విలన్ నుంచి విద్యావేత్త వరకు.. మంచు మోహన్‌బాబు అరుదైన సినీ ప్రస్థానం!
(మార్చి 19 మంచు మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా..) - మోహన్‌బాబు కెరీర్లో మైలురాళ్ళు ఇవే - మంచు భక్తవత్సలం టు కలెక్షన్ కింగ్ - నటుడిగా 550, నిర్మాతగా 72 సినిమాలు టాలీవుడ్ లెజెండరీ నటుడు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే నటుడు డా.మంచు మోహన్‌బాబు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన చేయని క్యారెక్టర్ లేదు. తనదైన డైలాగ్ డెలివరీతో, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో కొన్ని వందల పాత్రలకు ప్రాణం పోసిన ఈ నట దిగ్గజం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 1952 మార్చి 19న చిత్తూరు జిల్లాలోని మోదుగులపాలెంలో మంచు నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు మోహన్‌బాబు. ఆయన అసలు పేరు భక్తవత్సలంనాయుడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్‌లోని వైఎంసిఎ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా చాలాకాలం పనిచేశారు. 1970 ప్రాంతంలో సినిమాల మీద ఆసక్తితో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా 5 సంవత్సరాలపాటు పనిచేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ‘స్వర్గం నరకం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన నటన చూసి పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సహనటుడిగా, విలన్‌గా, హీరోగా పలు విభిన్నమైన పాత్రలు పోషించిన మోహన్‌బాబు మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. తన 50 సంవత్సరాల కెరీర్లో 550కి పైగా సినిమాల్లో నటించి కలెక్షన్‌కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు తన సత్తా చాటారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తనే హీరోగా నటిస్తూ ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి తన బేనర్లో పలు విభిన్నమైన సినిమాలు నిర్మించి అభిరుచిగల నిర్మాత అనిపించుకున్నారు. ‘పెదరాయుడు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘అల్లుడుగారు’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. తన బేనర్లో మొత్తం 72 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు మోహన్‌బాబు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, విద్యా రంగంలోనూ మోహన్‌బాబు తనదైన ముద్ర వేశారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా వేలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా విద్యాదానం చేస్తూ సమాజంపై తనకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. శ్రీ విద్యానికేతన్ ఇప్ప్పుడు మోహన్‌బాబు యూనివర్సిటీగా రూపాంతరం చెంది ఉన్నత విద్యను అందిస్తోంది. నటుడుగా, నిర్మాతగా, విద్యావేత్తగానే కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించి 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్ప్పుడప్ప్పుడు తనకు సరిపడా క్యారెక్టర్స్ వస్తే తెరపై కనిపిస్తున్నారు. గత ఏడాది మంచు లక్క్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన ‘దక్ష’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాబోయే చిత్రాల్లో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో, సూపర్‌స్టార్ కష్ణ మనవడు, రమేష్‌బాబు తనయుడు జయకష్ణ హీరోగా అజయ్ భూపతి రూపొందిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు మంచు మోహన్‌బాబు.
Mar 18, 2026లెజండరీ డైరెక్టర్ రిజెక్ట్ చేసిన ఈ ముగ్గురూ.. స్టార్స్ అయిపోయారు. ఎవరో తెలుసా?
చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గానీ, టెక్నీషియన్స్‌గా గానీ సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్‌గా టాలెంట్ అనేది అవసరం. ఎంతో మంది సినీ ప్రముఖులు చెప్పినట్టు టాలెంట్‌తోపాటు ఆవగింజంత అదష్టం కూడా కావాలి. టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే టైమ్‌ని ఆర్టిస్టులు బాగా నమ్ముతారు. తమకు కూడా టైమ్ వస్తే చక్రం తిప్పేస్తాం అంటుంటారు. కొందరి విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఇండస్ట్రీలోని వివిధ శాఖల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చాలా మంది.. మొదట్లో రిజెక్ట్ అయినవారే. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి సూపర్‌స్టార్ అయ్యారు. అలాగే మధుర గాయకుడు ఘంటసాలకు తొలి రోజుల్లో ఎదురైన అవమానాలు తక్కువేమీ కాదు. ఇప్పటికీ ఆయన పాటల్ని అందరూ ఆస్వాదిస్తున్నారంటే ఆ గానంలోని మాధుర్యమే కారణం. సినిమా ప్రయత్నాల్లో భాగంగా రిజెక్ట్ అయిన సందర్భాలు సినిమా కళాకారులకు చాలా ఉంటాయి. పాతతరంలో లెజండరీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆదుర్తి సుబ్బారావు రిజెక్ట్ చేసిన ముగ్గురు నటీనటులు ఆ తర్వాత స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ ముగ్గురూ ఎవరు, వారిలోని టాలెంట్‌ని ఆదుర్తి ఎందుకు గుర్తించలేకపోయారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1948లో కల్పన అనే హిందీ చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆదుర్తి సుబ్బారావు.. 1954లో వచ్చిన అమర సందేశం చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. రెండో సినిమా తోడికోడళ్లుతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మాంగల్యబలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, మంచి మనసులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, దాగుడు మూతలు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి.. ఇలా ఎన్నో అపురూపమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అలా ఓ 20 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత స్టార్స్‌తో కాకుండా కొత్తవారితో ‘తేనె మనసులు’ చిత్రం చెయ్యాలనుకున్నారు. హీరో నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అందరూ కొత్తవారు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చారు ఆదుర్తి. ఊహించిన దానికంటే ఎక్కువ మంది తమ వివరాలను తెలియజేస్తూ ఫోటోలు పంపించారు. వారిలో కొందరిని సెలెక్ట్ చేసి ఆడిషన్‌కి పిలిచారు. ‘తేనె మనసులు’ సినిమాలో రామ్మోహన్‌ను హీరోగా ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు. మరో హీరో, ఇద్దరు హీరోయిన్లు, మిగతా నటీనటుల కోసం ఆడిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఆడిషన్‌కి హాజరైన వారిలో కష్ణ, కష్ణంరాజు, జయలలిత, హేమమాలిని కూడా ఉన్నారు. అయితే వారిలో కష్ణను మాత్రమే ఎంపిక చేశారు ఆదుర్తి. హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్య సెలెక్ట్ అయ్యారు. కష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురూ స్టార్స్‌గా ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. హీరోగా పరిచయమై కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించి, ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేశారు కష్ణంరాజు. తన నటనతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకొని రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 1961లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన జయలలిత.. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత డాన్సర్‌గా కొన్ని సినిమాలు చేశారు. తేనె మనసులు విడుదలైన సంవత్సరమే మనుషులు మమతలు చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యారు జయలలిత. ఆ తర్వాత తమిళ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. వివిధ భాషల్లో హీరోయిన్గా తన సత్తా ఏమిటో చూపించి అందరు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయారు జయలలిత. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక హేమమాలిని విషయానికి వస్తే.. తమిళ్లో ఇదు సాతియం, తెలుగులో పాండవ వనవాసం చిత్రాల్లో డాన్సర్‌గా నటించారు. తేనె మనసులు ఆడిషన్ తర్వాత చాలా కాలం వరకు ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. 1968లో వచ్చిన సప్నోంకా సౌదాగర్ చిత్రంలో తొలిసారి రాజ్‌కపూర్ సరసన హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు హేమమాలిని. హీరోయిన్గా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలా దేశవ్యాప్తంగా ‘డ్రీమ్ గర్ల్’ అని పిలిపించుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు రిజెక్ట్ చేసిన కష్ణంరాజు, జయలలిత, హేమమాలిని.. ఈ ముగ్గురి కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగడం స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం నిజంగా గొప్ప విశేషమనే చెప్పాలి. ఎంతో మంది గొప్ప నటీనటులతో సినిమాలు రూపొందించిన ఆదుర్తి సుబ్బారావు.. ఈ ముగ్గురిలోని టాలెంట్‌ని గుర్తించలేకపోవడం ఆరోజుల్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Mar 18, 2026రజినీకాంత్ హీరోగా, చిరంజీవి విలన్‌గా 45 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమా గురించి మీకు తెలుసా?
