన్ని మనం రాజకీయ దాడిగా చూడవచ్చు. కాని, మోదీపైన ద్వేషాన్ని గుజరాత్ పై చూపిస్తే ఎలా? పైగా జవాన్ల బలిదానాల్ని ముడిపెడుతూ … గుజరాత్ నుంచి ఏ ఒక్క జవాను దేశం కోసం మరణించలేదని అనటం … ఎలాంటి లాజిక్? అఖిలేష్ కే తెలియాలి!   కాశ్మీర్ లో వరుసగా జరుగుతోన్న పాక్ ఆకృత్యాల నేపథ్యంలో కొన్ని గంటల క్రితమే ఒక యువ ఆర్మీ అధికారిని కోల్పోయింది దేశం. ఫయాజ్ అనే కాశ్మీరీ సైనికుడు ఉగ్రవాదుల చేతిలో బలైపోయాడు. ఆయన మరణానికి కారణమైన పాక్ ని ఒక్క మాట కూడా అనని అఖిలేష్ గుజరాత్ గురించి మాత్రం మాట్లాడుతుండటం దారుణమైన విషయం. పోనీ… అఖిలేష్ చెప్పినట్టు నిజంగానే గుజరాత్ నుంచి అమరులు లేనేలేరా? అది పచ్చి అబద్ధం! ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ గుజరాత్ సైనికులు ముగ్గురు కాశ్మీర్ సంరక్షణలో భాగంగానే అమరులయ్యారు! అయినా, కోడి గుడ్డు మీద ఈకలు పీకే పనిలో వున్నారు చాలా మంది నేతలు!   ఒక్క అఖిలేష్ కాదు… అఖిలేష్ వయస్సు కంటే రెట్టింపు సంవత్సరాల అనుభవం వున్న దిగ్విజయ్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా లంటి వారు కూడా అమర సైనికుల త్యాగాలతో ఆటలాడుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు కావాలని ముస్లిమ్ యువతని ఉగ్రవాద కేసుల్లో ఇరికిస్తున్నారని డిగ్గీ అంటే… ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ లో అమరులైన సైనికుల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడతారు? సుక్మాలో మావోల చేతిలో చనిపోయిన వారి గురించి ఎందుకు మాట్లాడరు… అంటూ లాజిక్ లు వెదికాడు! దేశం కోసం బలిదానం చేసే సైనికుల రక్తానికి కూడా మతం, ప్రాంతం అంటగట్టే ఇలాంటి నాయకుల్ని ఎవ్వరూ బాగు చేయలేకపోతున్నారు! వీళ్ల మాటల వల్ల అధికారం కోల్పోయి , జనం చేత తిరస్కరింపబడ్డా బుద్ది మాత్రం మారటం లేదు! చట్ట పరమైన కేసులు ఎలాగూ వుండవు కాబట్టి అడ్డూ అదుపు కూడా వుండటం లేదు!

టీటీడీఈవో వివాదం… జనసేన, సెల్ఫ్ గోల్ తో సెల్ఫ్ డిఫన్స్ లో పడిందా?

