పాక్ ఉన్మాదం పెరిగిపోతోంది! ప్రపంచ అనుమానం ముదిరిపోతోంది!
posted on May 16, 2017 @ 4:16PM
ఉగ్రవాదం అనగానే మనకు పాకిస్తాన్ గుర్తుకు వస్తుంది. మన దేశంలో జరిగే ప్రతీ దాడికి కారణం పాకిస్తానే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకూ పాకిస్తాన్ ఎలాగోలా తన ప్రభావం చూపుతూనే వుంటుంది. కాంగ్రెస్ వున్నా, బీజేపి వచ్చినా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ వుండటం లేదు. పాకిస్తాన్ మన సైనికుల తలలు నరకటం యథేచ్ఛగా జరుగుతూనే వుంది. అయితే, రాను రాను పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా అనే విషయం ఇండియానే కాదు ప్రపంచం మొత్తం నమ్మటంతో మొదలుపెడుతోంది. ఇది కొంతలో కొంత శుభ సూచకం!
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు చాలా రోజుల వరకూ పాకిస్తాన్ పాడు పనులు పట్టించుకోనే లేదు. వెస్టన్ కంట్రీస్ దృష్టిలో టెర్రరిజమ్ అంతా ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, పాలస్తీనాల్లోనే పుడుతూ వుంటుంది. కాని, ఈ అభిప్రాయం ఎంత తప్పో అమెరికా స్వయంగా నిరూపించుకుంది. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే అగ్రరాజ్యానికి దొరికాడు.అక్కడే మట్టుబెట్టారు. కేవలం ఆల్ ఖైదా కాదు తాలిబన్, లష్కరే తోయిబా నుంచి ఐసిస్ దాకా అన్ని ఉగ్రవాద సంస్థల లింకులు పాకిస్తాన్ లో దొరుకుతాయి. అసలు ప్రపంచంలోని అతి పెద్ద ఉగ్రవాద నెట్ వర్క్ పాకిస్తాన్ వారి ఐఎస్ఐ మాత్రమే!
పాకిస్తాన్ దశాబ్దాల తరబడి తన భూభాగంపై ఉగ్రవాదుల ఫ్యాక్టరీలు నడుపుతోందని భారత్ చెబుతూనే వుంది. ఇప్పుడు కూడా కుల్భూషణ్ జాదవ్ అనే భారతీయుడ్ని గూఢచారి అంటూ పాకిస్తాన్ ఉరితీసే ప్రయత్నం చేస్తోంది. ఆ కుట్రను అంతర్జాతీయ న్యాయస్థానంలో ఛేదించే గట్టి ప్రయత్నం చేస్తోంది భారత్. అయినా కూడా జాదవ్ ను ప్రాణలతో పాక్ వదిలిపెడుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే, అలాంటి ఒక ఉన్మాద దేశంగా మారిపోయింది టెర్రరిస్ట్ పాకిస్తాన్. మరి అలాంటి దేశం నుంచి విదేశాలకు వెళ్లిన పాకిస్తానీల్ని ఎవరైనా ఎలా చూస్తారు? అనుమానంగానే! ఇప్పుడే అదే జరుగుతోంది!
తాజాగా ఇస్లామాబాద్ నుంచీ లండన్ వెళ్లిన ఒక పాకిస్తానీ ఫ్లైట్ ను రెండు గంటలు ఆపేశారట బ్రిటన్ అధికారులు. అంతే కాదు, అనుమానం కొద్దీ ఆ విమానంలో వున్న 14మంది పాకిస్తానీ క్రూ మెంబర్స్ ని కంప్లీట్ గా చెక్ చేశారట. వాళ్ల దగ్గరా, విమానంలోనూ ఏమీ దొరకలేదట. కానీ ఈ విషయం మీద సీరియస్ అయిన పాకిస్తానీ గవర్నమెంట్ బ్రిటన్ విమానాయాన అధికారులతో మాట్లాడతామని అంటోంది. ఏమి మాట్లాడినా ఎంత నిరసన తెలిపినా పాకిస్తాన్ చేతులారా చేసుకున్న పాపమే ఇవాళ్టి ఈ చెడ్డ పేరు. ప్రపంచ టెర్రరిజనానికి అసలు మూలంగా మారిపోయాక ప్రపంచం అనుమానంగా చూడక మరేం చేస్తుంది? ముందు ముందు పాకిస్తాన్ కి, పాకిస్తానీలకి అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు, అవమానాలు మరిన్ని తప్పకపోవచ్చు! అయినా కూడా పాక్ తన తోక వంకర సరి చేసుకుంటుందని కూడా మనం ఆశించలేం…