ట్యాంపరైంది ఈవీఎంలా? కేజ్రీవాలా ఇమేజా?
posted on May 10, 2017 @ 10:26AM
అరవింద్ కేజ్రీవాల్… ఉరఫ్ ఏకే… ఒకప్పుడు ఈ పేరు ఏకే 47లాగా పెద్ద పెద్ద నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది! అన్నా హజారే పక్కన అవినీతి వ్యతిరేక కాగడాలా మెరిసిన ఈ తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చి కూడా సత్తా చాటాడు. దిల్లీని కైవసం చేసుకున్నాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు సీఎం అయ్యాడు. కాని, ఇప్పుడు ఏకే 47 అన్ని దిక్కుల్నుంచీ ఎదురవుతోన్న దాడులకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ట్రిగ్గర్ తాను నొక్కటం కాదు.. ఎవరు ఎప్పుడు ఏ ట్రిగ్గర్ తనపై గురి పెట్టి నొక్కుతారో అర్థం కాక కొంత అయోమయంలో కూడా పడిపోయాడు…
అరవింద్ కేజ్రీవాల్ 67సీట్లతో దిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకున్నాడు. కాని, అక్కడితో ఆగక ఆయన అనుక్షణం ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాల్ని ఒక పట్టు పడదామని ప్లాన్ చేశాడు. అందుకే, డీమానిటైజేషన్ లాంటివి వచ్చినప్పుడు దేశంలోని ఏ సీఎం చేయనంత హంగామా చేశాడు. కాని, ఇక్కడ కేజ్రీవాల్ అనుభవ రాహిత్యం బయటపడింది. కేవలం ఎన్డీఏ సీఎంలే కాదు ఇతర కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రాంతీయ పార్టీల సీఎంలు కూడా ప్రధానితో ప్రతీదానికీ విభేదించరు. అదే పనిగా విమర్శించరు. పీఎం స్థానంలో ఎవరు వున్నా తమ రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటూ బండి నెట్టుకొస్తారు. కాని, ఏకే ఏకంగా పీఎం అవ్వాలన్నా తాపత్రయంలో మోదీని అటాక్ చేస్తూ చేస్తూ స్వంత సుడిగుండంలో చిక్కుకున్నాడు!
ప్రజలు తన చేతిలో పెట్టిన దిల్లీ రాష్ట్రాన్ని ఏనాడూ సీరియస్ గా పరిపాలించని కేజ్రీవాల్ మొన్న జరిగిన ఎంసీడీ ఎలక్షన్స్ లో జనం అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాడు. అయినా, ఆయన తన మైండ్ సెట్ మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ ఆప్ ఓటమి ఈవీఎంల వల్ల మాత్రమే జరిగిందంటూ జనాన్ని నమ్మబలికిస్తున్నాడు. దిల్లీ అసెంబ్లీలో ఈవీఎంల ట్యాంపరింగ్ చిటికెలో పనంటూ తన ఎమ్మెల్యే చేత మ్యాజిక్ షో చేయించాడు. అసలు ఇలా ట్రయల్ షో చేసినంత మాత్రాన ప్రూవ్ అయ్యేది ఏంటి? ఎలక్ట్రానికి మిషన్ అనేది ఏదైనా ట్యాంపర్ చేయటం సాధ్యమే. అది అందరూ ఒప్పుకుంటారు. కాని, అసెంబ్లీలోకి తమ స్వంత ఈవీఎంలు ఆప్ తీసుకొచ్చి వాట్ని ట్యాంపర్ చేసినంత మాత్రాన భారత ఎలక్షన్ కమీషన్ ఈవీఎంలు ట్యాంపరైనట్టా? అదెలా సాధ్యం?
ఈవీఎంల గురించి తాను దిల్లీలో గెలిచినప్పుడు, బీహార్లో నీతీష్, లాలు విజయం సాధించినప్పుడూ మాట్లాడని అరవింద్ ఇప్పుడు మాట్లాడటమే విచిత్రం. అంతకంటే విడ్డూరం ఏంటంటే… ఒకవైపు తన స్వంత మినిస్టరే తనపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే ముందు దాని గురించి తేల్చకుండా ఈవీఎంలలోని దోషాలను నిరూపించటం ఓవర్ స్మార్ట్ తనం కాక మరేం అవుతుంది? ఇలా దృష్టి మరల్చే పనుల ద్వారా నెగ్గుకు రావచ్చు అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఆప్ కంటే రెండాకులు ఎక్కువే చేయగలవు! కాని, దిల్లీ జనం కేజ్రీవాల్ ను నమ్మింది ఆయన సంప్రదాయ పార్టీల కంటే భిన్నంగా ఏదో నిజాయితీగా చేస్తాడని! అలాంటి పరిణామాలు ఇంతవరకూ ఏ మాత్రం జరగలేదు!
ఎన్నికల్లో బ్యాడ్ ఫర్పామెన్స్, దిల్లీ పాలనలో దారుణమైన నిర్లక్ష్యం మాత్రమే కాదు… అరవింద్ తన పార్టీని కూడా సరిగ్గా నడుపుతున్నట్టు, నడపగలిగేట్టు కనిపించటం లేదు. దేశంలోని అనేక పార్టీలతో పోల్చితే అత్యంత చిన్న పార్టీ అయినా ఆప్ లో గ్రూపులకు మాత్రం కొదవలేదు. దానికి గుర్తే నిన్నగాక మొన్న తిరుగుబాటు చేసిన కుమార్ విశ్వాస్ వర్గం! అంతకు ముందు పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్! ఇలా కేజ్రీవాల్ పార్టీకి, ప్రభుత్వానికి రెంటికీ ఎసరు తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. చూడాలి మరి… మోదీ, అమిత్ షా లాంటి ఉద్ధండులు వున్న జాతీయ పార్టీ, అధికార పక్షమూ అయిన బీజేపి ఒక వైపు, కేజ్రీవాల్ అన్నీ తానై మోసుకొస్తున్న ఆప్ ఒకవైపు… అంతిమ విజయం ఎవరిదో!