  టీటీడీ ఈవో వివాదం ఇంచుమించూ చల్లారినట్టే! కానీ, ఈ మొత్తం వ్యవహారంలో డిఫెన్స్ లో పడ్డది మాత్రం జనసేనలాగే కనిపిస్తోంది! తాజాగా ఆ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఎప్పుడూ పవన్ తప్ప మరో నేత పేరు వినిపించని జనసేనలో.. ఈసారి ఉపాధ్యక్షుడుగా మహేంద్ర రెడ్డి పేరున ఓ వివరణ బయటకొచ్చింది. దాని సారాంశం ప్రకారం… జనసేన ఉద్దేశం ఐఏఎస్ లను తక్కువ చేసి మాట్లాడటం కాదనీ ఆయన అన్నారు. ఉత్తరాదిలోని ఆలయాలకు దక్షిణాది వారు ఈవోలుగా వుండనప్పుడు దక్షిణంలో మాత్రం ఉత్తరాది వారు ఎందుకని మాత్రమే పవన్ ప్రశ్నించారని అన్నారు! అయితే, ఇలా ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి రావటం జనసేనకు కాస్త ఇబ్బందనే చెప్పుకోవాలి!   చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఉత్తరాది ఐఏఎస్ ను చంద్రబాబు టీటీడీ ఈవోగా నియమించారు. అయితే, ఆయన ఏపీ క్యాడర్ అధికారే కాబట్టి టెక్నికల్ గా అందులో తప్పు లేదు. కాని, అది సంప్రదాయం మాత్రం కాదు. ఈ విషయాన్ని హైలైట్ చేయాల్సిన పవర్ స్టార్ ఉత్తర, దక్షిణ పదాలు వాడి తప్పుడు సంకేతాలు పంపినట్లు అయింది. నిజానికి పవన్ కంటే ముందు అభ్యంతరం చెప్పిన స్వామీ స్వరూపానందేంద్ర అనిల్ సింఘాల్ తెలుగు వారు కాదని మాత్రమే అన్నారు. దానికి నార్త్, సౌత్ నినాదం జోడించిన పవన్ కళ్యాణ్ పెద్ద చర్చకు కారకుడయ్యారు. కాని, అదే సమయంలో అఖిల భారత ఐఏఎస్ ల సంఘం ఖండనకు కూడా ఆయన కారణమయ్యారు! దేశంలోని అన్ని చోట్లా పని చేసే సివిల్ సర్వెంట్స్ కి కులం, మతం, ప్రాంతం అంకట్టవద్దని ఐఏఎస్ లు అంటున్నారు. కేవలం ఐఏఎస్ లే కాదు మిగతా చాలా వర్గాల నుంచీ కూడా టీటీడీ ఈవో నియమకంపై గొడవ అనవసరం అన్న అభిప్రాయం వెల్లడైంది. ఇక మోహన్ బాబు లాంటి వారు అనీల్ కుమార్ సింఘాల్ కి తమ మద్దతు కూడా ప్రకటించారు! ఇలాంటి పరిణామాలతో, జనసేన, దేశ సమగ్రత విషయంలో తమకు ఎవరు సాటిరారని చెప్పుకోవాల్సి వచ్చింది!   పవన్ కామెంట్స్ కు బదులుగా ఐఏఎస్ లు స్పందించటం, పవన్ తో పొసగదని పేరున్న మోహన్ బాబు తన అభిప్రాయం వెలిబుచ్చటం, అశోక్ గజపతి రాజు కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనటం… అన్నీ చూస్తుంటే… కదపాల్సిన వారు తెర వెనుక వుంటూ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది! ముందు ముందు జనసేన అధినేత ఏ మాట మాట్లాడినా ప్రతి వ్యూహం అమలయ్యేలా కనిపిస్తోంది. చూడాలి మరి…పవర్ స్టార్ తన పవర్ ఫుల్ పంథా కొనసాగిస్తారా? లేక ఆచితూచి కామెంట్స్ చేస్తారా?

జడ్జ్ గారు జంప్! అరెస్ట్ చేసే పనిలో మూడు రాష్ట్రాల పోలీసులు!

