English | Telugu
తొలి తెలుగు ఇండియన్ ఐడల్ విజేత జూనియర్ పూజా హెగ్డే
Updated : Jun 18, 2022
ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`.. సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా వినూత్నమైన షోలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తెలుగు సింగర్స్‌ని, న్యూ టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో నూతన సింగర్స్ కోసం ప్రత్యేక షోని ప్రారంభించింది. సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ నిత్యా మీనన్, సింగర్ కార్తీక్ ఈ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. గత 15 వారాలుగా సాగిన సమరం ముగిసింది. ఈ సింగింగ్ పోటీలో విజేతగా ఎవరు నిలుస్తారా? అనే ఉత్కంఠకు ఈ శుక్రవారం జరిగిన మెగా ఫైనల్ లో తెరపడింది.
ఈ పోటీల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముద్దుగా జూనియర్ పూజా హెగ్డే అంటూ పిలిచిన వాగ్దేవి తొలి తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచి ట్రోఫీని దక్కించుకుంది. ఈ మెగా ఫైనల్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై విజేతకు తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీని అందించారు. ఇదే కార్యక్రమంలో రానా, సాయి పల్లవి కూడా పాల్గొని ఈ మెగా ఫైనల్స్ ని మరింత స్పెషల్ గా మార్చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచిన వాగ్దేవికి ట్రోఫీతో పాటు రూ. 10 లక్షలు బహుమతిగా లభించడమే కాకుండా గీతాఆర్ట్స్ లో రూపొందే సినిమాలో పాడే అవకాశం కూడా దక్కింది.
ఈ పోటీలో మొదటి రన్నరప్ గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి రూ. 2 లక్షలు బహుమతిగా లభించాయి. విన్నర్ వాగ్దేవి గాత్రానికి ముగ్ధులైన మెగాస్టార్ చిరంజీవి తనకు `గాడ్ ఫాదర్` మూవీలో ఓ పాట పాడే అవకాశం ఇవ్వడం విశేషం. ఇదే వేదికపై ఆమెకు తెనాలి డబుల్ హార్స్ వారు రూ. 3 లక్షలు, శ్రీనివాస్ కు రూ. 2 లక్షలు, వైష్ణవికి చందనా బ్రదర్స్ వారు రూ. 1 లక్ష బహుమతిగా అందజేశారు.