English | Telugu

విజ‌య్ పార్టీలోకి విశాల్.. ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చిన హీరో

కోలీవుడ్ అగ్ర హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో నెట్టింట వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాట సినీ హీరోలు, హీరోయిన్స్ రాజకీయాల్లోకి రావ‌టం అనేది కామ‌న్‌గా జ‌రిగే విష‌య‌మే. అలాగే విజ‌య్‌తోపాటు సినీ రంగానికి చెందిన విశాల్ పేరు కూడా త‌మిళ‌నాడు పాలిటిక్స్‌లో ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో విశాల్ పుదుచ్చేరిలోని కాలేజ్ విద్యార్థుల‌తో ముచ్చ‌టించారు. ఈ నేప‌థ్యంలో ఓ విద్యార్థి ప్ర‌స్తుత త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌కు సంబంధించి వేసిన ప్ర‌శ్న నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ విశాల్‌ను స‌ద‌రు విద్యార్థి వేసిన ప్ర‌శ్నేంట‌ని వివ‌రాల్లోకి వెళితే..

మీకు హీరో విజ‌య్ మంచి స్నేహితుడు. ఆయ‌న రాజ‌కీయ పార్టీని పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఆయ‌న పార్టీ పెడితే, మీరు ఆ పార్టీలో జాయ‌న్ అవుతారా? అని అడిగిన ప్ర‌శ్న‌కు విశాల్ స్పందించారు. ఆ నిర్ణ‌యం దేవుడు చేతుల్లో ఉంద‌ని అన్నారు. ప‌లు సంవ‌త్స‌రాలుగా తాను ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నానని, వీలైన సాయం చేస్తున్నాన‌ని అన్నారు. రాజ‌కీయం అంటే సేవ చేయ‌టం. ఇబ్బందుల్లో ఉండేవారికి రూ.100 సాయం చేసేవాడిని కూడా రాజకీయ నాయ‌కుడ‌ని అనొచ్చు అని పేర్కొన్నారు విశాల్‌.

విశాల్ ప్ర‌స్తుతం మార్క్ ఆంటోని అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన‌లేదు. అయితే విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో వార్త‌లైతే వినిపిస్తున్నాయి. ఇక ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లోనే త‌న రాజ‌కీయ పార్టీని అనౌన్స్ చేస్తార‌ని ఇప్పుడు వెంక‌ట్ ప్ర‌భు దర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఆయ‌న పొలిటిక‌ల్ అనౌన్స్మెంట్ ఉంటుంద‌నే టాక్ త‌మిళ‌నాడులో జోరుగా సాగుతుంది.