జ్యోతిష్యం నిజమో కాదోగాని… గుడ్ టైం, బ్యాడ్ టైం మాత్రం నిజమే! మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లైఫ్ లో బ్యాడ్ పీరియడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కష్ట కాలమే ఆ జడ్జ్ గారికొచ్చింది! తన కెరీర్లో ఎందరికో జైలు శిక్షలు వేసిన ఆయన మరో నెల రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. పాపం… సరిగ్గా క్లైమాక్స్ దశలో ఆయనకు శని మహాదశ మొదలైనట్టుంది! రకరకాల మలుపుల మధ్య జడ్జిగారికే జైలు శిక్ష పడింది! అయితే, ఆర్నెళ్లే కదా వెళ్లి వచ్చేద్దాం అనుకోలేదు పెద్దాయన. మూడు రాష్ట్రాల పోలీసులకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ అదృశ్యమైపోయాడు! ఇప్పుడిక ఎప్పుడూ దొంగల్ని వేటాడే ఖాకీలకి గౌరవనీయులైన న్యాయమూర్తిగార్ని దొరకబుచ్చుకోవటం పెద్ద సవాలే అయి కూర్చుంది!   జస్టిస్ కర్ణన్ కేసు ఇప్పుడు దేశంలో పెద్దగా చర్చగా మారింది. ఆయన సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా చాలా మంది జడ్జీలను అవినీతిపరులంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు, తాను దళితుడ్ని కాబట్టి కుల వివక్ష చూపిస్తున్నారని కూడా ఆరోపించాడు. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాల్లో సుప్రీమ్ కు, కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి అయిన కర్ణన్ కు తీవ్రమైన యుద్ధం జరిగింది. ఎప్పుడూ అనూహ్యంగా ప్రవర్తించే జస్టిస్ కర్ణన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికే ఐదేళ్లు కఠిన కారాగారా శిక్ష విధించాడు. దానికి బదులుగా సుప్రీమ్ కూడా జస్టిస్ కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్ష వేసింది! కాని, మొండి పట్టుదలకి బాగా ఫేమస్ అయిన కర్ణన్ కోర్టు వేసిన శిక్షను గంభీరంగా అంగీకరించలేదు! వున్నట్టుండీ ప్రభుత్వ అతిథి గృహం నుంచీ మాయమైపోయాడు! పోలీసులు అవాక్కైపోయారు!   సుప్రీమ్ కోర్టు ఒక పదవిలో వున్న జడ్జీకి శిక్ష వేసి సంచలనం రేపితే… స్వయంగా జడ్జీ అయి వుండి పోలీసులకి చిక్కకుండా అదృశ్యమై కర్ణన్ కలకలం రేపుతున్నాడు. ఆయన కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తి కాగా సుప్రీమ్ తీర్పు సమయంలో చెన్నైలో వున్నాడు. అక్కడ్నుంచి కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసేందకు వచ్చేటప్పటికి కనిపించకుండాపోయాడు. కోల్ కతా పోలీసు బృందం తమిళ పోలీసుల్ని వెంటబెట్టుకుని వచ్చి నెల్లూరులో సోదాలు జరిపింది. ఇందుకు ఏపీ పోలీసులు కూడా సహకరించారు! మొత్తానికి మూడు రాష్ట్రాల పోలీసులు వేట కొనసాగించిన సార్ వారు ఎక్కడ దొరకలేదు!   జస్టిస్ కర్ణన్ కేసులో కొసమెరుపు ఏంటంటే… తమిళనాడులోని ఆయన స్వగ్రామంలో ఊరి జనం తమ జడ్జీగారికి జైలు శిక్ష రద్దు చేయాలని ధర్నా చేశారట! ఏది ఏమైనా మరో నెల రోజుల్లో రిటైర్ అవ్వనున్న సీనియర్ న్యాయమూర్తి సుప్రీమ్ తీర్పును గౌరవిస్తూ అరెస్ట్ అయిపోయి వుంటే ఎంతో బావుండేది అంటున్నారు విశ్లేషకులు. ఎన్నో తీర్పులిచ్చిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు అమలు విషయంలో పోలీసులకి సహకరించాల్సింది!

బుగ్గ కార్లో తిరిగే పర్మిషన్ బ్రిటీష్ వారు ఇచ్చారట! మోదీ చెప్పినా పట్టించుకోడట!