1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. అలా 30 సినిమాలు చేసిన తర్వాత 1981లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘రణవీరన్’ అనే తమిళ సినిమాలో విలన్‌గా నటించారు. అప్పటికే న్యాయంకావాలి, మొగుడు కావాలి, పున్నమినాగు, కోతలరాయుడు, నకిలీ మనిషి, లవ్ ఇన్ సింగపూర్ వంటి సినిమాలు చేశారు. అంతకుముందు కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి హీరోగా ఓ తమిళ సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్, ఎఎన్నార్, కష్ణ, శోభన్‌బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించిన కె.ఆర్.విజయ.. ఈ సినిమాలో హీరోయిన్. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే అంతటి సీనియర్ హీరోయిన్‌తో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా చిరంజీవి అదష్టమనే చెప్పాలి. అయితే ఈ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగి ఉంటే హీరోగా తమిళ్లో కూడా చిరంజీవి మంచి పేరు తెచ్చుకునే వారని కె.ఆర్.విజయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రజినీకాంత్‌లోని కమర్షియల్ యాంగిల్‌ని మొదట గుర్తించిన దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్. వీరిద్దరి కాంబినేషన్లో 25కి పైగా సినిమాలు వచ్చాయి. మొదట కె.బాలచందర్ వంటి దర్శకుల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన రజినీకాంత్.. ముత్తురామన్ వల్ల కమర్షియల్ హీరోగా మారిపోయారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘రణవీరన్’. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వీరప్పన్.. స్వతహాగ రచయిత. ఎంజీఆర్‌ని దష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేశారు. అయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చెయ్యలేకపోయారు. దాంతో రజినీకాంత్‌కి అవకాశం వచ్చింది. శ్రీదేవిని హీరోయిన్గా, చిరంజీవిని విలన్‌గా తీసుకున్నారు. తమిళ్లో అప్పటికే మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న రజినీకాంత్‌కి ‘రణవీరన్’ మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగానే ఉంటుంది. చిరంజీవి, రజినీకాంత్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటాయి. 1981 అక్టోబర్ 26న తమిళ్లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మరుసటి ఏడాది ‘బందిపోటు సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా రిసీవ్ చేసుకోలేదు. అప్పటి నుంచి రజినీకాంత్, చిరంజీవి మంచి స్నేహం ఉంది. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగిన తర్వాత తను హీరోగా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్ చెయ్యాల్సిందిగా రజినీకాంత్ రిక్వెస్ట్ చేశారు. 1989లో విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి రీమేక్‌గా తమిళ్లో రూపొందిన మా పిళ్లయ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు చిరంజీవి.
Mar 17, 2026ఎన్టీఆర్ సినిమా గురించి ఒకే పత్రికలో.. పాజిటివ్ రివ్యూ, నెగెటివ్ రివ్యూ.. ఎందుకలా వేశారు?
ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయింది అంటే దాని భవిష్యత్తు ఏమిటి, ఎన్నిరోజులు ఆడే ఛాన్స్ ఉంది.. అనేది క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇటీవలికాలంలో పెరిగిపోయిన మీడియా, సోషల్ మీడియా వల్ల ఇది సాధ్యపడుతోంది. సినిమాలను సమీక్షించడం అనే పద్ధతి ఇప్పటిది కాదు. సినిమా పుట్టిన నాటి నుంచే ఉంది. అయితే అప్పట్లో ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది కాబట్టి పత్రిక వచ్చే వరకు పాఠకులు ఎదురుచూసేవారు. సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కూడా ఇదే పద్ధతి ఉంది అంటే మీరు నమ్ముతారా? కానీ, ఇది నిజం. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఒక దినపత్రికలో దానికి సంబంధించిన రివ్యూ వచ్చేది. కొంతమంది ఆ రివ్యూ చూసిన తర్వాతే సినిమాకి వెళ్లేవారు. అప్పట్లో వెబ్సైట్లు, ఛానల్స్ అంత ప్రభావవంతంగా పనిచేయకపోవడం వల్ల ఆ దినపత్రికలోని రివ్యూనే ప్రామాణికంగా తీసుకునేవారు. 65 సంవత్సరాల వెనక్కి వెళితే.. ఒక సినిమాకి సంబంధించిన సమీక్షను ఒకే పత్రికలో రెండు సార్లు ప్రింట్ చెయ్యాల్సి వచ్చింది. ఒకసారి నెగెటివ్‌గా, ఒకసారి పాజిటివ్‌గా ప్రింట్ అయింది. ఎవరైనా సినిమా బాగుండకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తారు, బాగుంటే పాజిటివ్ రివ్యూ ఇస్తారు. అలా కాకుండా రెండు రకాల రివ్యూలు ఒకే పత్రికలో ప్రింట్ అవ్వడానికి రీజన్ ఏమిటి? ఇంతకీ అది సినిమా అనేది తెలుసుకుందాం. ఎన్.టి.రామారావు, సావిత్రి, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన చిత్రం ‘అప్ప్పుచేసి పప్ప్పుకూడు’. 1959 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి నాలుగు వారాలు కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎబౌ ఏవరేజ్ సినిమా అనిపించుకుంది. అయితే రీరిలీజ్‌లో ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా ఈ చిత్రం నిలిచింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వివిధ పత్రికల్లో సినిమాకి అనుకూలంగా సమీక్షలు వచ్చాయి. అందులో ఆంధ్రప్రతికలో మాత్రం నెగెటివ్ రివ్యూ వచ్చింది. సినిమాలో దొర్లిన పొరపాట్లు, కథ, కథనాల్లో ఉన్న లొసుగుల్ని ప్రస్తావిస్తూ ఆ సమీక్ష సాగింది. దీన్ని ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ రాశారు. సినిమా అంతా గందరగోళంగా ఉందని, కథ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉందని తన రివ్యూలో పేర్కొన్నారు. ఈ రివ్యూ చదివిన నిర్మాత చక్రపాణి ఆశ్చర్యపోయారు. అందరూ సినిమా బాగుందని రాస్తే, ఆ పత్రికలో ఎందుకలా వచ్చింది అనే విషయం తెలుసుకోవాలనుకున్నారు. అప్పట్లో ఆంధ్రపత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్న శంభుప్రసాద్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు చక్రపాణి. సినిమా గురించి రమణగారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తప్ప నెగెటివ్‌గా రాయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు అని చక్రపాణికి చెప్పారు శంభుప్రసాద్. సినిమా గురించి పాజిటివ్ రివ్యూ కావాలంటే మీరే ఎవరితోనైనా రాయించి పంపండి. దాన్ని కూడా ప్రింట్ చేస్తాం అని చెప్పారు శంభుప్రసాద్. అప్ప్పుడు ఈ విషయాన్ని చందమామ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్న కొడవటిగంటి కుటుంబరావు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన అంతకుముందు ఆంధ్రపత్రిక వారపత్రికకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ‘అప్ప్పుచేసి పప్ప్పుకూడు’ రిలీజ్ అయ్యే టైమ్‌కి ఆయన విజయ కాంపౌండ్లోనే ఉండడంతో ఆయన్ని అప్రోచ్ అయ్యారు చక్రపాణి. మన సినిమా గురించి ఎలా రాస్తే జనంలోకి వెళ్తుందో అలా రివ్యూ రాయమని కుటుంబరావును కోరారు చక్రపాణి. ఆయన చెప్పినట్టుగానే సినిమాలోని లొసుగుల్ని తడమకుండా పాజిటివ్‌గా రివ్యూ రాసి ఇచ్చారు. దాన్ని శంభుప్రసాద్‌కి పంపారు చక్రపాణి. ఆ రివ్యూను యధాతథంగా ఆంధ్రపత్రికలో ప్రింట్ చేశారు. అలా ఈ సినిమా గురించి ఒక పాజిటివ్ రివ్యూ, ఒక నెగెటివ్ రివ్యూ ఒకే పత్రికలో రావడం అనేది విశేషంగా చెప్ప్పుకోవచ్చు.
