English | Telugu
'మర్యాదరామన్న' మూవీ నా కెరీర్‌కు మైనస్ అయ్యింది!
Updated : Nov 9, 2021
యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'మర్యాదరామన్న' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించి, సునీల్‌ను హీరోగా ఓ మెట్టు పైకెక్కించింది. ఆ మూవీలో హీరోయిన్ సలోని ఫాదర్ రామినీడుగా మెయిన్ విలన్ క్యారెక్టర్‌లో రాణించి, అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు నాగినీడు. ప్రసాద్ ల్యాబ్స్ ఉద్యోగి అయిన ఆయన తనకు వచ్చిన అరుదైన ఆఫర్‌ను రెండు చేతులా ఒడిసిపట్టుకొని రామినీడు పాత్రకు న్యాయం చేకూర్చారు. ఆయన రూపం, ఆయన వాయిస్ ఆ పాత్రకు నిండుదనం తెచ్చాయి. అయితే ఆ సినిమా తన కెరీర్‌కు మైనస్ అయ్యిందంటారు నాగినీడు. ఆశ్చర్యం కలిగించే ఈ విషయాన్ని ఆయనే 'ఆలీతో సరదాగా' షోలో చెప్పారు.
"మర్యాదరామన్న మూవీ ఎంత బ్రేక్ ఇచ్చింది మీకు?" అనడిగారు అలీ. "ఒక విధంగా చెప్పాలంటే ఓ స్థాయిలో కూర్చొపెట్టింది. అది మైనస్ అయ్యింది. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరికి ఫోన్ చేసినా, నాగినీడు గారూ! మీకేదైనా మీరే చెయ్యగలరనే క్యారెక్టర్ ఇస్తాం కానీ, ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ మా దగ్గర లేదు. మిమ్మల్ని మామూలు క్యారెక్టర్‌లో నిలబెట్టలేం కదా అనేవారు. నేను మనసులో అనుకొనేవాడ్ని. మనకు అవన్నీ ఎందుకు, డబ్బులు కావాలి కదా. అవకాశం ఇస్తే బాగుండు" అని అని చెప్పారు.
తను మొట్టమొదట సినిమా హాల్లో చూసిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు 'పూలరంగడు' అనీ, ఆ సినిమా చూశాక నటుడ్ని కావాలనే కోరిక కలిగిందనీ నాగినీడు వెల్లడించారు. "ఆ సినిమాలో రాజబాబు క్యారెక్టర్‌లా ఇంట్లో యాక్ట్ చేసేవాడ్ని. కానీ ఈ అవతారంతో రాజబాబు గారిలా చేస్తే ఎవరూ నవ్వరు" అని ఆయన చెప్పారు. ఈ విషయాలను నవంబర్ 15న ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' ఎపిసోడ్‌లో మనం చూడబోతున్నాం.