ఎర్ర బుగ్గ కార్ మీద పెట్టుకుని తిరగటం అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు! అదో స్టేటస్ సింబల్. అయితే, అది నిజంగానే గొప్ప స్థాయికి సంకేతం కావచ్చు కాని ప్రజాస్వామ్యంలో అంతిమ స్థానం ఎవరిది? ప్రజలది. ఇక్కడ జనమే మహారాజులు. ఎన్నికలప్పుడు వాళ్లు ఓట్లు వేసి అందలం ఎక్కిస్తేనే ఎవరైనా పదవులు చేపట్టేది. పదవులు చేపడితేనే ఎర్రబుగ్గ కార్లు సిద్ధంగా వుండేది! మరి అటువంటి కోట్లాది జనానికి నాయకులు, వీఐపీలు తమ బుగ్గ కార్లతో ఇబ్బంది కలిగించటం సబబా? రోడ్ల మీద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ లకు కారణం అవ్వటమే కాకుండా… తమకి తాము చక్రవర్తుల్లాగా, దైవాంశ సంభూతుల్లాగా బుగ్గ కార్లలోని శాల్తీలు ఫీలవటం సమంజసమేనా? కానే కాదు!   కార్లపై ఎర్ర బుగ్గలు పెట్టుకోటాన్ని ఎందరో ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ మధ్యే మోదీ సర్కార్ లాల్ బత్తి సంస్కృతిని నిషేధించింది. ప్రధాని సహా ఎవ్వరూ బుగ్గ కార్ల గోలతో రోడ్లపై తిరగొద్దని తీర్మానించింది. దాని ఫలితంగానే కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా బుగ్గలు మాయం అవుతున్నాయి. చాలా మంది నేతలు తమ కార్లపై అలంకారాలు, అహంకారాలు తొలంగిచేస్తున్నారు! అయితే, ఈ తతంగం అంతటికీ తాను అతీతం అంటున్నారు నురూర్ రెహ్మాన్ బర్కతి! ఎవరీయనా అంటే… కోల్ కతాలోని టిప్పు సుల్తాన్ మసీద్ కు ప్రధాన ఇమామ్!   స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చెప్పినా తాను బుగ్గను తొలంగించనని తేల్చి చెప్పేశాడు బర్కతి. అంతే కాదు, ఓ విచిత్రమైన వాదన కూడా మీడియా ముందుకు తెచ్చాడు. తనకు ఎర్ర బుగ్గ పెట్టుకునే అనుమతి బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిందన్నాడు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ చెబితే తాను తీసేయనని ప్రకటించాడు! అసలు ఈ బ్రిటీష్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు! అయితే, బర్కతి గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఈ ఎర్ర బుగ్గ అంశం విషయంలో ఆయన మాటలు విని ఆశ్చర్యపోవటం లేదు. ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది! ఇమామ్ గా తనకున్న లాల్ బత్తి సౌకర్యాన్ని వదిలేది లేదని చెప్పిన ఆయన అదే మీటింగ్ లో బీజేపి, ఆరెస్సెస్ కోసం ఎవరైనా ముస్లిమ్ లు పని చేస్తే చితగ్గొడతామని అన్నాడు. వాళ్లని ఇస్లామ్ నుంచి వెలి వేస్తామని కూడా హెచ్చరించాడు. ఇక ఎవరైనా మసీదుల ముందు జై శ్రీరామ్ అంటే వారు హిజ్రాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు!   గతంలో ఈ ఎర్ర బుగ్గ ఇమామ్ మోదీని టార్గెట్ చేస్తూ ఫత్వా జారీ చేసి కలకలం రేపాడు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని తల , గడ్డం కొరిగి, ఆయన మీద నల్ల ఇంకు పోసిన వారికి 25లక్షలు ఇస్తానని అన్నాడు! బెంగాల్ కు చెందిన ఇమామ్ బర్కతి సహజంగానే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు. అందుకే, ఆయన బీజేపీ, ఆరెస్సెస్, మోదీలపై అగ్గి మీద గుగ్గిలం అవుతుంటాడని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్!

2019లో… టీడీపీ, బీజేపికి ‘పవర్’ ఫుల్ పోరు తప్పదా?

