English | Telugu
బాస్.. గంగవ్వా మాజాకా!
Updated : Jul 13, 2022
అదృష్టం..అవకాశం ఎప్పుడు ఎవరి జీవితాన్ని మలుపు తిప్పుతుందో చెప్పలేం... ఆ క్షణం కోసం ఓపికగా ఎదురుచూస్తూ ప్రయత్నం చేస్తూ వుండాల్సిందే. అయితే అదృష్టంతో పాటు కాలం కలిసి వచ్చిందా? ఇక అక్కడి నుంచి తిరుగేవుండదు.. జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఊహించని హైట్స్ కి తీసుకెళుతుంది. ఇది యూట్యూబ్ స్టార్ గంగవ్వ విషయంలో అక్షర సత్యంగా నిలుస్తోంది. `మా విలేజ్ షో` అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయి గంగవ్వ ఇప్పడు ఊహించని స్థాయికి వెళ్లింది.
ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కనీస విద్యార్హత లేకపోయినా గంగవ్వ సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4కు ఎంపికై హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుని అంతా అవాక్కయ్యేలా చేసిన గంగవ్వ అక్కడ కూడా తనదైన మార్కు మాటలతో కోట్ల మందికి చేరువయ్యింది. అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే హౌస్ ఉంచి బయటికి వచ్చిన గంగవ్వ ఇదే సమయంలో నాగార్జున నుంచి సొంతిల్లు కట్టిస్తాననే హామీని పొందింది. అన్నట్టుగానే నాగార్జున గంగ్వకు సొంతంగా ఇల్లు కట్టించి ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ ముగిసిన తరువాత నుంచి గంగవ్వ వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. రామ్ నటించిన `ఇస్మార్ట్ శంకర్`తో సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. `లవ్ స్టోరీ`లోనూ కనిపించి ఆకట్టుకుంది. ఇప్పడు ఏకంగా మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా పలు చిత్రాల్లోనూ నటిస్తున్న గంగవ్వకు ప్రత్యేకంగా కారవాన్ ని కేటాయిస్తున్నారట. పేరున్న వాళ్లకు, స్టార్లకు తప్ప కారవాన్ లు కేటాయించరు కానీ గంగవ్వకు ప్రత్యేకంగా కారవాన్ ని కేటాయించడంతో అంతా గంగవ్వా మజాకా అంటున్నారు. తనకు కారవాన్ ని నిర్మాతలు కేటాయిస్తున్న విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించింది గంగవ్వ.