పెగ్గేసిన పెళ్లికొడుకుల మత్తు వదిలిస్తోన్న పెళ్లి కూతుళ్లు!
posted on May 13, 2017 @ 3:20PM
బీహార్… ఈ పేరు చెప్పగానే మనకు వెనుకబాటుతనం, రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యం, లాలూ అవినీతి పాలన … ఇవే గుర్తుకు వస్తాయి. కాని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీహార్ నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఒక విచిత్రమైన కారణం చేత వార్తల్లో నిలిచింది! అదేంటంటే… రెండు మూడు వారాల వ్యవధిలో ముగ్గురు బీహారీ వధువులు పెళ్లికొడుకుల్ని వద్దు పొమ్మని వెళ్లగొట్టేశారు. పీటల మీది దాకా వచ్చిన పెళ్లిల్లు ఎందుకు ఆగిపోతున్నాయి? రీజన్ వింటే ఆశ్చర్యం, ఆనందం కలగక మానవు!
బీహార్ వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనుకబడేసిన ప్రాంతం! రాజకీయ నేతలు తమ స్వార్థం కొద్దీ జనంతో ఆటలాడుకున్నారు. అందుకే, ఒకప్పుడు నలంద లాంటి విశ్వవిద్యాలయం వున్న ఆ రాష్ట్రం ఇప్పుడు విద్యలో, ఉద్యోగాల్లో, అభివృద్దిలో అన్నిట్లో వెనుకబడింది. అందుకు అనేక కారణాలు. వాటిల్లో ముఖ్యమైంది… మద్యపానం! తాగి తాగి అక్కడి మగవాళ్లు తాము చచ్చి , కుటుంబాల్ని కూడా చంపుకుతిన్నారు. పేదరికంలో కూరుకుపోయేలా చేశారు. అయితే, నితీష్ కుమార్ గత ఏప్రెల్ లో మొండి పట్టుదలతో ముందుకు పోయి చెప్పిన మాట ప్రకారం మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. దాని సత్ఫలితాలు మెల్ల మెల్లగా తొంగి చూస్తున్నాయి ఇప్పుడిప్పుడే!
బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం వున్నా మందు దొరుకుతోంది అన్నది బహిరంగ రహస్యం. సీఎం నితీష్ లిక్కర్ బ్యాన్ మెచ్చుకోదగ్గదే అయినా… బ్లాక్ మార్కెట్లో మందు లేకుండా చేయటంలో ఆయన విఫలమయ్యాడు. దాని ఫలితమే అక్కడక్కడా ఇంకా బీహారీ మందు బాబులు చిందులేస్తూనే వున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. ఒకే నెలలో మూడు పెళ్లిల్లు ఆగిపోయి… నోట్లోంచి వచ్చిన మద్యం కంపుతో!
తాజాగా జరిగిన సంఘటనలో పాట్నాకి 75కిలో మీటర్ల దూరంలోని ఓ ఊళ్లో వరుడు పెళ్లికి వచ్చేప్పుడు మందు కొట్టి వచ్చాడట. దండలు మార్చుకునేందుకు వధూ, వరులు దగ్గరికి రావటంతో మనోడి సంగతి అమ్మాయికి తెలిసిపోయింది. అంతే కాదు, అబ్బాయి తరుఫున వచ్చిన మగ పెళ్లి వారు చాలా మంది తాగి వచ్చి రచ్చ చేయటంతో అమ్మాయి మూడు ముళ్లు వేయించుకోటానికి ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి వారు అబ్బాయి బృందం మొత్తాన్ని ఊళ్లోనే బంధించారు. గ్రామ పెద్దలు వచ్చి కట్నం డబ్బులు, కానుకలు అన్నీ తిరిగి ఇచ్చేస్తామని పెళ్లి కొడుకు వారి చేత ఒప్పించాక వదిలేశారు! అయితే, ఇలాంటి దిమ్మ తిరిగే సంఘటన బీహార్లో మొదటిది కాదు. రెండు, మూడు వారాల వ్యవధిలో మూడోది! కొన్నాళ్ల కిందట కూడా ఇలాగే మరో రెండు పల్లెటూళ్లలో కూడా మద్యం తాగొచ్చిన వరుళ్లకి మత్తు దిగే షాకిచ్చారు అమ్మాయిలు!
బీహార్ సీఎం నితీష్ మద్యపాన నిషేధం అనగానే మొదట అందరూ విమర్శించారు. ఆయనతో పొత్తు పెట్టుకున్న లాలూ కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికల హామీగా మాత్రమే చూశాడు. కాని, గెలిచిన తరువాత నితీష్ అన్నంత పనీ చేశాడు. ఆయనెందుకు చేశాడో… ఇప్పుడు ఇలా అమ్మాయిలు పెళ్లిల్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటుంటే అర్థం అవుతోంది. బీహార్ మహిళలు మద్యంతో దశాబ్దాలుగా విసిగి, వేసారి వున్నారు. అందుకే, మద్యం అంటేనే చిర్రెత్తిపోతున్నారు!