2014 ఎన్నికలు సమైక్యాంధ్రలో జరిగాయి. కాని, అప్పటికే విభజన బిల్లు పాసైపోయింది కాబట్టి పోరు ఏపీ, తెలంగాణలకు వేరు వేరుగానే జరిగింది. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ టీ కాంగ్రెస్ అయితే… ఏపీలో బాబు వర్సెస్ జగన్ గా నడిచింది. కాని, 2019 ఎన్నికలు ఎలా వుండబోతున్నాయి? ఖచ్చితంగా 2014లో అంత సుస్పష్టంగా మత్రం వుండబోవటం లేదు. అందుకు కారణం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరే!   గత ఎన్నికల్లో పోటీ చేయని పవన్ సైకిల్ కి, కమలానికి మద్దతు పలికాడు. కారణాలు ఏమైనా ఆయన సపోర్ట్ కూడా కలిసి వచ్చిన ఎన్డీఏ కూటమి ఏపీని కైవసం చేసుకుంది. కాని, మెల్లమెల్లగా జనంలోకి వచ్చిన జనసేనాని బీజేపి మీద స్వరం పెంచుతూ వచ్చాడు. ప్రత్యేక హోదా నుంచి ఉత్తర , దక్షిణ విభేదాల దాకా పవన్ పంథా చాలా మారిపోయింది. ఇక తాజాగా ఆయన హిట్ లిస్ట్ లో టీడీపీ కూడా చేరినట్టే కనిపిస్తోంది. అప్పుడప్పుడూ ఆయన టీడీపీని టార్గెట్ చేసినా ఇంత వరకూ బీజేపిని విమర్శించినంత ఘాటుగా, నేరుగా దుయ్యబట్టలేదు. కాని, తాజాగా టీటీడీ ఈవో నియామకంపై చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ మరీ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఉత్తరాది ఐపీఎస్ ను సీఎం ఎలా ఎన్నుకున్నారని ప్రశ్నించాడు!   పవన్ , టీడీపీల మధ్య పెరుగుతోన్న అంతరానికి మరో తాజా ఉదాహరణ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు! ఆయన అసలు పవన్ ఎవరో తనకు తెలియదని బాంబు పేల్చారు. ఆయన సినిమా వాడట కదా… నేను సినిమా చూసి చాలా ఏళ్లైపోయింది… అన్నారు. నిజంగా రాజుగారికి పవన్ తెలియదా? అలా భావిస్తే మనమే వెర్రివాళ్లం అవుతాం. కాకపోతే గతంలో పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర విమానాయాన శాఖా మంత్రి అలా అని వుంటారు. ఇంతకు ముందు జనసేనాని ఆయన్ని కేంద్ర మంత్రి పదవి వదిలేసి రమ్మని సవాల్ విసిరాడు. ఎందుకు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పదవి కోసం ప్రత్యేక హోదా విషయంలో కాంప్రమైజ్ అవుతారని సూటిగా కొశన్ చేశాడు!   పవన్ బీజేపిని, అప్పుడప్పుడూ టీడీపీని టార్గెట్ చేస్తున్నా రెండు పార్టీల నాయకులు పెద్దగా ప్రతి విమర్శలు చేస్తున్నట్టు మనకు కనిపించదు. పవన్ లాంటి మాటలే జగన్ మాట్లాడితే ముప్పేట దాడి జరిగిపోయేది ఈపాటికి. కాని, జనంలో, మరీ ముఖ్యంగా యూత్ లో భీభత్సమైన క్రేజ్ వున్న పవర్ స్టార్ తో అనవసర విభేదాలు వద్దన్నట్టు ప్రవర్తిస్తున్నాయి కమలం, సైకిల్. కాని, పవన్ పంథా ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఫైట్ ఇంట్రస్టింగ్ మారిపోవచ్చు. ఒకవైపు టీడీపీ, బీజేపి, మరో వైపు జగన్, ఇంకో వైపు జనసేనతో పవన్ మోహరించవచ్చు. ఇక అప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలతో అట్టుడికిపోవటం ఖాయం! అలాగే, పవన్ ఎంత కీలకంగా మారితే ఎన్నికల ఫలితాలు కూడా అంతే అనూహ్యంగా వుండే ఛాన్స్ వుంది! 