Mar 17, 2026
ఎన్టీఆర్‌కు బంగారం.. ఎస్వీఆర్కు మోటార్ సైకిల్!
తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిన ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రం ఈ ఏడాది మార్చి 15కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఘనవిజయం సాధించి విజయ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆరోజుల్లో హీరోలతో సహా నటీనటులంతా నెల జీతానికి సినిమాలు చేసేవారు. ‘పాతాళభైరవి’ సూపర్‌హిట్ కావడంతో విజయ సంస్థలో పనిచేస్తున్న వారందరికీ మూడు నెలల జీతం బోనస్‌గా ప్రకటించారు. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్.టి.రామారావుకు 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు విజయ అధినేతలు. అలాగే ఎస్.వి.రంగారావుకు 5 వేల రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్‌ను అందించారు. ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలతోనే విజయ సంస్థను మరింత విస్తరించారు నాగిరెడ్డి, చక్రపాణి.
Mar 15, 2026
ఎంతో మంది నటీనటులకు గొప్ప టర్నింగ్ పాయింట్ ‘పాతాళభైరవి’
75 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది. ఎన్.టి.రామారావు, కె.వి.రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విజయ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది. అప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఎన్టీఆర్.. ‘పాతాళభైరవి’తో మాస్ హీరోగా ఎదిగారు. నేపాళ మాంత్రికుడిగా నటించిన ఎస్వీఆర్ కెరీర్‌కి ఇది మంచి పునాది వేసింది. సినిమాలోని అంజిగాడు పాత్రను వల్లూరి బాలకృష్ణ పోషించారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని అందరూ అంజిగాడు అనే పిలిచేవారు. మహానటిగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న సావిత్రి ఈ సినిమాలోని ఒక సాంగ్ బిట్ ద్వారా తొలిసారి తెరపై కనిపించారు. సదాజపుడుగా నటించిన పద్మనాభంకు మంచి పేరు తెచ్చి నటుడుగా బిజీ అవ్వడానికి ఈ సినిమా కారణమైంది. ఇలా ఈ ఒక్క సినిమాతో నటీనటులే కాదు, సాంకేతిక నిపుణులు కూడా బిజీ అయిపోయారు.
Mar 14, 2026
‘పాతాళభైరవి’కి మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు!
నటరత్న ఎన్.టి.రామారావు కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా, ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పాతాళభైరవి’(Pathala Bhairavi). 1951 మార్చి 15న విడుదలైన ఈ సినిమా ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ‘పాతాళభైరవి’ చిత్రంలో ఎన్టీఆర్ తోటరాముడుగా నటించారు. అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు. ఇద్దర్ని దాటుకొని ఆయనకు ఆ అవకాశం వచ్చింది. అప్పటికే జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎఎన్నార్‌ను తీసుకోవాలనుకున్నారు కె.వి.రెడ్డి. కానీ, నాగిరెడ్డి, చక్రపాణి మాత్రం ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అన్నారు. అయితే వారిద్దర్నీ కాదని కాకినాడకు చెందిన వై.రాజారెడ్డిని తోటరాముడు క్యారెక్టర్‌కి ఎంపిక చేశారు. మేకప్ టెస్ట్ చేసి రిహార్సల్స్ కూడా చేయించారు. అయితే ఆయనకు కాస్త నత్తి ఉండడం వల్ల ఆ అవకాశం ఎన్టీఆర్‌ను వరించింది. ‘పాతాళభైరవి’తో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయారు.
Mar 14, 2026
75 ఏళ్ళ క్రితం రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘పాతాళభైరవి’
1951 మార్చి 15న ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వెర్షన్ 1951 మే 17న విడుదలైంది. మొదటి మూడు వారాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా ప్రింట్లు పెరిగాయి, థియేటర్లు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘పాతాళభైరవి’ కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వచ్చిన సినిమాల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన తొలి సినిమా ఇదే. ఎన్టీఆర్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా 75 ఏళ్ల క్రితమే రజతోత్సవం జరుపుకున్న తొలి సినిమాగా, 200 రోజులు ప్రదర్శింపడిన తొలి చిత్రంగా, ‘పాతాళభైరవి’ రెండు కొత్త రికార్డులు నమోదు చేసింది.. ఆరోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు విజయ సంస్థలో నెలవారీ జీతానికి పనిచేసేవారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సిబ్బందికి మూడు నెలల బోనస్ ప్రకటించారు విజయ అధినేతలు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ ప్రొడక్షన్స్ సంస్థను మరింత విస్తరించారు.
Mar 14, 2026ఎన్.టి.ఆర్.ను మాస్ హీరోగా నిలబెట్టిన ‘పాతాళభైరవి’కి 75 వసంతాలు!
