English | Telugu
వేదకు ప్రశంసలు..మాళవికకు చీవాట్లు పెట్టిన జడ్జి!
Updated : Jul 13, 2022
బుల్లితెరపై కొంత కాలంగా ప్రసారం అవుతున్న 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఆద్యంతం ట్విస్ట్‌లు, మలుపులతో ఆసక్తికరంగా సాగుతూ మహిళా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజాశ్రీధర్ తదితరులు నటిస్తున్నారు. బుధవారం ఎపిసోడ్ ఫ్యామిలీ జడ్జి ఎంట్రీతో ఎలాంటి మలుపులు తిరగబోతోంది?.. మాళవిక కుట్ర ఫలించబోతోందా?.. అన్నది ఇప్పడు తెలుసుకుందాం.
వేద, యష్ విడిపోయారని తెలుసుకున్న మాళవిక వెంటనే ఖుషీని యశోధర్ నుంచి వేరు చేయాలని కుట్రకు తెరలేపుతుంది. వెంటనే ఫ్యామిలీ కోర్టు జడ్జిని కలుస్తుంది. వేద - యష్ లది దొంగ పెళ్లి అని, తన నుంచి ఖుషీని సొంతం చేసుకోవాలన్న కుట్రతోనే వాళ్లు పెళ్లి నాటకం ఆడుతున్నారని చెబుతుంది. సరే నువ్వు చెప్పిందే నిజమైతే ఖుషీని నీకు అప్పగిస్తానని చెప్పి యష్ ఇంటికి సిబ్బందితో సహా వస్తారు జడ్జి. యష్ ని నిలదీస్తారు. "ఖుషీ కోసం మీరు, వేద పెళ్లి నాటకం ఆడారు" అంటారామె. "లేదు మేడమ్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు" అని చెబుతాడు యష్.
వెంటనే జడ్జి, "వేద ఎక్కడ?" అనడుగుతారు. అప్పుడే వేద ఎంట్రీ ఇస్తుంది. ఖుషి మీ గురించే అడుగుతూ వుంటుందని చెబుతుంది. అది గమనించిన మాళవిక ఇదంతా డ్రామా అంటుంది. ఇద్దరు విడిపోయారని, వీళ్ల మధ్య మాటలు లేవంటుంది. "కావాలంటే ఇరుగు పొరుగు వాళ్లని పిలిచి అడగండి, వీళ్ల బండారం బయటపడుతుంది" అంటుంది. దీంతో జడ్జి ఇరుగు పొరుగు వాళ్లని పిలవండి అంటారు. "అలా చేస్తే మా పరువు పోతుంది" అని రత్నం అంటాడు. నా డ్యూటీ నేను చేయాలని చెప్పిన జడ్జి ఇరుగు పొరుగు వారిని పిలిపించి విచారిస్తారు.
ప్రతీ రోజు వేద - యష్ గొడవ పడుతుంటారని వచ్చి వాళ్లు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆ తరువాత వర్షం పడిన రోజు యష్.. వేదని తన గుండెలకు హత్తుకుని ఐ లవ్ యూ చెప్పాడని, అంతే కాకుండా ఇటీవల జరిగిన బారసాలలో వేద గురించి ఎంతో గొప్పగా చెప్పాడని చెబుతారు. "వేద మంచి భార్యే కాదు, మంచి తల్లి కూడా" అని ప్రశంసలు కురిపిస్తారు. దీంతో మాళవిక చెప్పింది పచ్చి అబద్ధమని జడ్జి గ్రహిస్తారు. వేదని ప్రశంసించి, మాళవికకు చీవాట్లు పెడతారు.దాంతో మాళవిక ముఖం పాలిపోతుంది.