ట్రెండ్ ఫాలో అవ్వని పవర్ స్టార్… ఉత్తరం,దక్షిణంతో ట్రెండ్ క్రియేట్ చేస్తాడా?
posted on May 9, 2017 @ 12:25PM
పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఆయన రొటీన్ కి భిన్నంగా వెళతారు. తనకు నచ్చింది చేస్తారు. ఎన్నిసార్లు ఫెయిల్యూర్లు ఎదురైనా సేఫ్ గేమ్ ఆడటం ఆయన డిక్షనరీలో కనిపించదు! అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలు కాటమరాయుడు దాకా ఇదే తంతు! తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చినా, కొమురం పులి లాంటి డిజాస్టర్ వచ్చినా పవన్ రూటు మారదు! ఎవరూ ఊహించని సినిమాలు చేయటమే పవర్ స్టార్ పంథా! కాకపోతే, ఇదే పద్ధతి పాలిటిక్స్ లో వర్కవుట్ అవుతుందా? రొటీన్ కి భిన్నమైన అంశం నెత్తికెత్తుకుని జనంలోకి వెళితే… జనసేనాని మద్దతు పొందగలరా? రానున్న ఎన్నికలే తేల్చాలి…
అప్పుడెప్పుడో తమిళ కురు వృద్ధుడు కరుణానిధి మంచి యవ్వనంలో వుండగా ఉత్తర, దక్షిణ భారతదేశాల గొడవ భీభత్సంగా వుండేది. హిందీ అంటే చాలు హింసాత్మకమైపోయే వారు తమిళ తంబీలు! కాని, కాలక్రమంలో కరుణానిధి కూడా జన జీవన స్రవంతిలో కలవక తప్పలేదు! దక్షిణాది వాడైన ఆదిశంకరులు ఉత్తరాదికి వెళ్లారు. ఉత్తరాదిలో అవతరించిన శ్రీరాముడు శ్రీలంకదాకా దక్షిణాదినంతా పావనం చేశాడు. ఇటువంటి చరిత్ర, నేపథ్యం, సంస్కృతి వున్న దేశంలో ఉత్తర, దక్షిణ పిడకల వేట ఎక్కువ కాలం నడిచేది కాదు! కాని, అదే నెత్తికెత్తుకుంటున్నాడు పవన్….
పవన్ కళ్యాణ్ యాంటీ నార్త్ ట్వీట్లు, నినాదాల పరంపర ప్రత్యేక హోదాతో మొదలైంది. ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ కేంద్రం ఇవ్వలేదు. అది ఖచ్చితంగా తప్పే. కాని, అందుకు సరిపడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు బీజేపీ, టీడీపీ పెద్దలు. దానితో పవర్ స్టార్ సాటిస్ ఫై అయిపోవాలా? అక్కర్లేదు. ప్రత్యేక హోదా వచ్చేదాకా పోరాడాల్సిందే! తెలంగాణ కోసం పదేళ్ల యూపీఏ ప్రభుత్వంతో కేసీఆర్ అలాగే పోరాడారు కూడా. కాని, కేంద్రాన్ని ఒప్పించాల్సిన జనసేన అధ్యక్షుడు అంతకంతకూ ధిక్కార స్వరంతో ఫోకస్ మిస్ అవుతున్నాడని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు!
గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో పదే పదే ఉత్తరాది, దక్షిణాది కామెంట్లు చేస్తోన్న పవన్ కళ్యాణ్ బీజేపీ నేత తరూణ్ విజయ్ పైన కూడా తీవ్రంగా ఫైరయ్యారు. ఇక తాజాగా టీటీడీ ఈవో ఎంపికపై కూడా ఆయన నార్త్, సౌత్ కోణంలో మాట్లాడారు. అమర్ నాథ్, కాశీ, మథురాల్లో దక్షిణాది వారు వుంటారా? మరి ఇక్కడ ఉత్తరాది వారెందుకు అన్నారు! చంద్రబాబు నిర్ణయంపై కూడా ఒకరకంగా నిరసన తెలిపారు! కాని, సామాన్య జనం ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? టీటీడీలో ఉత్తరాది అధికారి వుండటం అంత దారుణమైన పరిణామా? కాకపోవచ్చంటున్నారు రాజకీయ అనలిస్టులు. ఎందుకంటే, తిరుమల తెలుగు వారి ఆధీనంలో వుండొచ్చేమో కాని దేశం నలుమూలల నుంచీ అక్కడికి లక్షలాది మంది వస్తారు. సహజంగానే వేంకటేశ్వరుడ్ని బాలాజీగా భావించే ఉత్తరాది హిందువులు కూడా అందులో వుంటారు. ఇక ఆలిండియా సర్వీస్ అయిన ఐఏఎస్ కేటగిరిలోని వారు ఎక్కడైనా పని చేయవచ్చు. ఇది రాజ్యాంగబద్దమే. కాబట్టి పవన్ ఒక ఐఏఎస్ నియామకంపై విమర్శలు చేయటం సరికాదంటున్నారు అబర్వర్స్.
ఎన్నికలు అంతకంతకూ దగ్గరకొచ్చేస్తోన్న వేళ పవన్ కళ్యాణ్ తన ఉత్తరాది, దక్షిణాది విమర్శల విషయంలో క్లారిటి తెచ్చుకుంటే మంచిది. ఇప్పటికిప్పుడు చర్చకి కారణమయ్యే ట్వీట్ల కన్నా దీర్ఘ కాలంలో జనసేన పార్టీకి మేలు చేసే పోరాటాలే మేలు. చూడాలి మరి… తన కెరీర్ ని ఎవ్వరి సాయం లేకుండా తీర్చిదిద్దుకున్న పవర్ స్టార్ పాలిటిక్స్ లో కూడా సలహాలు, సూచనల కన్నా తన ఇష్టాయిష్టాలు, బలమైన భావాలకే పెద్ద పీట వేస్తారేమో!