కొందరు నేతలు నోరు తెరిస్తే… రాజకీయ దుర్వాసనే!
posted on May 11, 2017 @ 10:42AM
భారత్ క్రికెట్ టీమ్ ఏ దేశ జట్టుతో ఓడిపోతే మీరు ఎక్కువ బాధపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా పాకిస్తానే! పాక్ పై ఇండియా గెలిస్తే సంతోషం, ఓడితే దుఃఖం… ఇదీ సామాన్యుల పరిస్థితి. కాని, మన దేశ రాజకీయ నేతలు కొందరికి అలాంటి భావోద్వేగాలు ఏమీ వున్నట్టు లేదు. ఎంత సేపూ తమ రాజకీయ వ్యాఖ్యలు, లాభాలే తప్ప వారికి కొంచెమైనా జాతీయ భావం వుందా అనిపిస్తుంటుంది! క్రికెట్లో ఓడటం కాదు…. ఏకంగా పాకిస్తాన్ మన సైనికుల్నే చంపేస్తుంటే కూడా కొందరి బుద్ధి మారటం లేదు. తాజాగా అఖిలేష్ తన కామెంట్స్ తో జవాన్ల త్యాగలని వెక్కింరిచారు…
ఆ మధ్య యూపీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ఖూన్ కీ దలాల్ అంటూ మోదీని విమర్శించాడు. ఆయన ఉద్దేశ్యం సైనికుల రక్తాన్ని ప్రధాని తన స్వార్థానికి వాడుకుంటున్నారని! అలా కామెంట్ చేసి రాహుల్ ఆశించింది ఏంటి? యూపీలో రాజకీయ విజయం! ఇప్పుడు అలాంటి మాటలే మాట్లాడాడు అఖిలేష్! ఉత్తర్ ప్రదేశ్ సీఎం నుంచి మాజీ సీఎం అయిన యువనేతకి ఫ్రస్ట్రేషన్ ఇంకా తగ్గినట్టు లేదు. అసలు గుజరాత్ నుంచి ఎవరన్నా సైనికులు దేశం కోసం అమరులయ్యారా… అంటూ ప్రశ్నించాడు! దీన్ని మనం ఏమనాలి?
మోదీ, అమిత్ షా గుజరాతీలు. వారంటే అఖిలేష్ కి పడదు. అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో అయితే మోదీ, షా ఇద్దర్నీ గుజరాత్ గాడిదలన్నాడు అఖిలేష్! అయినా, దాన్ని మనం రాజకీయ దాడిగా చూడవచ్చు. కాని, మోదీపైన ద్వేషాన్ని గుజరాత్ పై చూపిస్తే ఎలా? పైగా జవాన్ల బలిదానాల్ని ముడిపెడుతూ … గుజరాత్ నుంచి ఏ ఒక్క జవాను దేశం కోసం మరణించలేదని అనటం … ఎలాంటి లాజిక్? అఖిలేష్ కే తెలియాలి!
కాశ్మీర్ లో వరుసగా జరుగుతోన్న పాక్ ఆకృత్యాల నేపథ్యంలో కొన్ని గంటల క్రితమే ఒక యువ ఆర్మీ అధికారిని కోల్పోయింది దేశం. ఫయాజ్ అనే కాశ్మీరీ సైనికుడు ఉగ్రవాదుల చేతిలో బలైపోయాడు. ఆయన మరణానికి కారణమైన పాక్ ని ఒక్క మాట కూడా అనని అఖిలేష్ గుజరాత్ గురించి మాత్రం మాట్లాడుతుండటం దారుణమైన విషయం. పోనీ… అఖిలేష్ చెప్పినట్టు నిజంగానే గుజరాత్ నుంచి అమరులు లేనేలేరా? అది పచ్చి అబద్ధం! ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ గుజరాత్ సైనికులు ముగ్గురు కాశ్మీర్ సంరక్షణలో భాగంగానే అమరులయ్యారు! అయినా, కోడి గుడ్డు మీద ఈకలు పీకే పనిలో వున్నారు చాలా మంది నేతలు!
ఒక్క అఖిలేష్ కాదు… అఖిలేష్ వయస్సు కంటే రెట్టింపు సంవత్సరాల అనుభవం వున్న దిగ్విజయ్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా లంటి వారు కూడా అమర సైనికుల త్యాగాలతో ఆటలాడుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు కావాలని ముస్లిమ్ యువతని ఉగ్రవాద కేసుల్లో ఇరికిస్తున్నారని డిగ్గీ అంటే… ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ లో అమరులైన సైనికుల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడతారు? సుక్మాలో మావోల చేతిలో చనిపోయిన వారి గురించి ఎందుకు మాట్లాడరు… అంటూ లాజిక్ లు వెదికాడు! దేశం కోసం బలిదానం చేసే సైనికుల రక్తానికి కూడా మతం, ప్రాంతం అంటగట్టే ఇలాంటి నాయకుల్ని ఎవ్వరూ బాగు చేయలేకపోతున్నారు! వీళ్ల మాటల వల్ల అధికారం కోల్పోయి , జనం చేత తిరస్కరింపబడ్డా బుద్ది మాత్రం మారటం లేదు! చట్ట పరమైన కేసులు ఎలాగూ వుండవు కాబట్టి అడ్డూ అదుపు కూడా వుండటం లేదు!