బుగ్గ కార్లో తిరిగే పర్మిషన్ బ్రిటీష్ వారు ఇచ్చారట! మోదీ చెప్పినా పట్టించుకోడట!
posted on May 10, 2017 @ 3:34PM
ఎర్ర బుగ్గ కార్ మీద పెట్టుకుని తిరగటం అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు! అదో స్టేటస్ సింబల్. అయితే, అది నిజంగానే గొప్ప స్థాయికి సంకేతం కావచ్చు కాని ప్రజాస్వామ్యంలో అంతిమ స్థానం ఎవరిది? ప్రజలది. ఇక్కడ జనమే మహారాజులు. ఎన్నికలప్పుడు వాళ్లు ఓట్లు వేసి అందలం ఎక్కిస్తేనే ఎవరైనా పదవులు చేపట్టేది. పదవులు చేపడితేనే ఎర్రబుగ్గ కార్లు సిద్ధంగా వుండేది! మరి అటువంటి కోట్లాది జనానికి నాయకులు, వీఐపీలు తమ బుగ్గ కార్లతో ఇబ్బంది కలిగించటం సబబా? రోడ్ల మీద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ లకు కారణం అవ్వటమే కాకుండా… తమకి తాము చక్రవర్తుల్లాగా, దైవాంశ సంభూతుల్లాగా బుగ్గ కార్లలోని శాల్తీలు ఫీలవటం సమంజసమేనా? కానే కాదు!
కార్లపై ఎర్ర బుగ్గలు పెట్టుకోటాన్ని ఎందరో ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ మధ్యే మోదీ సర్కార్ లాల్ బత్తి సంస్కృతిని నిషేధించింది. ప్రధాని సహా ఎవ్వరూ బుగ్గ కార్ల గోలతో రోడ్లపై తిరగొద్దని తీర్మానించింది. దాని ఫలితంగానే కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా బుగ్గలు మాయం అవుతున్నాయి. చాలా మంది నేతలు తమ కార్లపై అలంకారాలు, అహంకారాలు తొలంగిచేస్తున్నారు! అయితే, ఈ తతంగం అంతటికీ తాను అతీతం అంటున్నారు నురూర్ రెహ్మాన్ బర్కతి! ఎవరీయనా అంటే… కోల్ కతాలోని టిప్పు సుల్తాన్ మసీద్ కు ప్రధాన ఇమామ్!
స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చెప్పినా తాను బుగ్గను తొలంగించనని తేల్చి చెప్పేశాడు బర్కతి. అంతే కాదు, ఓ విచిత్రమైన వాదన కూడా మీడియా ముందుకు తెచ్చాడు. తనకు ఎర్ర బుగ్గ పెట్టుకునే అనుమతి బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిందన్నాడు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ చెబితే తాను తీసేయనని ప్రకటించాడు! అసలు ఈ బ్రిటీష్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు! అయితే, బర్కతి గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఈ ఎర్ర బుగ్గ అంశం విషయంలో ఆయన మాటలు విని ఆశ్చర్యపోవటం లేదు. ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది! ఇమామ్ గా తనకున్న లాల్ బత్తి సౌకర్యాన్ని వదిలేది లేదని చెప్పిన ఆయన అదే మీటింగ్ లో బీజేపి, ఆరెస్సెస్ కోసం ఎవరైనా ముస్లిమ్ లు పని చేస్తే చితగ్గొడతామని అన్నాడు. వాళ్లని ఇస్లామ్ నుంచి వెలి వేస్తామని కూడా హెచ్చరించాడు. ఇక ఎవరైనా మసీదుల ముందు జై శ్రీరామ్ అంటే వారు హిజ్రాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు!
గతంలో ఈ ఎర్ర బుగ్గ ఇమామ్ మోదీని టార్గెట్ చేస్తూ ఫత్వా జారీ చేసి కలకలం రేపాడు. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని తల , గడ్డం కొరిగి, ఆయన మీద నల్ల ఇంకు పోసిన వారికి 25లక్షలు ఇస్తానని అన్నాడు! బెంగాల్ కు చెందిన ఇమామ్ బర్కతి సహజంగానే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు. అందుకే, ఆయన బీజేపీ, ఆరెస్సెస్, మోదీలపై అగ్గి మీద గుగ్గిలం అవుతుంటాడని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్!