సత్యభామగా బతికిన సత్యనారాయణ

 

 

 

భామనే.. సత్యభామనే.. భామనే పది ఆరు వేల గోపికాలందరీలోన.. భామనే.. సత్య భామనే.. వయ్యారి ముద్దుల భామనే.. సత్య భామనే.. అంటూ వేదాంతం సత్య నారాయణ వేదికమీద వయ్యారాలు ఒలకబోస్తుంటే చూడ్డానికొచ్చిన మగాళ్లంతా మనసుపారేసుకునేవాళ్లంటే నమ్మితీరాల్సిందే.

 

ఆ హొయలు, ఆ నడక, ఆ దర్పం.. సత్యభామ అచ్చం ఇలాగే ఉండేదా.. అని కళ్లకు కట్టినట్టు చూపించే ఆంగికం, వాచికం, నాట్యాభినయనం తీరు వేదాంతం సత్యనారాయణ శర్మకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టాయి. సిద్ధేంద్రయోగి విరచితమైన కూచిపూడి నాట్యశాస్త్రంపై ప్రాణప్రదమైన మక్కువని చూపించిన వేదాంతం.. తన జీవనపర్యంతం ఆసాంతం ఆ కళకే అంకితమయ్యారు..

 

తుది శ్వాసవరకూ ఆయన కూచిపూడి నాట్యంకోసమే బతికారు. ముదిమి మీదపడి ఇక న్యాయం చేయలేను అనుకున్నప్పుడు ప్రదర్సనల్ని నిలిపేసి ముందుతరాలకు మెళకువల్ని అందించే ఆచార్యపదవికే పరిమితమయ్యారు తప్ప కీర్తికోసం పాకులాడలేదు.

 

అసలు చీర కట్టడం ఎలాగో వేదాంత సత్యనారాయణ శర్మదగ్గర నేర్చుకోవాలన్నంత ముచ్చటగా ఆయన కట్టూ బొట్టూ తీరు ఉండేదని, చూడగానే ఆడవాళ్లుకూడా అభిమానులుగా మారిపోయేవాళ్లని అంతా చెప్పుకునేవాళ్లు. చీర కుచ్చిళ్లని కాస్త పైకి లాగి పట్టుకుని కాలి మువ్వల్ని ఘల్లుఘల్లున మోగిస్తూ వయ్యారంగా నడుస్తుంటే మగమహారాజులు పడిచచ్చేవాళ్లంటే నమ్మితీరాల్సిందే.

 

సత్యభామ వేషం వేదాంతానికి అంతటి పేరుని తీసుకొచ్చిపెట్టింది. మగాళ్లు ఆడాళ్లనుంచి ఏ కోరుకుంటారో తెలుసుకనకే తను ఆ హొయల్ని ఒలకించి నాట్యాన్ని రక్తికట్టించేవాడినని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారుకూడా.

 

విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాల్లో ఉషాకన్య రూపంలో వేదికమీద కనిపించిన వేదాంతం నిజంగా అమ్మాయే అనుకుని చాలామంది విదేశీయులు మేకప్ రూమ్ ముందు ఆయన అనుగ్రహం కోసం పడిగాపులుపడ్డ రోజుల్ని ఆయన ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు.

 

సత్యనారాయణ శర్మ చిన్ననాటనే జావళీలు, రామదాసు, త్యాగరాజు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ఔపోసన పట్టారు. యక్షగానాల్లో చెలికత్తెగా అభినయించారు. వేదాంతం తన పెద్దన్న ప్రహ్లాదశర్మ, పినతండ్రి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు.

 

కూచిపూడి నాట్యాన్ని రక్తికట్టించేందుకు వేదాంతం.. మచిలీపట్నానికి చెందిన వారణాసి బ్రహ్మయ్య వద్ద వయోలిన్ విద్యను, సంగీత కళానిధి ఏలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. చిన్ననాటనే ప్రహ్లాదునిగా, లోహితాస్యునిగా, శ్రీరాముడిగా, ధర్మాంగజుడిగా, బాల నర్తకుడిగా వేషాలు వేసి అందరినీ  అలరింపచేశారు.

 

పార్వతీదేవిగా నటనను ప్రారంభించిన వేదాంతం ఉషాపరిణయంలో పార్వతి, ఉషాకన్య, భామాకలాపంలో సత్యభామ, మోహిని రుక్మాంగదలో మోహినిగా, క్షీరసాగరమథనంలో విశ్వమోహినిగా, విప్రనారాయణలో దేవదేవిగా వేలాది ప్రదర్శనలిచ్చారు. లవకుశ సినిమాలో బి సరోజాదేవితో కలిసి నటించారు.

 

కూచిపూడి నాట్యాన్ని భావితరాల వారికి అందించేందుకు నర్తనశాలను రూపొందించి పలువురికి శిక్షణ ఇచ్చారు. కూచిపూడి నాట్యక్షేత్రం స్థాపనకు దివంగత చింతా కృష్ణమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, పద్మభూషణ్ వెంపటి చినసత్యంతో కలిసి కృషిచేసి ప్రధానాచార్యులుగా కొనసాగారు.

 

సత్యనారాయణశర్మ చిన్న వయస్సులోనే కేంద్ర సంగీత నాటక అవార్డును, పద్మశ్రీ అవార్డును అందుకుని పలువురు నాట్యాచార్యులకు ఆదర్శంగా నిలిచారు. కూచిపూడి నాట్యంలోని యక్ష నృత్యాంశాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రీతుల్ని పరిచయం చేస్తూ తనదైన శైలిలో కూచిపూడి నాట్యకళకి విస్తృత ప్రాచుర్యం కల్పించారు.

 

కూచిపూడి నాట్య ప్రదర్శనల ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్టప్రతులు వివి గిరి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డా. శంకర్‌దయాళ్ శర్మ, డా. జకీర్ హెస్సేన్, డా. ఆర్‌కె నారాయణన్‌ల ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనను తిలకించి అభినందించారు.

 

ఉషాకన్యగా పేరుగాంచిన వేదాంతం సత్యనారాయణ శర్మ 1934 సెప్టెంబరు 9న కూచిపూడిలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు. వేదాంతం ప్రహ్లాదశర్మ, వీరరాఘవయ్య ఈయన సోదరులు.

 

సత్యనారాయణ శర్మకు 18వ ఏట 1952లో పసుమర్తి కొండలరాయుడు కనిష్ట పుత్రిక లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వేదాంతం సత్యనారాయణ శర్మ ఇక లేరన్న నిజాన్ని కూచిపూడి గ్రామం జీర్ణించుకోలేకపోతోంది.