ధర్నా చౌక్ కోసం ధర్నా… ప్రభుత్వానికి కావాల్సిందే ప్రతిపక్షాలు చేశాయా?
posted on May 16, 2017 @ 12:05PM
హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్… ఆ పార్క్ పక్కనే ధర్నా చౌక్… రెండు దశాబ్దాలుగా ఆ ధర్నా చౌక్ ఎన్నో ధర్నాల్ని చూసింది! కాని, సోమవారం నాడు జరిగిన ధర్నా … చౌక్ చరిత్రలోనే విచిత్రం! విపరీతం కూడా! ఎందుకంటే, ధర్నా చౌక్ లో తాజాగా జరిగింది దాదాపుగా చివరి ధర్నా! ఎలాగైనా అక్కడ్నుంచీ చౌక్ ను ఎత్తేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే అది జరిపోవచ్చు కూడా. ఆపే అవకాశం ఇంచుమించూ ప్రతిపక్షాలకు , ప్రజా సంఘాలకు, జేఏసీకి లేదనే చెప్పాలి. ధర్నా చౌక్ ఎక్కడ వుండాలని నిర్ణయించే హక్కు ఏ విధంగా చూసినా అధికారంలోని ప్రభుత్వానిదే!
ధర్నా చౌక్ మార్పు నిజానికి పెద్ద సమస్యేం కాదు. తెలంగాణలో మిర్చీ రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అలాగే, రైతుల్ని క్రిమినల్స్ లాగా బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లటం చాలా మందికి సహించలేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో ధర్నా చౌక్ ధర్నాలు కేసీఆర్ సర్కార్ కు అందివచ్చిన అవకాశంగా ఉపయోగపడ్డాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టిన ప్రతిపక్షాలు ఇందిరా పార్కు వద్ద బలప్రదర్శనకు దిగాయి. అందుకు తగ్గట్టే ఓ వర్గం మీడియా చెబుతోన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ధీటుగా సమాధానమిచ్చే వ్యూహం పన్నింది. లేడీ పోలీసుల్ని కూడా స్థానికులు, వాకర్స్ అంటూ ధర్నాలో కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించుకునే క్రమంలో అసలు తీవ్రమైన సమస్యలు పక్క దారి పట్టాయి.
దిల్లీలో పార్లమెంట్ కు దగ్గర్లోనే జంతర్ మంతర్ వుంటుంది. అక్కడ ధర్నాలు చేస్తుంటారు. అదే రీతిలో హైద్రాబాద్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్లకు దగ్గరగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వుండేది ఇన్నాళ్లు. దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అక్కడ్నుంచి తొలగించటం టీసర్కార్ పొరపాటే అనవచ్చు. కాని, అది మరీ అంత పెద్ద సమస్య కూడా కాదు. మరీ ముఖ్యంగా జేఏసీ, కమ్యూనిస్టులు, జనసేన కార్యకర్తలు పట్టుదలకి పోయి ధర్నా చౌక్ కోసం ధర్నాలు చేయటంతో అనవసర ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల మీద నుంచీ మీడియా, జనం దృష్టి మళ్లింది. కాబట్టి బీజేపి, టీటీడీపి, జేఏసీ…. అన్నీ ఒక నిర్ణయానికి వచ్చి ధర్నా చౌక్ గొడవ పెద్దగా చేయకపోవటమే మేలు. అంతకంటే తీవ్రమైన ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తే గవర్నమెంట్ కార్నర్ అయ్యే ఛాన్స్ వుంటుంది.
ధర్నా చౌక్ ఎక్కడ వున్నా అసెంబ్లీ, సెక్రటేరియట్ దాకా పోలీసులు ఉద్యమకారుల్ని,నిరసనకారుల్ని అస్సలు వెళ్లనీయరు. అరెస్టులతో కథ కంచికి చేరాల్సిందే. కాబట్టి ధర్నా చౌక్ కేసీఆర్ కాస్త దూరంగా ఏర్పాటు చేసినా ప్రతిపక్షాలు ఉరుకోవటమే మేలు. అలాంటి నిర్ణయం ఒకవేళ నిజంగా అప్రజాస్వామికమే అయినా… సామాన్య జనంపై అది చూపే ప్రభావం చాలా స్వల్పం. అటువంటి దానిపై అహానికిపోయి పోరాటం చేస్తే అసలు సమస్యలు చర్చకు నోచుకోవు. అది ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రతిపక్షాలకే నష్టం…