English | Telugu
రోజాను కలిసిన రమ్యకృష్ణ.. అందుకేనా?
Updated : Jul 26, 2023
సీనియర్ నటి రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి రోజాను ఎందుకు కలిశారు? దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? రమ్యకృష్ణను వైఎస్సార్‌సీపీలోకి రావాల్సిందిగా రోజా ఆహ్వానించారా? రమ్యకృష్ణ ఓకే చెప్పారా?.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విరివిగా నలుగుతున్న ప్రశ్నలు.
ఒకప్పటి టాప్ హీరోయిన్, సీనియర్ నటి రమ్యకృష్ణ తన కుమారుడు రిత్విక్ వంశీతో కలిసి మంగళవారం నగరిలో రోజా ఇంటికి వెళ్లి స్నేహపూర్వకంగా ఆమెను కలిశారు. రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి కూడా వారి భేటీలో పాల్గొన్నారు. కాగా వారి కలయిక పొలిటికల్‌గా ఆసక్తిని రేకెత్తించింది. అందుకే సోషల్ మీడియాలో వారిద్దరూ కలిసిన ఫొటోస్, వీడియో క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే రమ్యకృష్ణను వైసీపీలోకి రావాల్సిందిగా రోజా ఆహ్వానించారనే ప్రచారం మొదలైంది.
తెలుగు చిత్రసీమపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారంటూ కొంతకాలంగా ఒక అభిప్రాయం చలామణీలో ఉంది. ఏపీలో కొంతకాలం క్రితం కాంట్రవర్సీ అయిన సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఇందుకు ఒక నిదర్శనం. ఆ టైంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి సినీ ప్రముఖులు జగన్‌ను కలిసి చర్చించడం మనకు తెలుసు. అలా తెలుగు సినీ ఇండస్ట్రీని తనకు దాసోహం అయ్యేట్లు జగన్ చేశారనే కామెంట్లు అప్పుడు బాగా వచ్చాయి.
ఇప్పుడు సినీ ప్రముఖులు రాజకీయంగా వైసీపీ వైపు ఉన్నారనే ఫీలర్స్ వదలడం కోసం వారికి ఆ పార్టీ గాలం వేస్తోందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో మంత్రి రోజాను రమ్యకృష్ణ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రమ్యకృష్ణ వైసీపీలో చేరడం ఖాయమనీ, ఇందుకు రోజా ఆమెను ఒప్పించారనీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. కొంతమంది వారి ఫొటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ ఈ ప్రచారానికి బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే రోజాను రమ్యకృష్ణ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే కలిశారని తెలుస్తోంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి చెన్నై నుంచి తన కుమారుడు రిత్విక్‌ను వెంటపెట్టుకొని తిరుపతికి వచ్చిన ఆమె, పనిలో పనిగా తన మిత్రురాలు రోజాను ఆమె ఇంటికి వెళ్లి కలిశారని సమాచారం. ఆ ఇద్దరూ ఒకప్పటి సంగతులు గుర్తుచేసుకొంటూ సరదాగా గడిపారు. గతంలో ఆ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. 'సమ్మక్క సారక్క' సినిమాలో టైటిల్ రోల్స్ చేశారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూ వస్తోంది. "రోజాను రమ్యకృష్ణ కలవడంలో ఏదైనా రాజకీయ కారణం ఉందా?" అని రమ్యకృష్ణ భర్త, సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీని తెలుగువన్ అడిగినప్పుడు ఆయన అటువంటిది ఏమీలేదని స్పష్టం చేశారు. అదీ విషయం!!