ట్యాంపరైంది ఈవీఎంలా? కేజ్రీవాలా ఇమేజా?

అరవింద్ కేజ్రీవాల్… ఉరఫ్ ఏకే… ఒకప్పుడు ఈ పేరు ఏకే 47లాగా పెద్ద పెద్ద నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది! అన్నా హజారే పక్కన అవినీతి వ్యతిరేక కాగడాలా మెరిసిన ఈ తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చి కూడా సత్తా చాటాడు. దిల్లీని కైవసం చేసుకున్నాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు సీఎం అయ్యాడు. కాని, ఇప్పుడు ఏకే 47 అన్ని దిక్కుల్నుంచీ ఎదురవుతోన్న దాడులకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ట్రిగ్గర్ తాను నొక్కటం కాదు.. ఎవరు ఎప్పుడు ఏ ట్రిగ్గర్ తనపై గురి పెట్టి నొక్కుతారో అర్థం కాక కొంత అయోమయంలో కూడా పడిపోయాడు…   అరవింద్ కేజ్రీవాల్ 67సీట్లతో దిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకున్నాడు. కాని, అక్కడితో ఆగక ఆయన అనుక్షణం ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాల్ని ఒక పట్టు పడదామని ప్లాన్ చేశాడు. అందుకే, డీమానిటైజేషన్ లాంటివి వచ్చినప్పుడు దేశంలోని ఏ సీఎం చేయనంత హంగామా చేశాడు. కాని, ఇక్కడ కేజ్రీవాల్ అనుభవ రాహిత్యం బయటపడింది. కేవలం ఎన్డీఏ సీఎంలే కాదు ఇతర కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రాంతీయ పార్టీల సీఎంలు కూడా ప్రధానితో ప్రతీదానికీ విభేదించరు. అదే పనిగా విమర్శించరు. పీఎం స్థానంలో ఎవరు వున్నా తమ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటూ బండి నెట్టుకొస్తారు. కాని, ఏకే ఏకంగా పీఎం అవ్వాలన్నా తాపత్రయంలో మోదీని అటాక్ చేస్తూ చేస్తూ స్వంత సుడిగుండంలో చిక్కుకున్నాడు!   ప్రజలు తన చేతిలో పెట్టిన దిల్లీ రాష్ట్రాన్ని ఏనాడూ సీరియస్ గా పరిపాలించని కేజ్రీవాల్ మొన్న జరిగిన ఎంసీడీ ఎలక్షన్స్ లో జనం అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాడు. అయినా, ఆయన తన మైండ్ సెట్ మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ ఆప్ ఓటమి ఈవీఎంల వల్ల మాత్రమే జరిగిందంటూ జనాన్ని నమ్మబలికిస్తున్నాడు. దిల్లీ అసెంబ్లీలో ఈవీఎంల ట్యాంపరింగ్ చిటికెలో పనంటూ తన ఎమ్మెల్యే చేత మ్యాజిక్ షో చేయించాడు. అసలు ఇలా ట్రయల్ షో చేసినంత మాత్రాన ప్రూవ్ అయ్యేది ఏంటి? ఎలక్ట్రానికి మిషన్ అనేది ఏదైనా ట్యాంపర్ చేయటం సాధ్యమే. అది అందరూ ఒప్పుకుంటారు. కాని, అసెంబ్లీలోకి తమ స్వంత ఈవీఎంలు ఆప్ తీసుకొచ్చి వాట్ని ట్యాంపర్ చేసినంత మాత్రాన భారత ఎలక్షన్ కమీషన్ ఈవీఎంలు ట్యాంపరైనట్టా? అదెలా సాధ్యం?   