- మొదట అనుకున్న హీరో ఎవరు? - తొలి 200 రోజుల సినిమా - రజతోత్సవం జరుపుకున్న తొలి సినిమా - అప్పటికి హై బడ్జెట్ సినిమా 1949లో వచ్చిన ‘మనదేశం’ చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన నటరత్న ఎన్.టి.రామారావు కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ‘పాతాళభైరవి’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హీరోగా అవతరించారు. అప్పటివరకు జానపద హీరో అంటే అక్కినేని పేరే వినిపించేది. కీలుగుర్రం, బాలరాజు వంటి సూపర్‌హిట్ సినిమాలతో ఎఎన్నార్ తిరుగులేని జానపద హీరో అనిపించుకున్నారు. ఎప్ప్పుడైతే ‘పాతాళభైరవి’ రిలీజ్ అయిందో.. ఎఎన్నార్ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్‌తో తను ఏ విధంగానూ పోటీ పడలేనని గ్రహించారు. అప్పటి నుంచి తన పంథా మార్చుకొని సాంఘిక చిత్రాల వైపు మళ్ళారు. వాటిలో కూడా భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను మలుచుకున్నారు ఎఎన్నార్. 1951 మార్చి 15న ‘పాతాళభైరవి’ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15తో ఈ సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి అంకురారప్పణ ఎలా జరిగింది? ఎన్టీఆర్ ఈ సినిమాలోకి హీరోగా ఎలా వచ్చారు? విజయ సంస్థకు ఈ తరహాలో ఒక సినిమా చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ కథను ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో ఎవరు? మాంత్రికుడి పాత్ర కోసం మొదట ఎవరిని అనుకున్నారు? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితం లభించింది? సినిమా గురించి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? వంటి విశేషాల గురించి తెలుసుకుందాం. చిత్ర నిర్మాణం చేపట్టిన తర్వాత విజయ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా ‘షావుకారు’. టైటిల్ రోల్‌ను జానకి పోషించారు. ఈ సినిమా నుంచి ఆమె పేరు షావుకారు జానకిగా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ సినిమాలోని మరో కీలక పాత్ర సున్నపు రంగ క్యారెక్టర్‌ను ఎస్.వి.రంగారావు పోషించారు. ఈ సినిమా విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది తప్ప లాభాలు తెచ్చిపెట్టలేదు. దీంతో తర్వాత ఏ సినిమా చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డారు విజయ అధినేతలు. విజయకు అనుబంధ సంస్థ అయిన వాహినిలో భక్తపోతన, యోగి వేమన, గుణసుందరి కథ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డితో రెండో సినిమా చెయ్యాలనుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. రచయితగా పింగళి నాగేంద్రరావును ఎంపిక చేశారు. అల్లావుద్దీన్ అండ్ ది పవర్ఫుల్ ల్యాంప్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కాశీ మజిలీ తరహాలో ‘పాతాళభైరవి’ కథను సిద్ధం చేశారు పింగళి. ఒక సామాన్యుడు రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ అందరికీ నచ్చింది. నాలుగు నెలలపాటు కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ, మాటలు పింగళి రాయగా, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు. ‘షావుకారు’ చిత్రానికి పనిచేసిన మార్కస్ బార్ట్లేను ‘పాతాళభైరవి’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. తమ ఆస్థాన సంగీత దర్శకుడు ఘంటసాలతో 10 పాటలు రికార్డ్ చేయించారు. ఇక తారాగణం ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. అప్పటికే జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎఎన్నార్‌ను తోట రాముడిగా, ముక్కామలను నేపాళ మాంత్రికుడిగా తీసుకోవాలని కె.వి.రెడ్డి అనుకున్నారు. అయితే విజయ అధినేతలు మాత్రం షావుకారులో నటించిన ఎన్టీఆర్ అయితే బాగుంటాడు అని సూచించారు. ‘షావుకారు’ తర్వాత ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది విజయ సంస్థ. దాని ప్రకారం నెలకు రూ.250 జీతం ఇస్తారు. సినిమా ఉన్నా లేకున్నా స్టూడియోకి వచ్చి కూర్చోవాలి. సినిమా చేస్తే.. నెల జీతం కాకుండా సినిమాకి రూ.5000 పారితోషికం ఇస్తారు. అంతేకాదు, అగ్రిమెంట్ కాలంలో బయటి సంస్థలకు సినిమాలు చేయకూడదు. తప్పనిసరి అయితే వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ షరతులన్నింటికీ ఒప్ప్పుకొని ఎన్టీఆర్ సంతకం చేశారు. విజయ సంస్థతో ఎన్టీఆర్‌కి అగ్రిమెంట్ ఉండడంతో పాతాళభైరవిలో హీరోగా అతన్నే తీసుకోవాలని నాగిరెడ్డి, చక్రపాణి అనుకున్నారు. కానీ, దర్శకుడు కె.వి.రెడ్డి ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ఇదిలా ఉంటే.. ‘మాయలమారి’ చిత్రంలో గండరగండ పాత్ర పోషించిన వై.రాజారెడ్డిని హీరోగా అనుకొని మేకప్ టెస్ట్ చేశారు. ఈ విషయం అన్ని పత్రికల్లో ప్రచురించారు కూడా. ‘పాతాళభైరవి’ చిత్రంలో ఎంతో పాపులర్ అయిన ‘నిజం చెప్పమంటారా.. అబద్ధం చెప్పమంటారా’ అనే డైలాగ్‌తో రిహార్సల్స్ మొదలు పెట్టారు. అయితే రాజారెడ్డికి కొంచెం నత్తి ఉండడంతో డైలాగులు చెప్పడంలో కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. ఆ సమయంలోనే ఒకరోజు వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఎఎన్నార్ టెన్నిస్ ఆడుతున్నారు. ఎన్టీఆర్ రాకెట్ పట్టుకొని కొట్టే విధానం కె.వి.రెడ్డికి బాగా నచ్చింది. దాంతో తోట రాముడు క్యారెక్టర్‌కు ఎన్టీఆర్ బెటర్ ఛాయిస్ అనుకున్నారు. అలాగే నేపాళ మాంత్రికుడి పాత్ర కోసం ‘షావుకారు’ చిత్రంలో సున్నపు రంగ పాత్ర పోషించిన ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు. ‘భక్తపోతన’ చిత్రంలో శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతిని హీరోయిన్గా, అంజిగాడు పాత్రకు వల్లూరి బాలకష్ణను తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇదే హై బడ్జెట్ సినిమా. 1950 ఫిబ్రవరి 5న ‘పాతాళభైరవి’ షూటింగ్ ప్రారంభమైంది. 1951 ఫిబ్రవరి 8 వరకు అంటే సంవత్సరంపాటు ఈ చిత్ర నిర్మాణం జరిగింది. మాయా మహల్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాట్యం తెలిసిన ఒక అమ్మాయి కావాల్సి వచ్చింది. అప్ప్పుడు సావిత్రి గురించి తెలిసి ఆమెను పిలిపించి ‘రానంటే రానే రానోయ్..’ అంటూ సాగే పాటను చిత్రీకరించారు. మహానటి సావిత్రి తొలిసారి వెండితెరపై కనిపించిన సినిమా ఇదే. ఈ పాటలో ఆమెతోపాటు నత్య దర్శకుడు పసుమర్తి కష్ణమూర్తి నర్తించారు. 1951 మార్చి 15న ‘పాతాళభైరవి’ చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వెర్షన్‌ను 1951 మే 17న విడుదల చేశారు. మొదటి మూడు వారాలు ఏవరేజ్ అనే టాక్ తెచ్చుకొని ఆ తర్వాత పెద్ద విజయం సాధించి చరిత్ర సష్టించింది. ఎన్టీఆర్‌ను మాస్ హీరోను చేసింది. 200 రోజులు ప్రదర్శింపబడిన తొలి చిత్రంగా, 25 వారాలు డైరెక్ట్‌గా ప్రదర్శితమైన తొలి రజతోత్సవ చిత్రంగా ‘పాతాళభైరవి’ రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు ఎఎన్నార్ నటించిన ‘బాలరాజు’ చిత్రాన్ని కూడా 25 వారాలు ప్రదర్శించారు. అయితే డైరెక్ట్‌గా కాకుండా షిఫ్టులవారీగా ప్రదర్శన జరిగింది. 1952లో తొలిసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం భారతదేశంలో జరిగింది. ఇందులో ప్రదర్శించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘పాతాళభైరవి’. సినిమా ఘనవిజయం సాధించడంతో విజయ సంస్థ సిబ్బందికి మూడు నెలల బోనస్ ప్రకటించారు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ సంస్థను మరింత విస్తరించారు. ‘పాతాళభైరవి’ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన సినిమా. అప్పటికి ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఆయన్ని మాస్ హీరోని చేసింది. జానపద హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని సంపాదించి పెట్టింది. నేపాల మాంత్రికుడిగా ఎస్వీఆర్ ప్రదర్శించి నటుడిగా ఎంతో బిజీ అయిపోయారు. ఈ సినిమాలోనే తొలిసారి సావిత్రి తెరపై కనిపించారు. అంజిగాడుగా వల్లూరి బాలకష్ణ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన పేరు అంజిగాడుగా స్థిరపడిపోయింది. సదాజపుడిగా నటించిన పద్మనాభం ఈ సినిమా తర్వాతే బిజీ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నో జానపద చిత్రాల్లో నటించినప్పటికీ ‘పాతాళబైరవి’ మాత్రం ఆయన కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.
