అయోధ్య రాముడి పార్టీ భద్రాది రాముడి రాష్ట్రంలో పాగా వేస్తుందా?
ప్రస్తుత బీజేపికి మోదీ ఇంజన్ లాంటి వారైతే… అమిత్ షా ఇంధనం! అవును, ఆయన సత్తా తోడు కాకపోతే మోదీ విజయాలు ఇంత తేలిక అయ్యి వుండేవే కావు. కాశ్మీర్ లో ప్రభుత్వంలో భాగం కావటం మొదలు మణిపూర్లో సర్కార్ ఏర్పాటు వరకూ షా వ్యూహాలు ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అయితే, మోదీ , షా ఇద్దరి వేడీ ఇంత వరకూ దక్షిణాది పార్టీలకు, నేతలకు తగల లేదనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కమలం ఎఫెక్ట్ తక్కువ. ఇక కర్ణాటకలో అదును కోసం ఓపిగ్గా వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకే సౌత్ ఇంకా మోదీ, అమిత్ షా దండయాత్ర నుంచి సేఫ్ గా వుండగలుగుతోంది.
ఇప్పటి వరకూ బీజేపి ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పడకున్నా ముందు ముందు ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది కాషాయదళం. అందుకే, ఫస్ట్ ఎటాక్ కింద మూడు రోజుల టీ టూర్ వేస్తున్నారు షా. ఆయన పర్యటనలో భాగంగా చాలా మంది ఇతర పార్టీల ముఖ్య నేతల మనసులు మారతాయని బీజేపి ఆశిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలో వుంది, కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు కూడా గులాబీ పార్టీకి వున్నాడు కాబట్టి దానికి డ్యామేజ్ తక్కువేనంటున్నారు విశ్లేషకులు. ఇక మిగిలింది బీజేపికి జాతీయ స్థాయిలోనూ బద్ధ శత్రువైన కాంగ్రెస్. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన టీ కాంగ్ కు షా ఎఫెక్ట్ ఎక్కువే వుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. అసోమ్ నుంచి కర్ణాటక దాకా అంతటా కాంగ్రెస్ టాప్ లీడర్స్ ని టార్గెట్ చేస్తోంది బీజేపి. అదే క్రమంలో తెలంగాణలో కూడా కోమటిరెట్టి బ్రదర్స్ లాంటి వార్ని కాషాయదళంలోకి లాగవచ్చని అంటున్నారు. ఇంకా ఎలాంటి కన్ ఫర్మేషన్ లేకున్నా భవిష్యత్ లో బీజేపి పంచన చేరే కాంగ్ నేతలు చాలా మందే వుండవచ్చు. కారణం… తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన ప్రతిపక్ష నేతగా నిలిచిన లీడర్ ఒక్కరూ లేరు. అలాగే, జాతీయ స్థాయిలోనూ రాహుల్ గాంధీ టీమ్ అధికారం చేజిక్కించుకునే సీన్ ఇప్పుడప్పుడే లేదు. కాబట్టి టీఆర్ఎస్ లోకి వెళ్లలేని కాంగ్రెస్ నేతలు బీజేపిని ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా కమలం కండువా వేసుకుంటాడని బలంగా ప్రచారం జరుగుతోంది. కాని, ఆయన ఇంత వరకూ ఎలాంటి సంకేతాలు, సూచనలు మాత్రం ఇవ్వటం లేదు…
తెలంగాణలో దాదాపుగా అంతమైన టీ టీడీపీ, అతి కష్టంగా కాలం నెట్టుకొస్తున్న కాంగ్రెస్… బీజేపికి చక్కటి ఛాన్స్ ఇస్తున్నాయి విస్తరించేందుకు. అలాగే, తన ప్రస్తుత పర్యటనలో షా నల్గొండని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. బహుశా కమలం టార్గెట్ తెలంగాణలోని కమ్యూనిస్ట్ హాట్ స్పాట్ లు కూడా అయి వుండవచ్చు. జాతీయ స్థాయిలో బెంగాల్, కేరళ, త్రిపుర లాంటి చోట్లలోనే కమ్యూనిస్టుల్ని ఎదురించి పోరాడుతున్న కమలం తెలంగాణలోనూ వార్ని టార్గెట్ చేయటం సహజమే. ఇక హైద్రాబాద్ లో ఎంఐఎం ఎలాగూ వుండనే వుంది! మొత్తానికి అమిత్ షా వ్యూహం ఫలించి పెద్ద ఎత్తున్న వలసలు చోటు చేసుకుంటే మాత్రం 2019లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోవటం ఖాయం. రాష్ట్రంలో అధికారం టీఆర్ఎస్ చేయి నుంచి జారినా , జారకున్నా కేంద్రంలో మోదీని రెండో సారి ప్రధానిని చేసేందుకు తెలంగాణ నుంచి బీజేపి ఎంపీలు ఎన్నిక కావటం తథ్యం. చూడాలి మరి… తమ సెక్యులర్ ఇమేజ్ లు పక్కన పెట్టిన హిందూత్వ కండువాలు తెలంగాణలో ఎందరు కప్పుకుంటారో!