ఈవీఎంల గురించి తాను దిల్లీలో గెలిచినప్పుడు, బీహార్లో నీతీష్, లాలు విజయం సాధించినప్పుడూ మాట్లాడని అరవింద్ ఇప్పుడు మాట్లాడటమే విచిత్రం. అంతకంటే విడ్డూరం ఏంటంటే… ఒకవైపు తన స్వంత మినిస్టరే తనపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే ముందు దాని గురించి తేల్చకుండా ఈవీఎంలలోని దోషాలను నిరూపించటం ఓవర్ స్మార్ట్ తనం కాక మరేం అవుతుంది? ఇలా దృష్టి మరల్చే పనుల ద్వారా నెగ్గుకు రావచ్చు అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఆప్ కంటే రెండాకులు ఎక్కువే చేయగలవు! కాని, దిల్లీ జనం కేజ్రీవాల్ ను నమ్మింది ఆయన సంప్రదాయ పార్టీల కంటే భిన్నంగా ఏదో నిజాయితీగా చేస్తాడని! అలాంటి పరిణామాలు ఇంతవరకూ ఏ మాత్రం జరగలేదు!   ఎన్నికల్లో బ్యాడ్ ఫర్పామెన్స్, దిల్లీ పాలనలో దారుణమైన నిర్లక్ష్యం మాత్రమే కాదు… అరవింద్ తన పార్టీని కూడా సరిగ్గా నడుపుతున్నట్టు, నడపగలిగేట్టు కనిపించటం లేదు. దేశంలోని అనేక పార్టీలతో పోల్చితే అత్యంత చిన్న పార్టీ అయినా ఆప్ లో గ్రూపులకు మాత్రం కొదవలేదు. దానికి గుర్తే నిన్నగాక మొన్న తిరుగుబాటు చేసిన కుమార్ విశ్వాస్ వర్గం! అంతకు ముందు పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్! ఇలా కేజ్రీవాల్ పార్టీకి, ప్రభుత్వానికి రెంటికీ ఎసరు తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. చూడాలి మరి… మోదీ, అమిత్ షా లాంటి ఉద్ధండులు వున్న జాతీయ పార్టీ, అధికార పక్షమూ అయిన బీజేపి ఒక వైపు, కేజ్రీవాల్ అన్నీ తానై మోసుకొస్తున్న ఆప్ ఒకవైపు… అంతిమ విజయం ఎవరిదో!

ట్రెండ్ ఫాలో అవ్వని పవర్ స్టార్… ఉత్తరం,దక్షిణంతో ట్రెండ్ క్రియేట్ చేస్తాడా?

  పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఆయన రొటీన్ కి భిన్నంగా వెళతారు. తనకు నచ్చింది చేస్తారు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్లు ఎదురైనా సేఫ్ గేమ్ ఆడటం ఆయన డిక్షనరీలో కనిపించదు! అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలు కాటమరాయుడు దాకా ఇదే తంతు! తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చినా, కొమురం పులి లాంటి డిజాస్టర్ వచ్చినా పవన్ రూటు మారదు! ఎవరూ ఊహించని సినిమాలు చేయటమే పవర్ స్టార్ పంథా! కాకపోతే, ఇదే పద్ధతి పాలిటిక్స్ లో వర్కవుట్ అవుతుందా? రొటీన్ కి భిన్నమైన అంశం నెత్తికెత్తుకుని జనంలోకి వెళితే… జనసేనాని మద్దతు పొందగలరా? రానున్న ఎన్నికలే తేల్చాలి…   అప్పుడెప్పుడో తమిళ కురు వృద్ధుడు కరుణానిధి మంచి యవ్వనంలో వుండగా ఉత్తర, దక్షిణ భారతదేశాల గొడవ భీభత్సంగా వుండేది. హిందీ అంటే చాలు హింసాత్మకమైపోయే వారు తమిళ తంబీలు! కాని, కాలక్రమంలో కరుణానిధి కూడా జన జీవన స్రవంతిలో కలవక తప్పలేదు! దక్షిణాది వాడైన ఆదిశంకరులు ఉత్తరాదికి వెళ్లారు. ఉత్తరాదిలో అవతరించిన శ్రీరాముడు శ్రీలంకదాకా దక్షిణాదినంతా పావనం చేశాడు. ఇటువంటి చరిత్ర, నేపథ్యం, సంస్కృతి వున్న దేశంలో ఉత్తర, దక్షిణ పిడకల వేట ఎక్కువ కాలం నడిచేది కాదు! కాని, అదే నెత్తికెత్తుకుంటున్నాడు పవన్….   