పవన్ కళ్యాణ్ మాటలు మళ్ళీ రాజకీయ ప్రకంపనలేనా?
కళకు భాష లేదు అంటారు. సినిమా పరిశ్రమలో వివిధ విభాగాల్లో విభిన్న భాషలకు చెందివారు పనిచేస్తుంటారు. ప్రేక్షకులు సైతం భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు. భాష, ప్రాంతం అనే అంతరాలను చెరిపివేస్తూ సినిమా రోజురోజుకి ఎదుగుతుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. మిగతా భాషలకు చెందిన పరిశ్రమలు కూడా అదే దిశగా అడుగులు వేస్తుండగా, తమిళ పరిశ్రమ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తమిళ సినిమాల షూటింగ్ లు ఆ రాష్ట్రంలోనే జరగాలని, అందులో పనిచేసేవారు తమిళులై ఉండాలని 'ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా'(ఫెఫ్సీ) నిబంధన తీసుకొచ్చింది. దీనిని ఇప్పటికే పలువురు తప్పుబడుతుండగా, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే 'ఆర్ఆర్ఆర్' లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతారని సూచించారు.