Mar 14, 2026మధురమైన పాటలకు పెట్టింది పేరు ‘మామ’ కె.వి.మహదేవన్!
(మార్చి 14 కె.వి.మహదేవన్ జయంతి సందర్భంగా..) పాతతరం సంగీత దర్శకుల్లో కె.వి.మహదేవన్ది ఒక విశిష్టశైలి. ఏ తరహా పాట ఇచ్చినా దాన్ని ఎంతో మధురంగా స్వర పరిచి అందరూ పాడుకునే విధంగా మలచడంలో దిట్ట. కొందరు సంగీత దర్శకులు బాణీలు మాత్రమే ఇస్తారు. వాటికి సాహిత్యాన్ని జోడిస్తారు. కానీ, మహదేవన్ శైలి అది కాదు. పాట రాసి ఇచ్చిన తర్వాతే ట్యూన్ చేస్తారు. ఆయన కెరీర్లో ఒక్కసారి కూడా పాట రాయకుండా ట్యూన్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ విధంగా ఎన్నో అద్భుతాలు సష్టించారు. 1918 మార్చి 14న తమిళనాడులోని కృష్ణన్కోయిల్లో జన్మించారు కె.వి.మహదేవన్. మహదేవన్ అంటే ‘మామ’. ఈ పేరు రావడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్లో వచ్చిన ‘మంచి మనసులు’ చిత్రం. ఈ సినిమాలో ‘మామా.. మామా..’ అనే పాట ఆరోజుల్లో ఎంతో పాపులర్. ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. అలా మహదేవన్ అందరితోనూ మామ అని పిలిపించుకున్నారు. తమిళనాట పుట్టినా, తమిళ చిత్రాలలో స్వరవిన్యాసాలు చేసి అలరించినా, ఎందుకనో మహదేవన్‌కు తెలుగు చిత్రాలతోనే ఎక్కువ బంధం ఉందని చెప్పక తప్పదు. కేవలం సాంఘిక చిత్రాలలోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ మహదేవన్ అద్భుతమైన పాటలు చేశారు. సినిమాలోని సందర్భానికి తగ్గట్టుగా బాణీలు కట్టడంలో మహదేవన్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎంతో మంది దర్శకనిర్మాతలు మహదేవన్‌తోనే సంగీతం చేయించుకునేవారు. కొందరు నిర్మాతలు మహదేవన్‌తో తప్ప మరొకరితో సంగీతంతో సినిమాలు చేయము అని చెప్పేవారు. ఆయన పరమమపదించిన తర్వాత ఒక నిర్మాత సినిమాలు నిర్మించడం ఆపేశారంటే ఆయన ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్, ఎఎన్నార్ నుంచి కష్ణ, శోభన్‌బాబు, కష్ణంరాజు వంటి హీరోల వరకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు మహదేవన్. ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున వంటి హీరోల సినిమాలకు కూడా సంగీతం చేశారు. మహదేవన్‌కు సంగీతం అందించడంలో ఆయన శిష్యుడు పుహళేంది కీలక పాత్ర పోషించేవారు. తనతో సమానంగా ఆయన్ని కూడా గౌరవించాలని చెప్పేవారు మహదేవన్. చివరి వరకు ఆయనతోనే ఉండి సంగీత ప్రియులకు మధురమైన పాటలు అందించడంలో పుహళేంది తన సహకారాన్ని అందించారు. ఇక మహదేవన్ సంగీతం అందించిన సినిమాల గురించి చెప్పడం అంటే అది పెద్ద సాహసమే అవుతుంది. మూగ మనసులు, మంచి మనసులు, దాగుడు మూతలు, అంతస్తులు, ఆస్తిపరులు, బడిపంతులు, బంగారుబాబు వంటి సినిమాల నుంచి ప్రేమనగర్, ముత్యాల ముగ్గు, సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, అడవిరాముడు వరకు అన్నింటినీ మించి సంగీతంలోని మాధుర్యాన్ని అందరికీ పంచిన శంకరాభరణం వంటి కళాఖండానికి కె.వి.మహదేవన్ అందించిన సంగీతం నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. 50 సంవత్సరాలకు పైగా కెరీర్ కొనసాగించిన మహదేవన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో 600కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఉత్తమ సంగీత దర్శకుడుగా శంకరాభరణం చిత్రానికి, తమిళ సినిమా కందన్ కరుణై చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అనేకం కె.వి.మహదేవన్ను వరించాయి. 1996 వరకు తన కెరీర్‌ను కొనసాగించిన ఆయన 2001 జూన్ 21న 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
Mar 13, 2026భార్యాభర్తలుగా నాటకం ఆడిన ఎన్టీఆర్, సావిత్రి.. దేనికోసం?
తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచి ఎవర్గ్రీన్ మూవీస్ అనే పేరు తెచ్చుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ‘మిస్సమ్మ’ ఒకటి. 1955లో విడుదలైన ఈ సినిమాను ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఈ చిత్రంలో ఎఎన్నార్, జమున, ఎస్.వి.రంగారావు, రేలంగి, రమణారెడ్డి ఇతర పాత్రలు పోషించారు. ఆద్యంతం ఎంతో వినోదాత్మకంగా సాగే ఈ కుటుంబ కథాచిత్రంలోని ఆసక్తికరమైన సన్నివేశాలను మీకు అందిస్తున్నాం. మధ్యతరగతి కష్టాలను, ఉద్యోగ వేటలో ఎదురయ్యే అవమానాలను ప్రతిబింబించే సన్నివేశాల్లో ఎన్టీఆర్, సావిత్రి నటన అద్వితీయం. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి, ఒక ఉద్యోగం సంపాదించడానికి వారు ఆడిన ఒక ‘చిన్న నాటకం’, దాని వెనుక ఉన్న భావోద్వేగాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం. ఈ సన్నివేశంలో మనం ప్రధానంగా చూసేది ఆర్థిక దుస్థితి. చదువుకున్నా ఉద్యోగం లేక, చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోయే యువతీయువకుల ప్రతినిధులుగా మనకు ఎన్టీఆర్, సావిత్రి కనిపిస్తారు. కథలో ఉత్కంఠతను పెంచే అంశం ఏమిటంటే, సావిత్రి పాత్ర పడే ఆర్థిక ఇబ్బందులు. ఐ.పి. డేవిడ్ అనే వ్యక్తికి ఆమె 400 రూపాయల అప్పు తీర్చాల్సి ఉంటుంది. అతను పెళ్లి చేసుకోమని వేధిస్తుంటే, “నేను పెళ్లి చేసుకోను, చేసుకోను!” అని ఆమె తెగేసి చెప్పే దృశ్యం ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలోనే ఎన్టీఆర్ పాత్ర ప్రవేశించి, ఆ అప్పు తీర్చడానికి రెండు నెలల గడువు ఇప్పిస్తాడు. అప్పు తీరాలన్నా, బతుకు బండి నడవాలన్నా ఒకే మార్గం.. ఉద్యోగం. కానీ ఆ ఉద్యోగం రావాలంటే ఒక నిబంధన ఉంది. దరఖాస్తు చేసుకునేవారు భార్యాభర్తలై ఉండాలి. ఇక్కడే ఎన్టీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. “మనం ఒక నాటకం ఆడదాం... ఈ ఉద్యోగం కోసం నేను భర్తగా, మీరు భార్యగా నటిద్దాం” అని ప్రతిపాదిస్తారు. మొదట సావిత్రి సంశయించినా, ఆర్థిక ఇబ్బందులు మరియు ఉద్యోగం తప్పనిసరి కావడంతో ఆలోచనలో పడుతుంది. ఈ గంభీరమైన చర్చల మధ్యలో వచ్చే బిచ్చగాడి పాత్ర హాస్యాన్ని పండిస్తుంది. ‘చదువు ఒక్కటే చాలదు బాబు, కాస్త యుక్తి కూడా ఉండాలి’ అని అతను చెప్పే మాటలు జీవిత సత్యాలు. చలివేంద్రం పేరుతో చందాలు వసూలు చేయమనే అతని సలహా ఆనాటి సామాజిక పరిస్థితులపై ఒక చిన్న వ్యంగ్య బాణంలా అనిపిస్తుంది. ‘ఆడవాళ్ళు అవునంటే కాదు, కాదంటే అవును’ అంటూ ఆడవారి మనస్తత్వం గురించి ఎన్టీఆర్ చివరలో వేసే చమత్కారం ప్రేక్షకులను మురిపిస్తుంది. ఎంతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగే ఈ వీడియోను వీక్షించండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
Mar 13, 202640 ఏళ్లు పూర్తి చేసుకున్న కమల్‌హాసన్, కె.విశ్వనాథ్‌ల ఆణిముత్యం ‘స్వాతిముత్యం’