పవన్ కళ్యాణ్ యాంటీ నార్త్ ట్వీట్లు, నినాదాల పరంపర ప్రత్యేక హోదాతో మొదలైంది. ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ కేంద్రం ఇవ్వలేదు. అది ఖచ్చితంగా తప్పే. కాని, అందుకు సరిపడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు బీజేపీ, టీడీపీ పెద్దలు. దానితో పవర్ స్టార్ సాటిస్ ఫై అయిపోవాలా? అక్కర్లేదు. ప్రత్యేక హోదా వచ్చేదాకా పోరాడాల్సిందే! తెలంగాణ కోసం పదేళ్ల యూపీఏ ప్రభుత్వంతో కేసీఆర్ అలాగే పోరాడారు కూడా. కాని, కేంద్రాన్ని ఒప్పించాల్సిన జనసేన అధ్యక్షుడు అంతకంతకూ ధిక్కార స్వరంతో ఫోకస్ మిస్ అవుతున్నాడని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు!   గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో పదే పదే ఉత్తరాది, దక్షిణాది కామెంట్లు చేస్తోన్న పవన్ కళ్యాణ్ బీజేపీ నేత తరూణ్ విజయ్ పైన కూడా తీవ్రంగా ఫైరయ్యారు. ఇక తాజాగా టీటీడీ ఈవో ఎంపికపై కూడా ఆయన నార్త్, సౌత్ కోణంలో మాట్లాడారు. అమర్ నాథ్, కాశీ, మథురాల్లో దక్షిణాది వారు వుంటారా? మరి ఇక్కడ ఉత్తరాది వారెందుకు అన్నారు! చంద్రబాబు నిర్ణయంపై కూడా ఒకరకంగా నిరసన తెలిపారు! కాని, సామాన్య జనం ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? టీటీడీలో ఉత్తరాది అధికారి వుండటం అంత దారుణమైన పరిణామా? కాకపోవచ్చంటున్నారు రాజకీయ అనలిస్టులు. ఎందుకంటే, తిరుమల తెలుగు వారి ఆధీనంలో వుండొచ్చేమో కాని దేశం నలుమూలల నుంచీ అక్కడికి లక్షలాది మంది వస్తారు. సహజంగానే వేంకటేశ్వరుడ్ని బాలాజీగా భావించే ఉత్తరాది హిందువులు కూడా అందులో వుంటారు. ఇక ఆలిండియా సర్వీస్ అయిన ఐఏఎస్ కేటగిరిలోని వారు ఎక్కడైనా పని చేయవచ్చు. ఇది రాజ్యాంగబద్దమే. కాబట్టి పవన్ ఒక ఐఏఎస్ నియామకంపై విమర్శలు చేయటం సరికాదంటున్నారు అబర్వర్స్.   ఎన్నికలు అంతకంతకూ దగ్గరకొచ్చేస్తోన్న వేళ పవన్ కళ్యాణ్ తన ఉత్తరాది, దక్షిణాది విమర్శల విషయంలో క్లారిటి తెచ్చుకుంటే మంచిది. ఇప్పటికిప్పుడు చర్చకి కారణమయ్యే ట్వీట్ల కన్నా దీర్ఘ కాలంలో జనసేన పార్టీకి మేలు చేసే పోరాటాలే మేలు. చూడాలి మరి… తన కెరీర్ ని ఎవ్వరి సాయం లేకుండా తీర్చిదిద్దుకున్న పవర్ స్టార్ పాలిటిక్స్ లో కూడా సలహాలు, సూచనల కన్నా తన ఇష్టాయిష్టాలు, బలమైన భావాలకే పెద్ద పీట వేస్తారేమో!