కసబ్ ఉరిశిక్ష పై ఎవరేమన్నారు..?
posted on Nov 21, 2012 @ 2:49PM
కసబ్ ఉరిశిక్ష అమలుపై హిందూ, ముస్లిం, సిక్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తున్నారు. ముంబై నగరంలో ఉండే డబ్బా వాలాలు కసబ్ ఫోటోలను దహనం చేశారు. కసబ్ ఉరిని కాంగ్రెసు, బిజెపి సహా అన్ని పార్టీలు స్వాగతించాయి. బహిరంగ ఉరి తీస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా సరైన శిక్ష విధించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు.
కసబ్ ఉరిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది
ఉగ్రవాది కసబ్ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. న్యాయస్థానం నిర్ణయం మేరకే కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశామని, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అని సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు.
కసబ్ ఉరితీతను స్వాగతిస్తున్నాం
టెర్రరిస్టు అజ్మల్ కసబ్ ఉరితీత ఆలస్యమైనా స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు పై దాడి చేసిన అఫ్జల్‌గురును కూడా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటన ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక
కసబ్ ఉరిశిక్షను స్వాగిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రక్తపాతం సృష్టించిన కసబ్ కు ఉరిశిక్ష అమలు అందరూ ఆహ్వానించాలన్నారు. విదేశీ ఉగ్రవాదం కారణంగా అనేక మంది ప్రాణాలు విడిచారని, ఉగ్రవాదం పై ప్రభుత్వం ఉక్కు పడికిలి బిగించాలని కిషన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు కసబ్ ఉరితీత ఓ హెచ్చరిక అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పార్లమెంటుపై దాడి చేసి అఫ్జల్‌గురుకు కూడా ఉరిశిక్ష అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కసబ్ ఉరి.. భారతదేశ చట్టం శక్తిని తెలుపుతుంది...
చట్టం ప్రకారం అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. ఎరవాడ జైలులో కసబ్ ను ఉరితీసి అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం జరిగిందన్నారు.
అప్జల్ గురు సంగతేంటి..? అతడిని ఎప్పుడు ఉరి తీస్తారు..?
గుజరాజ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కసబ్ ఉరిశిక్ష అమలు విషయంపై ట్విట్టర్లో స్పందిస్తూ... కసబ్ ఉరి సరే... మరి అప్జల్‌గురు సంగతేంటని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి చేయడమే కాకుండా పలువురు మరణానికి కారకుడయిన అప్జల్‌గురును వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.