కళాతపస్వి కె.విశ్వనాథ్.. కళాత్మక చిత్రాలకు, వైవిధ్యమైన కథలకు చిరునామా. తను చేసే ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత ఉండాలని కోరుకునే విశ్వనాథ్.. శంకరాభరణం తర్వాత తన ధోరణి మార్చుకున్నారు. సంగీత, నత్య ప్రధాన చిత్రాలు చేసేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి చూపించారు. అలా కమల్‌హాసన్ హీరోగా చేసిన సినిమా ‘సాగర సంగమం’. ఈ సినిమా ఘనవిజయం సాధించి వీరి కాంబినేషన్‌కి మంచి పేరు తెచ్చింది. ‘సాగర సంగమం’ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని కమల్‌తోనే విశ్వనాథ్ చేసిన సినిమా ‘స్వాతిముత్యం’. 1986 మార్చి 13న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే.. మానసికంగా ఎదుగుదల సరిగాలేని శివయ్య(కమల్‌హాసన్) బామ్మ సంరక్షణలో ఉంటాడు. అదే ఊరిలో భర్తను కోల్పోయిన లలిత(రాధిక) అనే మహిళ తన అన్నయ్య దగ్గర ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉంటాడు. శివయ్యకు, లలితకు పరిచయమవుతుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం వల్ల లలిత ఎన్నో కష్టాలు పడుతోందని తన బామ్మ ద్వారా తెలుసుకున్న శివయ్య.. శ్రీరామ నవమి రోజు.. సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలోనే లలిత అనుమతి తీసుకోకుండానే ఆమె మెడలో పసుపుతాడు కట్టేస్తాడు. నలుగురూ నాలుగు మాటలు అంటారు. అదే సమయంలో శివయ్యను లలిత చేతుల్లో పెట్టి అతని బామ్మ కన్నుమూస్తుంది. అక్కడి నుండి భార్యతో సహా పట్టణం వచ్చేస్తాడు శివయ్య. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది అనేది మిగతా కథ. శివయ పాత్రలో కమల్‌హాసన్ జీవించాడని చెప్పాలి. అమాయకత్వంతో కూడిన ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరొకర్ని ఊహించుకోలేని విధంగా నటనను ప్రదర్శించారు. రాధిక నటన ఎంతో సెటిల్డ్‌గా, మరెంతో హుందాగా అనిపిస్తుంది. శరత్‌బాబు, జె.వి.సోమయాజులు, నిర్మలమ్మ, వై.విజయ, సుత్తి వీరభద్రరావు, దీప, గొల్లపూడి మారుతీరావు తదితరులు మిగతా పాత్రలు పోషించారు. శివయ్య మనవళ్లలో ఒకరిగా ఇప్పటి టాప్ హీరో అల్లు అర్జున్ నటించారు. చక్కని కథ, కథనం.. దానికి తగిన మాటలు, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్.. ఇళయరాజా సంగీతం. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా..’, ‘వటపత్ర శాయికి వరహాల లాలి’, ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య..’ ‘మనసు పలికే మౌనగీతం..’ వంటి పాటలు ఆరోజుల్లో సంచలనం సష్టించాయి. ఎక్కడికి వెళ్లినా ఈ పాటలు వినిపించేవి. 1987 సంవత్సరానికిగాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని ఈ చిత్రానికి అందించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నంది అవార్డులు గెలుచుకుంది. ఇవికాక పలు ఫిలిం ఫేర్ అవార్డులు సాధించింది. అంతేకాదు, భారతదేశం తరఫున ఆస్కార్ ఎంట్రీ పొందిన చిత్రం ‘స్వాతిముత్యం’.
Mar 13, 2026ఎన్టీఆర్ వేణు గానానికి 50 ఏళ్లు.. ప్రేక్షకులు మెచ్చిన చక్కని ప్రేమకథ ‘ఆరాధన’!
‘నా మది నిన్ను పిలిచింది గానమై.. వేణు గానమై..’ అంటూ మహ్మద్ రఫీ ఆలపించగా, నటరత్న ఎన్.టి.రామారావు అభినయించిన తీరు అసామాన్యం, అద్వితీయం. ఇప్పటికీ ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఎంతో మంది పాడుకుంటూ ఉంటారు. అంతటి అద్భుతమైన పాట ‘ఆరాధన’ చిత్రంలోనిది. 1976 మార్చి 12న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ సమయానికి విడుదలైన మిగతా సినిమాలన్నింటినీ పక్కకు నెట్టి విజయ ఢంకా మోగించింది ‘ఆరాధన’. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 1970లో రాజేంద్రక్రుమార్, మాలా సిన్హా జంటగా రామానంద్ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘గీత్’ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. కళ్యాణ్‌జీ ఆనంద్జీ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలతో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఎ.పుండరీకాక్షయ్య తెలుగులో ‘ఆరాధన’ పేరుతో రీమేక్ చేశారు. ఎన్.టి.రామారావు, వాణిశ్రీ జంటగా నటించిన ‘ఆరాధన’ 1976 మార్చి 12న విడుదలై తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘మేరే మిత్వా.. మేరే మీత్రే..’ పాటను ‘నా మది నిన్ను పిలిచింది గానమై’గా సంగీత దర్శకుడు ఎస్.హనుమంతరావు రీమిక్స్ చేశారు. ఈ సినిమాలోని పాటలన్నీ మహ్మద్ రఫీ పాడటం విశేషం. అప్పటికే పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల పాలిట ఆరాధ్య నటుడిగా నీరాజనాలు అందుకుంటున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో గోపీ అనే దివ్యాంగుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. అలాగే గోపీ ప్రియురాలు రాధగా వాణిశ్రీ తన అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘నా మది నిన్ను పిలిచింది గానమై..’ అనే పాట సినిమాలో ఐదు సార్లు వినిపించడం విశేషం. సంగీత ప్రధానంగా రూపొందిన ప్రేమకథా చిత్రమిది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో 168 రోజులు ఆడటం విశేషం. ఈ చిత్రం విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, రామానంద్ సాగర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆ తర్వాతి కాలంలో ‘రామాయణ్’ సీరియల్‌తో ఎంతో పేరు తెచ్చుకున్నారు రామానంద్ సాగర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోపీ (ఎన్టీఆర్) చెల్లెలితో కలిసి మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వేణువు వాయించడం, పాటలు పాడటం అతడికి అలవాటు. గోపి ప్రతిభను చూసిన రంగస్థల కళాకారిణి, గాయని రాధ (వాణిశ్రీ) అతనికి దగ్గరవుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. గోపీలోని ప్రతిభతో నగరంలో డబ్బు సంపాదించవచ్చు అని సలహా ఇస్తుంది. కానీ, గోపీ అలా చేసేందుకు ఒప్ప్పుకోడు. ఇదిలా ఉంటే.. రాధ పని చేసే కంపెనీ యజమాని సుధాకర్ (జగ్గయ్య) ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. గోపీతో తను ప్రేమలో ఉన్నానని చెబుతుంది రాధ. డబ్బు కోసం పట్టణానికి వెళ్ళడానికి మొదట నిరాకరించిన గోపీ తన చెల్లెలి పెళ్లి కోసం రాధ సహాయం కోరతాడు. ఇవన్నీ చూస్తూ సహించలేని సుధాకర్.. గోపిపై దాడి చేయిస్తాడు. ఆ ఘటనలో గోపీ స్వరం పోతుంది. మూగవాడిగా పాటలు పాడలేని స్థితిలో ఉన్న గోపీ జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలేంటి? గోపీ, రాధ పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా కథ.
