రాజకీయ సినిమా కోసం… రజినీ మేకప్ వేసుకోటం మొదలెట్టేశాడా?
posted on May 16, 2017 @ 2:41PM
మన దేశంలో ఎన్నికలపై అత్యంత ప్రభావం చూపే అంశాలు ఏంటి? డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతం వగైరా వగైరా! ఇవి కాక మరేదైనా ఎలక్షన్స్ ను తారుమారు చేసే ఛాన్స్ వుందా? ఖచ్చితంగా వుంది! సౌత్ ఇండియాలో అయితే సినిమా గ్లామర్ పాలిటిక్స్ ను బాగానే ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ టైంలో వున్నంత సీన్ ఇప్పుడు లేకపోయినా హీరోలు ప్రతీ ఎన్నికల ముందు కలకలం రేపటం మనం చూస్తూనే వున్నాం. కేవలం ప్రచారం చేసి ఊరుకునే వారు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవారు, సీఎంలు అవ్వాలని ప్రయత్నించే వారు ప్రతీ రాష్ట్రంలోనూ వున్నారు. దివంగత జయలలిత తరువాత మళ్లీ ఇప్పుడప్పుడే సినిమా వాళ్లెవరూ ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలైతే కనిపించటం లేదు! కాని, ఇంకా ఎటూ తేల్చని తలైవా పైన మాత్రం ఆయన అభిమానులు గట్టి నమ్మకం పెట్టుకున్నారు!
ఒక పార్టీ పెట్టడం, అన్ని వర్గాల ఓట్లు సంపాదించటం, సీఎం అవ్వటం అంత ఆషామాషీ కాదు. అందుకే, తమిళనాడులో విజయ్ కాంత్ మొదలు మన దగ్గర చిరు వరకూ చాలా మంది అసెంబ్లీకి వెళ్లారుగాని… సెక్రటేరియట్లు కైవసం చేసుకోలేకపోయారు. ఇక ఇప్పుడు ఆ సత్తా వుందని ప్రచారం జరుగుతోన్న ఒకడే ఒక్కడు మొనగాడు… మన ముత్తు, రజినీకాంత్! ఆయన వస్తారనీ, చెన్నై చేజిక్కించుకుంటారని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. కాని, అత్యంత తాజాగా కూడా రోబో ఎలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. ఎప్పటిలాగే దేవుడిపైన భారం వేశాడు అరుణాచలం!
గతంలో చాలా సార్లు రాజకీయాల్లోకి రమ్మని రజినీకాంత్ పై ఒత్తిడి వచ్చినా ఆయన రాలేదు. అందుకు కారణాలు బోలెడు. అన్నిటికంటే ముఖ్యంగా బంగారం లాంటి కెరీర్ ఆయన ముందు వుండింది. అలాగే, ఒకవైపు జయ, మరోవైపు కరుణా నిర్ధాక్షిణ్యంగా దాడి చేయటానికి సిద్ధంగా వుండేవారు. ఇప్పుడు అలాంటి సమస్యలు అన్నీ పోయాయి. ఇంకా సినిమాలు చేస్తున్నప్పటికీ సుదీర్ఘ కెరీర్ మాత్రం లేదని చెప్పక తప్పదు. వయసు పెరిగిపోతోంది. అలాగే, జయ, కరుణా లేని లోటు తమిళనాడు ప్రతీ రోజు చవిచూస్తోంది. కాబట్టి ఈ సంధి కాలం పడయప్ప బాగా వాడుకోవచ్చు. కాని, ఏనాడూ తెగించి రణ రంగంలోకి దూకని మన హీరో మరోసారి తనదైన స్టైల్లో సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. రాజకీయాల్లోని రానని గతంలో లాగా తెగిసి చెప్పకపోయినప్పటికీ దేవుడు శాసిస్తే వస్తానంటూ పాత పాటే పాడాడు. మరి దేవుడు తమిళ వెండితెర వేల్పుకి ఏం చెబుతాడు? రాజకీయాల్లోకి వెళ్లమనా? వద్దనా? ఆ విషయం పార్లమెంట్ ఎన్నికలో, అసెంబ్లీ ఎన్నికలో వస్తే తప్ప తేలేది కాదు! కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం నిజం… రజినీకాంత్ చెప్పిన దేవుడు త్వరలోనే ఏదో ఒక ఆర్డర్ మాత్రం వేయవచ్చు! ఆర్డర్ మోదీ, అమిత్ షాలు సూపర్ స్టార్ వద్దకి మోసుకు రావచ్చు!
తమిళ రాజకీయాల్లో కీలకంగా ఎదగాలనుకుంటున్న బీజేపి రజినీ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వటం దాదాపు పక్కానే. కాని ఎప్పుడు ఎలా అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్!