ప్రధానిగా మోదీకి మూడేళ్లు! అపోజిషన్ కి మాత్రం మూడాఫ్!
posted on May 16, 2017 @ 4:02PM
2014 మే 16… ఆధునిక భారత చరిత్రలో పెద్ద మలుపు! కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రస్థానంలో పెద్ద కుదుపు! ఎవ్వరూ ఎప్పుడూ ఊహించనిది జరగనే జరిగింది. చాలా మంది దశాబ్దాల పాటూ ఆశపడుతూ వచ్చింది… ఎట్టకేలకు సాకారమైంది! అదే మోదీ ప్రధాని కావటం! కాంగ్రెస్ తప్ప భారతదేశ చరిత్రలో మరే పార్టీ స్వంత మెజార్జీ సాధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ రికార్డ్ బద్ధలైంది మూడేళ్ల కింద… ఇదే రోజు! అప్పట్నుంచీ చాలా మంది చాలా మార్పులు, విప్లవాలు, అభివృద్ధులు ఆశించారు. అవేమీ మోదీ శకంలో అనుభవంలోకి రాలేదు. అయినా, మూడేళ్ల అనంతరం నమోకి నమోన్నమః అంటూనే వున్నారట దేశంలోని అత్యధిక జనం…
దాదాపు 60శాతానికి పైగా ప్రజలు ఇంకా మోదీ మీద నమ్మకంతోనే వున్నారని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగలేదు. నిత్యావసరాల ధరలు తగ్గిందీ లేదు. అలాగే, పాకిస్తాన్ సమస్య, ఉగ్రవాదం ఎటూ పోయింది లేదు. మరింత ముదిరాయి కూడా. కాశ్మీర్ కల్లోలంగా మారింది. అయినా, 2014 పార్లమెంట్ మొదలు 2017 యూపీ అసెంబ్లీ వరకూ మోదీ దండయాత్రని ఎందుకు ఎవ్వరూ అడ్డుకోలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం… బీజేపి బలం కాదు… విపక్షాల బలహీనత అంటున్నారు క్రిటిక్స్. మోదీని ఢీకొట్టాలంటే మోదీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన రాజకీయవేత్త, నిజాయితీపరుడు కావాలి! అలాంటి నాయకుడు దేశంలోని బీజేపియేతర పార్టీలన్నిట్లో భూతద్దం వేసి వెదికినా దొరకటం లేదు. మాస్ అప్పీల్ వుంటే మంచి పేరు వుండదు. మంచి పేరుంటే జాతీయ స్థాయిలో సత్తా వుండదు. ఇదీ మోదీకి వ్యతిరేకంగా పోరాడుతోన్న నేతలందరి పరిస్థితి!
ఉన్నట్టుండీ పెద్ద నోట్లు రద్దు చేసిన మోదీ కోట్లాది మంది జనాన్ని ఏటీఎంల ముందు నిలబెట్టారు. అయినా, జనం ఆగ్రహంతో ఊగిపోతారనకుంటే సీన్ రివర్స్ అయింది. డీమానిటైజేషన్ మోదీ చేసిన విఫల యత్నంగా భావించే తప్ప… అందులో ఆయనకు దురుద్దేశాలున్నాయని జనం భావించలేదు. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ దాడి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయారు. ఇంచుమించూ ఇదే గడ్డు పరిస్థితి మిగతా అంశాల విషయంలోనూ మోదీ వ్యతిరేకులకి ఎదురవుతోంది. మూడేళ్ల ప్రధాని మోదీని ముప్పై ఏళ్ల జాతీయ అనుభవం వున్న నాయకులు కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకు కారణం మోదీ విజయాల శాతం తక్కువగా వున్నా దేశం ఆయన నిజాయితీని నమ్ముతుండటమే.
నరేంద్ర మోదీని నిలువరించలేకపోయిన నాయకుల్లో స్వంత పార్టీలోని అద్వానీ మొదలు ప్రతిపక్ష పార్టీల్లోని రాహుల్, నితీష్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ములాయం, మాయావతి… ఇలా అందరూ వున్నారు. విచిత్రంగా శివసేన లాంటి పార్టీలు , వాటి నాయకులు కూడా మోదీ మీద మింగలేక కక్కలేకా అన్నట్లు కోపాన్ని పంటికింద అనుచుకుని భాగస్వాములుగా వుంటున్నారు.
మరో రెండేళ్లలో మళ్లీ దేశం ఎన్నికల పోరుతో రణరంగం అవ్వనుంది. అప్పుడు కూడా పెద్దగా అనూహ్య మార్పులేం వుండబోవని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇందుకు వారు చూపుతున్న కారణం మోదీ విజయాలు కావు. ప్రతిపక్షాలకు కరువైన నాయకత్వం. రాహుల్, కేజ్రీవాల్, నితీష్…. ఇలా ఎవ్వరూ జనం సమక్షంలో మోదీకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. అసలు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అయితే… 2019 పక్కన పెట్టి 2024 కన్నా సమర్థ నాయకత్వాన్ని ముందు పెట్టుకుని బరిలోకి దిగాలని సూచిస్తున్నారు! మొత్తం మీద మూఢేళ్ల ప్రధాని మోదీ … జనంలో ప్రేమని ఎంతగా తట్టిలేపారో తెలియదుగాని… ప్రతిపక్షాల్లో నిస్పృహని మాత్రం పూర్తిగా గుమ్మరించారు!