2019లో… టీడీపీ, బీజేపికి ‘పవర్’ ఫుల్ పోరు తప్పదా?
posted on May 10, 2017 @ 10:37AM
2014 ఎన్నికలు సమైక్యాంధ్రలో జరిగాయి. కాని, అప్పటికే విభజన బిల్లు పాసైపోయింది కాబట్టి పోరు ఏపీ, తెలంగాణలకు వేరు వేరుగానే జరిగింది. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ టీ కాంగ్రెస్ అయితే… ఏపీలో బాబు వర్సెస్ జగన్ గా నడిచింది. కాని, 2019 ఎన్నికలు ఎలా వుండబోతున్నాయి? ఖచ్చితంగా 2014లో అంత సుస్పష్టంగా మత్రం వుండబోవటం లేదు. అందుకు కారణం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరే!
గత ఎన్నికల్లో పోటీ చేయని పవన్ సైకిల్ కి, కమలానికి మద్దతు పలికాడు. కారణాలు ఏమైనా ఆయన సపోర్ట్ కూడా కలిసి వచ్చిన ఎన్డీఏ కూటమి ఏపీని కైవసం చేసుకుంది. కాని, మెల్లమెల్లగా జనంలోకి వచ్చిన జనసేనాని బీజేపి మీద స్వరం పెంచుతూ వచ్చాడు. ప్రత్యేక హోదా నుంచి ఉత్తర , దక్షిణ విభేదాల దాకా పవన్ పంథా చాలా మారిపోయింది. ఇక తాజాగా ఆయన హిట్ లిస్ట్ లో టీడీపీ కూడా చేరినట్టే కనిపిస్తోంది. అప్పుడప్పుడూ ఆయన టీడీపీని టార్గెట్ చేసినా ఇంత వరకూ బీజేపిని విమర్శించినంత ఘాటుగా, నేరుగా దుయ్యబట్టలేదు. కాని, తాజాగా టీటీడీ ఈవో నియామకంపై చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ మరీ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఉత్తరాది ఐపీఎస్ ను సీఎం ఎలా ఎన్నుకున్నారని ప్రశ్నించాడు!
పవన్ , టీడీపీల మధ్య పెరుగుతోన్న అంతరానికి మరో తాజా ఉదాహరణ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు! ఆయన అసలు పవన్ ఎవరో తనకు తెలియదని బాంబు పేల్చారు. ఆయన సినిమా వాడట కదా… నేను సినిమా చూసి చాలా ఏళ్లైపోయింది… అన్నారు. నిజంగా రాజుగారికి పవన్ తెలియదా? అలా భావిస్తే మనమే వెర్రివాళ్లం అవుతాం. కాకపోతే గతంలో పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర విమానాయాన శాఖా మంత్రి అలా అని వుంటారు. ఇంతకు ముందు జనసేనాని ఆయన్ని కేంద్ర మంత్రి పదవి వదిలేసి రమ్మని సవాల్ విసిరాడు. ఎందుకు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పదవి కోసం ప్రత్యేక హోదా విషయంలో కాంప్రమైజ్ అవుతారని సూటిగా కొశన్ చేశాడు!
పవన్ బీజేపిని, అప్పుడప్పుడూ టీడీపీని టార్గెట్ చేస్తున్నా రెండు పార్టీల నాయకులు పెద్దగా ప్రతి విమర్శలు చేస్తున్నట్టు మనకు కనిపించదు. పవన్ లాంటి మాటలే జగన్ మాట్లాడితే ముప్పేట దాడి జరిగిపోయేది ఈపాటికి. కాని, జనంలో, మరీ ముఖ్యంగా యూత్ లో భీభత్సమైన క్రేజ్ వున్న పవర్ స్టార్ తో అనవసర విభేదాలు వద్దన్నట్టు ప్రవర్తిస్తున్నాయి కమలం, సైకిల్. కాని, పవన్ పంథా ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఫైట్ ఇంట్రస్టింగ్ మారిపోవచ్చు. ఒకవైపు టీడీపీ, బీజేపి, మరో వైపు జగన్, ఇంకో వైపు జనసేనతో పవన్ మోహరించవచ్చు. ఇక అప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలతో అట్టుడికిపోవటం ఖాయం! అలాగే, పవన్ ఎంత కీలకంగా మారితే ఎన్నికల ఫలితాలు కూడా అంతే అనూహ్యంగా వుండే ఛాన్స్ వుంది!