Mar 12, 2026డబ్బు అనే మాయాజాలం మనుషుల మధ్య మమకారాలను ఎలా తుంచేస్తుందంటే..?
డబ్బు ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళే.. మరి అది లేనప్పుడు? మన అనుకున్న వాళ్లే పరాయి వాళ్ళయిపోతారు. జీవితంలో ఆస్తిపాస్తులు, అంతస్తులు ఉన్నప్పుడు మన చుట్టూ వందల మంది ఉంటారు. కానీ, కాలం కలిసి రాక ఆ డబ్బే దూరమైతే? మన రక్త సంబంధీకులు, మనం ప్రాణంగా ప్రేమించే మన బిడ్డలే మనల్ని ‘అపరిచితుల్లా’ చూస్తారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. మహానటుడు ఎస్.వి. రంగారావు తన గంభీరమైన స్వరంతో, కళ్ళకు కట్టినట్టు వివరించిన ఈ సత్యం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తుంది. అపారమైన ఆస్తి నుంచి అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన ఒక తండ్రి వేదన, ఆ సమయంలో తన పిల్లల ప్రవర్తనను చూసి ఆవేదన పడే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఎస్.వి.రంగారావు, అంజలీదేవి, కష్ణ, శోభన్‌బాబు, వాణిశ్రీ, నాగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పేరు ‘లక్క్ష్మీ నివాసం’. ఒకప్పుడు లక్షాధికారిగా ఉన్న సుబ్బయ్య.. తన బిడ్డలను కోటీశ్వరులను చేయాలనే తపనతో వ్యాపారం చేసి అనుకోకుండా 16 లక్షల అప్పుల్లో మునిగిపోతారు. ఆస్తి కేవలం 6 లక్షలు మాత్రమే మిగులుతుంది. ఆ సమయంలో తన బిడ్డలు అండగా ఉంటారని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదురవుతుంది. తండ్రి పరిస్థితిని చూసి కన్న కొడుకే ఈసడించుకోవడం సమాజంలోని కఠిన వాస్తవానికి అద్దం పడుతుంది. తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు పిల్లలు తమ పేరు మీద ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తాన్ని కూడా తండ్రి వ్యాపారం కోసం ఇవ్వడానికి నిరాకరిస్తారు. ‘మా డబ్బు మాకు ఇచ్చేస్తే మా బతుకు మేం బతుకుతాం’ అని వారు చెప్పే మాటలు వింటే, వారు కొడుకులు కాదు, ‘రాక్షసులు’ అనిపించక మానదు. ‘తండ్రి ప్రాణం ఇచ్చినవాడే కానీ, డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్తా పోతుంది’ అనేంతగా నేటితరం ధన వ్యామోహంలో మునిగిపోయింది. భార్య కూడా తన దారి తాను చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ తండ్రికి మిగిలింది కేవలం శూన్యం. కన్నబిడ్డలే కాదనుకున్న వేళ, ఇన్నాళ్లూ సుబ్బయ్య ఉప్పు తిన్న పనివాడు గంగయ్య చూపిన విశ్వాసం మనల్ని కదిలిస్తుంది. ‘కాయకష్టం చేసైనా మిమ్మల్ని పోషించుకుంటాను బాబు, కలో గంజో అంతా కలిసి తాగుదాం’ అని గంగయ్య అన్నప్పుడు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డల కంటే పరాయివారే మిన్న అనిపిస్తుంది. డబ్బు మాయాజాలం మనుషుల మధ్య మమకారాలను ఎలా తుంచేస్తుందో ఈ సన్నివేశం మనకు నేర్పిస్తుంది. ఆస్తి ఉన్నప్పుడు గర్వపడే బిడ్డలు, అది లేనప్పుడు తండ్రిని అవమానించడం అత్యంత దురదృష్టకరం. జీవితంలో మనం సంపాదించాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు, కష్టకాలంలో వెన్నంటి ఉండే నమ్మకమైన వ్యక్తులను కూడా అనే సందేశం ఈ చిత్రంలో ఉంది. ఎంతో ఆసక్తిని, ఆలోచనను రేకెత్తించే సన్నివేశాలతో కూడిన వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మా Teluguone Cinema ఛానల్‌ను Subscribe చేసుకోండి.
Mar 03, 2026అవమానాన్ని కూడా ఆనందంగా అక్కున చేర్చుకున్న అక్కినేని!
పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారంతా ఒకప్ప్పుడు ఎన్నో కష్టాలకోర్చినవారు, మరెన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ తరహా కష్టాలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయని ప్రముఖుల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్, ఎఎన్నార్.. తెలుగు సినిమాకి రెండు కళ్లులాంటివారు అని చెబుతారు. ఎందుకంటే వారు చేసిన సినిమాల ద్వారా తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకొచ్చారు. నటుడిగా ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. 1944లో వచ్చిన ‘సీతారామ జననం’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు ఎఎన్నార్. 1949లో వచ్చిన ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఒక విధంగా చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యారని చెప్పొచ్చు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవమానాలను భరించారు. అలాంటి ఓ ఘటన 1946లో వచ్చిన ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రం చేస్తున్న సమయంలో జరిగింది. ఎఎన్నార్‌ను ఆ సినిమా మేనేజర్ సూర్యనారాయణ తీవ్రంగా అవమానించాడు. ఆ తర్వాత అక్కినేని హీరోగా ఎలా ఎదిగారో, ఎలాంటి మరపురాని సినిమాలు చేశారో మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే 1967లో పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ప్రాణమిత్రులు’ చిత్రంలో నటిస్తున్నారు అక్కినేని. అప్పటికి ఎఎన్నార్ స్టార్ హీరో. ఈ సినిమాకి కూడా సూర్యనారాయణే మేనేజర్. ఒకరోజు అక్కినేని చెయ్యాల్సిన సీన్‌కు అంతా సిద్ధం కావడంతో షాట్ రెడీ చెప్పి రమ్మని సూర్యనారాయణకు చెప్పారు పుల్లయ్య. మేకప్ రూమ్ దగ్గరకు వెళ్లిన ఆయన ఎఎన్నార్‌ను చూస్తూ వినయంగా నిలబడ్డారు. అది గమనించిన అక్కినేని.. ‘సూర్యనారాయణగారు.. చెప్పండి’ అన్నారు. ‘డైరెక్టర్‌గారు షాట్ రెడీ అని మీకు చెప్పమన్నారు’ అన్నాడు. ‘ఓకే. వస్తాను’ అని అంటూ ‘సూర్యనారాయణగారూ.. మీరు ముగ్గురు మరాఠీలు సినిమాకి పనిచేశారు కదూ. 20 సంవత్సరాలు దాటిపోయినా నేను మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకున్నానో తెలుసా.. మీ వల్ల నాకు జరిగిన అవమానం అలాంటిది. కన్నాంబగారు, సుబ్బారావుగారు మేకప్ రూమ్‌లో భోజనం చేస్తున్నారు. వారితోపాటు ఇంకా ఎవరెవరో భోజనాలు చేస్తున్నారు. నేను కూడా అక్కడికి వచ్చాను. నన్ను చూసి మీరు కసురుకున్నారు. ‘ఇక్కడ పెద్దవాళ్లంతా భోజనం చేస్తున్నారు. నీకు ఇక్కడేం పని. క్యాంటిన్‌కి వెళ్లు’ అన్నారు మీరు. నేను బాధపడుతూనే క్యాంటిన్‌కి వెళ్లిపోయాను’ అంటూ పాత విషయాన్ని గుర్తు చేశారు అక్కినేని. అది విని ఆ మేనేజర్ కంగారుపడిపోయాడు. ‘పొరపాటు జరిగిపోయింది సార్’ అన్నాడు. ‘ఇప్ప్పుడు మిమ్మల్ని తిట్టాలని ఆ విషయం గుర్తు చెయ్యలేదు. ఆరోజు మీరు చేసింది కరెక్టే. అప్ప్పుడు నేను సాధారణ నటుడ్ని. వాళ్లు పెద్ద నటులు. కాబట్టే మీరు అలా ప్రవర్తించారు. ఆరోజు నేను దాన్ని అవమానంగా భావించాను. ఎంతో బాధపడ్డాను కూడా. అది మీకు తెలియాలని ఇప్ప్పుడు గుర్తు చేశాను తప్ప మిమ్మల్ని బాధపెట్టాలని కాదు’ అంటూ సూర్యనారాయణ భుజం తట్టి సెట్ వైపు అడుగులు వేశారు అక్కినేని. ప్రారంభదశలో జరిగిన ఇలాంటి అవమానాలకు కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగారు కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు మహానటుడుగా ఎదిగారు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని తనను అవమానించిన వ్యక్తిపై పగ సాధించకుండా ప్రేమతోనే అతని మనసును గెలుచుకున్నారు. ఇలాంటి ఎన్నో అవమానాలను అక్కున చేర్చుకొని తన విజయ సోపానానికి మెట్లుగా మార్చుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.
Feb 27, 2026
శోభన్‌బాబు, జయలలిత కలిసి ఒకే ఒక్క సినిమా చేశారు.. మరి ఆ రూమర్స్ ఎలా వచ్చాయి?
(ఫిబ్రవరి 24 జయలలిత జయంతి సందర్భంగా..) శోభన్‌బాబు, జయలలిత ప్రేమకథ నిజమేనా? జయలలిత ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌కి కొదవే ఉండదు. ఇప్ప్పుడు సోషల్ మీడియా బాగా విస్తరించింది కాబట్టి చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతుంది. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ప్రింట్ మీడియా తప్ప మరో ప్రచార సాధనం లేదు. ఆ సమయంలో కూడా రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉండేవి. కేవలం ఇలాంటి వార్తలు మాత్రమే ప్రచురించే కొన్ని పత్రికలు కూడా అప్పట్లో ఉండేవి. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నంత ఫాస్ట్‌గా కాకపోయినా వార్త మాత్రం అందరికీ చేరేది. శోభన్‌బాబు(Sobhan Babu), జయలలిత(Jayalalitha) గురించి అలాంటి రూమర్స్ బాగా ప్రచారమయ్యాయి. శోభన్‌బాబు ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకునే సమయానికే జయలలిత బిజీ హీరోయిన్. ఒక నిర్మాత శోభన్‌బాబు, జయలలిత కాంబినేషన్లో సినిమా చెయ్యాలనుకున్నారు. ఇదే విషయం శోభన్‌బాబుకి చెబితే ఆయన ఎంతో సంతోషించారు. ఎందుకంటే అలాంటి టాప్ హీరోయిన్‌తో సినిమా చేస్తే తన కెరీర్‌కి బాగా ఉపయోగపడుతుందనుకున్నారు. అంతా ఓకే అనుకునే సమయానికి జయలలిత తల్లి సంధ్య చిన్న హీరోతో సినిమా ఎందుకు అని ఒప్ప్పుకోలేదు. అలా ఆ ప్రాజెక్ట్ నుంచి శోభన్‌ను తప్పించారు. చెల్లెలి కాపురం, జీవనతరంగాలు, శారద, తాసిల్దారుగారి అమ్మాయి, కాలం మారింది వంటి సినిమాలతో శోభన్‌బాబు హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ‘డాక్టర్‌బాబు’ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆ చిత్రానికి ఆయన కుమారుడు లెనిన్‌బాబు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి శోభన్‌బాబు, జయలలితలను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేశారు. అలా మొదటిసారి ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమా చేసే సమయానికి జయలలిత తల్లి సంధ్య మరణించారు. తల్లి మరణంతో కుంగిపోయిన జయలలిత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. సినిమాలు తగ్గించుకున్నారు. ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆమెకు ధైర్యం చెప్పి సినిమాలు కొనసాగించమని చెప్పారు. కొంతకాలం తర్వాత తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన సినిమాయే ‘డాక్టర్ బాబు’. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్, జయలలిత మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనపై శోభన్ చూపిస్తున్న ఆప్యాయత, అభిమానం జయలలితను బాగా ఆకట్టుకున్నాయి. తల్లి లేదనే బాధను శోభన్ మరిపించారు. అలా జరుగుతున్న సమయంలో వీరిద్దరి సాన్నిహిత్యంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే అందులో రకరకాల వెర్షన్లు మనకు కనిపిస్తాయి. అందులో ఏది నిజం అనేది మాత్రం ఎవరికీ తెలీదు. చేసింది ఒక్క సినిమా అయినా ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చివరి క్షణంలో శోభన్‌బాబు అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే అప్పటికే ఆయనకు పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోలేనని జయలలితకు చెప్పారు శోభన్. ఈ విషయం తమిళ స్టార్ హీరో ఎం.జి.ఆర్.కి తెలిసింది. శోభన్‌బాబుని పిలిపించారు. జయలలితను ఎందుకు పెళ్లి చేసుకోనని చెప్పావు అని అడిగారు. ఆమెకు చెప్పిన సమాధానమే ఎంజిఆర్‌కి కూడా చెప్పారు శోభన్. అక్కడితో వారి పెళ్లి ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడింది. ఇది ఒక వెర్షన్ అయితే మరో వెర్షన్ పూర్తి భిన్నంగా ఉంటుంది. డాక్టర్‌బాబు సినిమా చేసిన తర్వాత ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారని, ఇద్దరూ ఒకే గదిలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయంటారు. ఈ విషయాలన్నీ ఇండస్ట్రీలో ఉన్నవారికి బాగా తెలుసు. శోభన్, జయలలిత సహజీవనం చేయడం వల్ల వారికి ఒక కుమార్తె కూడా కలిగిందనే ప్రచారం ఉంది. అయితే ఆ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. శోభన్‌బాబుతో పెళ్లి విఫలమైన తర్వాత ఇక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిన జయలలిత చనిపోయే వరకు అవివాహితగానే ఉండిపోయారు.
Feb 23, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



